96

☪☪☪   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*  🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐          *ఇస్లాం చరిత్ర* *- 96*          🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 11* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

*హలీమా పెంపకంలో చిన్నారి ముహమ్మద్ (సల్లం)* 

ముహమ్మద్ (సల్లం) పుట్టిన తర్వాత, అబూ లహాబ్ బానిస మహిళ సౌబియా ఏడు రోజుల వరకు ఆయనకు (సల్లం) పాలు తాగించింది. చిన్నారి ముహమ్మద్ (సల్లం), కన్నతల్లి ఒడిలో నుంచి పాలతల్లి ఒడిలోకి వెళ్ళే సమయం ఆసనమయ్యింది.

"ఖురైష్" వంశంలో గొప్పింటి అరబ్బులు, తమ సంప్రదాయం ప్రకారం, తమ పిల్లలను నగర వాతావరణానికి దూరంగా, రోగాల నుండి రక్షణ కోసం, పాలు పట్టే "బద్ వీ" స్త్రీలకు అప్పజెప్పేవారు. చుట్టుప్రక్కల పల్లెల నుండి వచ్చి, ధనవంతుల పిల్లలను తమతో పాటు కొద్దికాలం తీసుకెళ్ళి, తమ పాలు పట్టి పోషించే పల్లె స్త్రీలను "బద్ వీ" స్త్రీలు అంటారు.

అదే కాదు, పల్లె వాతావరణంలో పెరగడం వల్ల వారి శరీరం దృఢంగా, సౌష్టవంగా మారాలని, పై పెచ్చు చిన్నప్పటి నుండే స్వచ్ఛమైన అరబీ ఉచ్చారణ నేర్చుకోవాలని అరబ్బులు కోరుకునేవారు. చంటి పిల్లల్ని తీసుకెళ్ళి రెండు సంవత్సరాలు పోషించిన తర్వాత, తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించేవారు. ఇలా చేయడం వల్ల ఆ "బద్ వీ" స్త్రీలకు, వారి పిల్లల్ని పోషించినందుకు ఆ ధనికులు నుంచి ఆర్థిక సాయం దక్కేది. అలా వచ్చిన డబ్బుతో, కొన్ని రోజుల పాటు ఆ పల్లె ఆయాల కుటుంబం గడిచేది.

ఖురైషీయుల ఈ సంప్రదాయం ప్రకారమే అబ్దుల్ ముత్తలిబ్, తన ముద్దుల మనవడు ముహమ్మద్ (సల్లం) కు పాలు పట్టే ఆయాను వెతకడం ప్రారంభించారు. చివరకు, చిన్నారి ముహమ్మద్ (సల్లం) కు పోషణభారం వహించే ఆయాగా హజ్రత్ హలీమా (రజి"అన్హా) కు ఈ అదృష్టం దక్కింది.

హలీమా, "బనీ సఅద్ బిన్ బకర్" తెగకు చెందిన మహిళ. ఈమె తండ్రి "అబూ జువైబ్". భర్త పేరు "హారిస్ బిన్ అబ్దుల్ ఉజ్జా." ఈయన "అబూ కబ్ షా" పేరున పిలువబడేవాడు. హారిస్ కూడా బనీ సఅద్ తెగకు చెందిన వ్యక్తే.

*"బద్ వీ" స్త్రీల బృందం : -* 

నిప్పులు కురిసే ఎండలో, అగ్నిలో ప్రయాణం చేస్తున్నట్లు ఉండే ఎడారి మార్గాన, తమ పల్లెల నుంచి బహుదూర ప్రయాణం చేస్తూ, "బనూ సఅద్" తెగకు చెందిన కొంత మంది స్త్రీలు, తమ తమ ఒంటెలపై ప్రయాణం సాగిస్తున్నారు. ఈ బృందంలో, తన భర్త హారిస్ తో పాటు, పాలు త్రాగే తన కుమారుణ్ణి ఎత్తుకొని, నత్త నడకలా నడుస్తున్న తన తెల్ల కంచర గాడిదపై ఎక్కి ప్రయాణం చేస్తూ హజ్రత్ హలీమా కూడా ఉన్నారు. ఆ హలీమా దంపతుల వెంట ఓ బక్కచిక్కిన ఒంటె కూడా ఉంది. బనూ సఅద్ కు చెందిన స్త్రీలతో పాటు హలీమా కూడా, ఊరిని వదిలి పాలు త్రాగే పిల్లలను వెతుకుతూ బయలుదేరారు. అది కరువుకాలం. కరువు వల్ల ఎవరి వద్ద చిల్లిగవ్వ కూడా మిగల్లేదు.

*ఈ ప్రయాణానికి ముందు హలీమా జీవన సరళిలోని కొన్ని రోజుల గురించి కొన్ని ఉల్లేఖనాలు ప్రకారం : -* 

హలీమా, తన వెంట ఉన్న ఒంటె, అంతకు ముందు ఒక్క చుక్క పాలు ఇస్తే ఒట్టు. ఇటు ఆకలికి తన కొడుకు ఏడవడం వల్ల రాత్రి వేళల్లో ఆ దంపతులకు నిదుర కూడా కరువైంది. ఆమె వక్షస్థలంలోనూ పాలు ఒక్క చుక్క కూడా లేవు. కరువు కాలంలో గడ్డి మేయనందువల్ల వారి పశువులు కూడా పాలు ఇచ్చేవి కావు. ఇలాంటి కరువు కాలం నుంచి బయట పడేందుకు వారు వర్షం కోసం ఎదురుచూస్తున్న రోజులవి.

అలాంటి సమయంలో పాలు తాగే ధనవంతుల పిల్లల పోషణ కోసం, కొంత మంది స్త్రీలతో కలసి ఆ దంపతులు మక్కాకు బయలుదేరారు. తన ప్రయాణం కోసం హలీమా, తన తెల్ల కంచర గాడిదపై బయలుదేరింది. కానీ అది బలహీనంగా, బక్కచిక్కి ఉండటం వలన అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా నడవడం వలన, ఆ బృందంలో ఉన్న స్త్రీలంతా కస్సుబుస్సుమన్నారు.

*మక్కా చేరుకున్న ఆయాల బృందం : -* 

ఎట్టకేలకు వారందరూ పాలు త్రాగే పిల్లల కోసం మక్కా చేరుకున్నారు. చంటి పిల్లల పోషణ కోసం వచ్చిన ఆ పల్లె ఆయాలు, మక్కా పట్టణంలోకి ప్రవేశించగానే ధనికుల పిల్లల కోసం గాలింపు మొదలుపెట్టారు. ధనవంతుల స్త్రీలు, తమ పిల్లల పోషణభారం వహించేందుకు తమకు నచ్చిన పల్లె స్త్రీలను ఎన్నుకుంటున్నారు. ఆ పల్లె ఆయాలు కూడా ధనవంతుల పిల్లలను బాగా పోషిస్తామని ఎంతో నమ్మకం కలిగి వచ్చారు.

కాని హలీమా అందరికన్నా బలహీనంగా ఉండడం వల్ల, ఏ తల్లి యొక్క దృష్టిని తన వైపుకు తిప్పుకోలేకపోయింది. ఎముకుల గూడులా ఉన్న హలీమా, తమ పిల్లలకు ఏ లోటు రాకుండా పాలిచ్చి పోషించగలదని, తమ పిల్లలను అప్పగించేందుకు ఏ తల్లీ ముందుకు రాలేదు!

*చిన్నారి ముహమ్మద్ (సల్లం) ను తీసుకునేందుకు నిరాకరించిన ఆయాలు : -* 

ఆ ఆయాల బృందంలో ప్రతి ఒక్కరు చిన్నారి ముహమ్మద్ (సల్లం) ను చూపడం జరిగింది. అయితే ఆ పిల్లవాడు పుట్టక ముందే తండ్రిని కోల్పోయాడు అని తెలియగానే, తండ్రి లేనందున తగిన ప్రతిఫలం లభించదనే ఉద్దేశ్యంతో, పిల్లవాడిని తీసుకోవడానికి నిరాకరించి ఆ ఆయాలు వెళ్ళిపోయారు. "తండ్రి లేని పిల్లవాడిని పెంచి పోషించడమంటే పేదరికాన్ని కొని తెచ్చుకోవడమే, పైగా ఆ బిడ్డ తాత దారిన పోయే దానయ్యలందరికీ దానం చేసి చేసి దారిద్ర్యం తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మనకి ఏమీ ఇవ్వలేడు! వితంతువు అయిన ఈ పిల్లవాని తల్లి కూడా మనకి ఏమిస్తుంది!" ఈ కారణాల వల్ల చిన్నారి ముహమ్మద్ (సల్లం) పోషణభారం స్వీకరించేందుకు ఏ "బద్ వీ" స్త్రీ కూడా ముందుకు రాలేదు.

*ప్రయాణానికి ముందు : -* 

ఆయాలంతా తమకు అప్పగించబడిన పసిపిల్లలను చూసుకుని మురిసిపోతూ తిరుగు ప్రయాణానికి సిద్దమయ్యారు. కాని హలీమాకు ఎవరూ పిల్లల్ని ఇవ్వలేదు. తన వెంట వచ్చిన స్త్రీలందరికి ఎవరో ఒక పిల్లవాడు లభించాడు. కేవలం హలీమాకే ఏ పిల్లవాడు లభించలేదు. ఇక బయలుదేరే సమయంలో తన భర్తతో....,  “దైవసాక్షి! నా స్నేహితురాళ్ళందరూ పిల్లలను ఎత్తుకొని సంతోషంగా వెళ్తున్నారు. ఒట్టి చేతులతో నేనెలా తిరిగి వెళ్ళేది? వెళ్ళి ఆ తండ్రిలేని పిల్లవాడినే తెచ్చుకుంటాను. ఒట్టి చేతులతో వెళ్ళటం కన్నా అనాథ బిడ్డని అయినా తీసుకెళ్ళడం మంచిది కదా?" అని అన్నది హలీమా.

“ఫర్వాలేదు! తండ్రిలేని పిల్లవాడ్ని పెంచితే తప్పు ఏముంది? బహుశా అల్లాహ్ ఇందులోనే మనకు శుభం కలిగించవచ్చు." అని ధైర్యం చెప్పాడు తన భర్త హారిస్.

హలీమా ఆనందంతో పరుగు వేగంతో బయలుదేరింది. ఆమినా తన కుమారుణ్ణి తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో చూసి చాలా నిరుత్సాహ పడ్డారు. “నా బిడ్డ తండ్రి కోల్పోయిన నిర్భాగ్యుడు. అందుకే ఆయాలెవరూ తీసుకోలేదు. ఇరుగుపొరుగు స్త్రీల పిల్లలందరినీ తీసికెళ్ళారు, నా బాబు ఒక్కడే మిగిలిపోయాడు.” ఇలా ఆలోచిస్తే ఆవేదన చెందుతున్న ఆ తల్లికి హలీమా రావడం కనిపించింది. మోడువారిన ఆశలు మళ్ళీ చిగురించసాగాయి. “అమ్మా! నేను మీ బాబును తీసుకెళ్ళనా!” అన్నది హలీమా.

ఈ మాట వినగానే ఆమినా సంతోషంతో పొంగిపోయారు. మనసులో పిల్లవాడిని ఆయాకు అప్పగించటానికి ఇష్టం లేకపోయినా తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని పాటించక తప్పదు. అనిర్వచనీయమైన కాంతులీనుతూ, అమాయకమయిన బోసి నవ్వులు చిందిస్తున్న బాల ముహమ్మద్ (సల్లం) ను ఆమె రెండు క్షణాల పాటు తనివితీరా చూసుకుని ప్రగాఢంగా గుండెలకు హత్తుకున్నారు. అమితమైన మమతానురాగాలతో ముద్దాడారు. ఆ తరువాత హలీమ చేతుల్లో పెట్టారు.

*తిరుగు ప్రయాణం : -* 

హలీమా చిన్నారి ముహమ్మద్ (సల్లం) ని తీసుకుని ముసిముసి నవ్వులతో వెళ్ళిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ, ఆయాల బృందంతో కలిసి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారి బృందం బయలుదేరింది. హలీమా, తన బలహీనమైన కంచర గాడిద పై ఎక్కి కూర్చుంది. చిన్నారి ముహమ్మద్ (సల్లం) కూడా ఆమె ఒడిలోనే ఉన్నాడు. వచ్చేటప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా నడిచిన కంచర గాడిద, వెళ్ళేటప్పుడు మాత్రం బిడరం మొత్తాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. మరే గాడిద కూడా దాని గమనాన్ని అందుకోలేకపోయింది. అది చూసి భార్యభర్తలతో పాటు తోటి ఆయాలు కూడా ఆశ్చర్యపోయారు. దాని వేగం చూసిన ఆ ఆయాలు హలీమాను పిలిస్తూ ...., "ఓ అబూ జువైబ్ కూతురా! ఇదేమిటి? మమ్మల్ని కూడా కాస్త చూడు. నీవు మా వెంట వచ్చేటప్పుడు ఎక్కి వచ్చిన కంచర గాడిదేగా ఇది?" అని అరిచారు. దానికి హలీమా...., "ఔనౌను, దైవసాక్షి! ఇది ఆ గాడిదే సుమా! దీనికి ఏదో ప్రత్యేకత ఏర్పడిందమ్మా!" అని బదులిచ్చింది.

ఇలా వారు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే, "బనూ సఅద్" తెగ నివాస ప్రదేశంలోని వారి వారి ఇళ్ళకు వచ్చి చేరుకున్నారు.

బాల ముహమ్మద్ (సల్లం) ని చూసుకుని హలీమా పరమ సంతోషంతో పరవశించిపోయింది. గుండెలకు హత్తుకుంది. పాలు లేక కృశించిపోయిన తన స్తనాన్ని బాధగా నిట్టూరుస్తూ పిల్లవాడి నోటికి అందించింది. కాని ఆశ్చర్యం....! హఠాత్తుగా హలీమాకు, తన స్తనాలు పాలతో నిండినట్లు అనుభూతికలిగింది. అంతే, పిల్లవాడు ఏకధాటిగా కడుపార పాలు త్రాగాడు. ఆ తరువాత, ముహమ్మద్ (సల్లం) పాల సోదరుడు "అబ్దుల్లాహ్" మరియు పాల సోదరి "షైమా" కూడా కడుపార పాలు త్రాగరు. హలీమా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. ఆ రాత్రి హలీమా దంపతులు ఆదమరిచి నిద్రపోయారు. ఎంతో హాయిగా రాత్రి గడిచింది. అంతకు మునుపు ఆ భార్యాభర్తలు ఇద్దరూ, తమ కుమారుడు అబ్దుల్లాహ్ తో పాటు నిద్రపోలేకపోయేవారు. కారణం, అబ్దుల్లాహ్ కు పాలు తక్కువై రాత్రి వేళల్లో ఏడవడం వల్ల ఆ భార్యభర్తలిద్దరికి నిదుర వచ్చేది కాదు.

హలీమా ఇంట శుభాలపంట పండింది. పట్టుకున్నదల్లా బంగారమైపోతోంది.చిక్కి శల్యమయిన వారి ఒంటె చలాకీగా తయారయింది. హారిస్ ఒంటె పాలు పితకదానికి వెళ్లగా దాని నిండుగా ఉన్న పాలిండ్ల (పొదుగులు) నుంచి చూస్తుండగానే పాలు కారసాగాయి. భార్యభర్తలు సంభ్రమాశ్చర్యాలతో ఆ వింత చూడసాగారు. పితికిన ఆ ఒంటె పాలను కడుపునిండా త్రాగారు.

ఆ కాలంలో ఆ ప్రాంతం అంతటి కరువు ప్రాంతం ఈ భూమిపై మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. వారు తిరిగి తమ ఇంటికి వచ్చిన తర్వాత, వారి మేకలు మేత కోసం బయటకు వెళితే కడుపునిండా మేసి నిండు పొదుగులతో తిరిగి వచ్చేవి. ఆ పాలను పితికి వారు త్రాగేవాళ్ళు.

ఆ కాలంలో ఏ వ్యక్తికీ ఒక్క చుక్క పాలు లభించేవి కావు. వారి పశువుల పొదుగులు ఎండిపోయి చుక్క పాలు కూడా లేకుండా ఉండేవి. చివరికి వారి జాతి ప్రజలు, తమ తమ పశువుల కాపరులతో...., "మూర్ఖులారా! అబూ జువైబ్ కూతురి కాపరి ఎక్కడ పశువుల్ని మేపుతున్నాడో అక్కడికి మీరు కూడా తీసుకువెళ్ళి మేపండి." అని చెప్పి మరి పంపేవారు. అయినా వారి మేకలు అర్ధాకలితోనే తిరిగివచ్చేవి. వాటి పొదుగుల్లో చుక్క పాలు కూడా ఉండేవి కావు. హలీమా మేకలు మాత్రం నిండిన పొదుగులతో ఇంటికి తిరిగి వచ్చేవి.

ఇలా హలీమా దంపతులు, అల్లాహ్ తరఫున క్రమం తప్పకుండా శుభాల వృద్ధే జరుగుతున్నట్లు గమనిస్తూపోయారు.

హారిస్ : - హలీమా! మనం చాలా అదృష్టవంతులం కదా! ఈ పిల్లవాడికి తండ్రి లేడని, పిల్లవాని పోషణభారం తీసుకోకూడదు అని అనుకున్నాం గాని ఇప్పుడు చూడు, మన ఇంట బంగారుగని అయ్యాడు.

హలీమా : - ఔను నిజమే! ఈ పిల్లవాడు దొరకటం నిజంగా మన అదృష్టమే.

*తిరిగి కన్నతల్లి గూటికి : -* 

బాల ముహమ్మద్ (సల్లం) కు రెండేళ్ల ప్రాయం వచ్చింది. పిల్లల ఆటపాటల్లో, హలీమా దంపతుల పోషణలో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లవానికి పాలు పట్టడం పూర్తిగా మానేశారు. రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేలోపల ముహమ్మద్ (సల్లం) ఇతర పిల్లల కంటే శారీరకంగా, దృఢంగా, అంగసౌష్టవంతో పెరిగిపోయాడు.

ఆ తరువాత హలీమా దంపతులు, బాల ముహమ్మద్ (సల్లం) ని తన తల్లి ఆమినా వద్దకు తీసుకెళ్ళారు.

_మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము._ 

🖊🖊     ®@£€€q +97433572282  🖊🖊
                 (rafeeq)

🖊🖊  Salman      +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment