102

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 102*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 17* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *ఫుజ్జార్ యుద్ధం* 

దైవప్రవక్త (సల్లం) పదిహేనేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఫుజార్ యుద్ధం సంభవించింది.

 *పవిత్ర మాసాలు : -* 

ప్రతి ఏటా జీఖాదా, జిల్ హజ్జా, ముహర్రం, రజబ్ మాసాలను అరబ్బులు పవిత్ర మాసాలుగా పరిగణిస్తారు. అంటే ఆ నాలుగు నెలల్లో జగడాలు, యుద్ధాలు, రక్తపాతాలు జరపడం నిషిద్ధం.

మక్కాలో ఈ నాలుగు నెలలు పెద్ద జాతర జరుగుతుంది. అరేబియా నలుమూలల నుండి, మరెన్నో ఇతరదేశాల నుండి వేలాదిమంది ప్రజలు ఇక్కడకి చేరుకుంటారు. వారు తెచ్చిన రకరకాల వస్తువులు ఈ జాతరలో కనిపిస్తాయి. పాటకచ్చేరీలు, కవిసమ్మేళనలు, ఉపన్యాసవేధికలు కూడా పెద్ద ఎత్తున వెలుస్తాయి. ప్రతి మనిషి ఆ మాసాలలో తన మతవిశ్వాసాలు, భావాలను నిర్భయంగా వెల్లడిస్తాడు.

ఇలా విభిన్నవిశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతులు కలిగిన రకరకాల భక్తులు, యాత్రికులు, కవులు, వర్తకులతో ఈ జాతర ఆ నాలుగు నెలలు కళకళలాడుతూ ఉంటుంది.

ఆధ్యాత్మిక ఆలోచనలతో సత్యాన్వేషణ కోసం రేయింబవళ్ళు పరితపిస్తున్న బాల ముహమ్మద్ (సల్లం) కు జాతరకు వచ్చే విభిన్న వ్యక్తుల్ని కలుసుకుని వారి విశ్వాసాలు, భావాలు తెలుసుకోవడానికి మంచి అవకాశం లభించేది. అక్కడి విశేషాలను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తూ మనస్సులో భద్రపరచుకునేవారు. ఆ తరువాత ఏకాంత సమయంలో వాటి వాస్తవికతను గురించి నిశితంగా ఆలోచించేవారు.

మక్కా నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న “ఉకాజ్” ప్రాంతం ఈ నాలుగు పవిత్ర మాసాల్లో గొప్ప వాణిజ్యకేంద్రంగా వెలిగిపోతూ ఉంటుంది. అమ్మకం, కొనుగోళ్ళు విపరీతంగా జరుగుతాయి. జాతరకు వచ్చే జనం తమకు కావలసిన వస్తువులు ఎగబడి కొంటారు. వర్తకులు అపార లాభాలు గడిస్తారు. ఇరాఖ్ రాజధాని “హీరా” నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపార సరుకులు ఇక్కడకు చేరుకుంటాయి.

ఆ ఏడు కూడా ఇరాఖ్ రాజు "నోమాన్ బిన్ మంజర్" ఒంటెలపై సరుకులు ఎక్కించి “ఉకాజ్” మార్కెట్ కు పంపడానికి సిద్ధంగా ఉంచాడు. అయితే హీరా నుంచి ఉకాజ్ కు చేరుకోవడానికి రక్షణ ఏర్పాట్లు కూడా ఎంతో అవసరం. దాన్ని గురించి మాట్లాడటానికి ఇరాఖ్ రాజు నోమాన్ దర్బారుకు, బనూకనాన తెగ నాయకుడు "బరాజ్" మరియు బనూహవాజన్ తెగ నాయకుడు ఉర్వా "రుహాల్" లు వచ్చారు. అపుడు ఇరాఖ్ రాజు నోమాన్, ఆ తెగల నాయకులను ఉద్దేశించి....,

నోమాన్ : - వర్తక బిడారాలు సిద్ధంగా ఉన్నాయి. నేను వీటిని మీ రక్షణలో ఇవ్వాలనుకుంటున్నా. మీ ఇద్దరిలో ఈ భాధ్యత ఎవరూ తీసుకుంటారో చెప్పండి?

బరాజ్ : - (మహారాజా!) నేను మీ వర్తక బిడారాలకు బనూకనాన తెగవారి బారి నుండి రక్షణ కల్పిస్తాను. కాని నా వర్తక బిడారాలను నజద్, తిహామా తెగల బారి నుండి రక్షణ కల్పించే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నాను.

నోమాన్ : - అయితే ఉర్వా! నీ అభిప్రాయం ఏమిటి ఈ విషయంలో? నోమాన్ ప్రశ్నించాడు.

ఉర్వా : - మహారాజా! ఇతను (బరాజ్) తన జాతి చేత తిరస్కరించబడిన కుక్క. ఇతనా మీ వర్తక బిడారాలకు రక్షణ కల్పించేవాడు! ఇది మాలాంటి నాయకుల పని. మీరు నా మీద నమ్మకం ఉంచండి. నేను నజద్, తిహామా తెగల బారి నుండి రక్షణ కల్పిస్తాను. (అని అన్నాడు ఉర్వా రుహాల్ మీసాలు మెలేస్తూ.)

అవమానకరమైన ఈ మాటలు విని, బరాజ్ అగ్రహంతో పళ్ళు పటపట నూరాడు. అపుడు బరాజ్, ఉర్వా వైపు ఉరిమిచూస్తూ....,

బరాజ్ : - మరి నీవు బనూకనాన తెగవారి బారి నుండి రక్షణ కల్పించగలవా?

ఉర్వా : - ఒక్క బనూకనానా తెగవారేమిటి, యావత్తు అరబ్ తెగల బారి నుంచి రక్షణ కల్పించగలను. (అన్నాడు ఉర్వా రుహాల్ ఘీంకరిస్తూ.)

బరాజ్ హోదా అంతస్తులో, బలపరాక్రమాలలో ఉర్వా అంతటివాడు కాదు. అంచేత పట్టరాని కోపాన్ని బలవంతంగా పంటి కింద నొక్కి రాజు ఆస్థానం నుండి బయటికి వెళ్ళి పోయాడు. కాని బరాజ్ హృదయంలో (ఉర్వా పై) ప్రతీకార జ్వాలలు తీవ్రంగా చెలరేగుతున్నాయి.

 *ప్రతీకారంతో "ఉర్వా" ని సంహరించిన బరాజ్ : -* 

ఉర్వా, రాజు నోమాన్ గారి వర్తక బిడారాలను తన రక్షణలోకి తీసుకుని హీరా నుండి బయలు దేరాడు. బరాజ్, తనంతటి బలాఢ్యుడు కాకపోయినా నిలువెల్లా విషంతో నిండిన జిత్తుల మారి నక్క అని ఉర్వాకు తెలుసు. అయినా ఉర్వా, బరాజ్ కుఅంతగా ప్రాముఖ్యం ఇవ్వదలచుకోలేదు.

(ప్రతీకారం తీర్చుకోవడానికి) బరాజ్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉర్వాని నీడలా వెన్నాడసాగాడు. వ్యాపార సామాగ్రితో ఎడారి ఓడలు రేయింబవళ్ళు నడుస్తూ "ఉకాజ్" (ప్రాంతం) దిశగా ప్రయాణిస్తున్నాయి. ఉర్వా తన సాయుధ సహచరులతో వర్తక బిడారం వెన్నంటే ఉన్నాడు. ఎత్తయిన ఇసుక తిన్నెల మధ్య వంకరటింకర దారిలో అర్థరాత్రి కటికచీకటి బరాజ్ కు సువర్ణావకాశం ఇచ్చింది. కాస్సేపటిలో బరాజ్ కత్తివాటుకు "ఉర్వా" గిలగిల కొట్టుకుంటూ ఊపిరి వదిలాడు.

ఈ సంఘటన హవాజన్ తెగలో పెద్ద చిచ్చు రేపింది. వారంతా ఆగ్రహోదగ్రులైపోయారు. ప్రతీకారేచ్ఛ పడగవిప్పి బుసలు కొట్టసాగింది. వారు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారు. బనూకనాన తెగలోని ఖురైష్ వంశస్థులు, యుద్ధం వల్ల సంభవించే ఘోర రక్త పాతాన్ని నివారించడానికి రాయబారం పంపారు. (ఆ రాయబారం ఏమనగా....,) "రక్తపరిహారంగా మీరు బరాజ్ ని హతమార్చవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తెలియజేశారు."

కాని హవాజన్ తెగవాళ్ళు ఈ ప్రతిపాదనను త్రోసిపుచ్చుతూ...., “బరాజ్ కుక్క కన్నా అధముడు. అతను ఉర్వాకు సమానమైనవాడు కాడు. ఉర్వా మా నాయకుడు. అతని హత్యకు ప్రతీకారంగా మేము ఖురైష్ వంశంలోని ఒక నాయకుడ్ని హతమార్చుతాం” అని తమ రాయబారి ద్వారా సమాధానమిచ్చారు.

ఖురైష్ నాయకులు మరో ప్రతినిధిని పంపుతూ...., “హత్యకు బదులు సంబంధిత హంతకుడ్ని హతమార్చటమే. అతనికి బదులు మేము మరెవరినీ మీకు ఇవ్వలేము. ఇదే మా తుది నిర్ణయం” అని చెప్పారు. 

హవాజన్ తెగ వాళ్ళు, ఖురైషీయుల రెండవ ప్రతిపాదన కూడా తిరస్కరిస్తూ...., “మేము రణరంగంలోకి దిగి మీ నాయకులందరినీ హతమారుస్తాం” అని హెచ్చరించారు.

ఇలా రాయబారం విఫలమై ఇరుపక్షాల మధ్య యుద్ధ జ్వాలలు ప్రజ్వరిల్లాయి. ఒరల్లో నుంచి ఖడ్గాలు చుర్రున బయటికి వచ్చాయి. కత్తులు, కటారులు పైకి లేచాయి. రణరంగం వేడెక్కింది. ఇరుపక్షాల మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. “పవిత్రమాసాల” లో రక్తపాతం నిషిద్ధమని తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం నేడు దారుణంగా కాలరాయబడుతోంది.

కరవాలాలు కదం తొక్కుతున్నాయి. బాణాలు దూసుకుపోతున్నాయి. శరీరాలు తూట్లు పడుతున్నాయి. అవయవాలు తెగిపడుతున్నాయి. నెలలు, సంవత్సరాలు గడచిపోతున్నా సమర జ్వాలలు సమసిపోయే సూచనలు కానరావడం లేదు. పైగా ప్రతీకార జ్వాలలు మరింత పెచ్చరిల్లుతూనే పోతున్నాయి. యుద్ధరంగం అత్యంత భీకరంగా మారిపోయింది.

ఈ చివరి ఘట్టంలో నూనూగు మీసాల ముహమ్మద్ (సల్లం) కూడా పాల్గొనడం విశేషం. అయితే ఆయన కత్తి పట్టి కదనరంగంలోకి దూకలేదు. శత్రువుల మీదికి విరుచుకు పడి ఈటెలు విసరడం లేదు. ప్రతీకారంతో ఊగిపోతూ బాణాలు వదలడం లేదు. ఆయన ఓ గుట్ట చాటున నిల్చుని, శత్రు సైనికుల నుండి వచ్చిపడుతున్న బాణాలను సేకరించి విల్లంబులతో పోరాడుతున్న తన చిన్నాన్న, పెదనాన్నలకు అందిస్తున్నారు.

లోక కళ్యాణమే తన జీవిత పరమావధిగా భావిస్తూ, సదా అధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్న ముహమ్మద్ (సల్లం) హృదయంలో మూఢ ప్రజల పట్ల పగ ప్రతీకారాలు ఎలా జనిస్తాయి? దుర్భర నరమేధకు కారణమవుతున్న ఈ భీకరపోరు త్వరగా సమసిపోయి సర్వత్రా శాంతి నెలకొనాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నారు.

కాని పోరు పరాకాష్టకు చేరుకుంది. రణ రక్కసి వికృత రూపం దాల్చి విలయతాండవం చేయసాగింది. తలలు తెంపులేకుండా తెగిపడుతున్నాయి. రక్తం యేరులై పారుతుంది. ఉభయ శిభిరాలలో హాహాకారాలు మిన్ను ముడ్తున్నాయి.

ఈ పరిస్థితి చూసి ఇరుపక్షాల నాయకులు ఆందోళన చెందసాగారు. తాము ఆర్థికంగా కూడా బాగా చితికిపోవటం గమనించారు. దాంతో పాటు గొప్ప గొప్ప బలాఢ్యులు, పేరు మోసిన పరాక్రమశాలురు సైతం విసిగిపోయి ఢీలా పడిపోయారు. అందరిలోనూ యుద్ధం కొనసాగించే శక్తి ఉడిగిపోయింది. ధైర్య స్థయిర్యాలు సన్నగిల్లి పోయాయి.

చివరికి ఉభయ శిబిరాల నుంచి ఏకకాలంలో రాజీ ఒప్పందం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండు మూడు రోజుల్లోనే ఆ ప్రయత్నాలు ఫలించాయి. బేషరత్తుగా యుద్ధం విరమించి, ప్రతీకార చర్యలకు శాశ్వతంగా తెరదించాలని ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం పట్ల ముహమ్మద్ (సల్లం) అందరికంటే ఎక్కువగా సంతోషం వెలిబుచ్చారు. విశ్వ ప్రభువు ఆయన కోరికను మన్నించి యుద్ధాన్ని నిలుపుదల చేయించాడు. సర్వత్రా శాంతి నెలకొన్నది. ప్రజలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బహిరంగ రాకపోకలు మొదలయ్యాయి. వ్యాపార లావాదేవీలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇల్లు, వీధులు కళకళలాడసాగాయి. జూడ గృహాలు, గాన కచ్చేరీలు, నర్తనసాలలు మళ్ళీ ఉపందుకున్నాయి. పుక్కిటి పురాణాలు, కాలక్షేపం కథలు తిరిగి జీవం పోసుకున్నాయి.

అయితే సత్యసంధుడు, వాగ్దానపాలకుడు అయిన ముహమ్మద్ (సల్లం) మాత్రం మునుపటిలాగే యధా ప్రకారం ప్రకృతి అనుశీలన, పరమార్ధ చింతన, పరోపకార పరాయణత్వాలతో పవిత్ర జీవితం గడుపుతున్నారు. హంగామా, అలజడుల నుంచి వేరయి, జన బాహుళ్యానికి దూరంగా మూగజీవాలైన మేకల మధ్య ఏకాంతంలో ఏకేశ్వర చింతనే ఆయన దైనందిన కార్యకలాపమయి పోయింది.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

1 comment:

  1. Assalamu walikum bhiyya ismea tho sirf 102 page hy uske baad si nahi hy 103-294 pages avilable nahi hy upldode kijiea

    ReplyDelete