98

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 98*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 13* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *హజ్రత్ ఆమినా గారి మరణం : -* 

ఆమినాకు, యస్రిబ్ (మదీనా) లో ఖననం అయివున్న తన భర్త అబ్దుల్లాహ్ సమాధిని చూసి రావాలనే కోరిక కలిగింది. మదీనాలో తన తల్లి తరుపున బంధువులు ఉన్నారు. అక్కడే కొన్నాళ్ళు గడిపి, మదీనా సమీపంలో "అబ్వా" అనే చోట అబ్దుల్లాహ్ సమాధిని సందర్శించేందుకు మదీనా వెళ్ళాలని నిర్ణయించుకుంది.

ఈ ఆలోచన రాగానే ఆమీనా మదీనా పట్టణానికి ప్రయాణమయ్యారు. ఆమె వెంట సేవకురాలు బర్కా, ముద్దుల కొడుకు ముహమ్మద్ (సల్లం) కూడా ఉన్నారు. ఆమినా మదీనా చేరుకున్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత వచ్చిన తమ ఆడపడుచుకు బంధువులు ఘన స్వాగతం చెప్పారు. గొప్ప అతిథి మర్యాదలు చేశారు. వృద్ధ మహిళలు ఆమెను గుండెకు హత్తుకున్నారు. ఆమె అనాథ కొడుకును ప్రేమగా తల నిమిరారు.

(ఆమినా, తన బంధువుల ప్రేమ, ఆప్యాయతల నడుమ నెల రోజులు గడిపారు)

 *మక్కాకు తిరుగు ప్రయాణం : -* 

ఆమీనా మదీనాలో నెలరోజులు గడపిన తర్వాత తిరిగి మక్కా బయలుదేరారు. దారిలో “అబ్వా” ప్రదేశం వచ్చింది. అక్కడే అబ్దుల్లాహ్ సమాధి ఉంది. ప్రేమ, విచారాలతో నిండిన భావోద్రేకాలు ఆమె కాళ్ళకు సంకెళ్ళు వేశాయి. “ఆమీనా! నీ భర్త సమాధిని ఓసారి తనివితీరా చూసుకుని వెళ్ళు, మళ్ళీ నీకు ఇక్కడకు వచ్చే అవకాశం లభిస్తుందో లేదో.” ఎవరో ఆమీనా చెవి దగ్గరకొచ్చి చెప్పినట్లు అనిపించింది.

ఆమీనా అప్రయత్నంగా భర్త సమాధి దగ్గరకెళ్ళారు. దాన్ని చూడగానే ఆమె సుకుమార హృదయం మరోసారి బాధగా విలపించింది. కన్నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి. మానుతున్న మనోగాయం మళ్ళీ పచ్చి పుండయిపోయింది. తనవాడు అనుకున్న వాడే పొతే ఇక ఆమె మూగ భాదను ఆలకించే నాదుడు ఎవరుంటారు? ముందుకొచ్చిన దుఖాన్ని బలవంతంగా దిగమింగి లోలోనే కుమిలిపోయారు ఆమె.

బాధా గ్రస్తహృదయం తెచ్చే భౌతికప్రభావం బాధితులకే బాగా తెలుసు. ఆ మనోవేదనకు ప్రయాణ బడలిక, పరిసరాల ప్రభావం తోడయ్యాయి. దానితో ఆమినా జబ్బు పడ్డారు. చూస్తూ ఉండగానే ఆమెకు తీవ్ర జ్వరం వచ్చిపడింది. దరిదాపుల్లో వైద్యులు కూడా లేరు. ఆమె ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తూ పోయింది. పరదేశంలో, పైగా నిర్జన ప్రదేశంలో ఆమెను ఓదార్చి సపర్యలు చేసే వారెవరుంటారు? ఆమీనా దగ్గర ఆమె సేవకురాలు బర్కా మాత్రమే ఉంది. ఆ సేవకురాలే ఆమె భాధలు పంచుకున్నది. ఆమె ఆమీనాను ఓదార్చుతూ శక్తివంచన లేకుండా సేవించడంలో నిమగ్నురాలు అయింది.

ప్రతి వ్యాధి ప్రారంభంలో మామూలుగానే ఉంటుంది. కాని కాలం గడిచిన కొద్దీ ఏ వ్యాధి ఏ చిక్కులు తెచ్చిపెడ్తుందో ఎవరికి తెలుసు? అయితే మానవుడు ఆశాజీవి. అంతిమ శ్వాస వరకూ నిరాశ చెందడు. దాంతోపాటు అప్పుడప్పుడు అతడ్ని భయం కూడా ఆవరిస్తుంది. ఇది చచ్చిపోతానన్న భయం కాదు. తన తదనంతరం తన ఆప్తుల గతి ఏమవుతుందోనన్న భయమే అతడ్ని ఎక్కువగా పీడిస్తుంది.

అలాంటి భయమే ఆమినాకు పట్టుకుంది. తాను చనిపోతే తన బాబును ఎవరు ఆదరిస్తారు? తన కంటిపాపకు ఎవరు నీడిస్తారు? పుట్టక ముందే తండ్రి నీడ కోల్పోయాడు. కాస్త తెలివచ్చిన తర్వాత ఇప్పుడు తల్లిని కూడా మృత్యువు కంబళించడానికి సిద్ధమైంది.

నిజానికి ప్రపంచంలో ప్రతి పిల్లవాడికి, అతని తల్లిదండ్రులే అసలైన నీడ. వారి వాత్సల్యఛాయలోనే పిల్లలు బాగా ఎదుగుతారు. ఇతర బంధువులు, సన్నిహితులు ఎంత సానుభూతి చూపినా తల్లిదండ్రులు అందించే ప్రేమామృతం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విచారమే ఆమినా గుండెల్ని  కలచివేస్తోంది.

 *సమీపించిన మృత్యు ఘడియలు : -* 

ఆమినా పరిస్థితి క్షణక్షణానికి దిగజారిపోతోంది ముఖంలో కాంతి క్రమక్రమంగా తగ్గిపోతోంది. బాల ముహమ్మద్ (సల్లం) తల్లి వైపు కంగారుపడుతూ అమాయకంగా చూడసాగారు. ఆమినా చేయి అప్రయత్నంగా కొడుకు తల మీదికి పొయింది. ఆమె ఏదో చెప్పాలనుకున్నారు. కాని పెదవులు విచ్చుకోలేదు. కళ్ళు కూడా క్రమేణా మూతలు పడుతున్నాయి. దీంతో బాల ముహమ్మద్ (సల్లం) తత్తరపడుతూ బిత్తరచుపులతో అమ్మను చూస్తూ మరెంతో ఆందోళనకు గురయ్యాడు.

కాని ఆ తర్వాత కాస్సేపటికే ఆమె ఉఛ్వాస నిశ్వాసలు అతి కష్టమైపొయాయి. శరీరం మీద వేడి తగ్గిపోయి చెమటపట్టింది. ఆ తరువాత ఓ సుదీర్ఘ శ్వాస వదలి చలనరహితంగా ఉండిపోయారు. “అమ్మా....! అమ్మా .....!!” బాల ముహమ్మద్ (సల్లం) భోరున విలపించారు. తల్లి తనువు మీద పడి తల్లడిల్లిపోయారు.

యావత్తు భూమి కంపించిపోయింది (యావత్తు భూమి కంపించినట్లయింది). ఒక్కసారిగా సర్వత్రా చీకట్లు ఆవరించాయి. అమ్మ పోయింది. దూరంగా.... చాలా దూరంగా వెళ్ళిపోయింది. తన కంటికి కనిపించనంత దూరంగా.… తిరిగిరానంత సుదూర తీరాలకు వెళ్ళిపోయింది అమ్మ.

అయ్యయ్యో....! అమ్మ కూడా నిన్ను వీడిపోయిందే! రెండవ నీడన్న ఉందనుకుంటే అది కూడా లేకుండా పోయిందే! ముహమ్మద్ (సల్లం)! దిక్కులేని అనాథవై పోయావా బాబూ!! అమ్మా అని పిలిచే అదృష్టాన్ని కూడా కోల్పోయావా తండ్రి!!!” ప్రకృతి సయితం అనాథ ముహమ్మద్ (సల్లం) ని చూసి ఆవేదన చెందింది.

గుండెలను పిండే ఈ విషాదఘటన ఏ మహాకార్యానికి నాందీ వాచకమో! ఏమైనా, విధి నిర్ణయాన్ని ఎవరు అడ్డుకోగలుగుతారు?

హజ్రత్‌ ఆమినా భౌతిక కాయం ఆ ప్రదేశంలోనే ఆమె భర్త సమాధి పక్కన ఖననం చేయడం జరిగింది. స్వయంగా సేవకురాలే సమీప గ్రామస్థుల సహాయంతో ఆమెను ఖననం చేసింది. నిజంగా భర్త ప్రేమే ఆమినాను మక్కా నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది.

ఏడేళ్ళ ముహమ్మద్ (సల్లం) తన జీవితంలో మొదటిసారిగా మృత్యువంటే ఏమిటో కళ్ళారా చూశారు. అదీ తన తల్లిపై విరుచుపడిన భయంకర విపత్తు! రాతిగుండెల్ని సైతం కరిగించే అత్యంత విషాద సంఘటన!! పైగా పరదేశంలో దిక్కులేని చావు!!!

బాల ముహమ్మద్ (సల్లం) తల్లిని తలచుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. వెక్కి వెక్కి ఏడవసాగారు. సేవకురాలు బాబును ఓదార్చడానికి శతవిధాల ప్రయత్నించింది. కాని అమ్మ పోతే అమ్మ ఇచ్చేటువంటి ప్రేమామృతం ఇంకెవరు ఇవ్వగల్గుతారు? ఈ ఆలోచన రాగానే బాల ముహమ్మద్ (సల్లం) మరింత బాధగా, హృదయవిదారకంగా విలపించారు.

తల్లి మరణం ఆ పసి హృదయంలో ఎంత తుఫాను రేపిందో ఊహిస్తేనే ఉల్లం ఝల్లుమంటుంది. ఏడ్చిఏడ్చి కంఠం రుద్ధమైపోయింది. పాలబుగ్గలపై కన్నీటిచారలు ఏర్పడ్డాయి. పరిచారిక బర్కా బాబును దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంది. పయిట చెంగుతో అతని కన్నీటి ముఖాన్ని తుడిచి ముద్దాడింది. తరువాత బాబును తీసుకొని అక్కడి నుంచి బరువెక్కిన హృదయంతో మక్కా బయలుదేరింది.

ఇద్దరూ కొన్నాళ్లపాటు ప్రయాణం చేసి మక్కా పట్టణం చేరుకున్నారు. కోడలు, మనుమడి కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న అబ్దుల్‌ ముత్తలిబ్‌ మనుమడి తో పాటు అతని తల్లి కన్పించకపోవడంతో హతాశుడయ్యారు. 

హాషిమ్ కుటుంబంపై మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క హాషిమ్ కుటుంబం ఏమిటి, ఆ రోజు మొత్తం మక్కా పట్టణాన్నే కారుమేఘాలు కమ్మివేశాయి.

అబ్దుల్ ముత్తలిబ్, బాల ముహమ్మద్ (సల్లం) ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇది వరకటి కంటే మిన్నగా అభిమానించసాగారు. ముహమ్మద్ (సల్లం) కు కాలిలో ఓ చిన్న ముల్లు గుచ్చుకున్నా ఆయన కంగారు పడిపోయేవారు.

అబ్దుల్ ముత్తలిబ్ హృదయం తన అనాధ మనుమడి మమతానురాగాలతో నిండి పరితపిస్తోంది. కారణం, కోడలి మరణం మరో క్రొత్త విఘాతం. ఇది పాత గాయాల్ని తిరిగి తోడిన సంఘటన. అబ్దుల్ ముత్తలిబ్ భావోద్రేకాల్లో తన మనుమని ఎడల గల తపన, హృదయ స్పందన, ఆయన సొంత కుమారుల ఎడల కూడా కానవచ్చేది కాదు. విధి ముహమ్మద్ (సల్లం) ని ఏకాంతపు ఎడారిలో తెచ్చి నిలబెట్టిన తీరును చూసి అబ్దుల్ ముత్తలిబ్ తల్లడిల్లిపోయేవారు. బాల ముహమ్మద్ (సల్లం) ని ఎటూకాకుండా చేయడానికి ఆయన సిద్ధపడలేదు. తన సంతానం కంటే (మిన్నగా) ప్రేమిస్తూ, పెద్దవారిని గౌరవించినట్లు బాల ముహమ్మద్ (సల్లం) ని గౌరవించేవారు.

 *ఇబ్నె హష్షామ్ కథనం ప్రకారం;* అబ్దుల్ ముత్తలిబ్ కోసం కాబా గృహం నీడన పరుపు వేసి, కుమారులంతా దాని చుట్టూ క్రింద కూర్చునేవారు. అబ్దుల్ ముత్తలిబ్ వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు. ఆయన గౌరవార్థం ఏ కుమారుడూ ఆ పరుపు దగ్గరకు కూడా పోయేవాడు కాడు. కాని దైవప్రవక్త (సల్లం) వచ్చి ఆ పరుపుపైన్నే కూర్చునేవారు. ఆయన ఇంకా చిన్న పిల్లవాడే. పినతండ్రులు ఆయనను పరుపుపై నుండి క్రిందికి తెచ్చి కూర్చోబెట్టేవారు. అలా చేస్తూ ఉండగా అబ్దుల్ ముత్తలిబ్ కుమారులను ఉద్దేశించి...., " నా ఈ కుమారుణ్ణి వదిలేయండి. దైవసాక్షి! ఈయన ఘనతే వేరు." అంటూ తిరిగి పిల్లవాణ్ణి ఎత్తుకొని తన దగ్గర కూర్చుండబెట్టుకొని వీపు తట్టేవారు. అతని చేష్టలు చూసి ఆనందపడేవారు.

ప్రవక్త (సల్లం) గారి వయస్సు ఇంకా ఎనిమిది సంవత్సరాల రెండు నెలల పది రోజులైందో లేదో అబ్దుల్ ముత్తలిబ్ సానుభూతి ఛాయ కూడా బాల ముహమ్మద్ (సల్లం) కు దూరమైపోయింది. అబ్దుల్ ముత్తలిబ్ మక్కాలో మరణించారు. మరణానికి ముందు ఆయన ప్రవక్త పినతండ్రి అయిన అబూతాలిబ్ కు ( అబూతాలిబ్, ప్రవక్త (సల్లం) గారి తండ్రి అబ్దుల్లాహ్ సొంత సోదరుడు) సంరక్షణ బాధ్యతలను స్వీకరించమని అప్పజెప్పడం జరిగింది.

అబ్దుల్ ముత్తలిబ్ గారి మరణంలోని వివరణను Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment