93

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 93*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 08* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 _కథానుసారంగా ఈ రోజు కథ కొంచెం పెద్దదిగా ఉంది. సోదరులు గమనించగలరు. నిన్నటి భాగమును చదివి, ఆ తర్వాత ఈ రోజు భాగము చదవాల్సిందిగా విన్నపం_

 *మక్కాలోకి ప్రవేశించిన రాజదూత హుమైరీ : -* 

మక్కా ప్రజలు అబ్రహా సైన్యం వచ్చిందని విని ఇంతకు ముందునుంచే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు హుమైరీ పట్టణంలోకి ప్రవేశించడం చూసి, మక్కా ప్రజలు మరింత ఆందోళన పడసాగారు. 

హుమైరీ, ఖురైష్ నాయకుల నివాసం ఎక్కడ ఉంది అని అక్కడ ఉన్న ప్రజలను అడిగాడు. వారు హుమైరీని, అబ్దుల్ ముత్తలిబ్ వద్దకు తీసుకువెళ్ళారు. అపుడు హుమైరీ, అబ్దుల్ ముత్తలిబ్ తో....,

హుమైరీ : - నేను యమన్ రాజు అబ్రహా యొక్క ప్రత్యేక దూతగా వచ్చాను.

అబ్దుల్ ముత్తలిబ్, హుమైరీని సాదరంగా ఆహ్వానించారు.

అబ్దుల్ ముత్తలిబ్ : - రండి, కూర్చోండి.

హుమైరీ : - నేను మా రాజు అబ్రహా గారి దగ్గర నుంచి ఒక సందేశం తెచ్చాను.

అబ్దుల్ ముత్తలిబ్ : - ఆ సందేశం ఏమిటో చెప్పండి.

హుమైరీ : - మా రాజుగారు కాబా మందిరం పడగొట్టడానికి అరవై వేలమంది సైనికులతో వచ్చారు. మీరు మా సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోలేరు. మక్కా ప్రజల పట్ల మా రాజుకు ఎలాంటి ద్వేషం, విరోధం లేవు. వారితో పోరాడాలని కాని, వారికి హాని కలిగించాలని కాని ఆయన ఉద్దేశ్యం కాదు. కాబా గృహాన్ని పడగొట్టడానికి మాత్రమే ఆయన వచ్చారు. అందుచేత మీరు మా దారికి అడ్డురాకండి. మా దారికి అడ్డురామని మీరు మాటిస్తే మక్కా ప్రజల ధన, మాన ప్రాణాలకు నేను హామీ ఇవ్వగల్గుతాను.

అబ్దుల్ ముత్తలిబ్ : - మాకు మీ రాజును ఎదుర్కొనే శక్తి లేదు. ఎదుర్కోవడానికి ప్రయత్నించం కూడా. కానీ కాబా దేవుని ఆలయం. ఆయన తలచుకుంటే తన ఆలయాన్ని కాపాడుకుంటాడు. (అని నిర్భయంగా చెప్పారు)

హుమైరీ : - సరే, మీరు మా రాజుగారి దగ్గరికి రండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆయన ముందు చెప్పుకోండి.

అబ్దుల్‌ ముత్తలిబ్ తన సహచరులతో, కుటుంబసభ్యులతో కలిసి, రాజు అబ్రహా ను కలవడానికి రాజదూత హుమైరీ వెంట బయలుదేరారు.

 *అబ్రహా రాజు విడిది చేసిన ప్రదేశానికి చేరుకున్న అబ్దుల్ ముత్తలిబ్ : -* 

తన వద్దకు వస్తున్న అబ్దుల్ ముత్తలిబ్ ను చూసిన అబ్రహా రాజు, అబ్దుల్ ముత్తలిబ్ ముఖవర్చస్సు, ఠీవి, దర్పం, హుందాతనం, గాంభీర్యం చూసి ఎంతో ప్రభావితుడయ్యాడు. ఆ వెంటనే రాజు అబ్రహా, ఆసనం మీద నుండి లేచి అబ్దుల్ ముత్తలిబ్ కు ఎదురెళ్ళి, చాలా మర్యాదగా స్వాగతం చెప్పాడు. అంతేకాదు, అబ్దుల్ ముత్తలిబ్ ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ విధంగా రాజు తన ప్రక్కన కూర్చుండబెట్టడం అత్యున్నత స్థాయి మర్యాదకు చిహ్నం. అపుడు అబ్రహా, అబ్దుల్ ముత్తలిబ్ తో....,

అబ్రహా : - చెప్పండి అబ్దుల్ ముత్తలిబ్. మా నుండి మీరు ఏం కోరుతున్నారు? మీరేమన్నా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా?

అబ్దుల్ ముత్తలిబ్ : - ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది. మీరు పట్టుకెళ్ళిన నా రెండు వందల ఒంటెలు నాకు తిరిగి ఇప్పించండి చాలు. (అని నిర్లక్ష్యంగా చెప్పారు)

అబ్దుల్ ముత్తలిబ్ మాటలు విని అబ్రహా నిర్ఘాంతపోయాడు. అతని ముఖకవళికలు మారిపోయాయి.

అబ్రహా : - ఏమిటీ! ఒంటెల్ని ఇవ్వాలా!! మీ గురించి నేను ఏదేదో గొప్పగా ఊహించుకున్నాను. మిమ్మల్ని మొదటిసారి చూసినపుడు మీ గాంభీర్యం చూసి అచ్చెరువొందాను. మీ రూపురేఖలు చూసి ప్రభావితుడనై, మీరు ఎంతో గొప్ప నాయకుడని భావించాను. అందువల్లనే మీకు అత్యున్నత మర్యాద ఇచ్చాను. కాని మీరు ఇప్పుడు ఒంటెలు అడిగి, నా దృష్టిపథం నుండి దిగజారిపోయారు. ఒక సాధారణ మనిషి మాదిరి, చాలా చిల్లర స్థాయి విజ్ఞప్తి చేశారు. ఇక మీ మీద నాకు ఎలాంటి గౌరవం మిగల్లేదు. మీ తాతముత్తాతల ఆరాధనా కేంద్రం, శాంతి నిలయమైన కాబా గృహాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తారని నేను భావించాను. కానీ, మీరు కాబా గురించి ఒక్కమాటా ప్రస్తావించలేదు. మీ ఒంటెల్ని తిరిగిచ్చెయ్యమని మాత్రం అడుగుతున్నారు! (అని అన్నాడు వెటకారంగా)

అబ్దుల్ ముత్తలిబ్ : - నేను నా ఒంటెలకు మాత్రమే యజమానిని. వాటిని మీ సైన్యం ఎత్తుకు వచ్చింది. అందుచేత ఒంటెల గురించి మాత్రమే నేను మిమ్మల్ని అభ్యరిస్తున్నాను. ఇక కాబా విషయమంటారా.... కాబా గృహం యజమాని ఉన్నాడు, ఆయనే దాని రక్షణ చూసుకుంటాడు. ఆయనే దానిని కాపాడుకుంటాడు.

అబ్దుల్ ముత్తలిబ్ మాటలు విన్న అబ్రహా కోపంతో ఊగిపోయాడు.

అబ్రహా : - ఆ దేవుడు కూడా కాబాను నా పట్టు నుండి కాపాడలేడు. (అని అన్నాడు కోపంగా)

అబ్దుల్ ముత్తలిబ్ : - ఆ సంగతి మీకూ, ఆయనకే తెలియాలి. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మధ్యలో నాకెందుకు ఈ గొడవ.

మహాగంభీరంగా కనపడే అబ్దుల్ ముత్తలిబ్ నిర్లక్ష్యధోరణి చూసి అబ్రహా, ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇక ఆ తర్వాత అబ్రహా ఓ సైనికుడ్ని పిలిచి అబ్దుల్ ముత్తలిబ్ ఒంటెల్ని ఆయనకు ఇచ్చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సైనికుడు రాజు ఆజ్ఞను శిరసావహించి, ఒంటెల్ని అబ్దుల్ ముత్తలిబ్ కు అప్పగించాడు.

అబ్దుల్ ముత్తలిబ్ తో వచ్చిన ఇతర సభ్యులు అబ్రహాకు నచ్చజెప్పడానికి, కాబా గృహానికి నష్టం కలిగించకుండా చూడడానికి ప్రయత్నించారు. అందుకు బదులుగా తిహామా, ఖురైష్ తెగలు పండించే పంటలో మూడవ వంతు అబ్రహాకు చెల్లించడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ అబ్రహా ఒప్పుకోలేదు. అతడు సంపద కోసం రాలేదు. కాబాను ధ్వంసం చేయాలన్న ఉద్దేశ్యంతోనే వచ్చాడు.

చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాకా, చేసేదేమీ లేక అబ్దుల్ ముత్తలిబ్ మరియు మక్కా ప్రతినిధులు బరువెక్కిన హృదయాలతో వెనుదిరిగారు.

మక్కా పట్టణంలో ప్రజలు ఊపిరి బిగబట్టి అబ్దుల్ ముత్తలిబ్ రాకకోసం వేయి కళ్ళతో ఎదురుచూడసాగారు. ఆఖరి క్షణంలోనైనా ఏదైనా మహత్యం జరిగి యుద్ధనివారణ కృషి ఫలిస్తుందేమోనని కూడా కొందరు ఆశలు పెట్టుకున్నారు. అయినా ఎందుకో వారి మనసు కీడు శంకిస్తోంది. మక్కా ప్రజల గుండెలు దడదడా కొట్టుకోసాగాయి.

 *మక్కాకు చేరుకున్న అబ్దుల్ ముత్తలిబ్ : -* 

అబ్దుల్ ముత్తలిబ్ ఇంటికి తిరిగొచ్చాడు. ఆయన తన సహచరులకు విషయం తెలియజేసి తరువాతి కార్యక్రమం గురించి వారితో చర్చించారు.

ఆ తరువాత పట్టణంలోని వారంతా తక్షణమే తమ తమ భార్యాపిల్లల్ని తీసుకొని, మక్కా పట్టణం వదలి కొండగుహల్లోకి పారిపోయి తలదాచుకోవలసిందిగా ఒక బహిరంగ ప్రకటన చేశారు. అబ్రహా సైన్యం వెళ్ళే వరకు పట్టణంలోకి తిరిగి రావద్దని సలహా కూడా ఇచ్చారు. ఆ రాత్రి మక్కా ప్రజలు కాబా గృహానికి వీడ్కోలు ప్రదక్షిణ చేశారు.

ఆ తరువాత మక్కా ప్రజలు తమ ఇళ్లూ, వాకిళ్ళూ వదిలేసి కట్టు బట్టలతో కొండ గుహల్లోకి పారిపోయారు. అబ్దుల్ ముత్తలిబ్, కొందరు ఛోటా నాయకులతో కలిసి కాబా మందిరంలోకి ప్రవేశించారు.

ఆ సమయంలో కాబా మందిరంలో మొత్తం మూడు వందల అరవై విగ్రహాలున్నాయి. వాటిలో ఇబ్రాహీం (అలైహి), ఇస్మాయీల్ (అలైహి) విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈసా (అలైహి) మాతృమూర్తి హజ్రత్ మర్యం (అలైహి) విగ్రహం కూడా ఉండి. గర్భగుడి కప్పుపై హుబల్ దేవతా విగ్రహం ఉండి. ఇది అన్నిటికంటే పెద్ద విగ్రహం. దీని ఎడమ చేయి విరిగిపోతే ఆ స్థానంలో బంగారపు చేయి తయారుచేయించి తగిలించారు.

జమ్ జమ్ బావి ఒడ్డు మీద ఇరుపక్కలా రెండు విగ్రహాలున్నాయి. ఒకటి పురుష విగ్రహం, మరొకటి స్త్రీ విగ్రహం. ఇవి కాకుండా జంతువుల ఆకారాలు గల విగ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయి.

అబ్దుల్ ముత్తలిబ్, ఆయన సహచరులు ఈ విగ్రహాలన్నిటినీ వదిలేసి గర్భగుడిపై కప్పిన గలేబుని పట్టుకొని నిల్చున్నారు. వారికి తాము రోజూ పూజిస్తున్న విగ్రహాలు, ఇతర మిధ్యా దైవాలు గాకుండా అందర్నీ సృష్టించిన నిజ దేవుడు గుర్తుకొచ్చాడు.

అబ్దుల్ ముత్తలిబ్, ఆయన సలహాదారులు కాబా గృహం ద్వారాన్ని ఆలింగనం చేసుకుని సుదీర్ఘకాలం దేవుణ్ణి ఇలా ప్రార్థించారు :

“దేవా! నీ దాసుడు తన గృహాన్ని కాపాడుకుంటాడు. నీవు కూడా నీ గృహాన్ని కాపాడుకో. రేపు నీ గృహాన్ని నీ శత్రువులు నాశనం చేయడానికి వస్తున్నారు. వారి ప్రయత్నాలను వమ్ముచేయి. ఒకవేళ నీవు అబ్రహా సైనికులను మరియు మా జాతి ప్రజలను ఎవరి మానాన వారిని వదిలేయదలచుకుంటే నీ అభీష్టానికి అడ్డుపడేవారుండరు. దేవా! నేను నిన్నే నమ్ముకున్నాను. ఎలాగైనా శత్రువుల బారి నుండి కాబా గృహాన్ని రక్షించు. మా పట్టణం నాశనం కానివ్వకుండా వాళ్ళను అడ్డుకో." అని మొరపెట్టుకున్నారు.

ఇలా ప్రార్థించి, అబ్దుల్ ముత్తలిబ్ కూడా తన సహచరులతో కొండగుహల్లోకి వెళ్ళి దాక్కున్నారు.

 *కాబాను ధ్వంసం చేయాలని విడిది చేసిన చోటు నుండి బయలుదేరిన అబ్రహా : -* 

మరుసటి రోజు అబ్రహా, కాబా గృహాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. తన సైన్యాన్ని యుద్ధం కోసం సన్నద్ధం చేసి, ఏనుగులను క్రమబద్ధం చేసి మక్కాలో ప్రవేశించడానికి బయలుదేరాడు. అబ్రహా కూడా ఓ మదపుటేనుగుపై అట్టహాసంగా ముందుకు సాగాడు.

ఆ సైన్యం మక్కా పట్టణాన్ని సమీపిస్తూ, "ముజ్ దలిఫా" మరియు "మినా" ల నడుమ గల "ముహస్సిర్" కొండ లోయకు చేరుకోగానే అబ్రహా కూర్చున్న ఏనుగు హఠాత్తుగా ఆగి కూలబడిపోయింది. మావటివాడు ఎంత కొట్టినా, అంకుశంతో గాయపర్చిన ఆ ఏనుగు పైకి లెగలేదు. ఆ ఏనుగును లేపి కాబా దిశగా నడపడానికి ప్రయత్నిస్తే అటువైపు ఒక్క అడుగు కూడా వేయకుండా మొరాయించింది. కాబా ఉన్న వైపుకు కాకుండా మరో దిక్కుకు త్రిప్పినప్పుడు ఆ ఏనుగు పైకి లేచి హుషారుగా పరుగులు తీసేది. కాని కాబా వైపుకు త్రిప్పినప్పుడల్లా కూలబడిపోయేది. మక్కా వైపు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగనని మొరాయించింది. ఈ దృశ్యం చూసి అబ్రహా, అతని సైనికులు ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంలోనే అల్లాహ్, చిన్న చిన్న పక్షుల గుంపును అబ్రహా సైన్యం పైకి పంపించాడు. ఈ పక్షులు అబాబీల్ మరియు పిచుకల్లాంటి పక్షులు. ఈ పక్షుల గుంపు వద్ద, కాల్చిన గట్టి మట్టి లాంటి గులకరాళ్ళు ఉన్నాయి. ప్రతి పక్షి వద్ద మూడేసి గులకరాళ్ళు ఉన్నాయి. ఒక రాయి పక్షి ముక్కున, మిగిలిన రెండు రాళ్ళు, పక్షి రెండు కాళ్ళ వేళ్ళ సందుల్లో ఉన్నాయి.

ఆ అబాబీల్ పక్షులు రావడంతోనే, నేరుగా అబ్రహా సైన్యం పైకి కాల్చిన గులకరాళ్ళను వర్షించాయి. ఆ గులకరాళ్ళు చాలా పదునుగా ఉండి ఎవరికైనా తగిలితే అతని శరీర అవయవాలు తెగిపోయేవి. పక్షులు జారవిడిచిన ఆ రాళ్ళు శరవేగంగా సైనికుల శరీరవయవాలను చీల్చుతూ నేలపై పడసాగాయి. చూస్తుండగానే మైదానమంతా రక్తంతో నిండిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఏనుగుల ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, సైనికుల హాహాకారాలతో సర్వత్రా భీతావహ వాతావరణం నెలకొంది. 

దాంతో అబ్రహా సైన్యం బెంబేలేత్తిపోయి పెడబొబ్బలు పెడుతూ ఎటుబడితే అటు పారిపోవడానికి ప్రయత్నించారు. తీవ్రమైన తొక్కిసలాట ఏర్పడింది. కాని అప్పటికే చాలా మంది మృత్యువాత పడ్డారు. మిగిలినవారు కొద్ది దూరం పోయి ఊపిరి విడిచారు. శవాలు గుట్టలు గుట్టలుగా పడసాగాయి. ఇలా అల్లాహ్ ఆ సైన్యాన్ని ధాన్యపు పొట్టులా మార్చేశాడు.

అయితే ఈ గులకరాళ్ళు అందరికీ తగలలేదు. సైన్యం లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒకరిని మరొకరు త్రొక్కుకుంటూ పరుగులు తీశారు. త్రొక్కిసలాటలో ప్రతి దారిలోనూ, ప్రతి నీటి చెలమ దగ్గరా చనిపోనారంభించారు.

ఈ పరిస్థితి చూసి అబ్రహా గగ్గోలుపెట్టాడు. ఇటు అబ్రహా పై అల్లాహ్ శిక్ష పడిన తీరు ఎలాంటిదంటే, అతని చేతివేళ్ళ గోర్లు చిగురుల నుండి వేరై క్రిందపడిపోయాయి. చేతి వ్రేళ్ళు తోటకూర కాడల్లా వ్రేలాడపడ్డాయి. అతను కూడా గులకరాళ్ళ దెబ్బలతో రక్తసిక్తుడై పారిపోయాడు. కాని దారిలోనే అతని ఒళ్ళు హూనమైపోయింది. రాజధాని "సన్ఆ" కు చేరే లోపలే అతని రోమ్ముమీది మాంసంతో సహా చర్మం ఊడిపోయి, వక్షస్థలం బ్రద్దలై గుండె బయటపడింది. దాంతో అబ్రహా దభేలున నేలమీద పడి ఊపిరి విడిచాడు.

 *మక్కా ప్రజల ఊరట : -* 

అబ్రహా దాడికి భయపడి, మక్కా పౌరులు ప్రాణభీతితో కొండలోయల్లోకి పారిపోయారు. కొండ శిఖరాల్లో తలదాచుకున్నారు. సైన్యం పై దైవశిక్ష అవతరించిన తరువాత, జరిగిన విషయం తెలుసుకున్న మక్కా ప్రజలు ప్రశాంతంగా తమ తమ ఇళ్ళకు చేరుకున్నారు.

ఈ ఫీల్ సంఘటన తరువాతి నుంచి అరబ్బులు తమ కేలండరును మార్చుకుని ఈ సంవత్సరం నుంచి కొత్త కేలండరును, "ఏనుగుల సంవత్సరం" నుంచి లెక్క మొదలయ్యే కేలండరును తయారు చేసుకున్నారు.

అటు అబ్రహా చనిపోగానే "సైఫ్ బిన్ జీయజన్" అనే అతను యమన్ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ వార్త అందగానే అబ్దుల్ ముత్తలిబ్, అతడ్ని అభినందించడానికి కొందరు పెద్దలను వెంటబెట్టుకొని యమన్ రాజధాని "సన్ఆ" చేరుకున్నారు. యమన్ కొత్తరాజు "సైఫ్" ఖురైష్‌ నాయకులకు ఘనంగా స్వాగతం చెప్పి సత్కరించారు. ఆ సందర్భంలో సైఫ్ మాట్లాడుతూ...., "యావత్తు అరేబియా ప్రజలతోపాటు అనేక జాతులు ఎదురుచూస్తున్న అంతిమ దైవప్రవక్త మీ సంతతిలో (అరబ్ జాతిలో) ఉద్భవిస్తాడు." అని తెలియజేశారు.

క్రైస్తవ మతాన్ని, యూద మతాన్ని బాగా అధ్యయనం చేసిన గొప్ప పండితుడు ఆ సైఫ్. అందువల్ల ఈ శుభవార్తను విన్న ఖురైష్ నాయకులు ఎంతోగానో సంతోషించారు.

యూద పండితులు, ధర్మవేత్తలు, క్రైస్తవ తత్త్వవేత్తలతోపాటు అనేక మంది జ్యోతిష్కులు త్వరలోనే అరేబియాలో అంతిమ దైవప్రవక్త ప్రభవించబోతున్నాడని ప్రకటించారు.

ఇక మరో విషయానికొస్తే అబ్దుల్ ముత్తలిబ్ గారి చిన్న కోడలు ఆమినా ఉంది. ఆమె ప్రసవానికి ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉంది. ఇలాంటి సమయంలో ఈ ఫీల్ సంఘటన జరిగింది.

 *ఈ అద్భుతమైన సంఘటన (ఫీల్ సంఘటన) నిజానికి ముహమ్మద్ (సల్లం) రాకకు ముందు, ఆయన రాకను సూచిస్తూ జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లం) కూడా ఆ సంవత్సరమే జన్మించారు. ఆయన పెరిగి పెద్దయి కాబా గృహాన్ని విగ్రహారాధన నుంచి కాపాడారు.* 

 *ఫీల్ సంఘటన జరిగిన తరువాతి వివరణ : -* 

ఈ సంఘటన, అనేక చరిత్రకారుల ప్రకారం - దైవ ప్రవక్త (సల్లం) గారి జననానికి కేవలం యాభై రోజులు లేదా యాభై ఐదు రోజుల ముందు ముహర్రమ్ నెలలో సంభవించింది. కాబట్టి ఇది క్రీ.శ 571 ఫిబ్రవరి చివరి రోజులు లేదా మార్చి నెల ప్రారంభం కాలానికి సంబంధించిన సంఘటన. 

ఈ ఫీల్ సంఘటన నిజంగా హెచ్చరికతో కూడుకున్న ఒక సూచన. దానిని అల్లాహ్ తన ప్రవక్త (సల్లం) కోసం, తన కాబాగృహం కోసం అవతరింపజేశాడు. ఎందుకంటే, "బైతుల్ మక్దిస్" విషయానికి వస్తే ఆ కాలం నాటి ఇస్లాంకు "ఖిబ్లా" గా ఉండేది. అక్కడి ప్రజలు ముస్లిములే అయినప్పటికీ దాన్ని అల్లాహ్ శత్రువులైన బహుదైవారాధకులు (ముష్రిక్కులు) హస్తగతం చేసుకోవడం జరిగింది.

"బుఖ్తెనసర్" దాడి క్రీ.పూ. 587 మరియు రోమనుల ఆక్రమణ క్రీ.శ 70 లాంటి సంఘటనలతో ఈ విషయం అర్థమవుతుంది. కానీ దీనికి భిన్నంగా కాబా గృహంపై క్రైస్తవులకు ప్రాబల్యం లభించలేదు. వాస్తవానికి అప్పటి కాలంలో ఈ క్రైస్తవులే ముస్లింలు కాని కాబా పౌరులు ముష్రిక్కులు.

అదే కాదు, ఫీల్ సంఘటన జరిగినప్పటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే, ఆనాటి సభ్య ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు అంటే రోమ్, పర్షియా వగైరాలకు ఈ వార్త (ఫీల్ సంఘటన) వెనువెంటనే ప్రాకిపోయింది. అబీసీనియాకు రోమ్ సామ్రాజ్యంతో సత్సంబంధం ఉండేది. మరోవంక పారసీకులు రోమనుల కార్యకలాపాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. వారు రోమను మిత్ర రాజ్యాల్లో సంభవించే సంఘటనలను తరచి చూస్తూ ఉండేవారు.

ఈ కారణాల మూలంగా ఈ సంఘటన జరిగిన వెనువెంటనే పర్షియనులు శీఘ్రగతిన యమన్ ను వశపరుచుకున్నారు. ఈ రెండు గొప్ప సామ్రాజ్యాలే అప్పటి నాగరిక ప్రపంచానికి సంబంధించిన ప్రముఖ ప్రాంతాలను పాలించేవి గనుక, ఫీల్ సంఘటన కారణంగా ప్రపంచ దేశాల దృష్టి అంతా "కాబా" గృహం వైపునకు మరలింది. ప్రపంచ దేశాలకు, కాబాగృహ ఔన్నత్యం, గౌరవానికి సంబంధించిన ఒక స్పష్టమైన దైవ సూచనలా అగుపించింది.

ఈ గృహాన్ని అల్లాహ్ తన పవిత్రతను కొనియాడటం కోసం ఎంచుకున్నాడన్న విషయం ప్రతి హృదయంలో బాగా నాటుకుపోయింది. కాబట్టి, ఇక్కడి ప్రజల్లో ఏ వ్యక్తి అయినా దైవదౌత్యం చాటుతూ లేచినిలబడడం నేరుగా ఈ సంఘటనతో సంబంధం కలిగి ఉంటుందని, ప్రకృతి నియమాలకు భిన్నంగా విశ్వాసులకు కాకుండా బహుదైవారాధకులకే సహాయం చేయడంలో దైవలీల ఔచిత్యం ఎంతైనా ఉందని తెలుసుకోవడం జరిగింది.

అల్లాహ్ ప్రియ ప్రవక్త, యావత్తు మానవాళి కోసం ఉద్భవించిన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జననం గురించి Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment