101

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 101*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 16* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *పెదనాన్న అబూ తాలిబ్ తో వ్యాపార రీత్యా సిరియా కి వెళ్లిన బాల ముహమ్మద్ (సల్లం)* 

ముహమ్మద్ (సల్లం) తల్లితండ్రులు ఆమినా, అబ్దుల్లాహ్ ఆయన చిన్న తనంలోనే చనిపోయినందున ముహమ్మద్ (సల్లం) అనాథగా మిగిలారు. తర్వాత కొంతకాలం తన తాత అబ్దుల్ ముత్తలిబ్ సంరక్షణలో పెరిగారు. ఆ తాత మనవళ్ళ మధ్య ఎంతో ప్రేమ ఉండేది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. కాని అబ్దుల్ ముత్తలిబ్ మరణంతో ముహమ్మద్ సంతోషం, ఆనందం ఆవిరైపోయింది.

విషాద వదనంతో, ఎంతో ఒంటరి భావనతో ముహమ్మద్ (సల్లం) తన పెదనాన్న అబూ తాలిబ్ ఇంటికి చేరారు. పెదనాన్న కూడా ఆయనను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. ముహమ్మద్ (సల్లం) తనను తాను సమాధాన పర్చుకున్నారు. కాని తాను అనాథనన్న విషయం ఆయన జీవితాంతం మరచిపోలేదు.

తన కొత్త జీవితం అన్ని విషయాలలోనూ ఎంతో భిన్నంగా ఉండేది. తనతో, తన పెదనాన్నకు సరదాగా ఉండటం కాని, తాత ముత్తలిబ్ లాగా పురాతన గాధలు చెప్పడం కాని రాదు. అంత సమయం కూడా అబూ తాలిబ్ కు ఉండేది కాదు. మక్కాలో ఆయన ఒక పేరు మోసిన వ్యాపారి. రాత్రింబవళ్ళు వ్యాపారం, లాభనష్టాల గురించే ఆయన ఆలోచిస్తూ గడిపేవారు.

అనుమానాస్పద ప్రామాణికతలు గల కొన్ని ఉల్లేఖనాల ప్రకారం, దైవప్రవక్త (సల్లం) గారి వయసు పన్నెండు సంవత్సరాలు, మరో వివరాణాత్మక ఉల్లేఖనం ప్రకారం పన్నెండు సంవత్సరాల, రెండు నెలల పది రోజులు.

తన పెదనాన్న వ్యాపార నిమిత్తం ఒక సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమవ్వసాగారు. అందుకోసం తన ఒంటెలను సిద్ధం చేయసాగారు. ఆయన వెళ్లబోయేది సిరియా దేశానికి.

సరుకంతా ఒకసారి పరిశీలించుకున్న తర్వాత అబూ తాలిబ్ బిడారు కూడా మరుసటి రోజు బయలుదేరడానికి సిద్ధమయింది. ఆ రోజు ముహమ్మద్ (సల్లం) కు నిద్ర పట్టలేదు. ఎలాగైనా సరే తను కూడా సిరియా వెళ్ళాలన్నది ముహమ్మద్ (సల్లం) కోరిక.

మక్కా వ్యాపారులు ప్రయాణానికి బయలుదేరే ముందు ఒకటికి పలుమార్లు ఒంటెలను సరి చూసుకునేవారు. వ్యాపారానికి సంబంధించిన వస్తువులను సిద్ధం చేసుకునేవారు. నీళ్ళు అందుబాటులో ఉంచుకునేవారు.

 *తరువాతి రోజు, ప్రయాణానికి బయలుదేరే ముందు : -* 

యథాప్రకారం, అబూ తాలిబ్ ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటుంటే, బాల ముహమ్మద్ (సల్లం), ఆయన వైపు తదేకంగా చూడసాగారు. ముహమ్మద్ (సల్లం) పై అబూ తాలిబ్‌ అమితమయిన వాత్సల్యం ఉన్నప్పటికీ ఈ ప్రయాణంలో ఆయన్ని వెంట తీసుకుపొవడానికి భయపడ్డారు. వయస్సు చూస్తే పన్నెండేళ్ళు మాత్రమే. ప్రయాణమా బహు కష్టంతో కూడుకున్నది. సిరియా ప్రయాణమంటే మాటలు కాదు. అది భయంకరమైన ఎడారి మార్గం. ఎటు చూసినా అనేక మైళ్ళదాకా ఎత్తయిన ఇసుకతిన్నెలే కన్పిస్తాయి. అందుచేత ముహమ్మద్ (సల్లం) ను మక్కాలో వదిలి వెళ్ళడమే మంచిదని భావించారు అబూ తాలిబ్.

అయితే అబూ తాలిబ్ ఇంటి నుండి బయలుదేరగానే ముహమ్మద్ (సల్లం) తానూ వస్తానని ఏడుస్తూవచ్చి అబూ తాలిబ్ ని పెనవేసుకున్నారు. పెదనాన్న హృదయంలో పితృవాత్సల్యం పెల్లు బికింది. చివరికి ఆయన ఈ బాలప్రయాణికుడ్ని వెంట తీసుకొని బయలుదేరారు.

వాణిజ్యబృందం అనేక మజిలీలు దాటుకుంటూ ప్రయాణం సాగిస్తోంది. ప్రయాణంలో ముహమ్మద్ (సల్లం) ఎక్కడ అలసి ఢీలాపడిపొయి తనకు భారంగా పరిణమిస్తాడోనని అనుకున్నారు అబూ తాలిబ్. కానీ, ప్రయాణంలో ముహమ్మద్ (సల్లం) మరింత ఉత్సాహంతో కనిపిస్తూ, పెదనాన్నకు చేదోడు, వాదోడుగా నిలిచారు. చివరికి ఈ వర్తకబృందం సిరియా చేరుకొని "బస్రా" పట్టణం వెలుపల విడిది చేసింది.

"బస్రా" సిరియా దేశానికి చెందిన "హురాన్" కు రాజధానిగా ఉండేది. రోమనులు ఆక్రమించుకున్న అరేబియా ద్వీపకల్ప ప్రాంతాలకు రాజధాని అది.

అది మధాహ్న సమయం. అబూ తాలిబ్ వర్తక బృందం సిరియా దేశంలోని బస్రా పట్టణానికి చేరుకుంది.

అపుడు అకస్మాత్తుగా వారికి గంటల శబ్దం వినిపించింది.

“వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తున్నారా”? అని ముహమ్మద్ (సల్లం) తన పెదనాన్నను అడిగారు.

“ప్రార్థన కొరకు ప్రజలను పిలిచే చర్చీ గంటలు అవి” అని అబూ తాలిబ్ చెప్పారు.

ముహమ్మద్ (సల్లం) నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రార్థన కొరకు పిలిచే ఆ విధానం ముహమ్మద్ (సల్లం) కు ఆశ్చర్యకరంగా అనిపించింది. కాని ఆ విషయాల గురించి ఆయనకు కొంచెం మాత్రమే తెలుసు.

ఎడారిలో కొన్ని రోజుల యాంత్రిక ప్రయాణం తరువాత, వారికి కనిపించిన మొదటి చిన్నపాటి పట్టణం ఈ బస్రానే. అక్కడ ఇటీవలే వర్షాలు పడి అక్కడక్కడ పచ్చదనం కనిపిస్తుంది. అక్కడి గాలి మట్టి వాసనతో నిండిపోయి ఉంది. అకస్మాత్తుగా గంటల గణగణ ఆగిపోయి అంతటా నిశ్శబ్దం అలుముకుంది. ఆ చల్లటి, తడితడి వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ముహమ్మద్ (సల్లం) ఉత్తేజాన్ని పొందారు. మలమల మాడే ఎండలతో, దుమ్ము ధూళితో, శబ్దాలతో నిండిఉండే మక్కా ఎక్కడ, చల్లని ప్రశాంతమైన ఈ బస్రా ఎక్కడ అని ముహమ్మద్ (సల్లం) ఆలోచించుకోసాగారు.

 _(సుదీర్ఘమైన ఎడారి ప్రయాణం చేస్తున్నందువల్ల వర్తకులు అలసిపోయి, బస్రా పట్టణం వెలుపల ఓ కుటీరం దరిదాపుల్లో ఉన్న చెట్టునీడ పట్టున విడిది చేశారు. కొంతమంది విశ్రాంతి కోసం నడుం వాలిస్తే, మరికొందరు వంట చేయడంలో, ఇంకొందరు పశువులకు మేత వేయడంలో నిమగ్నులయ్యారు.)_ 

 *క్రైస్తవ పండితుడు బహీరా : -* 

ముహమ్మద్ (సల్లం) ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ఆయనకు కొద్ది దూరంలో ఒక క్రైస్తవ పండితుడు ఉంటున్న కుటీరం (చర్చీ) కనిపించింది.

అందులో ఏదో జరుగుతుంది. ఆ పండితుని పేరు బహీరా. "బహీరా" అనే బిరుదుతో పిలువబడే "జర్జీస్" అనే పేరుగల ఓ క్రైస్తవ సన్యాసి. అతను ఒక పొడవాటి జుబ్బా ధరించి ఉన్నాడు. నున్నటి గుండు, పొడవాటి గడ్డంతో ఉన్నాడు. అతను క్రైస్తవ మత ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఓ సదాచార సంపన్నుడు, సర్వసంగ పరిత్యాగి. బస్రా పట్టణంలో బాగా పేరుమోసిన క్రైస్తవ సన్యాసి. బస్రా పట్టణపు పొలిమేరల్లో, దైవధ్యానంలో ఏకాంత జీవితం గడుపుతున్నాడు.

 *ముహమ్మద్ (సల్లం) భావిప్రవక్త అని గుర్తించిన బహీరా : -* 

అది ప్రార్థనలకు ప్రత్యేకమైన రోజు అయినందున ఆ పనులు చూసుకుంటూ తన సమీపానికి చేరుతున్న వర్తకబృందాన్ని గమనించాడు బహీరా. ఆ దారి గుండా సంవత్సరాలుగా ఎన్నో వర్తక బృందాలు వస్తూ పోతుండేవి. కానీ ఈ సారి మాత్రం ఒక అసాధారణమైన, ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.

అది ఏమనగా, బహీరా కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ ఆ వర్తక బృందాన్ని చూడగలిగాడు. బహీరా చూసిన దృశ్యం ఏమిటంటే; ఒంటెల మీద సరుకులు, సుదీర్ఘ ప్రయాణం చేసి ఎండ వేడిమికి అలిసిపోయి డీలా పడిపోయిన మనుషులు, వారితోపాటు ఒక చిన్న పిల్లవాడు, వాళ్ళ మధ్యన ఆ పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడో! ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఒక మేఘం ఆ పిల్లవాడిని మాత్రమే ఎండ నుంచి గొడుగులా కాపాడుకుంటూ వస్తోంది. బహీరా కళ్ళు చిట్లించి దగ్గరగా చూసే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆ దృశ్యం మాయమయ్యింది. తెల్లటి గది గోడలు తప్పించి బహీరాకి మళ్ళీ ఆ దృశ్యం కనిపించలేదు.

బహీరా వెంటనే మోకాళ్ళ మీద నుంచి లేచి ఆ దృశ్యాన్ని చూడటానికి కుటీరం నుంచి బయటకు పరుగు తీశాడు. గదికి దగ్గరలో ఉన్న ఓ చెట్టు నీడలో అదే వర్తక బృందం కనిపించింది. ఆ బృందంలో తాను చూసిన ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. అయితే ఆశ్చర్యకరంగా పిల్లవాడికి ఎక్కువ నీడ ఉండాలన్నట్టు ఆ చెట్టు, తన ఆకులను మరియు కొమ్మలను బాగా వంచి ఉంచింది.

బహీరాకు బాగా తెలుసు, అటువంటి అద్భుతాలు సాధారణంగా, సామాన్య మనుషుల విషయంలో జరగవని. అందుకని తనలో తను, “ఇది ఖచ్చితంగా అల్లాహ్ సూచనే, ఈ అబ్బాయి ఏదో ప్రత్యేకమైన పని కొరకే తీసుకురాబడ్డాడు” అని అనుకున్నాడు బహీరా.

బహీరా మెదడుకు ఏదో ఆలోచన వచ్చి, అతను వర్తక బృందం వద్దకు వెళ్ళి, వారిని కలిశాడు. అపుడు...., (ఇంతకు మునుపెన్నడూ బహీరా బయటకు వచ్చేవాడు కాదు)

బహీరా : - ఓ ఖురైషీ తెగ వర్తకులారా! మీ కొరకు నేను భోజనం తయారు చేయించాను. మీరు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను.

వర్తక బృందంలోని ఒక వ్యక్తి : - బహీరా! ఈ రోజు మీకు ఏమయింది? గతంలో మేము ఎన్నోసార్లు ఈ దారి గుండా పోతూ నిన్ను కలవడం జరిగింది. కాని నువ్వు ఎప్పుడూ మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించలేదు. (అని అన్నాడు నవ్వుతూ)

బహీరా : - అవును, మీరు చెప్పింది నిజమే, కాని మీరు నా అతిథులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఓ విందు ఇచ్చి గౌరవించాలని అనుకుంటున్నాను.

బహీరా విందును ఏర్పాటు చేశాడు. అబూ తాలిబ్ భోజనానికి వెళ్తూ, “ముహమ్మద్ (సల్లం)! ఇదిగో నీ భోజనం. మేము వచ్చేంత వరకు ఈ ఒంటెలను, సరుకులను కనిపెట్టుకుని ఉండు. మా మంచి పిల్లవాడివి కదూ!” అని ముహమ్మద్ (సల్లం) ని అక్కడ వదిలేసి, అప్యాయంగా తల నిమిరి వెళ్ళారు.

ముహమ్మద్ (సల్లం) ఈ విషయాలు ఏవి పట్టించుకోలేదు. ఒంటరిగా కూర్చోవడం ఆయనకు ఎంతో సంతోషం. చెట్టు నీడన భోజనం చేసి, తన గురించి అలోచించుకోవడం ఆయనకు మహా ఇష్టం. కాని బహీరా ఏ మాత్రం సంతృప్తిగా లేడు. కారణం, అందరూ భోజనానికి కూర్చున్నారు. కాని ఆ బాలుడు మాత్రం కనిపించలేదు. నిజం చెప్పాలంటే ఇదంతా ఆ బాలుడి కోసమే చేశాడు బహీరా. కాని ఆ బాలుడు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

అపుడు బహీరా...., "ఆ బాలుడు, ఆ మేఘం, ఆ చెట్టు ఒట్టి ఊహాజనితమేనా? ఖచ్చితంగా కాదు. నేను ఇప్పటికీ తెలివితక్కువ ముసలివాడినేమి కాదు." అని ఆలోచించసాగాడు. అతను పూర్తిగా అసహనానికి లోనై ఉన్నాడు. అపుడు బహీరా ఉండబట్టలేక....,

బహీరా : - మీలో ఒకతను ఈ విందుకు రాలేదు. అతను రాకూడదా ఏమిటి? (అని అడిగేసాడు ఉండబట్టలేక)

“అబ్బే.... అలాంటిదేమి లేదు. ముహమ్మద్ (సల్లం) ను మేము కావాలనే బయట వదలిపెట్టి వచ్చాం. మమ్మల్ని క్షమించండి” అంటూ వాళ్ళలో ఒకతను ముహమ్మద్ (సల్లం) ను పిలువటానికి బయటకి వెళ్ళాడు. కొద్దిసేపటి తరువాత ముహమ్మద్ (సల్లం) ను విందు భోజనం దగ్గరకి తీసుకొచ్చాడు. ముహమ్మద్ (సల్లం) కూడా ఆ విందులో పాల్గొన్నారు.

ఆ విందు జరుగుతున్నంత సేపూ, బహీరా ముహమ్మద్ (సల్లం) నే చూస్తూ ఉన్నాడు. చిన్నవాడయినప్పటికీ ఎంతో ఉన్నతంగా కనిపిస్తున్నాడు. ఎంతో వినయ విధేయలతో ఉన్నాడు. అతని చూపులు ఎంతో నిజాయితీగా, మరెంతో నిదానంగా ఉన్నాయి.

విందు పూర్తయ్యాక వర్తక బృందంలోని కొంతమంది ఆటపాటల్లో మునిగిపోయారు. మరి కొంతమంది కబుర్లలోకి దిగారు. అపుడు బహీరా, ముహమ్మద్ (సల్లం) ను తన దగ్గరకు పిలిచి....,

బహీరా : - చూడు బాబు! లాత్, ఉజ్జా దేవుళ్ళ తోడు, నా పక్కన కూర్చొని నీ గురించి అన్ని విషయాలు చెబుతావా?

మక్కా దేవుళ్ళు అయిన లాత్, ఉజ్జా పేర్లు చెప్పినందువల్ల ఆ బాలుడు సంతోషంతో తన గురించి అంతా చెబుతాడని బహీరా ఆశించాడు. కాని ముహమ్మద్ (సల్లం) అతనిని సరిచేస్తూ చెప్పారు.

ముహమ్మద్ (సల్లం) : - చెప్తానుగాని, అల్లాహ్ కు బదులుగా లాత్, ఉజ్జాలపై ఒట్టేసి నన్నేమి అడగకు. నాకు అన్నిటికన్నా అయిష్టమైనవి ఆ రెండు పేర్లే.

బహీరా వేరే విధంగా ముహమ్మద్ (సల్లం) నుంచి విషయాలు రాబట్టే ప్రయత్నం చేశాడు.

బహీరా : - సరే, అల్లాహ్ తోడు! నీ విషయాలు మొత్తం నాకు చెప్పు.

అపుడు బహీరా బాలుడి గుణగణాలను గురించి, స్వభావాన్ని గురించి, అలవాట్లను గురించి, మరికొన్ని ఇతర విషయాలను గురించి ఏమేమో అడిగాడు. బాల ముహమ్మద్ (సల్లం) అన్నింటికీ సమాధానం ఇచ్చారు.

ముహమ్మద్ (సల్లం) చెప్పిన విషయాలు అన్నింటిని పరిశీలించాక క్రైస్తవ పండితుడైన బహీరాకు ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యింది. అది ఏమిటంటే, ఈ పిల్లవాడు అల్లాహ్ కృపకు నిజంగా నోచుకున్నవాడే.

అంతలో అబూ తాలిబ్, ముహమ్మద్ (సల్లం) ను తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చారు. అపుడు బహీరా, అబూ తాలిబ్ తో....,

బహీరా : - ఈ అబ్బాయి మీకు ఏమవుతాడు?

అబూ తాలిబ్ : - నా కుమారుడు!

బహీరా : - ఏమిటీ! ఈ అబ్బాయి మీ కుమారుడా! కాదు. నిజం చెప్పండి. ఇతని తండ్రి బ్రతికేవున్నాడా! ఇదెలా సాధ్యం?

బహీరా మాటలకు అబూ తాలిబ్ ఆశ్చర్యపోయారు. ఇక నిజం చెప్పక తప్పలేదు.

అబూ తాలిబ్ : - ఈ అబ్బాయి నా తమ్ముడి కొడుకు.

బహీరా : - మరి ఇతని తండ్రి....?

అబూ తాలిబ్ : - ఇతను తల్లి కడుపులో ఉండగానే ఇతని తండ్రి చనిపోయాడు.

బహీరా : - ఇదీ సత్యం. ఈ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోండి, ఇతనికి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అల్లాహ్ ఈయనను కారుణ్యమూర్తిగా చేసి పంపిస్తాడు. 

అబూ తాలిబ్ : - ఇదంతా మీకు ఎలా తెలుసు?

బహీరా : - మీరు ఈ లోయలో అడుగు పెట్టగానే ఇక్కడి ఏ చెట్టూ, ఏ రాయీ కూడా ఈ అబ్బాయికి సాష్టాంగపడకుండా లేదు. ఈ వస్తువులు ఓ ప్రవక్తకు తప్ప మరే దాని ఎదుట సాష్టాంగ పడవు. అదే కాదు, నేను ఈ అబ్బాయిని "ప్రవక్త గుర్తు" ద్వారా కనుగొన్నాను. ఈ గుర్తు వీపుపై, మెడ క్రింద ఉన్న మెత్తటి ఎముకపై యాపిల్ ఆకారంలో ఉంది. ఇది మా గ్రంథాల్లో ఉన్న విషయం.

ఆ తర్వాత బహీరా, అబూ తాలిబ్ ను ఉద్దేశించి...., "ఈ అబ్బాయిని వెనక్కి పంపించేయండి. సిరియాకు తీసుకొనివెళ్ళకండి. అక్కడ యూదుల ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పగా, అబూ తాలిబ్ కొందరు బానిసల వెంట ముహమ్మద్ (సల్లం) ను మక్కాకు పంపించేశారు.★

వేరొక ఉల్లేఖనంలో, బహీరా, అబూ తాలిబ్ ను ఉద్దేశించి...., "చూడండి! యూదుల బారి నుండి ఈ అబ్బాయిని కాపాడుకోవాలి. నేను ఎలా గుర్తించానో, అలాగే గుర్తించగలిగితే ఆ యూదులు తప్పక ఈ బాలుడి వెంటపడతారు. అంతేకాదు, ఆ దుర్మార్గులు ఈ అబ్బాయి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అందుచేత బాబును జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ పిల్లవాడు భవిష్యత్తులో మహాపురుషుడవుతాడు. అంటూ హెచ్చరించి మరీ చెప్పాడు.

అబూ తాలిబ్, ముహమ్మద్ (సల్లం) ను తీసుకుని విడిది చేసిన ప్రదేశానికి వెళ్లిపోయారు.

ఆరోజు బహీరా ముఖం ఇదివరకెన్నడూలేని విధంగా ఆనందాతిశయంతో కళ కళలాడిపోయింది. "అవును నేను అనుకున్నది నిజం అయ్యింది" అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్లి ధ్యానంలో లీనమైపోయాడు.

 _బహీరా ప్రఖ్యాత క్రైస్తవ సాధువు. తౌరాత్, ఇంజీల్ తదితర మత గ్రంథాలు కాచి వడపోసిన గొప్ప తత్వవేత్త ఈ గ్రంథాల్లో అంతిమ దైవ ప్రవక్త రాక గురించి అనేక భవిష్యత్ ప్రకటనలు ఉన్నాయి. వాటిని చదివి ఉండటం వల్ల బహీరా పిల్లవాడిని చూడగానే రాబోయే అంతిమ దైవప్రవక్త అతనేనని ఊహించాడు._ 

బాలుడి బాహ్య స్వరూపమైతే భవిష్యత్ ప్రకటనల ప్రకారమే ఉంది. మరి అంతర్ స్వరూపం, అంటే పుట్టుక, గుణగణాలు, అలవాట్ల సంగతి ఏమిటి? వీటిని ధ్రువపరుచుకోవడానికే బహీరా ముహమ్మద్ (సల్లం) ని, అతడి సంరక్షకుడికి విడివిడిగా కలుకొని మాట్లాడారు.

ఆ తర్వాత బహీరా, ఈ బాలుడే రాబోయే అంతిమ దైవప్రవక్తని వెంటనే గ్రహించాడు. ఇలా తన ఊహ నిజమైనందుకు బహీరా పరమానందభరితుడయ్యాడు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

 _{★ ఈ గుర్తు ఉన్న ఉల్లేఖనం గురించి వివరణ : ముక్తసర్ సరీత్ - షేక్ అబ్దుల్లా, పుట 16, ఇబ్నె హష్షామ్ - 1/180,183; తిర్మిజీ వగైరాల్లో ఉన్న ఉల్లేఖనంలో దైవప్రవక్త (సల్లం)ను హజ్రత్ బిలాల్ వెంట పంపడం జరిగిందని ఉంది. అయితే ఇది పెద్ద పొరపాటు. బిలాల్ అప్పటికి బహుశా పుట్టి ఉండలేదేమో. పుట్టినా, ఆయన అబూ తాలిబ్ కు లేదా అబూ బక్ర్ (రజి) కు బానిసగా ఉండలేదు. జాదుల్ ముఅద్ - 1/17)_ 

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment