63

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 63* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*కొండగుహ వారు : - - : (డెసియస్ పాలనా కాలం)* 

ఇఫిసస్ నగరంలో పండుగ రోజు అది. ఆ రోజున ప్రజలు తమ విగ్రహాలకు పూజలు చేస్తారు. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఒక యువకుడు దూరంగా ఉండిపోయాడు. ఎందుకంటే, అతని మనసుకొయి ఈ కార్యక్రమం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. అతను ఒక చెట్టు నీడన కూర్చుని నగరంలో జరుగుతున్న కార్యక్రమం గురించి ఆలోచించసాగాడు. కొంతసేపటి తర్వాత అతని మిత్రుడు ఒకరు వచ్చి కలిశాడు. ఆ తరువాత కొద్దిసేపటికి మరొకరు. అలా మొత్తం ఏడుగురు మిత్రులు అక్కడ కలిశారు. వారందరి ఆలోచనా విధానం ఒక్కటే. విగ్రహారాధన పట్ల, విగ్రహారాధకులు పట్ల వారి మనస్సులో అనేక అనుమానాలున్నాయి. అల్లాహ్ వారికి సత్యాన్ని గ్రహించే వివేకం ప్రసాదించారు. వారు తాము నమ్మిన ధార్మిక విశ్వాసాన్ని తమ హృదయాల్లోనే దాచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రాజు కూడా విగ్రహారాధకుడే కాబట్టి తమ విశ్వాసం గురించి చెబితే రాజు వేధింపులకు గురిచేస్తాడని భయపడ్డారు.

*రహస్య సమాలోచన* 

వారంతా మళ్ళీ ఒక రాత్రి సమావేశమయ్యారు. ఆ ఏడుగురు స్నేహితుల్లో ఒకరు గుసగుసగా మిగిలిన వారితో మాట్లాడుతూ....,

ఏడుగురిలో ఒకడు : - స్నేహితులరా! రాజు గారికి మన గురించి తెలిసిపోయిందట, మనం మతం మార్చుకున్నామని తెలిసి రాజు కోపంతో మండిపడుతున్నాడట, కనుక మనం విగ్రహారాధనలో పాల్గొనకపోతే శిక్షిస్తానని బెదిరించినట్లు కూడా తెలిసింది. రాజు, రేపు మనల్ని తన దర్బారుకు పిలిపిస్తాడు. దర్బారులో మన పై విచారణ జరిపిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి.

మరొక యువకుడు : - నాకు కూడా ఈ విషయం తెలిసింది. కాని ఇదంతా ఒక పుకారు మాత్రమే అనుకుంటున్నాను. ఏది ఏమైనా మనం మన విశ్వాసం విషయంలో దృఢంగా ఉండాలి. మళ్ళీ విగ్రహారాధనకు మరలిపోవడం మన వల్ల కానిపని. ఈ సృష్టి మొత్తానికి మహాసృష్టికర్త ఒకరున్నారని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి.

*ఆ ఏడుగురికి కబురు పంపిన రాజుగారు* 

మరుసటి రోజు ఆ ఏడుగురిని రాజుగారు దర్బారుకు పిలిచాడు. వారిని ప్రశ్నించడానికే రాజు పిలుస్తున్నాడని, రాజుకు కొత్త మతం అంటే గిట్టదని వారికి బాగా తెలుసు. అయినా వారు భయపడలేదు. రాజదర్బారులోకి ఆ ఏడుగురు స్నేహితులు ప్రవేశించిన తర్వాత, వారు ఊహించినట్టుగానే మతం మార్చుకున్న విషయమై రాజుగారు వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి వారు...., "మా ప్రభువు భూమి, ఆకాశాలకు ప్రభువు. మేము ఆ సృష్టికర్తను తప్ప మరెవ్వరినీ ఆరాధించము. అల్లాహ్ ను తిరస్కరిస్తే మహాపాపం చేసినట్లు అవుతుంది." (అని నిర్భయంగా చెప్పారు.)

ఈ మాటలు రాజుగారికి చాలా కోపం వచ్చింది. వారికి "మరణశిక్ష విధిస్తాను" అని అన్నాడు. కాని వారు కులీన కుటుంబాలకు చెందినవారయినందువల్ల, రాజుగారు వారికి ఒక రోజు గడువు ఇచ్చాడు. ఈలోగా తమ కొత్త మతాన్ని వదులుకోనట్లు అయితే వారికి చావు తప్పదని హెచ్చరించాడు. వారు అల్లాహ్ పట్ల విశ్వాసంతో మరింత బలాన్ని పొంది ఇలా జవాబిచ్చారు....,

 "రాజుగారు! ఈ మతాన్ని మేము ఎవరి ప్రోద్బలం వల్లనూ స్వీకరించలేదు. అజ్ఞానం వల్లనూ స్వీకరించలేదు. ఎవరి బలవంతం వల్లనూ ఈ మతాన్ని స్వీకరించలేదు. మా హృదయాలలో ఉన్న సహజసిద్ధమైన భావనల ప్రేరణ వల్ల మాకు లభించిన వరం ఇది. అల్లాహ్ మా హృదయాలను ప్రకాశవంతం చేశారు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే మాకు ప్రభువు. ఆయనే భూమి, ఆకాశాలకు ప్రభువు. మేము అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించము. రాజుగారు! మా పట్ల మీరు ఎలా వ్యవహరించాలనుకున్నా.... మీ ఇష్టం.... ఇప్పుడే మీ ఇష్టం వచ్చినట్లు చేయడం మంచిది.

రాజు : - నేను నా నిర్ణయాన్ని ప్రకటించేశాను. కాబట్టి మీకు ఒక రోజు ఆలోచించుకునే గడువు ఉంది. రేపు నేను నా తుది తీర్పు వినిపిస్తాను.

*అక్కడి నుంచి తప్పించుకున్న యువకులు* 

రాజదర్బారు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తమ పథకాన్ని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నారు. అపుడు వారిలో....,

ఒకడు మిగిలినవారితో : - స్నేహితులరా! మనం మన విశ్వాసం పట్ల ఎంత దృఢంగా ఉన్నామో రాజుకు తెలుసు కాబట్టి తప్పక మన మీద చర్య తీసుకుంటాడు. ఒకవేళ రాజు చర్య తీసుకోకపోతే ప్రజలు రాజును బలహీనుడుగా భావించి పరిహసిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు, పట్టణాన్ని వదిలి కొండ గుహల్లో ఎక్కడైన తలదాచుకుందాం. అక్కడ మనం స్వేచ్ఛగా మన విశ్వాసం ప్రకారం జీవించవచ్చు. ఎవరి జోక్యం ఉండదు.

తమకు లభించిన ఆహారపదార్థాలు తీసుకుని ఆ ఏడుగురు యువకులు కొండలకు వెళ్ళిపోయారు. అక్కడ వారందరికీ సరిపోయే వైశాల్యం ఉన్న ఒక గుహ కనపడింది. ఆ గుహలో వాళ్లు దాక్కున్నారు. వారిని అనుసరిస్తూ ఒక కుక్క కూడా అక్కడి వరకు వచ్చింది.

ఆ కుక్క గుహ ముఖద్వారం వద్ద కూర్చుంది. వారు తమ వద్ద ఉన్న ఆహారపదార్థాలను తిని, సమీపంలోని వాగు నీరు త్రాగి విశ్రాంతి తీసుకున్నారు. కొద్ది సేపటికి వాళ్లంతా గాఢనిద్రలో మునిగిపోయారు.

రోజులు గడిచాయి. నెలలు గడిచాయి  తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ యువకులు అలాగే గాఢనిద్రలో ఉండిపోయారు. సూర్యకిరణాలు ఆ గుహలోనికి రాలేదు. కటిక చీకటిలో ఉండడం వల్ల వారి గురించి బాటసారులకు కూడా తెలుసుకునే అవకాశం చిక్కలేదు. వారి చుట్టూ ఉన్న దుర్మార్గపు ప్రపంచం నుంచి అల్లాహ్ వారికి ఆశ్రయం కల్పించారు. ఆ విధంగా వారు 309 సంవత్సరాల కాలం నిద్రలో గడిపారు. (దివ్యఖుర్ఆన్ ప్రకారం మూడు వందలకు పైబడి తొమ్మిది సంవత్సరాలు. దీనిని బట్టి మూడువందల సంవత్సరాలు సూర్యమాన సంవత్సరాలని, పైన ఉన్న తొమ్మిది సంవత్సరాలు చంద్రమాన సంవత్సరాల లెక్కలోనివని గ్రహించవచ్చు.)

*యువకుల గురించి పట్టణంలో వార్త* 
ఆ ఏడుగురు పట్టణం వదిలివెళ్లిన విషయాన్ని అందరూ చెప్పుకోసాగారు. వాళ్లు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియలేదు. వారి తల్లిదండ్రులు వారిని వెదకడానికి చాలా మందిని పంపించారు. రాజు కూడా దేశం యావత్తు వారి కోసం వెదికించారు. కానీ వారి జాడ దొరకలేదు. వారు ఈ విధంగా మాయం అయిపోయిన సంఘటన తరువాత చాలా కాలం వరకూ జనం కథలుగా చెప్పుకున్నారు. అనేక తరాల వరకు ఈ కథ వ్యాపించింది.

*దీర్ఘనిద్ర నుంచి మెలుకువ* 

ఆ తర్వాత అల్లాహ్ వారిని మళ్లీ నిద్ర లేపారు. నిద్ర నుంచి మేల్కొన్న తరువాత ఆ ఏడుగురు తాము చాలా సేపు నిద్రపోయామని అనుకున్నారు. అందులో ఒకడు జవాబిస్తూ...., "బహుశా మనం ఒక రోజంతా నిద్రపోయి ఉంటాము." అని అన్నాడు. మరొకడు జవాబిస్తూ...., "సూర్యాస్తమయం ఇంకా రాలేదు కాబట్టి రోజులో కొంత భాగం మాత్రమే నిద్రపోయే ఉంటాము." అని అన్నాడు. ఇంకొకడు మాట్లాడుతూ...., "ఈ ఊహలు కట్టిపెట్టండి. నిజం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ముందు నాకు ఆకలి చాలా వేస్తోంది. మనలో ఎవరినైనా పట్టణానికి పంపించి ఆహారం తెప్పిద్దాం. మన జేబుల్లో ఎవరి వద్ద ఎంత సొమ్ము ఉందో పోగు చేయండి. పట్టణానికి వెళ్ళేవారు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆచూకి ఎవరికీ తెలియకూడదు." అని అన్నాడు. వాళ్ళంతా తమ వద్ద ఉన్న సొమ్మును ఒకరికి ఇచ్చారు. అతడిని పట్టణానికి పంపించారు.

*పట్టణంలోకి ప్రవేశించిన యువకుడు* 

ఆ యువకుడు పట్టణం దగ్గరకు చేరుకుంటున్నప్పుడు, అక్కడి పరిసరాలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అంతా కొత్తగా వుంది. అతను ఏదీ గుర్తు పట్టలేకపోయాడు. భవనాలు, ప్రజల వస్త్రధారణ, వ్యవహారశైలి అన్నీ మారిపోయాయి. అతను ఒక ఫలహారశాల చూసి అందులోకి ప్రవేశించాడు. ఆ దుకాణందారుడు యువకుడి ముఖంలోని తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. యువకుడు రొట్టెలు కావాలని అడిగాడు. కాని ఆ యువకుడు ఇచ్చిన నాణేలు చూసి దుకాణందారుడు ఆశ్చర్యపోయాడు.

"ఆ విచిత్రమైన నాణేలు ఎక్కడి నుంచి తీసుకువచ్చావు." అని దుకాణందారుడు ప్రశ్నించాడు. అలాంటి నాణేలు ఇక్కడ వాడకంలో లేవని అన్నాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం ప్రారంభమయ్యింది. ఆ వెంటనే జనం గుమిగూడారు. ఆ యువకుడు ఆ ప్రాచీన నాణేలను ఎక్కడి నుంచి సంపాదించాడో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ భావించారు. ఆ యువకుడు ఆ డబ్బు తన స్వంతమని వాదించాడు. రాజభటులు అక్కడికి వచ్చారు. ఆ యువకుడిని న్యాయస్థానానికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆ యువకుడిని ప్రశ్నించడం జరిగింది. అతను తన గురించి చెప్పాడు. గుహలో ఉన్న తన ఆరుగురు మిత్రుల గురించి కూడా చెప్పాడు. అప్పుడు ప్రజలకు ఆ యువకుడు ఎవరో తెలిసింది. మూడువందల తొమ్మిది సంవత్సరాల క్రితం పట్టణం నుంచి మాయమైన ఏడుగురు యువకుల్లో ఒకడిగా అతడిని గుర్తించారు. దుర్మార్గపు రాజు మరణించి అనేక వందల సంవత్సరాలు అయ్యిందని తెలిసి ఆ యువకుడు కూడా ఆశ్చర్యపోయాడు.

ఈ సంఘటన గురించిన వార్త అప్పటి రాజుగారికి తెలిసింది. ఆయన ఒక సందేశహరుడిని పంపి ఆ యువకుడిని పిలుచుకొని రమ్మన్నారు. యువకుడు చెప్పిన విచిత్రమైన కథ విన్న తర్వాత రాజు ఆ యువకునితో కలిసి కొండ గుహ వద్దకు వెళ్లాడు. యువకుడు తన మిత్రులను గుహ బయటకు రమ్మని పిలిచాడు. ఇప్పుడు భయపడవలసిన పనిలేదని చెప్పాడు. వారు బయటకు వచ్చారు. ఆ యువకుల ముఖాలపై తేజస్సు చూసి రాజు మ్రాన్పడిపోయాడు. వారిని చాలా అభిమానంగా ఆలింగనం చేసుకున్నాడు. మిగిలిన యువకులు తమ మిత్రుడి ద్వారా జరిగిన కథ తెలుసుకున్నారు.

రాజు వారిని తన భవనానికి రమ్మన్నాడు. కాని, వారు ఆ ఆహ్వానాన్ని మర్యాదగా కాదంటూ, తమ బంధువులు, మిత్రులు అందరూ మరణించినందువల్ల ఇక జీవితంలో తమకు కావలసింది ఏమీ మిగల్లేదని అన్నారు.

వారు చేతులెత్తి అల్లాహ్ ను ప్రార్థిస్తూ తమను కారుణ్యంతో కాపాడమని కోరుకున్నారు. ఆ వెంటనే వారి ఆత్మలు వారి శరీరాలను వదిలి వెళ్లిపోయాయి. అయినా ఆ యువకులు ముఖాల తేజస్సుతో ప్రకాశిస్తూనే ఉన్నాయి. వారి అంత్యక్రియలకు వేలాది ప్రజలు హాజరయ్యారు. కొండ గుహను వారి సమాధిగా రాజు అందంగా కట్టించాడు.

_సమాధులను అందంగా కట్టించడం అన్నది ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచనం ప్రకారం నిషిద్ధం. ప్రవక్త ముహమ్మద్ (స), ఆయన అనుచరులు, షహీదులు (అమరవీరులు) ఎవరి సమాధులు కూడా ఈ విధంగా కట్టించబడలేదు._ 

Insha Allah రేపటి భాగము - 64 లో ముగ్గురు ప్రవక్తలు - ఒక విశ్వాసి గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment