104

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 104*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 19* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *ముహమ్మద్ (సల్లం) శ్రామిక జీవితం : -* 

యుక్త వయస్సులో దైవప్రవక్త (సల్లం) కు నిర్ణీతమైన పని అంటూ ఏదీ లేదు. అయితే ఆయన (సల్లం) మేకలు కాసేవారని అనేక ఉల్లేఖనాలు చెబుతున్నాయి. ఆయన (సల్లం) మొదట "బనీ సఅద్" మేకల్ని కాశారు. మక్కాలోనూ మక్కా వాసుల మేకల్ని కొన్ని "కీరాత్"ల కూలీ పై కాసేవారు.

 *నిజాయితీతో కూడిన ముహమ్మద్ (సల్లం) వ్యాపారం : -* 

యువ ముహమ్మద్ (సల్లం) మేకలకాపరి నుంచి వర్తకుని స్థాయికి ఎదిగారు. ఇరవై సంవత్సరాలు నిండిన ఆ యువకుని హృదయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఇప్పుడు పేద జనోద్ధరణ భావన కూడా పరవళ్ళు తొక్కసాగింది. ఈ సమస్యను సంపాదన కొంతవరకైనా పరిష్కరిస్తుందన్న ఆశతో ముహమ్మద్ (సల్లం), హజ్ చేసే కాలం కోసం ఎదురుచూడసాగారు.

హజ్ చేసే కాలం రానే వచ్చింది. "ఉకాజ్" ప్రాంతం రకరకాల దుకాణాలతో కళకళలాడసాగింది. దేశం నలుమూలల నుండి వచ్చిన విభిన్న వస్తువులు, సరుకులతో దుకాణాలు కిటకిటలాడిపోయాయి. అమ్మకం, కొనుగోళ్ళు ఊపందుకున్నాయి. వ్యాపార లావాదేవీలతో పాటు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. స్త్రీలు, పురుషులు, పిల్లలతో పాటు ఆ ప్రాంతం కోలాహలంగా ఉంది.

జాతరకు వచ్చిన జనం సాంస్కృతిక కార్యక్రమాలు చూసిన తరువాత దుకాణాల వైపు మరలుతున్నారు. వర్తకులు తమ దుకాణాలను బాగా అలంకరించి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. కొందరు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మరికొందరు అప్పుగా సరుకులు అమ్మి అసలుతో పాటు వడ్డీ కూడా గుంజుతున్నారు.

అయితే ఒక వర్తకుడు మాత్రం తన దుకాణానికి వస్తున్న కొనుగోలుదారులకు సరుకులోని నాణ్యత, నాసిదనాలను గురించి చెబుతూ వాటి ప్రకారమే ధరలు నిర్ణయించి అమ్ముతున్నాడు. అతని నిజాయితీ చూసిన జనం అతని దుకాణంలోని వస్తువులు ఎగబడి కొనసాగారు. అధిక లాభాల కన్నా కొనుగోలుదారుల క్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఆ వ్యాపారి అనతికాలంలోనే వాణిజ్య రంగంలో సత్యసంధుడు (సాదిఖ్‌) గా, నిజాయితీ పరుడు (అమీన్‌) గా ఖ్యాతి గాంచాడు.

(ఆ వ్యాపారి ఎవరో కాదు, యవ్వనంలో ఉన్న ముహమ్మద్ (సల్లం))

అంతేకాకుండా ప్రజల నడ్డివిరిచే వడ్డీ అంటే అతను అసహ్యించుకునేవాడు. వెంటనే డబ్బు చెల్లించలేని పేద కొనుగోలుదారులకు అతను వడ్డీ లేకుండానే సరుకులు అప్పుగా ఇచ్చేవాడు. అసలు చెల్లించలేనివారిని అతను మాఫీకూడా చేసేవాడు. అంచేత ఆ వ్యాపారి "ఉకాజ్" మార్కెట్ లో పేదల పాలిట పెన్నిధి అని కూడా పేరు సంపాదించాడు. అంచేత అతని వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతోంది.

కాని ఎక్కువమంది కొనుగోలుదారులతో సరుకు త్వరగా అమ్ముడుపోతున్నా లాభాలు మాత్రం అంతంత మాత్రమే ఉంటున్నాయి. పెట్టుబడి కూడా ఏమంత పెరగడం లేదు. తోటి వర్తకులు లక్షాధికారులై పొతుంటే ఇతను మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతున్నాడు. 

ఎంత తక్కువ లాభాలతో అమ్మినా కొనుగోలుదారులు అధికమైనప్పుడు ఆ వ్యాపారి ఎప్పుడో ఓ రోజు తప్పకుండా లక్షాధికారి అవుతాడు. కాని ఈ వింతవ్యాపారి సంగతే తోటి వర్తకులకు అంతుబట్టడం లేదు. సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నట్లు? ఈ ఆలోచనతో "ఉత్ బా" అనే ఓ బడావర్తకుడు ఆ వింత వ్యాపారిపై ఓ కన్నేసి ఉంచాడు.

ఓ రోజు రాత్రి "ఉత్ బా", వింతవ్యాపారి దుకాణం మూసి వెళ్ళిపోగానే రహస్యంగా అతని వెనకాల నడిచాడు. వింతవ్యాపారి ధాన్యంమూటల్ని, డబ్బుసంచుల్ని భుజాన వేసుకొని వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో నుంచి ఓ పండు ముసలి బయటికి వచ్చింది. వింతవ్యాపారి, వణుకుతున్న ఆమె చేతులకు ఒక సంచి అందించి మౌనంగా ముందుకు నడిచాడు.

ఆ వింతవ్యాపారి వీధిమలుపు దాటి మరో ఇంటికెళ్ళి తలుపుతట్టాడు. ఆ ఇంట్లో నుంచి అంగవికలుడైన ఒక వృద్ధుడు కుంటుకుంటూ బయటికి వచ్చాడు. అతని కళ్ళు లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. పక్కటెముకలు బయటికొచ్చి అస్థిపంజరంలా ఉన్నాడు. వింతవ్యాపారి అతని చేతులకు ఒక ధాన్యం మూటను అందించి ముందుకు సాగాడు.

రహస్యంగా వెనకాల నడుస్తున్న "ఉత్ బా", ఆ వ్యాపారి దానశీలతను, దయార్ద్ర హృదయాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. “ఇతను లక్షాధికారి కాకపోవడానికి కారణం ఇదన్నమాట!” అనుకున్నాడు మనసులో. 

ఆ వింతవ్యాపారి రెండు వీధులు దాటి ఓ చోట దారి పక్కవున్న మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ చిరిగిన చొక్కాలతో, చాలీచాలని ఉడుపులతో ఉన్న కొందరు పేద పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు, ఆ మనిషిని చూడగానే...., “అదిగో ఆయన వచ్చేశాడు.... ముహమ్మద్ (సల్లం) బాబాయి వచ్చేశాడు.” అన్నారు మహా సంబరపడిపోతూ. 

మహనీయ ముహమ్మద్ (సల్లం) దగ్గరకు రాగానే ఆ పిల్లలు పరుగెత్తుకెళ్ళి ఆయన్ని చుట్టేసుకున్నారు. యువ ముహమ్మద్ (సల్లం) వాత్సల్యపూరితంగా చూస్తూ, తన దగ్గర మిగిలివున్న మూటలు, సంచులన్నిటినీ ఆ పిల్లలకు తలా ఒకటి చొప్పున పంచిపెట్టారు. పిల్లలు, “ముహమ్మద్ బాబాయి, మహమంచి బాబాయి!” అని చెప్పుకుంటూ సంతోషంతో గెంతుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.…

“ఉకాజ్" మండిలో ముహమ్మద్ (సల్లం) దుకాణం ప్రతిరోజూ సాయంత్రం దాకా కొనుగోలుదారులతగో సందడే సందడి. ఆదేమి చిత్రమోగాని, ఆ దుకాణం సమీపం నుండి వెళ్ళే ప్రతి వ్యక్తిని ఆ దుకాణం సూదంటురాయిలా ఆకర్షించసాగింది.

"అబ్దుల్లా బిన్ అబుల్ హమ్సానీ" ని కూడా ఆ దుకాణం ఆకట్టుకుంది. దుకాణదారుని నిజాయితీ గుణగణాలు గురించి ఇదివరకే విని ఉండడం వల్ల "అబ్దుల్లా బిన్ అబుల్ హమ్సానీ" పెద్దగా బేరం చేయకుండానే సంతోషంగా సరుకులు కొన్నాడు. కాని అతను సరుకు అక్కడే ఉంచి “మీరు ఇక్కడే ఉండండి, నేనిప్పుడే కాస్సేపట్లో వస్తాను" అంటూ (ముహమ్మద్ (సల్లం) తో చెప్పి వెళ్ళిపోయాడు.

అయితే అలా వెళ్ళినవాడు చీకటిపడినా రాలేదు. మరునాడు కూడా జాడలేదు. ఇప్పుడే వస్తానని వెళ్ళిన మనిషి ఎక్కడికి పోయాడో, ఏమయ్యాడోగాని, అతని కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయారు ముహమ్మద్ (సల్లం)

మూడో రోజు ఆ మనిషి వచ్చాడు. అతడ్ని చూసి ముహమ్మద్ (సల్లం) మండిపడ్డారా? లేదు. ఎంత మాత్రం లేదు. పోనీ ముఖం చిట్లించుకున్నారా? ఉహూ.... మరి...? మందహాసంతో అతడ్ని స్వాగతించారు.

“ముహమ్మద్ ! నేను అనుకున్న సమయానికి రాలేకపోయాను. నేనిందుకు ఎంతో విచారిస్తున్నాను. నేనసలు ఈ విషయాన్నే మరచిపోయాను. నన్ను క్షమించు” అన్నాడు అబ్దుల్లా బిన్ అబుల్ హమ్సానీ సిగ్గుపడుతూ.

“ముహమ్మద్! నువ్వెంత మంచివాడివి!! జనం చెప్పుకుంటున్నట్లు నువ్వు నిజంగా నిజాయతీ పరుడవు, సత్య సంధుడవు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు” అన్నాడు అబ్దుల్లా, ముహమ్మద్ (సల్లం) చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని మృదువుగా వత్తుతూ.

 *తౌహీద్....* 

ఓరోజు యువ ముహమ్మద్ (సల్లం) ఖబీస్ కొండ మీద కూర్చొని కాబా మందిరం వైపు చూడసాగారు. అప్పుడు ప్రజలు కాబా ప్రదక్షిణ చేస్తున్నారు. కొందరు చాలీ చాలని బట్టలు ధరించి అర్థనగ్నంగా ప్రదక్షిణ చేస్తుంటే, మరికొందరు సిగ్గు విడచి నగ్నంగా ప్రదక్షిణ చేస్తున్నారు. కొందరు విగ్రహాల ముందు సాష్టాంగపడుతూ మిధ్యా దైవాలను వేడుకుంటున్నారు. పూజారులు భక్తుల నుండి కానుకలు స్వీకరిస్తూ వాళ్ళను ఆశీర్వదిస్తున్నారు.

మహనీయ ముహమ్మద్ (సల్లం), వాళ్ళ దురాచారాలు, మూఢ నమ్మకాలు చూసి ఎంతో బాధపడిపోయారు. కాస్సేపటికి ఆయన (సల్లం) కొండ మీద నుండి దిగి వచ్చి కాబా ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. అంతలో ఒక వృద్దుడు...., “ఖురైషీయులారా ! ఈనాడు మనలో నేను తప్ప (దైవప్రవక్త) ఇబ్రాహీం (అలైహి) ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నవారెవ్వరూ లేరు” అన్నాడు.

యువ ముహమ్మద్ (సల్లం) ఈ మాటలు విని ఉలిక్కిపడ్డారు. “నిజమే. ఇబ్రాహీం (అలైహి) ధర్మమే మానవాళికి మోక్షం ఇచ్చే ఏకైక సన్మార్గం” అనుకుంటూ ఆయన (సల్లం) ఆ వృద్దుడి దగ్గరకి వెళ్లారు. “తాతా ! ఇబ్రాహీం (అలైహి) ధర్మం గురించి నీకు తెలుసా!” అని అడిగారు.

“ఆ.... ఇబ్రాహీం (అలైహి) ధర్మం అంటే విగ్రహాలు, మిధ్యా దైవాలను పూజించటం కాడు. సృష్టి కర్త, కాబా ప్రభువైన ఏకేశ్వరుడ్ని ఆరాధించటమే ఇబ్రాహీం (అలైహి) ధర్మం. కాని ఈ ధర్మంలో ఆరాధనా విధానం ఏమిటో నాకు బొత్తిగా తెలియదు. కాబా ప్రభువా! నిన్ను ఆరాధించే విధానం ఏమిటో తెలిస్తే బాగుండు. జనం నిజ ధర్మం ఏమిటో తెలియక విగ్రహాలను పూజిస్తున్నారు” అన్నాడు ఆ వృద్దుడు విచారం వెలిబుచ్చుతూ.

వృద్దుని మాటలు విని యువ ముహమ్మద్ (సల్లం) లోలోన ఎంతో సంతోషించాడు. “నేను లాత్, ఉజ్జా, హుబల్ వగైరా మిధ్యా ధైవాలను వదిలేసి ఒక్క అల్లాహ్ ను మాత్రమే నా ఆరాధ్య దైవంగా స్వీకరించాను. నువ్వు కూడా ఆ ప్రభువునే ఆరాధిస్తూ ఉండు నాయనా! అల్లాహ్ ఆరాధించేవాడు ఎన్నటికీ నష్టపోడు” అన్నాడు వృద్దుడు.

ఆ వృద్దుని పేరు "జైద్ బిన్ అమ్ర్." అతనొక్కడే గాకుండా ఇబ్రాహీం (అలైహి) ప్రవక్త (అలైహి) ధర్మంలో స్థిరంగా ఉన్నవారు మరో ముగ్గురు కూడా ఉన్నారు. వారు : వరఖా బిన్ నౌఫల్, ఉస్మాన్ బిన్ హారిస్, ఉబైద్ బిన్ హజష్.

వీరు నలుగురు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఏకేశ్వరత్వాన్ని గురించి మాట్లాడుకుంటారు. సత్యాన్వేషణలో కొంత కాలానికి వరఖా బిన్ నౌఫల్, ఉస్మాన్ బిన్ హారిస్, ఉబైద్ బిన్ హజష్ క్రైస్తవులుగా మారిపోయారు. జైద్ బిన్ అమ్ర్ మాత్రం ఇబ్రాహీం (అలైహి)  ధర్మంలోనే స్థిరంగా ఉండి సత్యాన్వేషణలో తన జీవితం గడుపుతున్నాడు.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment