94

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 94*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 09* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి శుభ జననం* 

దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) మక్కాలో "షిఅబె బనీ హాషిం" అనే చోట, "ఫీల్ సంఘటన" జరిగిన మొదటి సంవత్సరం, "రబీ ఉల్ అవ్వల్" మాసం, తొమ్మిదవ తారీఖున సోమవారం పూర్వ సంధ్యాసమయాన జన్మించారు.

అప్పుడు "నౌషీర్వాన్" పట్టాభిషేకమై నలభైవ సంవత్సరం నడుస్తోంది. క్రీస్తు శకం ఏప్రిల్ నెల 20 లేదా 21వ తారీఖు 571వ సంవత్సరం అది.

ఇబ్నె సఅద్ ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) గారి మాతృమూర్తి "ఆమినా" ఇలా చెప్పారని ఉంది. "దైవప్రవక్త (సల్లం) జన్మించినప్పుడు నా శరీరం నుండి ఓ జ్మోతిర్మయ కాంతి బయటకు వచ్చింది. దీని ఫలితంగా సిరియా మహళ్ళు వెలిగిపోయాయి."

ఇమామె అహ్మద్, ఈ విషయానికే సంబంధించిన ఓ ఉల్లేఖనాన్ని హజ్రత్ "అరియాజ్ బిన్ సారియా" చెప్పినట్లు తన గ్రంథంలో ఉటంకించారు.

కొన్ని ఉల్లేఖనాల్లో, దైవప్రవక్త (సల్లం) జనన సమయాన కొన్ని సంఘటనలు దైవదౌత్యపు ముందస్తు సూచనలుగా చెప్పడం జరిగింది. అంటే కిస్రా దర్బారులోని పదునాలుగు స్తంభాలు పడిపోయాయి. అగ్ని ఆరాధకులైన మజూస్ ల అగ్నిగుండం చల్లారిపోయింది. "సావా" సముద్రం ఎండిపోయింది. చుట్టుపట్ల గల చర్చీలు పడిపోయాయి. ఇది బైహఖి ప్రవచనం.

 *రబీ ఉల్ అవ్వల్ మాసం, ఎనిమిదవ తారీఖు, ఆదివారం : -* 

ఆ రోజు రాత్రి మిలమిల మెరిసే నక్షత్రాల విశేష కాంతి కిరణాలతో మక్కా పట్టణం మెరిసిపోవడం ప్రారంభించింది. ఆ రాత్రి అనంత కోటికాంతులతో అందాల జాబిలి ఎవరి కోసమో స్వాగత గీతిక పాడుతూ పరవశించిపోతుంది. మరో వైపు కొండ గుహల నుండి వీస్తున్న చల్లని గాలులు, మధుర ధ్వనులతో మనసుల్ని రంజింపజేస్తున్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో మక్కా పట్టణం తియ్యటి స్వప్నజగత్తులో మైమరచి పోయింది.

అలా చీకటి తెరల కింద మక్కా పట్టణం అంతా సద్దుమణిగినప్పటికీ అక్కడక్కడ కొందరు స్త్రీలు హుటాహుటిన లేచి అబ్దుల్ ముత్తలిబ్ ఇంటికి చేరుకుంటున్నారు. కారణం, నెలలు నిండిన హజ్రత్ ఆమినాకు అప్పుడప్పుడే పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.

ఆ రాత్రి అబ్దుల్ ముత్తలిబ్ ఇంటికి నలువైపులా కాంతి కిరణాలు విరజిమ్ముతూ, మనోహర సౌందర్యంతో వెలిగిపోతూ మానవాళికేదో మూగ సందేశం ఇస్తోంది. లోపల అనేక మంది ఆడవాళ్ళు హజ్రత్ ఆమినా చుట్టూ గుమిగూడారు. 

ఆ ఇంటి పై దివ్య కాంతులు క్షణ క్షణానికి తేజోవంతమై పోతున్నాయి. ఏమిటీ ఈ తేజస్సు? ఎక్కడ్నుంచి ఈ కాంతి పుంజాలు?? అదిగో! దైవ గృహంపై కూడా అచ్చం అదే తేజస్సు!! అవే కాంతి పుంజాలు!!!

ఆశ్చర్యం! అత్యంతాశ్చర్యం!! కాబా మందిరం నుంచి అబ్దుల్ ముత్తలిబ్ ఇంటిదాక రత్నాలు వెదజల్లిన రహదారిలా ఏమిటీ ఈ వింత వెలుగు? దివి నుండి దేవదూతలు, దేవతా కన్యలేమైనా దిగి వస్తున్నారా? ఆ తేజస్సు ముందు పండు వెన్నెల కూడా పటాపంచలైపోయింది. మిల మిల మెరిసే నక్షత్రాలు కూడా వెలవెల పోయాయి. కనువిందు చేస్తున్న ఆ కాంతులేమిటో అర్థం కాక మక్కా ప్రజలు మంత్ర ముగ్ధులై చూడసాగారు. 

ఘడియలు, గంటలు గడచిపోతున్నాయి. ఉషఃకాంతులతో నక్షత్రాలు క్రమంగా పలుచబడుతున్నాయి. చూస్తుండగానే ప్రాక్దిగ్మండలంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం వెలిసింది. అసాధారణమైన నక్షత్రం అది. నిన్నటిదాకా లేని ఈ నవతార నేడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ శుభసందేశం అందజేయటానికి వచ్చింది ఈ నవతార?!

 *రబీ ఉల్ అవ్వల్ మాసం, తొమ్మిదవ తారీఖు, సోమవారం : -* 

వేకువజామున కోడి కూతలతో కొంత మంది మేల్కొన్నారు. తమ రోజువారి కార్యకలాపాలు ప్రారంభించటానికి ముందు వారు, తాము ఆరాధ్య దైవాలుగా భావించే విగ్రహాలను పూజించుకోడానికి సమాయత్తమయ్యారు. కాని పూజా గదుల్లోకి వెళ్ళి చూస్తే ఆ విగ్రహాలు బోర్లాపడి ఉన్నాయి. బహుశా బలంగా వీచిన గాలి వల్ల పడిపోయి ఉంటాయని తలచి, ఏంతో భక్తీ శ్రద్దలతో ఆ విగ్రహాలను లేపి నిలబెట్టేందుకు ప్రయత్నిచారు. కాని అదేమి విచిత్రమో గాని, ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాలు నిలబడలేకపోయాయి.

“ఏమైంది ఈ రోజు నా ఆరాధ్య దేవత క్రింద పడిపోతోంది? నా దేవతకు నిద్రొస్తోంది అనుకుంటా! అయినా నా మతిమరుపు కాకపోతే, విగ్రహాలు నిద్రపోతాయా! ఒకవేళ నా మీద కోపమేమైనా వచ్చిందేమో! పోనీలే మరోసారి నిలబెడతా....” అంటూ ఓ వృద్దుడు, తన దేవతా విగ్రహాన్ని గోడకానిచ్చి నిలబెట్టాడు. ఆ తరువాత, ఆ విగ్రహానికి ఎదురుగా నిలబడి సాగిలబడి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ వృద్ధుడు. కానీ లేచి చూస్తే ఆ విగ్రహం మళ్ళీ క్రిందపడి ఉంది.

అంతలో అక్కడికి ఓ యువతి వచ్చి...., “తాతా! చూశావా ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాలు నిలబడటం లేదు. నువ్వే చూద్దువుగాని రా” అన్నది ఆమె ఆ వృద్ధుని చేయి పట్టుకుంటూ. అంతకు ముందే విసిగిపోయి ఉన్న ఆ ముసలాయన చిరాగ్గా చేయి విదిలించి...., “ఇక్కడ పరిస్థితి నీకు కనపడటం లేదా! ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలనే నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను” అన్నాడు.

 *ఎక్కువైన పురిటినొప్పులు : -* 

మరో వైపు, అబ్దుల్ ముత్తలిబ్ ఇంట్లో ఆమినా చిత్ర విచిత్ర అనుభూతులకు లోనవుతూ ఉంది. అంతలో ఆమె కర్ణపుటాలకు అకస్మాత్తుగా కొన్ని మృదువచనాలు తాకాయి : “ఆమినా! ఇదిగో ఆమె ఇస్మాయిల్ జబీవుల్లా తల్లి హాజీరా (రజి).” “ఈమె ఈసా రూహుల్లా మాతృమూర్తి మర్యం (అలైహి)” 

కాస్సేపటికి తెల్లవారింది. ఆ రోజు, లేలేత చీకటి పొరలను చీల్చుకుంటూ వచ్చిన సూర్యడు కూడా చల్లని కాంతి కిరణాలతో ప్రత్యక్షమయ్యాడు. ఆ వాతావరణం హృదయాల్ని ఉల్లాసపరుస్తోంది. మలయ మారుతం మందహాసం చేస్తుంది. చిగురాకులపై పడిన మంచు బిందువులు ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. ఎటునుంచో చల్లని పవనవీచికలు వీస్తూ ఎదలను గిలిగింతలు పెడుతున్నాయి. ఏవో వ్యక్తపరచలేని మంజుల మధుర భావానాలు శూన్యజగతిని చైతన్యవంతం చేస్తున్నాయి. ఆ చైతన్య స్రవంతిలో కుసుమకన్యలు తేలియాడుతూ, తన్మయత్వం చెందుతూ సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి.

అంతటా ఆనందమయం! సర్వత్రా శోభాయమానం !! దివి అంటా ఏకంగా భువికే దిగి వచ్చినట్లుంది. అలాంటి శుభతరుణంలో ఉన్నట్లుంది అబ్దుల్ ముత్తలిబ్ ఇంట్లో ఒక్కసారిగా ఆనంద కుసుమాలు వెల్లివిరిశాయి.

అంతలో పట్టలేని సంతోషంతో ఓ పడతి లోపలనుంచి బయటకి పరుగెత్తుకొచ్చి....,

"అబ్దుల్ ముత్తలిబ్ కు శుభవార్త చెప్పండి. ఆయనకు మనుమడు పుట్టాడు.” అని చెప్పి మళ్ళీ లోపలకి వెళ్ళిపోయింది.

ఈ శుభవార్త వినగానే అబ్దుల్ ముత్తలిబ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆ సంతోషంతో ఆయన ఒక్క ఊపులో వచ్చి ఇంట్లో వాలారు. తన ముద్దుల మనవడిని వెయ్యి కళ్ళతో చూసుకొని ఎంతోగానో మురిసిపోయారు. ఆమినా ఒడిలో అనిర్వచనీయమైన కాంతులు వెదజల్లుతున్న ఆ అందాల బాలచంద్రుడ్ని చూసి ఆనందించనివారేలేరు. అక్కడున్న స్త్రీలు అయితే సంతోషాతిశయంతో పాటలు పాడటం ప్రారంభించారు.

ఆ తరువాత, ఆ శిశువుకు పెట్టబోయే పేరు గురించి అక్కడున్న స్త్రీలలో గుసగుసలు వ్యాపించాయి. వారి మాటలను గ్రహించిన అబ్దుల్ ముత్తలిబ్....,

అబ్దుల్ ముత్తలిబ్ : - నా ముద్దుల మనవడికి ఏం పేరు పెడతారో అని ఆలోచిస్తున్నారా? మా ఈ రతనాల మూటకు "అహ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)" అనే పేరు ఎప్పుడో పేరు పెట్టేశాం.

"అహ్మద్....! పేరు చాలా బావుంది." అని అన్నారు ఆ స్త్రీలు.

అబ్దుల్ ముత్తలిబ్ : - ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా. భువి పైనే కాదు, దివి పైన కూడా నా మనవడి పేరు వెలిగిపోవాలి మరి.

ఈ పేరు వినగానే ఆమినా పెదవులపై చిరునవ్వు తొనిగిసలాడింది. తన మనసులోని మాటే అబ్దుల్ ముత్తలిబ్ నోట వెలువడినట్లు ఆమినా మనసులోనే సంబరపడి పోయారు.

ఈ పేరు గురించి మక్కా ప్రజలు రకరకాలుగా చెప్పుకోసాగారు. “అబ్దుల్లాహ్ కు కొడుకు పుట్టాడట. అతనికి పెట్టిన పేరు చాలా విచిత్రంగా ఉంది.” ఎవరి నోట విన్నా ఇవే మాటలు. ఎందుకంటే, అప్పట్లో ఈ పేరు అరేబియాలో చెలామణిలో ఉన్న పేరు కాదు.

బంధువులు, మిత్రులు, సహచరులు జట్లుజట్లు గా వచ్చి అబ్దుల్ ముత్తలిబ్ ని అభినందనల్లో ముంచెత్తసాగారు.

 *అబూ లహబ్ సంతోషం : -* 

అబూ లహబ్ బానిస మహిళ సౌబియా, అబ్దుల్లాహ్ కు కొడుకు పుట్టాడన్న శుభవార్త విని పరుగు పరుగున వెళ్ళి, తన యజమాని అబూ లహబ్ కు "మీ తమ్ముడు అబ్దుల్లాహ్ కు కొడుకు పుట్టాడు." అని తెలియజేసింది.

అబూ లహబ్ : - “సౌబియా! నా తముడు అబ్దుల్లాహ్ కు కొడుకు పుట్టాడని శుభవార్త విన్పించావు. దీనికి ప్రతిఫలంగా నేను నిన్ను బానిసత్వం నుంచి విముక్తం చేస్తున్నా. (అని అన్నాడు సంతోషిస్తూ)

సౌబియా : - ఏమిటీ! బానిసత్వం నుంచి నాకు స్వేచ్ఛను ప్రసాదించారా! చాలా సంతోషం. మీ ఋణం నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. (అని అన్నది సంతోషముతో ఉక్కిరిబిక్కిరి అవుతూ)

అబూ లహబ్ : - అయితే! ఆమినా తన కొడుక్కు ఆయాను పెట్టుకునే వరకు, నువ్వు ఆయాగా ఉండి, బాబుకు పాలిస్తూ ఉండు.

అబూ లహబ్ చెప్పిన ఈ విషయానికి సమ్మతించిన సౌబియా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

దైవప్రవక్త (సల్లం) కు, తన తల్లి ఆమినా తరువాత అందరికంటే ముందు సౌబియానే పాలు పట్టింది. అప్పుడు సౌబియాకు మస్రూహ్ అనే పాలు త్రాగే తనయుడు ఉన్నాడు. సౌబియా ప్రవక్త (సల్లం) కంటే ముందు అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడు "హమ్ జా" కు కూడా పాలు పట్టింది. ప్రవక్త (సల్లం) తరువాత ఈమె "అబూ సల్మా బిన్ అబ్దుల్ అసద్ మక్జూమీ" కి కూడా పాలు పట్టింది.

 *ఆనందంతో పరవశించినన అబూ తాలిబ్ : -* 

దైవప్రవక్త (సల్లం) గారి జననం తరువాత హజ్రత్ ఆమినా, ఈ శుభవార్తను అబూ తాలిబ్ కు చేరవేశారు. ఈ శుభవార్త విన్న అబూ తాలిబ్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఆనందపరవశులై, తన తమ్ముడి కుమారుడిని చూడటానికి పరుగు పరుగున అక్కడికి వచ్చారు.

ఆ శిశువును కాబా గృహంలోకి తీసుకొనివెళ్ళి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) కు అరబ్బు సంప్రదాయం ప్రకారం ఏడవ రోజు "ఖత్నా" (సున్తీ) చేశారు.

 *క్రైస్తవ సన్యాసి అయిస్ : -* 

ముహమ్మద్ (సల్లం) జన్మించాడన్న వార్త, మక్కా శివార్లలోని ఓ లోయలో ఉంటున్న "అయిస్" అనే ఓ క్రైస్తవ సన్యాసి చెవుల్లో కూడా పడింది. అతను ఆ లోయలో సర్వసంగ పరిత్యాగి అయి నిరంతరం దైవ ధ్యానంలో గడుపుతున్న గొప్ప మతపండితుడు కూడా. అందుచేత జనం తరచుగా అతని దగ్గరకెళ్ళి భక్తితో కానుకలు సమర్పించుకుంటారు.

అబ్దుల్ ముత్తలిబ్ కూడా అతని దగ్గరకు పోయి వస్తుంటారు. మనవడు పుట్టగానే ఈ శుభవార్త చెప్పటానికి ఆయన "అయిస్" దగ్గరకు వెళ్లారు. అపుడు అబ్దుల్ ముత్తలిబ్ ని చూడగానే, అయిస్ చిరునవ్వుతో....,

అయిస్ : - అబ్దుల్ ముత్తలిబ్! ఏమిటి విశేషం, ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు?

అబ్దుల్ ముత్తలిబ్ : - విశేషమే మరి! వస్తూ వస్తూ ఓ శుభవార్త కూడా తెచ్చాను. మీరేమో భార్యాపిల్లల బాదరాబందీ లేకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుంటే ఊర్లో సంతులు ఎలా తెలుస్తాయి?

అయిస్ : - సరే చెప్పండి ఆ శుభవార్త ఏమిటో!

అబ్దుల్ ముత్తలిబ్ : - ఈ రోజు నా చిన్న కొడుకు అబ్దుల్లాహ్ కు కొడుకు పుట్టాడు. పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. ఈ బాలుడి సౌందర్యం గురించిన వార్త, యావత్తు మక్కా పట్టణంలో మారుమ్రోగిపోతోంది. ప్రజల అభినందనలు స్వీకరించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను అంటే నమ్మండి.

అయిస్ : - చాలా సంతోషం. ఇంతకూ అబ్బాయికి ఏం పేరు పెట్టారు?

అబ్దుల్ ముత్తలిబ్ : - ముహమ్మద్ (సల్లం) (గర్వంగా చెప్పారు)

అయిస్ : - ముహమ్మద్ (సల్లం).... శుభం. అబ్దుల్ ముత్తలిబ్! ఈ పిల్లవాడి గురించే నేను మీకు ఇంతకాలం నుంచి చెబుతూ వచ్చాను. మూడు కారణాలతో నేను ఈ బాలుడ్ని గుర్తించాను.

అబ్దుల్ ముత్తలిబ్ : - ఇంతకు ముందే మూడు కారణాలతో గుర్తించారా!  ఏమిటవి?

అయిస్ : - మొదటిది; ఇది వరకు ఎన్నడూ చూడని ఒక నక్షత్రం రాత్రి ఉదయించింది.

      రెండవది; పిల్లవాడు పుట్టిన రోజు సోమవారం.

      మూడవది; అతని పేరు ముహమ్మద్ (సల్లం) అని పెట్టారు.

ఇవే నేను గుర్తించిన మూడు కారణాలు. అబ్దుల్ ముత్తలిబ్! మీరు ఏంతో అదృష్టవంతులు. సమస్త మానవజాతి, చరిత్ర మీ వంశాన్ని ఎన్నటికీ మరచిపోదు.

క్రైస్తవ సాధువు అయిస్, తనని అభినందిస్తూ చెప్పిన ఈ మాటలతో అబ్దుల్ ముత్తలిబ్, అమితమయిన సంతోషముతో తన్మయత్వం చెందుతూ ఇంటికి తిరిగొచ్చారు. అసాధారణ వంశాంకురం, అపురూప సౌందర్యవంతుడైన మనవడు పుట్టిన తరువాత ఆయన కోడలు ఆమినాను మరింత అభిమానించసాగారు.

ఇలాంటి సంతోష సమయంలో కూడా ఆమినా, తన భర్త గురించి లోలోన బాధపడుతూనే ఉంది. అసామాన్య తేజస్సుతో వెలిగిపోతున్న తన కుమారుడ్ని చూసి ఆమినా అమితానందంతో పొంగిపోయారు. "ఈ సమయంలో నా భర్త అబ్దుల్లాహ్ కూడా ఉంటే ఎంతో బావుండేది!!" అని బాధపడ్డారు.

బాబు ముఖంలో ఆమినాకు, ఒంటెక్కి తన వైపు కడసారిగా చూస్తున్న భర్త ఛాయలు కనిపించాయి. "తన కొడుకును చూసుకొని ఆయన ఎంత మురిసిపోతారో!" అని ఊహించుకోసాగింది.

"ఆయన సిరియా నుంచి ఎప్పుడు తిరిగొస్తారో....,"

 _కాని, అబ్దుల్లాహ్ ఇక రాలేడని, కానరానిలోకాలకు శాశ్వతంగా వెళ్ళిపోయాడని తెలుసుకునేందుకు ఆమినాకు ఎక్కువ సమయం పట్టలేదు._ 

Insha Allah రేపటి భాగములో అబ్దుల్లాహ్ మరణం గురించి తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment