61

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 61* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

 *యహుదా : - - : ఖత్రూస్* 

బనీఇస్రాయీల్ లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ భిన్న ధ్రువాల వంటివారు. రాత్రి, పగలుకు మధ్య ఎంత తేడా ఉందో వారిద్దరి మధ్య అంత తేడా ఉండేది. ఒక కుమారుడు యహుదా అల్లాహ్ పై భక్తివిశ్వాసాలు కలిగినవాడు. దానధర్మాలు చేసే ఉదార స్వభావి. ఈ ప్రపంచం అంటే ఏమిటో గుర్తించినవాడు. అందువల్ల ఇక్కడి సంపద సౌభాగ్యాలను పట్టించుకునేవాడు కాదు. రెండవ కుమారుడు ఖత్రూస్ ప్రాపంచిక సుఖభోగాలంటే పడిచచ్చేవాడు. చెడు నడతకు అలవాటు పడినవాడు. తండ్రి చాలా సంపన్నుడు. తండ్రి మరణించిన తర్వాత ఇద్దరు సోదరులు వారసత్వంగా ఆ సంపదను సమాన భాగాలుగా పంచుకున్నారు. 
యహూదా తన భాగాన్ని అందుకున్న తరువాత అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించాడు. " అల్లాహ్! నేను ఈ సంపదను నీ ప్రసన్నత పొందే మార్గంలో ఖర్చు చేస్తాను." అన్నాడు.

అతని ఇంటికి వచ్చిన అవసరార్ధులైన వారెవ్వరు ఉత్తచేతులతో వెళ్లేవారు కాదు. యహూదా, తన సంపదలో అధిక భాగం మంచి పనుల కోసం ఖర్చు చేసేశాడు. తన కోసం చాలా తక్కువ సంపద మిగిలినప్పటికీ అతను మాత్రం సంతృప్తితో ఉండేవాడు.

 *ప్రాపంచిక ఆకర్షణలో ఖత్రూస్* 

యహూదా సోదరుడు ఖత్రూస్ ఎన్నడూ దానధర్మాలు చేసేవాడు కాదు. అతని సంపద రోజురోజుకు పెరిగింది. బీదలు ఎంత మొత్తుకున్నా అతని హృదయం కరిగేది కాదు. అతను రెండు తోటలను కొన్నాడు. వాటిని అభివృద్ధి చేయడానికి తన సంపదను, తన శక్తి సామర్థ్యాలు అన్నీ వెచ్చించాడు. ఆ తోటలు పట్టణంలో ప్రముఖ తోటలుగా పేరుపొందాయి. ఖత్రూస్, ఆ తోటల కోసం రోడ్డు వేయించాడు. తోటల్లోని చెట్ల మధ్య సెలయేరు ప్రవహించేలా చేశాడు. తోటలోని పూల సువాసన చాలా దూరం వరకు వ్యాపించేది. అతని తోటలో కాస్త నడిస్తే స్వర్గవనాలలో విహరించినట్లేనని ప్రఖ్యాతి పొందింది.

పచ్చని దట్టమైన చెట్లు, వాటిమధ్య సెలయేరు, ప్రకృతి సౌందర్యం అక్కడ తొణికిసలాడేది. మనసు ప్రశాంతమయ్యేది. ఆ అందమైన తోటను చూడడానికి ప్రజలు చాలా దూరం నుంచి వచ్చేవారు. తన తోట ప్రసిద్ధికెక్కడం చూసి ఖత్రూస్ చాలా ఆనందించాడు. అంతేకాదు, ఈ పేరు ప్రతిష్టల వల్ల అతను అహంభావిగా మారాడు. తన పట్ల అల్లాహ్ ప్రత్యేకంగా అనుగ్రహం కురిపిస్తున్నారని, తన సంపద అందుకు నిదర్శనం అని భావించేవాడు.

 *యాహుదాని కించపరచిన ఖత్రూస్* 

ఒక రోజు యహూదా, తన సోదరుడు ఖత్రూస్ వద్దకు వచ్చాడు. ఖత్రూస్, యహూదాని చిన్నచూపు చూస్తూ....,

ఖత్రూస్ : - యహూదా! నీకు వారసత్వంగా లభించిన సంపద ఏమయింది? చూడు ఎలా ఉన్నావో.... నీ దుస్తులు పరమ మురికిగా ఉన్నాయి. నీకు సేవకులు ఎవరూ లేరు. కానీ నన్ను చూడు, మనిషి కోరుకునేవి అన్నీ నా వద్ద ఉన్నాయి. నా వద్ద సంపద వుంది. పిల్లలు ఉన్నారు. సేవకులు ఉన్నారు. స్నేహితులు ఉన్నారు ఇంకా ప్రసిద్ధికెక్కిన తోటలు ఉన్నాయి. రా.... భూమి పై స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వు ఎప్పుడు తీర్పుదినం గురించి, పరలోకం గురించి చెబుతుంటావు కదా.... ఒకవేళ ఆ రోజు వస్తే.... ఆ రోజున కూడా నేడు ఎంతగా సౌభాగ్యాలు పొందానో అన్ని సౌభాగ్యాలు  పొందుతానన్న నమ్మకం నాకు ఉంది.

యహుదా : -  సోదరా ఖత్రూస్! నువ్వు అల్లాహ్ పట్ల విశ్వాసాన్ని తిరస్కరిస్తున్నావు. మరణాంతర జీవితాన్ని, తీర్పుదినాన్ని నిరాకరిస్తున్నావు. అల్లాహ్ స్వర్గాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. అల్లాహ్ మనిషికి మట్టినుంచి పుట్టించారు. మనిషి వీర్యాన్ని అల్లాహ్ సురక్షితమైన స్థానంలో ఉంచారు. తర్వాత దానిని ఒక నెత్తుటి ముద్దగా మార్చారు. ఆ పిదప దానిని ఒక మాంసపు ఖండంగా మార్చారు. తర్వాత దానికి కండరాలు, ఎముకలు చేర్చాడు. ఆ విధంగా మానవుడిని సృష్టించారు.

         సృష్టికర్త, నిన్ను అద్భుతమైన ఆకారంలో సృష్టించినవారు. మరణాంతరం కూడా ఆయన నిన్ను మళ్ళీ బ్రతికించగలడు. ఒకప్పుడు ఉన్న దానిని మళ్లీ సృష్టించడం అన్నది అసలు.  లేనిదానిని సృష్టించడం కన్నా చాలా తేలిక. ప్రాపంచిక ఆకర్షణలను చూసి నీ దృష్టి చెదిరిపోయింది. నీ మనసు మొద్దుబారిపోయింది. నేను బీదవాడిని కాబట్టి నువ్వు నన్ను తక్కువగా చూస్తున్నావు. ప్రాపంచిక సంపదల పట్ల నీ ప్రేమ నిన్ను కుహనా దేవుళ్ళను ఆరాధించేలా చేసింది. నీ బంగారు ఆభరణాలు, నీ తోటలు శాశ్వతమైనవి కావు. చివరకు అవి దుమ్ము, ధూళిలో కలిసిపోతాయి. నీ స్నేహితులు, నీ దుర్మార్గానికి సహాయం చేస్తున్నవారు. నిజానికి నీ అసలైన శత్రువులు.

           నేను అల్లాహ్ ను పూర్తిగా నమ్ముకున్నాను. నా సంపదలు నిజానికి నా ఆరోగ్యం, నా మానసిక శాంతి. నేను సాధారణమైన ఆహారం తీసుకుంటాను. కానీ నేను ఆరోగ్యంగా జీవించి ఉండడానికి ఆ ఆహారం చాలు.

               నా జీవన విధానం, నన్ను నీ మాదిరిగా అహంభావిగా మారకుండా కాపాడుతుంది. నాకు లభించే ప్రతిఫలం శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సౌభాగ్యాల స్వర్గవనం. కాబట్టి సోదరా! నువ్వు నీ భౌతిక వస్తుసంపదల ఆరాధనను మానుకో, అవన్నీ అల్లాహ్ ప్రసాదించిన అనుగృహాలుగా గుర్తించి అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించు. నా బీదరికం కారణంగా, నాకున్న తక్కువ సంతానం కారణంగా నన్ను హీనంగా చూసే బదులు నువ్వు నీ అందమైన తోటలోకి వెళ్లినప్పుడు ఇదంతా అల్లాహ్ అభీష్టమే, అల్లాహ్ శక్తి తప్ప మరో శక్తి ఏదీ లేదు అని అంటే బాగుండేది.

కానీ ఖత్రూస్ తన తోటను చూసి పొంగిపోతూ తన సోదరుడు యహూదా వెళ్లిపోవడాన్ని చూడనన్నా చూడలేదు.

ఆ తర్వాతి రోజు ఎప్పటి మాదిరిగా ఖత్రూస్ తన తోట చూడడానికి వెళ్ళాడు. కానీ తోటను సమీపిస్తూ అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయి ఆగిపోయాడు. అతని తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడి సెలయేరు పూర్తిగా అసలు ఎప్పుడూ లేనట్లుగా ఎండిపోయింది. ఖత్రూస్ గొంతు ఎండిపోయింది. అల్లాహ్ పట్ల తన కృతఘ్నత, తన స్వార్థం, అహం, దుర్మార్గాలే తనను నాశనం చేశాయని గుర్తించాడు. కోపంగా తన చేతులు నులుముకుంటూ, "అల్లాహ్ కు భాగస్వాములను కల్పించకుండా ఉన్నట్లయితే ఎంత బాగుండును." అని అనుకున్నాడు.

 *గ్రహించవలసిన పాఠాలు* 

■=■ అల్లాహ్ ను నిరాకరించడం మాత్రమే కుఫ్ర్ (అవిశ్వాసం) కాదు. అహం, గర్వం, ఆడంబరాలు, పరలోకాన్ని కాదనడం కూడా కుఫ్ర్ కు దారితీస్తాయి.

■=■ తన సౌభాగ్యాలు, తన హోదా, సంపదలన్నీ తన సొంత శక్తిసామర్థ్యాల వల్లనే లభించాయని, అల్లాహ్ అనుగ్రహం ఇందులో ఏమీ లేదని, అల్లాహ్ కు జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదని భావించేవాడు కూడా అవిశ్వాసియే. అల్లహ్ విధించే శిక్ష అనూహ్యంగా, అతి తీవ్రంగా ఉంటుంది.

■=■ అల్లాహ్ అనుగ్రహాలు, సౌభాగ్యాలకుగాను, "మాషా అల్లాహ్, లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్" (ఇదంతా అల్లాహ్ అభీష్టమే. అల్లాహ్ శక్తి తప్ప మరో శక్తి ఏదీలేదు.) అని పలకాలి. ఇది దివ్యఖురాన్ నేర్పిన గొప్ప ప్రార్థన.

Insha Allah రేపటి భాగము - 62 లో తోటవారి గాథ గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment