88

☪☪☪   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*  🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐          *ఇస్లాం చరిత్ర* *- 88*          🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 03* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

*జమ్ జమ్ బావి తవ్వకం* 

అబ్దుల్ ముత్తలిబ్, కాబా నిర్వహణ భాద్యత చేపట్టగానే మొదట కాబా యాత్రికుల సమస్యల్ని గురించి ఆలోచించాడు. ఆ సమస్యలలో అబ్దుల్ ముత్తలిబ్ కు మంచినీటి కొరత పెద్ద సమస్యగా గోచరించింది. మక్కా ప్రజలకు పట్టణం వెలుపల శివార్లలో ఉండే కొన్ని బావుల్లో నుంచి మాత్రమే కొంత నీరు లభిస్తున్నది. అంతదూరం నుంచి పట్టణంలోకి యాత్రికుల కోసం నీరు మోసుకురావటం కూడా పెద్ద సమస్యగా ఉంది.

ఈ సమస్యే అబ్దుల్ ముత్తలిబ్ ని నిరంతరం భాదిస్తూ ఉంది. జమ్ జమ్ బావి నీరు ఎంతో మధురంగా ఉంటుంది. ఎంతో తోడినా తరగని అపార జలనిధి. అదీ గాక నీరు ఎంతో పైకి ఉండేది. సులభంగా తోడుకోవచ్చు. అలాంటి బావి కనపడకుండా పోయింది. ఆ జమ్ జమ్ బావిని ఎవరు పూడ్చి నాశనం చేసారో!

అబ్దుల్ ముత్తలిబ్ ఓ రోజు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...., "జమ్ జమ్ బావిని ఎవరు పూడ్చారు? ఎందుకు పూడ్చవలసి వచ్చింది?” అని కొందరు వృద్ద ఖురైషీయుల్ని అడిగాడు.

వృద్ద ఖురైషీయులు : - మొదట్లో ఇక్కడ "జుర్హుమ్" తెగ వాళ్ళు పరిపాలన చేస్తుండేవారు. అయితే కొంత కాలానికి ఆ తెగవాళ్ళలో నీతినియమాలు సన్నగిల్లడం ప్రారంభమైంది. అవినీతి, అక్రమాలు ఎక్కువై పోయాయి. దాంతో "బనూ ఖుజాఆ" తెగవాళ్ళు వారి మీద తిరగబడ్డారు. "జుర్హుమ్" తెగవారికి, వారి రాజు ముజాజ్ జుర్హుమికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించారు. ఈ యుద్దంలో "జుర్హుమ్" తెగవాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. అప్పుడు ముజూజ్ జుర్హుమి మక్కా నుండి పారిపోతూ ప్రతికారంగా కాబా మందిరములోని కానుకల్ని జమ్ జమ్ బావిలో విసిరేసి, దాన్ని పూడ్చి వెళ్ళాడు.

అబ్దుల్ ముత్తలిబ్ : - అలాగానా! ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు!! సరే.... ఏది ఏమైనప్పటికీ జమ్ జమ్ బావిని వెతికి తీసి, దాని వీటిని ప్రజలు వాడుకునేలా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు.

అబ్దుల్ ముత్తలిబ్ అలా అన్నాడే కాని, చాలా కాలం దాకా జమ్ జమ్ బావిని వెలికితీసేందుకు ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు. కాలం మరికొన్ని సంవత్సరాలు ముందుకు సాగింది. "అబ్దుల్ ముత్తలిబ్" కు "సఫియా" తో వివాహం అయింది. వివాహమై అనేక సంవత్సరాలు గడచినా ఒక్క కొడుకు "హారిస్" మాత్రమే పుట్టాడు. హారిస్ పెరిగి పెద్దవాడై తండ్రికి కుడిభుజంలా మసలుకుంటున్నాడు.

ఆ తరువాత ఓ రోజు...., కళ్ళు చించుకున్నా కానరాని కటిక చీకటి, మక్కా పట్టణంలో ముసురుకుంది. చీమ చిటుక్కుమన్నా వినిపించే అంతటి నిశ్శబ్దం అలుముకుంది. పొద్దస్తమానం కష్టపడిన శ్రమ జీవులు మేనుమరచి ఘాడంగా నిద్రపోతున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ కూడా ఓ పక్కకు తిరిగి ప్రశాంతంగా నిదురపోతున్నాడు.

అంతలో...., “అబ్దుల్ ముత్తలిబ్! లే.... లేచి జమ్ జమ్ బావిని వెలికి తియ్యి”. అని ఓ గద్గస్వరం. వెంటనే అబ్దుల్ ముత్తలిబ్ ఉలిక్కిపడి లేచాడు. చూస్తే పడక గదిలో ఎవరూ కనిపించలేదు. అదేదో తన భ్రమ అనుకుని మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు.

తెల్లవారింది. అబ్దుల్ ముత్తలిబ్ ఆ విషయం అంతటితో మరచిపోయి తన రోజువారి కార్యకలాపాలలో నిమగ్నుడైపోయాడు. సూర్యాస్తమయం కాగానే చీకటిరక్కసి మళ్ళీ జడలు విప్పింది. మక్కా ప్రజలు తలుపులు మూసుకుని పడకలపైకి చేరారు.

నడిరాత్రి సమయంలో మళ్ళీ అదే విచిత్రశబ్దం!...., “అబ్దుల్ ముత్తలిబ్! లే.... లేచి జమ్ జమ్ బావిని వెలికి తియ్యి”. అబ్దుల్ ముత్తలిబ్ మళ్ళీ ఉలిక్కిపడి లేచి, చుట్టూ కలియజూశాడు. కాని ఎవరూ కనిపించలేదు. “ఏమిటి వింత శబ్దం! ఎవరు తనను పిలుస్తున్నది?” ఇలా ఆలోచిస్తూ తిరిగి నిద్రలోకి జారుకున్నాడు. కాని ఉదయం లేవగానే ఆ విషయం గురించి ఆలోచనలు ముసురుకున్నాయి. అయినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయాడు. మరచిపోవాలన్న మరువలేకపోతున్నాడు.

మూడవ రోజు కూటడా నడిరేయి సమయంలో అదే గొంతు స్వరం వినిపించింది. ఆ తర్వాత, తన కలలో ఎవరో పుణ్య పురుషుడు ఈ మాటలు చెబుతూ అబ్దుల్ ముత్తలిబ్ ని కాబా మందిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ జమ్ జమ్ బావి ఉన్న ప్రదేశానికి కూడా చూపించాడు. ఆ తరువాత ఆ వ్యక్తి అదృశ్యమైపోయాడు. కల చెదరిపోయింది. అబ్దుల్ ముత్తలిబ్ వెంటనే త్రుళ్ళిపడి లేచాడు. ఇది నిజంగా కాబా ప్రభువు నుండి వచ్చిన ఆదేశమై ఉంటుందని భావించాడు. ఈ ఆలోచనతో ఆయనకు ఆ తర్వాత నిద్రపట్టలేదు.

తెల్లవారాక తన కొడుకు హారిస్ ని పిలిచి కలలో తనకు అందిన ఆజ్ఞ గురించి తెలియజేసాడు. ఆ తరువాత హారీస్ ని వెంటబెట్టుకుని కాబా మందిరానికి వెళ్ళాడు అబ్దుల్ ముత్తలిబ్. అక్కడ ఖురైష్ నాయకులను పిలిపించి వారికి కూడా, తన కల గురించి తెలియజేస్తూ ఇలా అన్నాడు...., 
అబ్దుల్ ముత్తలిబ్ : - సోదరులారా! గత మూడు రాత్రులు కలలో నాకు ఇలాంటి ఆజ్ఞలు లభించాయి. కలలో తెలియజేయబడినట్లు ఈ ప్రదేశంలోనే జమ్ జమ్ బావి ఉంటుంది అని నాకు గట్టి నమ్మకం ఉంది. కాని ఇక్కడ త్రవ్వకం జరిపి జమ్ జమ్ వెలికితీయటం ఎంతో శ్రమతో కూడిన పని. మీరు కూడా నాతో సహకరిస్తే ఈ పని సులభమవుతుంది.

ఖురైష్ నాయకులు ఈ మాటలు విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. ఆ నాయకులలో ఒకతను ముందుకొచ్చి...., “ఇదంతా మీ భ్రమ. కలలోని మాటలు నిజమవుతాయనుకోవడం కన్నా మించిన వెర్రితనం మరొకటి లేదు. జమ్ జమ్ ను వెలికితీయటం సాధ్యమయ్యే పని కాదు” అని అన్నాడు నిర్లక్ష్యంగా.

“ఈ ప్రదేశంలో మనం త్రవ్వకం ఎలా జరపగలం? దీనికి ఇరువైపులా మన దేవతా విగ్రహాలున్నాయి. ఇక్కడ త్రవ్వితే పాపం మూట కట్టుకున్నట్లే" అని అన్నాడు మరొకడు.

అబ్దుల్ ముత్తలిబ్ : - విగ్రహాలు పెద్ద సమస్య కాదు. వీటిని ఇక్కడి నుంచి తీసి వేరే చోటికి తరలించవచ్చు.

“ఎంత మాత్రం వీల్లేదు. మన దేవతా విగ్రహాలను ఇక్కడే ఉండనివ్వాలి. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న ఈ విగ్రహాలను తొలగించడమంటే దేవతల ఆగ్రహాన్ని మనం చేజేతులా కొని తెచ్చుకోవడమే అవుతుంది. మేము ఈ పనిలో మీతో సహకరించలేము” అన్నాడు వేరొక వ్యక్తి.

“ఔను, మేము మీతో ఏ మాత్రం సహకరించలేము” అంటూ మరో నలుగురు అతనితో గొంతు కలిపారు.

అబ్దుల్ ముత్తలిబ్ : - సరే, మీరు సహకరించినా సహకరించకపోయినా, నేను మాత్రం ఈ పని చేసి తీరుతాను” (అన్నాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో)

“సరే మీ ఇష్టం....” “ఈయన గారికి ఏదో కీడు మూడింది. అందుకే ఈ దుస్సాహసానికి పాల్పడుతున్నాడు”. “పర్యవసానం ముందుకు వస్తే గాని వాస్తవం అర్ధం కాదు”. ఇలా చెప్పుకుంటూ ఆ ఖురైష్ నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఆ తరువాత అబ్దుల్ ముత్తలిబ్ కొడుకు హారిస్ సహాయంతో “జమ్ జమ్” చోటు నుండి విగ్రహాలను వేరే చోటుకు తరలించి త్రవ్వకం మొదలుపెట్టాడు. చివరికి ఆయన శ్రమ ఫలించింది. జమ్ జమ్ జలం చూసి అబ్దుల్ ముత్తలిబ్ పరమానందభరితుదయ్యాడు. జమ్ జమ్ బావిలో, "బనూ జుర్హుమ్" తెగ మక్కాను వదిలేస్తూ అందులో పూడ్చిపెట్టిన వస్తుసామగ్రి క్రమక్రమంగా బయటపడనారంభించాయి.

"బనూ జుర్హుమ్" తెగ నాయకుడు "ముజాజ్" కు చెందిన అనేక ఖడ్గాలు, డాళ్ళు, కవచాలు దొరికాయి. ప్రజలు, దేవతలకు సమర్పించుకున్న కానుకలు కూడా లభించాయి. ఆ కానుకలలో రెండు బంగారు జింకలు కూడా ఉన్నాయి.

త్రవ్వకంలో జమ్ జమ్ బావి పూర్తిగా బయటపడినప్పుడు ఖురైష్ తెగ వారు అబ్దుల్ ముత్తలిబ్ తో...., "మమ్మల్ని కుడా త్రవ్వకంలో పాలుపంచుకునేటట్లు చేయండి." అని వాదులాడారు. దానికి సమాధానంగా అబ్దుల్ ముత్తలిబ్...., "లేదు! నేను అలా చేయలేను. ఈ పని కోసం నేనొక్కడినే ప్రత్యేకించబడ్డాను." అని తెగేసి చెప్పారు.

కానీ ఖురైష్ నాయకులు వెనక్కు తగ్గలేదు. చివరికి ఈ విషయంలో తీర్పు కోసం వీరంతా "బనూ సఅద్" కు చెందిన ఓ మంత్రగత్తె (కాహిన్ స్త్రీ) వద్దకు వెళ్ళాలని నిర్ణయం జరిగింది. వారంతా మక్కా నుండి బయలుదేరారు కూడా. కానీ మార్గమధ్యం లో అల్లాహ్ వారికి చూపిన కొన్ని సూచనల ద్వారా జమ్ జమ్ బావి త్రవ్వకం పని, దైవం తరఫున అబ్దుల్ ముత్తలిబ్ కే కేటాయించబడిందని తెలిసిపోయింది. వారంతా ప్రయాణాన్ని మానుకొని వెనక్కు మరలివచ్చారు. ఈ సందర్భంలోనే అబ్దుల్ ముత్తలిబ్, దైవంతో...., "నాకు పది మంది కుమారులను ప్రసాదిస్తే, వారంతా పెరిగి పెద్దవారై తనను రక్షించే స్థాయికి వస్తే, వారిలో ఒక కుమారున్ని కాబా గృహం దగ్గర బలి ఇస్తాను." అని మొక్కుకోవడం జరిగింది.

*మక్కా ప్రజల ఆనందం : -* 

జమ్ జమ్ బావి బయటపడిందని, ఇక నుంచి ఎడతెగకుండా లభించే దాని మధురమైన నీటిని హాయిగా త్రాగవచ్చని తెలియగానే జనం గుంపులు గుంపులుగా వచ్చి చూడసాగారు. అబ్దుల్ ముత్తలిబ్ ని, మక్కా ప్రజలు ప్రశంసలతో ముంచెత్త నారంభించినారు.

అబ్దుల్ ముత్తలిబ్, జమ్ జమ్ బావిలో దొరికిన ఖడ్గాలు, డాళ్ళు, కవచాలను కరిగించి, కాబా సింహద్వారాన్ని పోతపోశారు. రెండు బంగారు జింకలను ఈ ద్వారంలోనే రెండువైపులా బిగించారు. దానివల్ల కాబాకు కొత్త శోభ చేకూరింది.

Insha Allah రేపటి భాగములో అబ్దుల్ ముత్తలిబ్ సమర్పించుకున్న బలిదానం గురించి తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282  🖊🖊
                 (rafeeq)

🖊🖊  Salman      +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment