100

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 100*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 15* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

           *పెదనాన్న అబూ తాలిబ్ సంరక్షణలో ముహమ్మద్ (సల్లం)* 

 *ప్రవక్త (సల్లం) మాధ్యమంగా వర్షం గురించి వేడుకోలు : -* 

ఎండలు మండిపోతున్నాయి. భూములు బీటలు వారుతున్నాయి. జలనిధులు తరిగిపోతున్నాయి. చెట్లు ఎండిపోతున్నాయి. మేత దొరక్క పశువులు నకనకలాడుతున్నాయి. పాలులేక పసిపిల్లలు చిక్కి పోతున్నారు. దారిద్ర్యంతో పేదల కడుపులు పీక్కుపోతున్నాయి. వ్యాపార లావాదేవీలు మందగించి పోతున్నాయి. వీధులు నిర్మానుష్యమవుతున్నాయి. కరవు రక్కసి కరాళనృత్యం చేస్తుంది. ప్రజల హాహాకారాలు చేస్తున్నారు. నానాటికి విషమిస్తున్న పరిస్థితి పట్ల ఖురైష్ నాయకులు తీవ్ర ఆందోళన చెందసాగారు.

ఓరోజు వారు సమావేశమయి సమస్య పరిష్కారం గురించి చర్చించారు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి అబుతాలిబ్ ఇంటికి వెళ్లారు...., “అధినాయకా! ఎంతో కాలం నుంచి వానలు లేక పరిస్థితి రోజురోజుకు ఘోరమవుతున్న సంగతి మీకు తెలుసు. జనం కరవు రక్కసి కోరల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. పశువులు మేతలేక బక్కచిక్కి పోతున్నాయి. కరవు నివారణకు మేము చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాము. చివరికి పరిష్కారం కోసం మీ దగ్గరకి వచ్చాము. మేము మీ నుండి కేవలం ప్రార్థన మాతమే కోరుతున్నాం. మీరు వర్షం కోసం దైవాన్ని ప్రార్ధించండి” అన్నాడు వారిలో ఒకతను.

“మన దేవతలకు మన మీద దయ కలగడం లేదు. మేము సమర్పించుకున్న కానుకల్ని వారు తిరస్కరించారు. మా మొక్కుబడులన్నీ నిష్ఫలమైపోయాయి. మేము పాపత్ములం. మా దేవతలు మమ్మల్ని కనికరించడం లేదు. ఇక మీరే ఏదయినా చెయ్యాలి. మీరు పుణ్యాత్ములు, కాబా ధర్మకర్తలు. అందుకని మీరు మా కోసం వర్షం కురిపించమని దేవుడ్ని ప్రార్థించండి.” అన్నాడు మరొకడు దీనంగా.

అబుతాలిబ్ ఈ మాట విని తల వంచుకుని రెండు క్షణాలు ఆలోచించారు. తర్వాత ఏమాట చెప్పకుండా లోపల గదిలోకి వెళ్ళిపోయారు. కాసేపటికి బయటకి వచ్చారు. ఆయనతో పాటు పదేళ్ళ బాల ముహమ్మద్ (సల్లం) కూడా ఉన్నారు. రాగానే “పదండి కాబాలయానికి” అన్నారు ముహమ్మద్ (సల్లం) ని తీసుకుని బయటికి అడుగేస్తూ.

ఖురైష్ నాయకులంతా ఆయన వెంట బయలుదేరారు. వారి వెనుక జనసామాన్యం కూడా ఓ పెద్ద గుంపుగా బయలుదేరింది. అబూ తాలిబ్ కాబా మందిరానికి చేరుకున్నారు.

బాల ముహమ్మద్ (సల్లం) ని కాబా గోడకు అనిచ్చి కూర్చోబెట్టి...., “బాబు! వర్షం కురిపించమని దేవుడ్ని ప్రార్థించు. ఆయన నీ ప్రార్థన ఆలకించి వర్షం కురిపిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది” అన్నారు ఆయన (అబ్దుల్ ముత్తలిబ్).

ప్రజలు వారి చుట్టూమూగి, ఏం జరుగుతుందో చూద్దామని ఆసక్తిగా నిల్చున్నారు.

బాల ముహమ్మద్ (సల్లం) తల పైకెత్తి నిర్మలంగా ఉన్న నీలాంబరం వైపు దృష్టి సారించారు. పెదవుల నుండి ప్రార్థనా పదాలేమిటో నిశ్శబ్దంగా వెలువడి విశ్వాంతరాళంలోకి దూసుకుపోయాయి. దానితో పాటు ఆయన తన కుడిచేయి చూపుడు వ్రేలిని పైకెత్తారు. జనం ఊపిరిబిగబట్టి ముహమ్మద్ (సల్లం) వైపు, ఆకాశం వైపే తదేకంగా చూడసాగారు. ఆకాశం ఎటు చూసిన నిర్మలంగా ఉంది. మచ్చుకు ఓ చిన్న మబ్బు తునకైనా లేదు. ఎండ పెట పెట లాడిపోతుంది.

కాని కొన్ని క్షణాల్లోనే వాతావరణం మారిపోయింది. ఎటునుంచో మేఘాలు ఉరుకులు పరుగులు పెడ్తూ వచ్చేశాయి. సూర్యుడు గబగబా పారిపోయి కనుమరుగయి పోయాడు. చూస్తూ ఉండగానే ఆకాశం దట్టమైన కారుమేఘాలతో నిండిపోయింది. రివ్వున గాలి వీచింది. ఆ వెనువెంటనే చిటచిట చినుకులు ప్రారంభమయ్యాయి.

అబూతాలిబ్ చిన్నారి ముహమ్మద్ (సల్లం) ని తీసుకుని ఇంటికి బయలుదేరారు. జనం కూడా క్రమేణా తమ తమ ఇండ్లకు వెళ్ళిపోసాగారు. 

ఉరుములతో ఆకాశం దద్దరిల్లింది. మెరుపులతో వర్షం ఉధృతమయింది. చాలా సేపటిదాకా వాన కుండపోతగా కురిసి క్రమంగా వెలసింది. వీధులు ఏరులై పారాయి. కుంటలు, బావులు నిండిపోయాయి. మోడువారిన చెట్లు చిగురించాయి. బీటలు వారిన నెల పచ్చికలతో నిండిపోయింది. జనంలో ఉత్సాహం పెల్లుబికింది.

(వర్షం గురించి వేడుకున్న ఈ సంఘటన తర్వాత) ఎక్కడచూసినా బాల ముహమ్మద్ (సల్లం) గురించిన చర్చలే. ఏనోట విన్నా ఆ చిన్నారి మహిమ గురించిన మాటలే.

 *మేకల కాపరిగా బాల ముహమ్మద్ (సల్లం) : -* 

అరబ్బులు నిరాడంబర జీవులు, వారికి సభ్యతా సంస్కారాలంటే ఏమిటో తెలియదు. గొప్పింటి పిల్లలు కూడా అడవులకు వెళ్ళి పశువులు కాస్తుంటారు. అందువల్ల ముహమ్మద్ (సల్లం) కూడా మక్కా అడవుల్లో మేకలు కాయడం మొదలెట్టారు.

యథాప్రకారం ఆయన ఓ రోజు మేకలు తోలుకుంటూ అడవికి బయలుదేరారు. దారిలో మరో ఇద్దరు బాల కాపరులు తోడయ్యారు. వీరు ముగ్గురు తమ తమ మేకలను చెట్లు, పొదల మధ్య మేత మేయడానికి వదిలేసి, ఓ చట్టుబండ మీదికి చేరి కబుర్లాడు కోవడం మొదలెట్టారు. కాని ముహమ్మద్ (సల్లం) కు ఈ కబుర్లు నచ్చలేదు. ఆయన ఓ అయిదు నిమిషాలు విని విసిగెత్తి లేచి నిలుచున్నారు.

“ఏమిటి లేచావు? ఎక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు ఒక బాలుడు.

నా మేకలు దూరంగా వెళ్ళి మేస్తున్నాయి, నేను వాటికి దగ్గరగా వెళ్ళి కూర్చుంటాను” అని చెప్పారు బాల ముహమ్మద్ (సల్లం).

“మేకల్ని గురించి కంగారుపడకు. మనం ఒక్క కేక వేస్తే చాలు, మన కేక విని వాటంతట అవే మన దగ్గరకు వచ్చేస్తాయి. రా, ఆడుకుందాం” అన్నాడు రెండో అబ్బాయి.

“మీరు ఆడుకోండి, నేను అటు వెళ్ళి కూర్చుంటా మేకల్ని చూసుకుంటూ” అంటూ ముహమ్మద్ (సల్లం) అక్కడనుంచి వెళ్ళిపోయారు.

“ఏమిటి ఆయన తత్వం! ఆటలంటే ఇష్టం లేదేమో ఇతనికి!!” అన్నాడు ఒకడు.

“ఈయన గారికి ఒంటరిగా ఉండటం అంటే మహా ఇష్టం” అన్నాడు అతని స్నేహితుడు.

“నిజమే. ఇతనెప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.”

“ఆలోచించుకోని. మనం అటు వెళ్ళి ఆడుకుందాం రా.”

 *ప్రకృతి గురించిన సందేహం : -* 

ముహమ్మద్ (సల్లం) తన చుట్టుప్రక్కలున్న ప్రకృతి దృశ్యాలు పరికించి చూడసాగారు. “కొండలు.... ఇసుక తిన్నెలు.... చెట్లు.... పొదలు.... పైన సహస్ర కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యుడు.... నీలాకాశంలో అక్కడక్కడ కొన్ని మబ్బు తునకలు.... ఈ మబ్బు తునకలే కాబోలు కారు మేఘాలయి కడవల కొద్ది వర్షం కురిపిస్తాయి. ఆ వర్షానికి చెట్లు, చామలు మొలకెత్తుతాయి. ఏమిటి విచిత్రం! అసలు వీటన్నిటినీ సృష్టించిన ఆ ప్రభువు ఎంత గొప్పవాడో!! ఆయనే మనుషుల్ని కూడా సృష్టించిన మహా మేధావి.”

“మరి ఈ దేవతలు, విగ్రహాలు ఏమిటి? జనం వాటికి కానుకలు, జంతుబలులు సమర్పించుకోవటం ఏమిటి? వాటి ముందు సాగిలబడి మొరపెట్టుకోవటం ఏమిటీ? ఈ మనుషులు స్వయంగా తయారు చేసుకున్న ఈ విగ్రహాలు వీరికేమైనా తిండి పెడుతున్నాయా? వర్షం కురిపిస్తున్నాయా? ఆహరమిచ్చే, వర్షం కురిపించే సృష్టికర్తను వదలి, ఉలుకు పలుకూ లేని విగ్రహాలు పూజిస్తున్న ఈ జనం ఎంత మూర్ఖులు...! 

“ముహమ్మద్! ఏమిటి ఆలోచిస్తున్నావు?” అన్నారు స్నేహితులు దగ్గరకు వస్తూ.

“ఆ .. ఆలోచిస్తున్నాను. ఈ చెట్లు, కొండలు ఎక్కడ్నుంచి వచ్చాయి. వీరిని ఎవరు సృష్టించారు అని ఆలోచిస్తున్నాను” అన్నారు ముహమ్మద్ (స) కాస్తంత తొట్రుపడుతూ.

“వీటన్నిటిని మన దేవతలు సృష్టించారు”.

“కాని, నా అంతరాత్మ ఈ విషయాన్ని ఒప్పుకోవటం లేదు”.

“తప్పు, అలా అనకు, మన దేవతలకు కోపం వచ్చి మనల్ని శపిస్తారు.” 

“మాట్లాడటమేరాణి ఈ విగ్రహాలు శపించటం ఏమిటి? మీరు కూడా కాస్త ఆలోచించండి. నాకు మాత్రం వీటిమీద ఏ మాత్రం నమ్మకం లేదు”. (అన్నారు ముహమ్మద్ (సల్లం))

“అది సరే గాని, ముహమ్మద్! ఈ రాత్రి బనూకనాన వాడలో బ్రహ్మాండమైన పాటకచేరి ఉందట. మేము వెళ్తున్నాము. నువ్వు కూడా విందువు గాని వచ్చేయి. డప్పులు, పాటలు, నాట్య కత్తెలు.... అబ్బో, ఒకటేమిటి.... భలే ఉంటుందిలే....” ఓ మిత్రుడు చెప్పుకుపోతున్నాడు.

“నాకు ఇలాంటివి చూడాలని లేదు. మీరు వెళ్ళండి” అని అన్నారు ముహమ్మద్ (సల్లం).

“అసలు నువ్వు ఓ సారి చూస్తే వదిలిపెట్టవ్. ఆ పాటలు, నాట్యం, ఆ మేళతాళాలు .... అబ్ బ్బ.... ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన కార్యక్రమం. ఎప్పుడూ మేకల మధ్య ఉంటే జీవితంలో ఏం మజా ఉంటుంది? అప్పుడప్పుడు ఇలాంటి పాట కచేరిలు కూడా వినాలి. అంతెందుకు, ఓ సారి పోయిరా నీకే తెలుస్తుంది” అంటూ ఉసిగొల్పాడు రెండో వాడు.

“ఊ ...సరే వస్తాన్లే” అన్నారు బాల ముహమ్మద్ (స) మనసులో ఇష్టం లేకపోయినా.

సాయంత్రం పొద్దువాలగానే మిత్రులు ముగ్గురు మేకలు తోలుకుని ఇండ్లకు తిరిగొచ్చారు. ఆ రాత్రి బనూకనాన వాడలో....

మద్దెల మోతలు.... డప్పుల ఢక ఢకలు .... సన్నాయి నొక్కులు.... హృద్యంగ రాగాలు.... కర్ణపేయంగా మార్మోగుతున్నాయి. గాయకురాళ్ళు, నాట్య కత్తెలు ఉరకలు వేసే ఉత్సాహంతో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. మాటిమాటికి మధుపాత్రలు మగువుల నుంచి మగరాయళ్ల చేతులకు మారుతున్నాయి...రంగరంగా వైభావంతో శ్రోతలు ఉర్రూతలూగుతున్నారు.... మధురమైన పాటలు వింటూ మైమరచిపోతున్నారు.

బాల ముహమ్మద్ (సల్లం) ఇంటి నుంచి అయిష్టంగానే బయలుదేరారు. మనసూ ససేమిరా అంటున్నా కాళ్ళు మాత్రం కదంబ కార్యక్రమం వైపు లాక్కెళ్తున్నాయి. కాని దారిలో ఒకచోట ఓ ఇంటి నుంచి మధురమైన గానమేదో చెవిన పడింది. బాల ముహమ్మద్ (సల్లం) అదేమిటో విందామని అక్కడకి వెళ్ళి కూర్చున్నారు. అంతే కాసేపటికి నిద్ర ముంచుకు వచ్చింది. తరువాత లేచి చూస్తే భళ్ళున తెల్లాయిపోయింది.

పొద్దెక్కిన తరువాత బాల ముహమ్మద్ (సల్లం) యథాప్రకారం మేకల్ని తోలుకుని అడవికి బయలుదేరారు. దారిలో మిత్రులు కలిశారు. “ముహమ్మద్! రాత్రి నువ్వు పాటకచ్చేరికి రాలేదా? మేము నిన్ను చాల సేపు వెతికాం. కాని నువ్వు ఎక్కడా కనపడలేదు” అన్నారు మిత్రులు. 

“నేను పాటకచ్చేరికి వెళ్దామనే బయలుదేరాను. కాని దారిలో ఒక ఇంట్లో నుంచి ఏదో పాట వినిపిస్తుంటే అక్కడకి వెళ్ళి కూర్చున్నా. అదేం పాటో గాని, ఒక చరణం విన్నానో లేదో నిద్ర ముంచుకొచ్చింది. లేచి చూస్తే తెల్లారిపోయింది.” చెప్పారు ముహమ్మద్(సల్లం).

“అరె, మంచి కార్యక్రమం పోగొట్టుకున్నావు, సరే ఈ రోజు రాత్రి కూడా ఉంది. వెళ్ళి చూడు. ఈ అవకాశం పొతే ఇంతట్లో రాదు మళ్ళీ. ఈ రాత్రి ఎలాగైనా చూడు” అన్నారు స్నేహితులు మళ్ళీ పురమాయిస్తూ.

సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాక భోజనం చేసి మళ్ళీ బయలుదేరారు బాల ముహమ్మద్ (సల్లం) పాట కచ్చేరికి. కాని అదేమీ చిత్రమో, కొంచెం దూరం పోగానే మళ్ళీ ఓ ఇంటి నుండి పాట వినిపించటం, అక్కడకెళ్ళి కూర్చుంటే వెంటనే నిద్ర రావటం జరిగిపోయాయి.

ముహమ్మద్ (సల్లం) బాల్యంలో సైతం పాట కచ్చేరిలు, పుక్కిటి పురాణాలు వినడాన్ని విధి అంగీకరించలేదు. అందుకే ఆయనకు రెండోసారి కూడా దారిలోనే నిద్ర వచ్చేసింది.

 *ముహమ్మద్ (సల్లం) ప్రవర్తన గురించి....,* 

సభ్యతా సంస్కారాలు లేని అరబ్ సమాజంలో మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, మద్యసేవనం, మగువ లోలత్వం మాత్రం మస్తుగా ఉండేవి. వీటికి తోడు అరబ్బులు తెగ విద్వేషం, జాతీయ దూరాభిమానాలతో చీటికిమాటికి పరస్పరం కత్తులు దూసుకుంటూ సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసుకునేవారు. ఇలాంటి సమాజంలో పిల్లలకు కూడా పెద్దల బుద్ధులే రావడం సహజం. కాని బాల ముహమ్మద్ (సల్లం) పై ఈ చెడు సమాజం ప్రభావం పడకుండా విధి ఆయనని ఏకాంత ప్రదేశాల్లో నోరులేని జీవాల మధ్య ప్రకృతి దృశ్యాల చాటున సుశిక్షణ ఇవ్వసాగింది.

ఆ మాటకు వస్తే స్వయంగా ముహమ్మద్ (సల్లం) కు కూడా అరబ్బుల జీవన విధానం నచ్చలేదు. ఆయనకు ఆటపాటలు కూడా నచ్చేవి కాదు. కాలక్షేపం కథలు, పనికిమాలిన కబుర్లు, వ్యర్థమైన పనులకు ఆమడ దూరంలో ఉంటారు. ఆయనసలు తోటి పిల్లలతో ఎక్కువగా స్నేహం చేసేవారు కూడా కాదు. వారి ఆకతాయి చేష్టల్ని అసహ్యించుకునేవారు. నిరంతరం ఏదో ఆలోచిస్తూ ఉండటం ఆయన ప్రవృత్తిలో వేరుగొనిపోయింది. ముఖ్యంగా ప్రకృతిని అవలోకిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఆయన కాలం గడుపుతుంటారు.

అంచేత బాల ముహమ్మద్ (సల్లం) వింతప్రవర్తన జనంలో పెద్ద చర్చనీయాంశమైపోయింది. "అబ్దుల్లాహ్ కొడుకు దైవదూతల ఉన్నాడే! నేనింతవరకు అతను తోటిపిల్లలతో పొట్లాడుతూ, దుర్భాషలాడుతూ ఉండటం చూడలేదు." అన్నారు ఒకరు.

"మీరు పోట్లాట గురించి చెబుతున్నారుగాని, నేనా పిల్లోడ్ని నోరువిప్పి గట్టిగా నవ్వడం కూడా చూడలేదు. చిరునవ్వు మాత్రమే అప్పుడప్పుడు అతని పెదాలపై కాస్తంత తొణికిసలాడుతుంది. అల్లరి చేష్టల వైపు కన్నెత్తి కూడా చూడడు." అన్నారు మరొకరు.

"అసలు మీరు ముహమ్మద్ (సల్లం) అంటే ఏమనుకున్నారు? ఈ అబ్బాయి భవిష్యత్తులో మహాపురుషుడవుతాడని ఇతని ప్రవర్తనే చెబుతోంది. ఈరాన్, ఈజిప్టు జాతులు ఈర్ష్య పడేలా ఇతని ద్వారా మన అరబ్బుల గౌరవం పెరుగుతుందన్నా ఆశ్చర్యం లేదు."

"అది సరేగాని మరో సంగతి విన్నారా? విలువిద్యలో, గుర్రపుస్వారీలో ఈ అబ్బాయి మక్కా పిల్లల్ని మించిపోయాడు. ఇతను వదిలే బాణం ఒక్కటీ గురితప్పదు."

"నేనయితే ఇంతకంటే విచిత్ర విషయమే విన్నాను." అన్నాడు ఒక వృద్ధుడు.

"ఏమిటదీ?" అక్కడ గుమిగూడిన వారంతా ఒకేసారి ఎంతో ఆత్రంగా అడిగారు.

"ఆ అబ్బాయి ఏదైనా చెట్టు పక్కగా నడిస్తే. ఆ చెట్టుకొమ్మలు అతని వైపు కిందికి వంగుతాయట! రాళ్ళ నుంచి అతనికి సలాం చెబుతున్నట్లు ధ్వనులు కూడా వస్తాయట!"

ఈ విశేషాలు విని అందరూ అత్యంతాశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకున్నారు. ఇలా మక్కాలో ఎవరినోట విన్నా ముహమ్మద్ (సల్లం) గురించిన చర్చలే. ఏ సమావేశంలో విన్నా ఆ చిన్నారి వింత ప్రవర్తన గురించిన ప్రస్తావనలే.

అంతేకాదు, బాల ముహమ్మద్‌ (సల్లం) మహా బిడియస్థుడు. ఆయన ఈడు పిల్లలు కొందరు ఒక్కోసారి దిశమొలలతోనే వీధుల్లో తిరుగుతుంటారు. పిల్లలేమిటీ, హజ్ కాలం వచ్చిందంటే కొందరు పెద్దలు సైతం స్త్రీపురుష విచక్షణ లేకుండా కాగా చుట్టూ దిశమొలలతోనే ప్రదక్షిణం చేస్తారు. కాని బాల ముహమ్మద్ (సల్లం) మాత్రం మొలమీద బట్ట కాస్తయిన తొలగనిచ్చేవారు కాదు.

ఒకసారి కాబా వరదముంపుకు గురయి గోడలు బీటలు వారితే, వాటి మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. అందులో పెద్దలతో పాటు పిల్లలు కూడా పాల్గొన్నారు. పిల్లలు తమతమ మొలబట్టలు తీసి భుజాలపై వేసుకొని రాళ్ళు మోయసాగారు. కాని చిన్నారి ముహమ్మద్ (సల్లం) అలా చేయకుండా రాళ్ళు మోయడానికి ఉపక్రమించారు.

అయితే చిన్నాయన అబ్బాస్ ఆయన్ని వారిస్తూ...., "తోటి పిల్లల్ని చూడు, మొలబట్టల్ని తీసి భుజాలపై వేసుకొని ఎలా మోస్తున్నారో రాళ్ళు. నువ్వు కూడా అలా చెయ్యి. భుజం నొప్పెట్టకుండా ఉంటుంది." అని చెప్పారు.

కాని ముహమ్మద్ (సల్లం) అలా చేయడానికి తటపటాయించారు. చివరికి ఆయన చిన్నాయనే మొలబట్ట లాగి ఊడదీశారు. అంతే, చిన్నారి ముహమ్మద్ (సల్లం) అమితమైన సిగ్గుతో స్పృహతప్పి పడిపోయారు. తిరిగి లేచి "నా లుంగీ.... నా లుంగీ" అంటూ అరిచారు. వెంటనే అబ్బాస్ ఆయనకు మొలబట్ట మళ్ళీ చుట్టబెట్టారు. అప్పటికి గాని బాల ముహమ్మద్ (సల్లం) కు మనస్సు స్థిమిత పడలేదు.

Insha Allah రేపటి భాగములో వర్తక బృందం, క్రైస్తవ పండితుడు బహీరా గురించి తెలుసుకుందాము

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment