59

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము -59* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*ఉజైర్ అలైహిస్సలామ్ : - - : క్రీ.పూ. 500-400 సం"* 

ఉజైర్ (అలైహి) తన తోటలోకి ప్రవేశించి, అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ పైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసన కర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మెరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు, నోరూరించే పండ్ల భారంతో క్రిందకి వంగి పోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని, రకరకాల పండ్లు కోసుకుని ఆ బుట్టలో వేసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్లిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకుపోవడాన్ని ఉజైర్ (అలైహి) గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయట పడి చూసేసరికి ఆయన ఒక పాడుబడిన ఊరిలో ఉన్నారు. నేల పై మానవుల కంకాళాలు, జంతువుల ఆస్థిపంజరాలు చెల్లా చెదురుగా పడిఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందరవందరగా పడి ఉన్నాయని గ్రహించారు. 

*నిద్రలోకి జారుకున్న ఉజైర్ (అలైహి)* 

ఉజైర్ (అలైహి) గాడిద నుంచి క్రిందికి దిగారు. గాడిద పై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు ఆనుకొని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏముందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణాంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. "మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించి పడతారు?" ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడిచిపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఉజైర్ (అలైహి) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వారి పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడిచిపోయాయి. జాతుల అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.

అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించకపోయినా, అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కానీ అల్లాహ్ సందేశహరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణాంతర జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

*దీర్ఘ నిద్ర నుంచి మెలుకువ* 

ఉజైర్ (అలైహి) తన దీర్ఘ నిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయింది. ఉజైర్ (అలైహి) నిద్రపోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. అపుడు ఆ దైవదూత ఉజైర్ (అలైహి) తో....,

దైవదూత : - ఉజైర్! నీవు ఈ స్థితిలో ఎంతకాలం ఉన్నావో చెప్పగలవా? (ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు.)

ఉజైర్ (అలైహి) : - ఒక రోజో లేక అంతకంటే తక్కువ కాలమో ఉన్నానని అకుంటున్నాను. (నేను రోజులో చాలా భాగం నిద్రపోయి ఉంటాను.)

దైవదూత : - కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ బుట్టలోని పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో, ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వఛ్ఛంగా ఉంది. కానీ నీ గాడిదను చూడు, కేవలం దాని ఆస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అల్లాహ్ మహత్యాన్ని చూడు, మరణించిన వారిని మళ్లీ అల్లాహ్ ఎలా బ్రతికిస్తాడో అర్థం చేసుకో. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శనంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో.

ఉజైర్ (అలైహి) చూస్తుండగానే గాడిద ఆస్థిపంజరం పై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఉజైర్ (అలైహి) ఆశ్చర్యంగా...., "అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేను ఇప్పుడు దృఢంగా నమ్ముతున్నాను." అన్నారు.

*అంతరించిన గతం* 

ఉజైర్ (అలైహి) కు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెతకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే, అక్కడ ఉజైర్ (అలైహి) కు ఒక వృద్ధ మహిళ కనపడింది. ఆమె కళ్ళు కనబడటం లేదు. కానీ, ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహి) ఆమెను గుర్తించారు. ఆ వృద్ధ మహిళ ఎవరో కాదు, ఉజైర్ (అలైహి) ఇల్లు వదిలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. అపుడు ఉజైర్ (అలైహి), ఆ వృద్ధ మహిళతో....,

ఉజైర్ (అలైహి) : - ఇది ఉజైర్ ఇల్లేనా?

వృద్ధ మహిళ : - అవును! (ఆమె దుఃఖంతో) ఉజైర్ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలైపోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసినవాళ్ళు చాలా మంది చనిపోయారు.  చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు.

ఉజైర్ (అలైహి) : -  నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్రపోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్రలేపారు.

ఈ మాటలు విని ఆ వృద్ధ మహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత....

వృద్ధ మహిళ : - ఉజైర్ (అలైహి) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవారు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్ (అలైహి) అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ని ప్రార్థించు.

అపుడు ఉజైర్ (అలైహి), అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించారు. ఆ వృద్ధ మహిళలకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్లింది.

ఉజైర్ (అలైహి) పిల్లలు. మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనపడుతున్న ఉజైర్ (అలైహి) ని చూసి, ఆయన తమకు తాతగారు అని వారు నమ్మలేకపోయారు. "ఇది నిజమా!" అని గుసగుసలాడుకోసాగారు. ప్రస్తుతం ముసలివాడైపోయిన ఉజైర్ (అలైహి) కుమారుల్లో ఒకరు....,

ఉజైర్ (అలైహి) కుమారుడు : - నా తండ్రి భుజం పై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి.

ఉజైర్ (అలైహి) తన భుజం పై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. అపుడు మరో కుమారుడు....,

ఉజైర్ (అలైహి) మరొక కుమారుడు : - జెరూసలేమ్ ను బుఖ్త్ నస్సర్  ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి, తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి.

ఉజైర్ (అలైహి) తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహి) తిరిగి వచ్చారని, వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగలించుకున్నారు. ఆనందభాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, "అల్లాహ్, ఉజైర్ (అలైహి) ను మళ్లీ బ్రతికించారు. కాబట్టి, ఉజైర్ (అలైహి) తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి." అనడం ప్రారంభించారు.

_సాధారణంగా మనిషి కళ్ళకు కనపడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ (అలైహి) తిరిగి రావడం అల్లాహ్ మహత్యంగా గ్రహించే బదులు యూదులు, ఉజైర్ (అలైహి) ను అల్లాహ్ కుమారునిగా పిలువడం ప్రారంభించారు._ 

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment