36

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 36* 

____________________________________________

*ఖిజర్ అలైహిస్సలామ్* 

ఒక రోజు మూస (అలైహి) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ప్రజల పై తీవ్ర ప్రభావం వేసింది. ఆ ప్రజలు లోని ఒక వ్యక్తి మూసా (అలైహి) ని ఉద్దేశిస్తూ....,

"దైవప్రవక్త మూసా! భూమి పై మీ కన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా?" అని ప్రశ్నించాడు.

అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు. తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు. కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు అని మూసా (అలైహి) భావించాడు. అపుడు ఆ వ్యక్తితో....,

"నా ప్రియ సోదరా! అల్లాహ్ నాకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు. సమస్త మానవాళి జీవన సరళి కోసం తౌరాత్ గ్రంథాన్ని నాకు ప్రసాదించాడు. కాబట్టి ఈ పుడమి పై నేనే ఎక్కువ జ్ఞానం కల వ్యక్తిని." అని జవాబిచ్చాడు.

కానీ తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవప్రవక్త కేంద్రం కావడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడూ ఉంటాడని అల్లాహ్ మూసా (అలైహి) కు వహీ ద్వారా తెలియజేశారు.

అప్పుడు మూస (అలైహి) అల్లాహ్ తో : - ప్రభు! ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయనను కలుసుకొని ఆయన నుంచి విద్య నేర్చుకోవాలని భావిస్తున్నాను. ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలో కొన్ని గుర్తులు కూడా చెప్పండి.

అల్లాహ్ : - మూసా! నీటి తో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరు. ఆ చేప, నీటి పాత్ర లో నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి నీకు కనపడతాడు.

అల్లాహ్ చెప్పిన సూచనలను పాటిస్తూ, మూసా (అలైహి) ఆ వ్యక్తి ని కలుసుకోవడానికి ఒక అనుచరున్ని సహాయంగా తీసుకోని బయలుదేరారు. ఆ అనుచరుడు చేప ఉన్న నీటి పాత్రను పట్టుకొని రాసాగాడు. మూసా (అలైహి) తన అనుచరునితో, "రెండు నదుల సంగమానికి చేరుకోనంతవరకు మనం ఈ ప్రయాణాన్ని ముగించకూడదు. అప్పటివరకు సుదీర్ఘకాలం పాటు మనం ఇలా నడుస్తూనే ఉండాలి." అని అన్నారు.

వారిద్దరూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా వెళుతూ వెళుతూ రెండు నదులు కలిసిన సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. ఆ ప్రదేశంలో మూసా (అలైహి) నిద్రలోకి జారుకున్నారు. మూసా (అలైహి) నిద్రపోతున్నపుడు, నీటి పాత్ర లో ఉన్న చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కానీ అతడు ఈ సంఘటన గురించి మూసా (అలైహి) కు చెప్పడం మరచిపోయాడు. మూసా (అలైహి) లేచిన తర్వాత ఇద్దరూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళ్తూ వెళ్తూ వారు బాగా అలసిపోయారు. చాలా ఆకలి తో ఉన్నారు.

మూసా (అలైహి) తన అనుచరుని తో ఇలా అన్నారు.

మూసా (అలైహి) : - మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము. తినడానికి ఏమైనా సిద్ధం చేసి తీసుకురా.

అపుడు ఆ అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలోకి దూకి వెళ్లిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని మూసా (అలైహి) కు తెలియజేశాడు. "అది సరేగానీ, అసలు ఏం జరిగిందో చూశారా? మనం రెండు నదులు కలిసే సంగమం దగ్గర విశ్రాంతి తీసుకున్నామా! అక్కడ నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అపుడే నేను మీకు ఈ విషయం చెపుదామంటే మీరు నిద్రలో ఉన్నారు. ఆ తర్వాత నాకు చేప సంగతే గుర్తుకు రాలేదు. షైతాన్ నన్ను ఏమరపాటుకు గురి చేశాడు. నేను ఆ సంగతి మీకు చెప్పడం మరచిపోయాను. చేప భలే విచిత్రంగా నదిలోకి దూకి పారిపోయింది." అని మూసా (అలైహి) తో అన్నాడు.

మూసా (అలైహి) : - అయ్యయ్యో! దాని గురించే కదరా బాబు నా అన్వేషణ. పద పద మనం వెనక్కి వెళ్ళాలి.

అలా వారు తమ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెనక్కి వెళ్లారు. రెండు నదులు కలిసిన ప్రదేశానికి, చేప నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి మాదాసులలో ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన్ని ఒక వస్త్రం కప్పి ఉంది. ఆయనే మార్గదర్శి ఖిజర్ అలైహిస్సలామ్.

మూసా (అలైహి) : - అస్సలాము అలైకుమ్. (మీ పై శాంతి కలుగుగాక!).

_[ఖిజర్ (అలైహి), తన ముఖం పై కప్పి ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు.]_ 

ఖిజర్ (అలైహి) : - మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు. కానీ ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరు ఎవరు?

మూసా (అలైహి) : - నా పేరు మూసా! ఇతను నా అనుచరుడు. నేను ఇస్రాయీల్ వారి ప్రవక్తను.

ఖిజర్ (అలైహి) : - మీకు బోధనలు ఎవరు చేశారు? మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు?

అపుడు మూసా (అలైహి) జరిగినదంతా ఖిజర్ (అలైహి) కు వివరించారు.

మూసా (అలైహి) : - నేను మీతో రావచ్చా? అల్లాహ్ మీకు నేర్పిన దివ్యజ్ఞానాన్ని నాకు కూడా నేర్పుతారా? దాని కోసం నేను మీ వద్ద శిష్యరికం చేయవచ్చా? ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను. (చాలా మర్యాదగా అడిగారు)

ఖిజర్ (అలైహి) : - మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు నాతో వస్తే అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు నాతో వాదనకు దిగుతారు. అయినా మీకు తెలియని విషయాల గురించి మీరు ఎలా సహనం వహించగలరు.

మూసా (అలైహి) : - అల్లాహ్ చిత్తమయితే మీరు నన్ను సహణశీలిగా చూడగలరు. అల్లాహ్ తలిస్తే నేను మీతో సహనంతో ఉంటాను. నేను మీ పట్ల అవిధేయత చూపను. నేను ఏ విషయంలోనూ మీకు వ్యతిరేకంగా వ్యవహరించను.

ఖిజర్ (అలైహి) : - సరే! మీరు నా వెంట రాదలుచుకుంటే ఒక షరతు, ఏ విషయమైనా నేను మీకు చెప్పనంతవరకు దాని గురించి మీరు నన్ను అడగకూడదు, నేను ఏం చేసినా ప్రశ్నించరాదు.

ఈ షరతు కు అంగీకరించిన తర్వాత మూసా (అలైహి) తన అనుచరుణ్ణి వెనక్కి పంపివేసి తను ఖిజర్ (అలైహి) తో పాటు బయలుదేరారు.

*పడవకు నష్టం చేకూర్చిన ఖిజర్ (అలైహి)* 

తర్వాత మూసా మరియు ఖిజర్ అక్కడి నుంచి బయలుదేరారు. కొంచెం దూరం నడిచాక ఒక నది వద్దకు చేరుకోని, ఒక పడవ ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహి) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒక వైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహి)....,

మూసా (అలైహి) : - అరే! ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మీరు ఇందులో రంధ్రం వేశారు. పడవలోని వారందరినీ ముంచదలచారా? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు. మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది.

ఖిజర్ (అలైహి) : - నేను చెప్పలేదా, నీవు నాతో పాటు సహనంగా ఉండలేవని. నేను ఏం చేసినా ప్రశ్నించకూడదు అని మన మధ్య జరిగిన అంగీకారాన్ని మరచిపోయావా మూసా!

మూసా (అలైహి) : - నేను మీకు క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు. నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను.

అందుకు అంగీకరించిన ఖిజర్ (అలైహి), మూసా (అలైహి) ను వెంట తీసుకుని బయలుదేరారు.

*ఒక పిల్లవాడిని హతమార్చిన ఖిజర్ (అలైహి)* 

మూసా మరియు ఖిజర్ లు వారి ప్రయాణం ముందుకు సాగించారు. వారికి ఆ దారిలో ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనపడ్డాడు. ఖిజర్ (అలైహి) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకువెళ్లి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహి) నిర్ఘాంతపోయారు.

మూసా (అలైహి) : - మీరు ఏ పాపం ఎరుగని ఒక అమాయక పిల్లవాడిని దారుణంగా చంపేశారు. పాపం ఆ పిల్లవాడు ఏ తప్పు చేయలేదే? ఇది నిజంగా అమానుషం. మీరు చాలా చెడ్డపని చేశారు. (అని అరిచారు)

ఖిజర్, మూసా వైపు తీక్షణంగా చూస్తూ....,

ఖిజర్  (అలైహి) : - ఏమిటి మళ్ళీ మరచిపోయావా? నేను చేసే పనులను మరిసారి ప్రశ్నిస్తే ఇక నాతో రావడం ఉండదు. నీవు నాతో పాటు సహనంగా ఉండలేవు.

మూసా (అలైహి) : - క్షమించండి. నేను మిమ్మల్ని మళ్ళీ క్షమాపణలు కోరుతున్నాను. నేను మరోసారి ఈ పొరపాటున చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి. ఇపుడు మాత్రం నా వైపున మీకు సాకు దొరికింది.

ఖిజర్ (అలైహి) మరోసారి మూసా (అలైహి) ను మన్నించారు.

అక్కడి నుంచి వారు ముందుకు సాగుతూ ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో మూసా మరియు ఖిజర్ ఆహారాన్ని, ఆశ్రయాన్ని కోరారు. కానీ పిసినారి ప్రజలు వారికి ఆతిథ్యమివ్వడానికి నిరాకరించారు. అందువల్ల వారిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెళుతున్నపుడు ఆ ఊర్లో ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహి) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూనుకున్నారు. ఇది చూసిన మూసా (అలైహి) ఉండబట్టలేక....,

మూసా (అలైహి) : - మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. ఆ ఊరి వాళ్ళు కనీసం మనకు అన్నం అయిన పెట్టలేదు. వారి కోసం అంత కష్టం ఎందుకు చేశారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకొని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళం.

తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహి) భరించలేరని ఖిజర్ (అలైహి) కు అర్థమయ్యింది.

ఖిజర్ : - ఇక చాలు...., నా దగ్గర నీ శిష్యరికం ముగిసింది. ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరు అయ్యే ముందు నేను చేసిన ఈ పనులకు కారణాలు వివరిస్తాను.

మూసా (అలైహి) సిగ్గుపడుతూ తలవంచుకున్నారు.

మొదట ఖిజర్ (అలైహి) నీటిలో ఉన్న పడవకు రంధ్రం వేశారు. తర్వాత ఒక అమాయక చిన్న పిల్లవాడిని చంపేశారు. ఒక కూలిపోయే గోడను పునర్నిర్మించారు.

అయితే ఖిజర్ అలైహిస్సలామ్ చేసిన ఈ పనులకు గల కారణాలను రేపటి భాగము - 37 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment