57

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 57* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*యూనుస్ అలైహిస్సలామ్ : - - : అసీరియా జాతి* 

ఆసీరియా జాతి ప్రజలు విగ్రహారాధకులు. వారు నైనవాహ్ పట్టణంలో నివసించేవారు. వారి జీవనవిధానం అల్లాహ్ పట్ల భయం లేకుండా ఉండేది. ఆ జాతి ప్రజలు అల్లాహ్ ను వదిలి, విగ్రహాలను పూజించేవారు. అపుడు వారి వద్దకు ప్రవక్త యూనుస్ (అలైహి) ను అల్లాహ్ పంపించారు.

అసీరియా జాతి ప్రజలను సంస్కరించడానికి, అల్లాహ్ ను ఆరాధించేలా వారిని తీర్చిదిద్దడానికి ప్రవక్త యూనుస్ (అలైహి) వచ్చారు. అపుడు యూనుస్ (అలైహి) వారితో....,

యూనుస్ (అలైహి) : - ప్రజలారా! మీరు చేస్తున్న ఈ విగ్రహారాధన చాలా ఘోరమైన పాపం. మీరు మీ ఆరాధన మరియు విగ్రహారాధన విషయంలో మీ విధానాలను మార్చుకోన్నట్లయితే అల్లాహ్ ఆగ్రహం మీ పై విరుచుకుపడుతుంది. మీరు మీ బుద్ధిహీనతను కొనసాగిస్తే అల్లాహ్ యొక్క శిక్ష త్వరలోనే మీ పై ఉంటుంది. ఆ శిక్ష నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని మరచిపోకండి. (అని హెచ్చరించారు)

తమ ఆరాధన విధానంలో యూనుస్ (అలైహి) జోక్యం అసీరియా జాతి ప్రజలకు నచ్చలేదు. అపుడు అసీరియా ప్రజలు....,

అసీరియా ప్రజలు : - యూనుస్ (అలైహి)! మేము నీ మాటలను లక్ష్యపెట్టము. మా తాతముత్తాతలు ఈ విగ్రహాలనే దేవుళ్లుగా ఆరాధించారు. మేము కూడా ఈ విగ్రహాలను చాలా కాలంగా ఆరాధిస్తున్నాము. మాకు ఎలాంటి హాని కలగలేదు. నువ్వు చెప్పిన విధంగా, మేము ఏ శిక్షకు భయపడము. నీవు చెబుతున్నట్లుగా ఆ శిక్ష ఏంటో రానివ్వు చూద్దాం! (అని వారు ఆయన మాటలను తిరస్కరించారు.)

విగ్రహారాధన ఎంత అవివేకమైనదో, అల్లాహ్ ఆరాధనలోని ఔచిత్యం ఎంత గొప్పదో అసీరియా జాతి ప్రజలకు వివరించడానికి యూనుస్ (అలైహి) చాలా విధాలుగా కృషి చేశారు. విగ్రహారాధన యొక్క మూర్ఖత్వం మరియు అల్లాహ్ యొక్క చట్టాల మంచితనం గురించి వారికి తెలియజేసి, వారిని సత్యం వైపు రమ్మని ఒప్పించటానికి యూనుస్ (అలైహి) చాలా విధాలుగా ప్రయత్నించారు. కానీ అసీరియా జాతి ప్రజలు యూనుస్ (అలైహి) మాటలను నిర్లక్ష్యం చేశారు.

కానీ అసీరియా జాతి ప్రజలు, యూనుస్ (అలైహి) చేసిన హితబోధనలలోని సత్యాన్ని గ్రహించే బదులు, ఆయన పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఈ మూర్ఖులతో ఎంత వాగ్వాదించిన ప్రయోజనం లేదని యూనుస్ (అలైహి) గ్రహించి, నిరాశకు గురయ్యారు. అపుడు వారితో....,

యూనుస్ (అలైహి) : - ప్రజలారా! అలా అయితే నేను మిమ్మల్ని మీ దురదృష్టానికి వదిలి వేస్తున్నాను. అల్లాహ్ శిక్ష మరియు అల్లాహ్ కోపం మీ పై విరుచుకపడి, ఈ పట్టణాన్ని చుట్టుకోక ముందే నేను భయపడి ఈ పట్టణాన్ని వదిలి వెళ్లిపోతున్నాను.
(అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.)

యూనుస్ (అలైహి), ఆ నైనవాహ్ పట్టణాన్ని విడిచి వెళ్ళిన వెంటనే ఆకాశం, తన రంగును మార్చడం ప్రారంభమైంది. అక్కడి ఆకాశం ఎర్రగా భయంకరమైన మంటలా మారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన అసీరియా జాతి ప్రజలు భయంతో వణికిపోసాగారు. "ఇక కేవలం మన వినాశనం క్షణాల్లో మాత్రమే మన పై విరుచుకపడుతుంది." అని అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యి వినాశనం పాలైన ఆద్ జాతి, సమూద్ జాతి మరియు నూహ్ జాతి ప్రజల వినాశనం గుర్తుకు తెచ్చుకున్నారు. తమకు కూడా అలాంటి గతి పట్టుకుందా! అన్న ఆలోచన వారిలో నెమ్మదిగా ధార్మిక విశ్వాసాన్ని సృజించింది మరియు అల్లాహ్ పట్ల విశ్వాసం వారి హృదయాలలోకి చొచ్చుకెళ్లింది. అల్లాహ్ ఆగ్రహానికి గురికాక ముందే, తమ విశ్వాసాన్ని ప్రకటించి పశ్చాత్తాపం చెందాలని నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయంలో భాగంగా అసీరియా జాతి ప్రజలంతా ఇల్లు, వాకిలి వదిలి తమ పిల్లా పాపాలు మరియు పశువులతో సహా వెంటబెట్టుకొని, పట్టణం వెలుపల ఒక కొండ పై గుమిగూడారు. ఆ కొండ పైకి వెళ్లిన తర్వాత, ఈ భయంకరమైన విపత్తు నుంచి కాపాడమని అల్లాహ్ క్షమాభిక్ష కోసం మరియు అల్లాహ్ కారుణ్యం కోసం ప్రార్థించడం ప్రారంభించారు.

అసీరియా జాతి ప్రజల మొరలతో చుట్టుపక్కల ఉన్న కొండలు అన్నీ ప్రతిధ్వనించాయి. అసీరియా ప్రజల నిజాయితీతో కూడిన పశ్చత్తాపం, అక్కడ ఉన్న వాతావరణమంతా అలుముకుంది. అపుడు, అసీరియా జాతి ప్రజల ప్రార్థనలు ఆలకించిన అల్లాహ్ వారిపై తన ఆగ్రహాన్ని తొలగించారు.

అల్లాహ్ వారి పశ్చాత్తాపం అంగీకరించారు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, భయనకరంగా మంట వలె మండుతున్న ఆకాశం తన సాధారణ స్థితికి తిరిగివచ్చింది. భయంకరమైన విపత్తు బారి నుంచి బయటపడిన అసీరియా జాతి ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. ఈ విధంగా అల్లాహ్ ఆ ప్రజలను ప్రకృతి విపత్తు నుంచి కాపాడి, మరల అనుగ్రహించారు.

ఈ భయంకరమైన తుఫాను శిక్ష తప్పుకోగానే, యూనుస్ (అలైహి) చేసిన బోధనలు మరియు హితోపదేశాలు సత్యమైనవిగా అసీరియా జాతి ప్రజలు  గ్రహించి, తమ నుంచి దూరంగా వెళ్లిపోయిన యూనుస్ (అలైహి) ను తిరిగి వారి దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆయన వచ్చి తమకు సరైన సత్య మార్గం చూపించి, హితబోధనలు చేస్తారని వారు ఆశపడ్డారు. యూనుస్ (అలైహి) వారి దగ్గరకు తిరిగి వచ్చి నేరుగా మార్గనిర్దేశం చేస్తారని వారు ఆశించారు.

*యూనుస్ (అలైహి) పడవ ప్రయాణం* 

నైనవాహ్ పట్టణాన్ని మరియు అసీరియా జాతి ప్రజలను వదిలివచ్చిన యూనుస్ (అలైహి) ఎక్కడికి వెళ్ళాలో తోచడం లేదు. వెళుతూఉంటే అల్లాహ్ దారి చూపిస్తారని మధ్యస్తంగా ఉన్న ఒక పడవలో ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు కొంతమంది ప్రయాణీకులు ఉన్నారు.

పడవ, తన ప్రయాణాన్ని సముద్రంలో ప్రారంభించగానే, వారి ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. సముద్రం పైనున్న చల్లని గాలి, పడవ తాకిడికి వారి పై పడుతున్న నీటి చినుకులు. ఈ విధంగా వారి ప్రయాణం సాఫీగా సాగింది.

పగటి పూట ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిన పడవ ప్రయాణం, రాత్రి సమయం వచ్చినప్పుడు భయంకరమైన తుఫాను ధాటికి గురయింది. సముద్రం అకస్మాత్తుగా పెను ఉప్పెనలా మారింది. తీవ్రమైన తుఫాను ధాటికి పడవ చిగురుటాకులా వణికిపోసాగింది. పడవను ముక్కలు ముక్కలుగా విభజించటానికి వస్తున్నట్లు భయంకరమైన అలలు వస్తున్నాయి. ఆ ఎత్తయిన పర్వతాల వంటి అలలు పడవను ఎగరేస్తున్నాయి. పర్వతాల వంటి అలల తాకిడికి పడవ తలక్రిందులైపోతోంది.

పడవ యొక్క భారీ బరువును తగ్గించటానికి అనవసరపు వస్తువులను బయటకు విసిరేశారు. కానీ ఇది సరిపోదు. పడవలో బరువైన సామాను చాలా వుంది. ప్రయాణీకులు తమ సామాన్లను పడవ నుంచి బయటకు విసిరివేసారు. అయినా కూడా పడవలో బరువు చాలా ఎక్కువగా ఉంది. ఇంకా బరువు తగ్గించకపోతే పడవకు ప్రమాదం. కాబట్టి కనీసం ఒక వ్యక్తిని సముద్రంలోకి విసిరేస్తే బరువు తగ్గుతుందని, ఆ విధంగా పడవ ప్రమాదం నుంచి తప్పించుకొని మిగిలినవాళ్ళు బ్రతుకుతారని అనుకున్నారు.

ఇపుడు సముద్రంలోకి ఎవరిని విసిరివేయాలన్న విషయంపై; ఆ పడవలో ఉన్న ప్రయాణికులందరి పేర్లు చీటీలపై వ్రాసి, ఆ చీటీలను మడిచి కిందకు విసిరేసి, అలా కిందకు విసిరేసిన ఆ చీటీల్లో నుంచి ఒక చీటీని తీసుకొని, చీటీలో ఎవరి పేరు అయితే వారిని సముద్రంలోకి విసిరివేయాల్సిందిగా నిబంధన పెట్టుకుంటారు.

అలా మొదటిసారి చీటీ తీయగానే యూనుస్ (అలైహి) పేరు వచ్చింది. నిబంధనల ప్రకారం ఇపుడు ఆయనను సముద్రంలోకి విసిరేయాలి.

యూనుస్ (అలైహి) గురించి వారికి తెలుసు. చాలా మంచివారు, గౌరవనీయుడు. అటువంటి మనిషి సముద్రంలోకి విసిరివేయడానికి వారు ఇష్టపడలేదు. అందువల్ల వారు మళ్ళీ చీటీలు వేశారు. రెండవసారి కూడా యూనుస్ (అలైహి) పేరు వచ్చింది. చివరిసారిగా చూద్దామని మూడవసారి చీటీలు వేశారు. దురదృష్టవశాత్తు మూడవసారి కూడా యూనుస్ (అలైహి) పేరే వచ్చింది. ఇందులో అల్లాహ్ అభీష్టం ఉందని యూనుస్ (అలైహి) గుర్తించారు. 

విగ్రహాలను ఆరాధిస్తున్న అసీరియా జాతి ప్రజలకు, పూర్తిగా అల్లాహ్ ను ఆరాధించేలా తీర్చిదిద్దే బాధ్యత యూనుస్ (అలైహి) కు అల్లాహ్ అప్పగించారు. కానీ యూనుస్ (అలైహి), అల్లాహ్ అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదిలివేశారు. ఈ విధంగా యూనుస్ (అలైహి) తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు.

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగము - 58 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment