56

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 56* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

తన భర్త అయ్యూబ్ (అలైహి) మాటలు విన్న రహీమా (అలైహి), బరువైన హృదయంతో వెక్కిళ్ళతో వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రహీమా (అలైహి) కు అక్కడి నుంచి వెళ్లక తప్పలేదు. వేరెక్కడయినా ఆశ్రయం వెతుక్కోవడమూ తప్పలేదు.

ఈ విధంగా ఇబ్లీస్ మాటల ప్రలోభానికి గురయిన రహీమా (అలైహి), తన అయ్యూబ్ (అలైహి) నుంచి దూరం అయ్యింది. అయ్యూబ్ (అలైహి) ఆ భయాంకర వ్యాధిని మొత్తం 18 సంవత్సరాలు అనుభవించారు.

*తొలగిన కష్టాలు* 

తన భార్య రహీమా (అలైహి) కూడా దూరమయ్యాక కొన్ని రోజుల వరకు ఒంటరి జీవితం గడిపారు. ఇపుడు ఇంట్లో తన భార్య లేదు, తన పిల్లలు లేరు, చివరకు బంధుమిత్రులు కూడా లేరు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ ప్రార్థనల్లో ఎక్కువగా గడిపారు. ఆ వ్యాధి పెట్టె నరకయాతనను తట్టుకోలేక అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ కారుణ్యం కోసం వేడుకున్నారు. (దుఆ చేశారు.)

అయ్యూబ్ (అలైహి) : - ప్రభు! నేను జబ్బు పడ్డాను. ఈ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాను. షైతాన్ నన్ను తీవ్ర బాధకు, యాతనలకు గురి చేశాడు. నీవు అందరికంటే గొప్ప దయామయుడవు పరమ కరుణామయుడవు. (దుఃఖంతో మరియు వేదనతో షైతాన్ నన్ను బాధపెట్టాడు. శారీరక బాధ మరియు అతని సంపద మరియు పిల్లలను కోల్పోవడాన్ని సూచిస్తున్న వేదన అది.)

అప్పుడు కరుణ చూపించేవారిలో అపార కరుణామయుడు అయిన అల్లాహ్ అయ్యూబ్ (అలైహి) ప్రార్థనలకు ప్రతిస్పందించి, అపుడు అల్లాహ్ వహీ ద్వారా అయ్యూబ్ (అలైహి) కు జవాబిస్తూ....,

అల్లాహ్ : - నా ప్రియ దాసుడా అయ్యూబ్! షైతాన్ నీకు గురి చేసిన పరీక్షలలో నీవు సఫలీకృతుడవయ్యావు. ఇపుడు ఆ వ్యాధి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నేను చెప్పిన విధంగా చెయ్. నిలబడి నీ పాదాలను నేల మీద తట్టు, అలా చేయగానే అక్కడి నుంచి నీటి ఊట ఉబికివస్తుంది.

అల్లాహ్ చెప్పిన ప్రకారం అయ్యూబ్ (అలైహి) తన కాళ్ళతో నేల మీద  తట్టారు. ఆ వెంటనే మంచి నీటి ఊట పైకి ఎగజిమ్మింది. అపుడు అల్లాహ్....,

అల్లాహ్ : - అయ్యూబ్! ఇపుడు నువ్వు ఆ చల్లని నీటితో నీ శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని కడుగుతూ, మొత్తం శరీరమంతా తడిపేసి స్నానం చేయి.

అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, ఆ మంచి నీటి ఊట తో స్నానం చేయగానే అయ్యూబ్ (అలైహి) చర్మం పై ఉన్న గాయాలు ఒక్కొక్కటి అదృశ్యమవుతూ మరియు శరీరాన్ని సోకిన వ్యాధి, పుళ్లు (పుండ్లు) మరియు పురుగులు క్షణంలో అదృశ్యమైపోయాయి. అల్లాహ్ తన ప్రతిస్పందనను ఇంకా తెలియజేస్తూ....,

అల్లాహ్ : - అయ్యూబ్! ఇపుడు కొంచెం పక్కకు వెళ్లి, వేరొక ప్రదేశంలో మునుపటిలాగే నిలబడి నీ పాదాలను నేల మీద తట్టు, పైకి వచ్చిన ఆ మంచి నీటిని తాగడానికి ఉపయోగించు.

అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయగానే, ఉబికి వచ్చిన ఆ మంచి నీటిని అయ్యూబ్ (అలైహి) తాగారు. ఆ వెంటనే ఆయన శరీరంలోకి ప్రవేశించిన నీటి వల్ల, అయ్యూబ్ (అలైహి) శరీరం లోపల అంతర్గత సమస్యలన్నీ అదృశ్యమయ్యాయి. అంతేకాకుండా ఆయన తన యుక్త వయస్సులో ఉన్నప్పటిలా ఒక యువకుడిలాగా తయారయి, ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడ్డారు.

అల్లాహ్ చెప్పిన విధంగా, ఆ వసంత ధారవాహికను ఉపయోగించుకోవడం వల్ల అయ్యూబ్ (అలైహి) శరీరం లోపలి సమస్యలు మరియు బయటి సమస్యలు నుంచి పూర్తిగా కుదుటపడి, ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని మునుపటిలాగా ఆరోగ్యవంతంగా, నవ యువకుడిలా తయారయ్యారు.

*తిరిగివచ్చిన రహీమా అలైహిస్సలామ్* 

తన భర్త అయ్యూబ్ (అలైహి) ఆజ్ఞ ప్రకారం, తన భర్తని వదిలి వెళ్లిపోయిన రహీమా (అలైహి) ఎల్లప్పుడూ తన భర్త అయ్యూబ్ (అలైహి) పరిస్థితి ఎలా ఉందో! అని తీక్షణంగా ఆలోచించేది. అయ్యూబ్ (అలైహి) కోసం ఆవిడ హృదయం తల్లడిల్లేది. ఇలా అయ్యూబ్ (అలైహి) ని వదిలి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఎలాగైనా తన భర్తతో క్షమాపణలు కోరి, అక్కడే అయ్యూబ్ (అలైహి) కు సేవచేస్తూ, ఆయన సేవలో గడపాలని రహీమా (అలైహి) తిరిగి తన ఇంటికి వచ్చింది.

రహీమా (అలైహి) తన ఇంట్లోకి ప్రవేశించగానే, ఇంటి లోపల వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని యౌవనత్వంలో ఉన్న యువకుడిలాగ అయ్యూబ్ (అలైహి) కనిపించారు. రహీమా (అలైహి), ఆ యువకుడే తన భర్త అని దాదాపు అయ్యూబ్ (అలైహి) ని గుర్తించలేదు. ఎందుకంటే ప్రవక్త అయ్యూబ్ (అలైహి) ని రహీమా (అలైహి) వదిలి వెళ్ళేటప్పుడు ఉన్నట్లుగా ఆయన జబ్బుతో లేరు. అపుడు రహీమా (అలైహి) అతనితో....,

రహీమా (అలైహి) : - ఓ అల్లాహ్ యొక్క దాసుడా! మీరు ఎవరు? ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారు? ఈ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక దైవప్రవక్త ను చూశారా? మీరు ఆ వ్యక్తిని పోలి ఉంటారు!

అయ్యూబ్ (అలైహి) : - రహీమా! నేనే నీ భర్త అయ్యూబ్ (అలైహి)ను. నా వ్యాధి నయమైపోయి, పూర్తి యవ్వనంలో ఉన్న నన్ను గమనించు. నువ్వు నా నుంచి వెళ్లిపోగానే, నేను అల్లాహ్ అనుగ్రహం కోసం అల్లాహ్ ని వేడుకున్నాను. నా ప్రభువు నా మొర ఆలకించి నా నుండి ఆ భయంకరమైన వ్యాధిని దూరం చేశారు. (అని చెప్పి, మంచి నీటి ఊట గురించి జరిగినదంతా చెప్పారు.) చూశావా ఇపుడు నేను మునుపటి కంటే మెరుగైన ఆరోగ్యంతో ఉన్నాను.

ఈ మాటలు విని, భయంకర వ్యాధి నుంచి బయటపడి పూర్తిగా కోలుకొని ఉన్న తన భర్త అయ్యూబ్ (అలైహి) లో వచ్చిన మార్పును చూసి రహీమా (అలైహి) ఆశ్చర్యపోయింది. తన కంటి నుంచి ఉబికి వస్తున్న కన్నీటి ధారతో, ఆ వెంటనే అయ్యూబ్ (అలైహి) ని ఆనందంతో కౌగిలించుకుంది. ఇబ్లీస్ మాటల ప్రలోభానికి గురయ్యి అయ్యూబ్ (అలైహి) ని నిలదీసినందుకు గాను ఆయనకు క్షమాపణలు కోరింది.

ఆ తర్వాత తన భర్తని పూర్తి ఆరోగ్యవంతుడిగా చేసి, తనకు మునుపటి జీవితాన్ని ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపింది. షైతాన్ మాటల ప్రలోభానికి, అల్లాహ్ విశ్వాసం పట్ల బలహీనమైనందుకు అల్లాహ్ క్షమాపణలు కూడా కోరింది.

అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ దంపతులిద్దరూ వహించిన సహనానికి గాను అల్లాహ్ వారికి ప్రతిఫలం ఇచ్చారు. పోగొట్టుకున్న సంపదను, పంటపొలాలను, పశువులను తిరిగి వారికి ప్రసాదించారు. వారి సంతానానికి బదులుగా ఇరవై మంది కన్నా ఎక్కువ పిల్లల్ని ప్రసాదించారు. జబ్బు బారినపడ్డ అయ్యూబ్ (అలైహి) ని తిరిగి ఆరోగ్యవంతుడిగా చేశారు. 

*అయ్యూబ్ (అలైహి) గందరగోళం* 

ఇలాంటి సంతోషకరమైన స్థితిలో అయ్యూబ్ (అలైహి) ఒక గందరగోళాన్ని ఎదుర్కొన్నారు. ఆ తిరకాసు ఏమనగా; అయ్యూబ్ (అలైహి) జబ్బు తో బాధ పడుతూ అనారోగ్యంగా ఉన్నప్పుడు, రహీమా (అలైహి) ఇబ్లీస్ మాటలను నమ్మి అల్లాహ్ పై ఉన్న విశ్వాసం పట్ల బలహీనంగా ఉన్నందువల్ల , "మళ్ళీ ఆరోగ్యం చేకూరితే నిన్ను వంద దెబ్బలతో శిక్షిస్తాను" అని తన భార్య రహీమా (అలైహి) కు చెప్పి అయ్యూబ్ (అలైహి) ప్రమాణం చేస్తారు.

ఇక ఆరోగ్యం కుడుటపడింది కాబట్టి అయ్యూబ్ (అలైహి), తను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోని, తన భార్యను వంద దెబ్బలతో శిక్షించాలి. ఈ విధంగా ప్రవక్త అయ్యూబ్ (అలైహి) తన ప్రమాణాన్ని నిలబెట్టుకోవలసి వచ్చింది. కానీ అందుకు అయ్యూబ్ (అలైహి) వెనకడుగు వేస్తారు. ఎందుకనగా....,

అయ్యూబ్ (అలైహి), తను అనారోగ్యంతో ఉన్నపుడు తన బంధువులు మరియు స్నేహితులు సేవ చేయలేక ఆయనను వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో తనను కంటికి రెప్పలాగా చూసింది కాబట్టి, ఈ విధంగా అయ్యూబ్ (అలైహి) తన భార్యను శిక్షించలేరు. మరియు అల్లాహ్ పై బలహీన విశ్వాసం పట్ల తన నుంచి దూరంగా తన భార్య రహీమా (అలైహి) ను వెళ్లిపోమని అయ్యూబ్ (అలైహి) ఆజ్ఞాపించినపుడు, ఆవిడ ఆ ఆజ్ఞ ప్రకారం వెళ్ళిపోయి, తన భర్తను విడిచిపెట్టి ఉండలేక క్షమాపణలు అడిగి అయ్యూబ్ (అలైహి) కు సేవ చేస్తూ,ఆయన వద్దే గడపడానికి తిరిగి తన ఇంటికి వచ్చింది కాబట్టి. ఈ విధంగా రహీమా (అలైహి) ను బాధించే ఉద్దేశ్యం అయ్యూబ్ (అలైహి) ఎంతమాత్రం లేదు.

ఈ పై కారణాల వల్ల అయ్యూబ్ (అలైహి), తన పట్ల విశ్వాసంగా ఉన్నందుకు తన భార్యను శిక్షించలేరు, కానీ చేసిన ప్రమాణాన్ని మాత్రం భంగపరచకూడదు. ఈ కారణాలు కాకుండా, ప్రవక్తలు వారి భార్యలను ఎన్నడూ కొట్టలేదు. అందువలన అయ్యూబ్ (అలైహి) మరింత గందరగోళంలో ఉన్నారు. అయ్యూబ్ (అలైహి) యొక్క ఈ దురవస్థను అల్లాహ్ చూసినప్పుడు, ఈ ఇబ్బంది నుండి బయటపడటానికి వహీ ద్వారా ఒక చక్కటి మార్గం అయ్యూబ్ (అలైహి) తెలిపారు.

అల్లాహ్ : - అయ్యూబ్! వంద గడ్డిపోచలు కలిపి ఒక కట్టగా చేయ్. నీ భార్య శరీరానికి ఆ కట్టను కొట్టేలా తాకించు. ఆ విధంగా నీవు చేసిన ప్రమాణం పూర్తవుతుంది. నీ కష్టకాలంలో నీ వెంట ఉన్న నిజాయితీ కలిగిన నీ భార్య పట్ల సానుభూతి, దయలను ప్రదర్శించినట్లవుతుంది. అంతేగాని ప్రమాణాన్ని విచ్ఛిన్నం చేయవద్దు.

*(గడ్డిపోచల కట్ట) "ఈనెల కట్ట తీసుకొని కొట్టు, ప్రమాణాన్ని భంగపరచకు." మేమతడ్ని సహణశీలిగా, మంచి దాసునిగా, తన ప్రభువు వైపుకు మాటిమాటికి మరలే వానిగా గుర్తించాము. (ఖురాన్ 38:44)* 

ఈ విధంగా అయ్యూబ్ (అలైహి) యొక్క సంకటాన్ని అల్లాహ్ స్వయంగా తొలగించారు.

ఇంతటితో ప్రవక్త హజ్రత్ అయ్యూబ్ అలైహిస్సలామ్ గారి కథ ముగిసినది. Insha Allah రేపటి భాగము - 57 లో *ప్రవక్త హజ్రత్ యూనుస్ అలైహిస్సలామ్* గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

*గ్రహించవలసిన పాఠాలు : -* 

○ ప్రవక్తలకు కూడా పరీక్షలు, కష్టాలు తప్పవు. మనిషిని అతని విశ్వాస స్థాయికి అనుగుణంగా పరీక్షించడం జరుగుతుందని అంటారు. మనిషి బలమైన విశ్వాసం కలిగినవాడైతే కఠినమైన పరీక్షలకు గురిచేయడం జరుగుతుంది. ఈ విధంగా అల్లాహ్ మనిషి విశ్వసాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షలో సహనం వహించినవారికి తన కారుణ్యంతో ప్రతిఫలం ప్రసాదిస్తారు. అల్లాహ్ ఈ విధంగానే అయ్యూబ్ (అలైహి) ను పరీక్షించారు. ఈ పరీక్షలో ఆయన సహనానికి మారుపేరుగా నిలిచారు. అయ్యూబ్ (అలైహి) వంటి సహనం కలిగిన వ్యక్తిగా ఎవరినైనా ప్రశంసించడమంటే భావం అత్యంత ఉత్తమ స్థాయి సహనం కలిగిన వాడిని చెప్పడమే.

○ సబ్ర్ (సహనం) గురించి 70 సార్ల కన్నా అధికంగా దివ్యఖురాన్ ప్రస్తావించింది. మిగిలిన సద్గుణాలకన్నా సహనాన్ని అల్లాహ్ అధికంగా ప్రశంసించారు.

○ భార్యతో ఎలా వ్యవహరించాలన్నది అయ్యూబ్ (అలైహి) ఆచరణల్లో తెలుస్తుంది. అయ్యూబ్ (అలైహి) కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్లీస్ ఆయన భార్య రహీమా (అలైహి) ను ప్రలోభానికి గురిచేశాడు. అందువల్ల ఆయన తన భార్యను శిక్షిస్తానని ప్రమాణపూర్వకంగా చెప్పారు. కానీ ఆమె ఆయన పట్ల చాలా విశ్వాసంగా ఉన్న మహిళ. అందువల్ల ఆమె పట్ల ఉదారంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అల్లాహ్ ఒక చక్కని మార్గాన్ని ఆయనకు చూపించారు.

○ వంద గడ్డిపోచల కట్టతో భార్యను తాకాలని చూపించిన పద్ధతి నిజానికి అల్లాహ్ నేర్పిన ఒక పాఠం. మాటలకు, వాస్తవాలకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించవలసిన అవసరాన్ని ఈ పద్ధతి తెలుపుతుంది. బహిరంగంగా విధించే సాధారణమైన శిక్ష కూడా మనిషికి సరిపోతుంది.

○ అనుచితంగా ప్రమాణాలు చేయరాదని దివ్యఖుర్ఆన్ బోధిస్తుంది.

No comments:

Post a Comment