259

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 259*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 174*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

     *వైరాగ్యం, మద్యం, జూదం : - - : హిజ్రీ శకం - 5*

*"విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ మీకోసం ధర్మసమ్మతం (హలాల్) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి.★ మితిమీరి పోకండి. నిశ్చయంగా అల్లాహ్ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు." (ఖుర్ఆన్ 5:87,88).*

★→ ఒక వ్యక్తి, దైవప్రవక్త (సల్లం) సన్నిధిలోకి వచ్చి ఇలా విన్నవించుకున్నాడు. *"దైవప్రవక్తా! నేను మాంసం తిన్నప్పుడల్లా నా మనోవాంఛలు నా పై ప్రాబల్యం వహిస్తున్నాయి. కాబట్టి నేను నా కోసం మాంసాన్ని నిషేధించుకున్నాను."* అన్నాడు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది.

మరికొంతమంది సహాబీలు వైరాగ్యానికి, దైవభక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కొన్ని హలాల్ విషయాలకు దూరంగా ఉండసాగారు. ఉదా :- పెళ్ళి చేసుకోవటం, రాత్రి పూట నిద్రించటం, పగటిపూట అన్నం తినటం వంటివి మానుకున్నారు. ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలియగా, అలా చేయవద్దని ఆయన (సల్లం) వారించారు.

'హజ్రత్ ఉస్మాన్ బిన్ మజ్ఊన్ (రజి)' అనే సహాబీ తన భార్యకు దూరంగా ఉండసాగారు. ఆయన (రజి) భార్య చేసిన ఫిర్యాదును పురస్కరించుకొని దైవప్రవక్త (సల్లం) ఆయన్ని కూడా మందలించారు. (అహ్'సనుల్ బయాన్ ఖుర్ఆన్ అనువాదం నుంచి సేకరణ)

*↑ ఈ వృత్తాంతంలోని మరింత వివరణ ↓*

కొందరు ప్రవక్త అనుచరులు కూడా తాము ఎల్లప్పుడూ ఉపవాసాలు పాటిస్తామని; రాత్రుళ్ళలో నిద్రపోకుండా ఆరాధనలోనే గడుపుతామని; మాంసం, నెయ్యి, నూనెలు వాడమని; స్త్రీలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. దైవప్రవక్త (సల్లం)కు ఈ సంగతి తెలియగానే ఆయన (సల్లం) ఒక ప్రసంగంలో ఇలా అన్నారు. ↓

*"ఇలాంటి పనులు చేయమని నాకు ఆజ్ఞ లేదు. మీపై మీ ఆత్మల హక్కు కూడా ఉంది. కనుక ఉపవాసాలు కూడా ఉండండి, తినడం త్రాగడం కూడా చేయండి, రాత్రుళ్ళలో ఆరాధన కూడా చేయండి, నిద్రపోతూ కూడా ఉండండి. నన్ను చూడండి, నేను నిద్రపోతాను, జాగరణ చేస్తాను, ఉపవాసాలు పాటిస్తాను, వాటిని విరమిస్తాను కూడా. మాంసం, నెయ్యి కూడా తింటాను. నా విధానం, నా సంప్రదాయాలను ఇష్టపడని (పాటించని) వాడు నావాడు కాదు."*

ఆ తరువాత ఆయన (సల్లం) మస్జిద్ లో ప్రసంగవేదికపై నిలబడి ఇలా అన్నారు....; ↓

*"వీరికి ఏమయింది. స్త్రీలను, మంచి ఆహార పదార్థాలను, సువాసనలను, నిద్రను ఇతర ప్రాపంచిక సౌఖ్యాలను నిషేధించుకున్నారు! నేను మీకు విరాగులుగా, సన్యాసులుగా మారమని బోధించలేదు. నా ధర్మంలో స్త్రీల సాంగత్యాన్ని, మాంసాహారాన్ని త్యజించాలని లేదు. అలాగే బైరాగులయి ఏకాంత కుహరాల్లో తిష్ఠవేయాలని కూడా లేదు. ఆత్మనిగ్రహం కొరకు నా ధర్మంలో ఉపవాసవ్రతం ఉంది. వైరాగ్య ప్రయోజనాలన్నీ ఇక్కడ జిహాద్ ద్వారా సమకూరుతాయి. (కనుక) అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు మరెవరినీ సాటి కల్పించకండి. హజ్, ఉమ్రా (విధు)లు నిర్వహించండి. నమాజు స్థాపించండి. జకాత్ చెల్లించండి. రమజాన్ ఉపవాసాలు పాటించండి. మీకు పూర్వం ప్రజలు తమపై లేనిపోని భారం, కాఠిన్యాలు మోపుకోవడం వల్లనే సర్వనాశనం అయ్యారు. వారు తమ మీద లేనిపోని బరువులు, కాఠిన్యాలు మోపుకున్నప్పుడు అల్లాహ్ కూడా వారిపై బరువులు, కాఠిన్యాలు మోపాడు. మీకు మఠాలలో, ఆశ్రమాల్లో ఏకాంత కుహరాల్లో కనిపిస్తున్న అవశేషాలు వారు వదిలిపెట్టి పోయినవే."*

ఆ తర్వాత అల్లాహ్ మద్యం, జూదాలను కూడా నిషేధిస్తూ ఈ క్రింది సూక్తులు అవతరింపజేశాడు.

*"ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు - ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు. సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలనీ, అల్లాహ్ స్మరణ నుంచీ, నమాజు నుంచీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనయినా వాటిని మానుకోండి. అల్లాహ్ కు విధేయత చూపండి. ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. (చెడు పట్ల) కడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు గనుక విముఖత చూపితే, మా ప్రవక్త పై ఉన్న బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకేనని తెలుసుకోండి." (ఖుర్ఆన్ 5:90-92).*

ఈ ఆదేశంతో మద్యం పూర్తిగా నిషేధించబడిందని, ఇక నుండి ఎవరూ మద్యం ముట్టడంగాని, అమ్మడంగాని చేయరాదని దైవప్రవక్త (సల్లం) బహిరంగ ప్రకటన చేయించారు. ఈ ప్రకటన వినగానే ముస్లిములంతా మద్యం మానుకున్నారు. మధుపాత్రలను నోటిదాకా తీసుకెళ్ళినవాళ్ళు కూడా నిషేధప్రకటన వినగానే, ఆ పాత్రలను దూరంగా విసిరికొట్టారు.

ముస్లింలంతా తమ తమ ఇళ్ళలో ఉన్న మద్యాన్నంతటినీ వీధుల్లోకి తెచ్చి పారబోశారు. ఆరోజు మదీనా వీధుల్లో మద్యం ఏరులై ప్రవహించింది. సారా అంగళ్ళు శాశ్వతంగా కనుమరుగైపోయాయి.

కొందరు మద్యం గురించి దైవప్రవక్త (సల్లం) ముందు ప్రస్తావిస్తూ, *"దీనిని యూదులకు కానుకగా ఇవ్వవచ్చా?"* అని అడిగారు.

దానికి దైవప్రవక్త (సల్లం), *"మద్యాన్ని నిషేధించినవాడు (అల్లాహ్) దాన్ని ఇతరులకు కానుకగా ఇవ్వడాన్ని కూడా నిషేధించాడు."* అని అన్నారు.

మరొకతను దీన్ని మందుగా వాడుకోవడానికి అనుమతివ్వమని అడిగాడు.

దైవప్రవక్త (సల్లం) అనుమతి నిరాకరిస్తూ, *"అది మందు కాదు, వ్యాధి"* అన్నారు.

వేరొకతను వచ్చి, *"దైవప్రవక్తా! మేము తీవ్రమైన చలి ఉండే ప్రాంతంలో ఉంటున్నాం. కాయకష్టం కూడా ఎక్కువగా చేయవలసి వస్తుంది. మద్యసేవనం వల్ల మాకు కాస్త సేద తీరుతుంది. చలికి తట్టుకునే శక్తి కూడా వస్తుంది."* అని అన్నాడు.

దైవప్రవక్త (సల్లం) ఈ మాట విని, *"మీరు తాగే ఆ పానీయం వల్ల మత్తు కలుగుతుందా?"* అని అడిగారు.

దానికి ఆ వ్యక్తి, *"కలుగుతుంది"* అన్నాడు.

*"అయితే దాన్ని మానుకోవాల్సిందే"* అన్నారు ప్రవక్త (సల్లం).

*"కాని మా ప్రాంతం జనం ఒప్పుకోరే! ఎలా?"* అన్నాడు ఆ వ్యక్తి.

*"ఒప్పుకోకపోతే వారితో యుద్ధం చేయండి."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*హజ్రత్ ఉమ్మె సల్మా (రజి)తో దైవప్రవక్త (సల్లం) వివాహం : -*

ఆ కాలంలోనే దైవప్రవక్త (సల్లం), 'ఉమ్మె సల్మా (రజి)'ను వివాహమాడారు. ఉమ్మె సల్మా (రజి) మొదటి భర్త 'అబూ సల్మా (రజి)'. ఆయన (రజి) ఉహద్ యుద్ధంలో గాయపడ్డారు. తరువాత కొన్నాళ్ళకే 'బనీ అసద్' తెగతో జరిగిన యుద్ధంలో పాల్గొనవలసి రావడంతో మానుతున్న గాయాలు పచ్చి పుండ్లయి వాటి నుండి ధారాపాతంగా రక్తం కారడం మొదలెట్టింది.

గాయపడి మంచాన పడ్డ అబూ సల్మా (రజి)ను పరామర్శించడానికి దైవప్రవక్త (సల్లం) తరచుగా ఆయన ఇంటికి వెళ్ళేవారు. ఆయన ఆరోగ్యం కోసం దైవాన్ని ప్రార్థించేవారు. కాని అబూ సల్మా (రజి) అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. చివరికి ఆ గాయాలతోనే ఆయన శాశ్వతంగా కన్నుమూశారు.

భర్త మరణంతో ఉమ్మె సల్మా (రజి) కృంగిపోయారు. తండ్రి నీడ కోల్పోయిన తన అనాథ పిల్లల దుస్థితి చూసి ఆమె భోరున విలపించారు.

కొన్నాళ్ళకు ఆమె విషాదాన్ని బలవంతంగా దిగమింగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆమెను వివాహమాడదలచి కబురు పంపారు. అప్పటికి ఆమె యవ్వన సరిహద్దులు దాటారు. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అంచేత ఆమె దైవప్రవక్త (సల్లం)ను వివాహమాడలేనని చెప్పారు. దైవప్రవక్త (సల్లం) కొన్నాళ్ళు ఆగి మళ్ళీ పెళ్ళి కబురు పంపించారు. చివరికి ఆమె అంగీకరించారు. దైవప్రవక్త (సల్లం) ఆమెను వివాహమాడి ఆమె పిల్లలను తన సంరక్షణలోకి తీసుకున్నారు.

అనాథలన్నా, వితంతువులన్నా ఆయన (సల్లం)కు అమితమైన సానుభూతి ఉండేది. ఆపద సమయాల్లో వాళ్ళను తన శక్తివంచన లేకుండా ఆదుకునేవారు. వాళ్ళను ఆదుకోవడం గొప్ప పుణ్యకార్యం అని తలచేవారు.

*హజ్రత్ జైనబ్ (రజి)తో దైవప్రవక్త (సల్లం) వివాహం : -*

దాదాపు అదే కాలంలో దైవప్రవక్త (సల్లం), హజ్రత్ జైనబ్ (రజి)ను కూడా వివాహం చేసుకున్నారు. ఈమె (రజి), దైవప్రవక్త (సల్లం)కు స్వయాన మేనత్త కూతురవుతారు.

*↑ ఈ వివాహంలోని మరింత వివరణను In Sha Allah రేపటి భాగంలో....; →*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment