92

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 92*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 07* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *అబ్దుల్ ముత్తలిబ్ విషయంలో, బైతుల్లాకు (కాబా గృహానికి) సంబంధించి రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి.* 

మొదటిది : - జమ్ జమ్ బావి త్రవ్వకం.

రెండవది : - ఫీల్ సంఘటన.

జమ్ జమ్ బావి త్రవ్వకం గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు కథలో భాగంగా ఫీల్ సంఘటన గురించి తెలుసుకుందాం.

 *ఫీల్ సంఘటన : - - : అబ్రహా రాజు* 

మక్కా పట్టణం కాలచక్రంతోపాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చరిత్ర పుటలు దాటుకుంటూ నిశ్చింతగా ముందుకు సాగుతోంది. చిన్న చిన్న సంఘటనలు మినహా భావితరాలు చెప్పుకోదగ్గ ఉదంతాలేవి సంభవించడం లేదు. అందువల్ల మక్కా ప్రజలు ప్రశాంత జీవితం గడుపుతున్నారు. కాని, ఈ ప్రశాంత పరిస్థితి ఎంతో కాలం సాగలేదు. ఉన్నట్లుండి ఓ రోజు పిడుగు లాంటి వార్త వినిపించింది!

“యమన్ రాజు అబ్రహా మక్కాపై దాడి చేయడానికి వస్తున్నాడట!!"

ఈ వార్త క్షణాల్లో పట్టణమంతా కార్చిచ్చులా వ్యాపించిపోయింది. జనం తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. వారి గుండెల్లో గుణపాలు గుచ్చినట్లైంది.

 *అబ్రహా గురించి : -* 

అబీసీనియా రాజు "నజాషీ" పరిపాలనలో ఉన్న యమన్ వలస రాజ్యానికి సైన్యాధిపతి "అబ్రహా సబాహ్" అనే అబీసీనియా నీగ్రో. ఇతను అబీసీనియా రాజు "నజాషీ" తరపున యమన్ కు గవర్నరుగా నియమించబడినవాడు. అది ఎలా అంటే; అబ్రహా, తన సైన్యంతో యమన్ పై అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. "అబ్రహా" తో యుద్ధం చేసే బదులు అతడినే యమన్ కు గవర్నరుగా నియమించడం మంచిదని అబీసీనియా రాజు "నజాషీ" భావించాడు.

యమన్ కు పొరుగున ఉంది మక్కా. యమన్ ప్రజలే కాదు, ఆ చుట్టుప్రక్కల ప్రజలందరూ మక్కా పట్ల గౌరవాదరాలు, భక్తిప్రపత్తులు ప్రదర్శించడాన్ని "అబ్రహా" చూశాడు. అందుకు కారణం మక్కాలో ఉన్న "కాబా". మక్కాయాత్ర కోసం ప్రజలు దూరప్రాంతాల నుంచి రావడాన్ని చూశాడు. కాబా మందిరం కారణంగా మక్కా పట్టణం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతూ పట్టణ ప్రజలకు యావత్తు అరేబియాలో మంచి పేరు ప్రతిష్ఠలతో పాటు, ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూర్చుతోంది. దీంతో అసూయ చెందిన అబ్రహా తన రాజధాని "సన్ఆ" నగరంలో కాబాను పోలిన ఓ మందిరం నిర్మించి, అరబ్బులను దానివైపు తిప్పుకోవాలని తలచాడు.

అరబ్బులు కాబా గృహం "హజ్" చేస్తున్నారని ఓర్వలేని అబ్రహా రాజు, ప్రజలను క్రైస్తవం పట్ల ఆకర్షితులయ్యేలా చేయడానికి, వారిని మక్కాకు దూరం అయ్యేలా చేయడానికి నిర్ణయించుకుని, యమన్ కు రాజధాని "సన్ఆ" నగరంలో ఒక అందమైన పెద్ద ఆరాధనాలయం (చర్చీ) నిర్మించాడు. అరబ్బులు కాబా గృహం హజ్ చేయకుండా ఈ చర్చీకి వచ్చి ఆరాధనలు చేయాలని తలచాడు.

మక్కాలోని కాబా గృహం చాలా సాధారణంగా ఉంటుంది. అబ్రహా రాజు "సన్ఆ"లో నిర్మించిన ఆరాధనాలయం అట్టహాసంగా, అనేక అలంకరణలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ, అబ్రహా రాజు అంత గొప్ప కట్టడాన్ని నిర్మించినప్పటికీ, ప్రజలను మక్కా నుంచి మరియు కాబా నుంచి దూరం చేసి, తను నిర్మించిన ఆరాధనాలయం వైపుకు తిప్పుకోవాలని ఎత్తుగడలు వేసిన అబ్రహా, అతను ఊహించినట్లు జరగలేదు.

వివిధ ప్రదేశాల ప్రజలే కాదు, స్వయంగా తన రాజ్య ప్రజలు కూడా మక్కా యాత్రకు వెళ్ళడం మానుకోలేదు. ప్రాచీన కాబాకు పోటీగా అబ్రహా రాజు కొత్త దైవగృహాన్ని నిర్మించాడని చెప్పుకుంటూ ప్రజలు అతని ప్రయత్నాల పట్ల నవ్వుకునేవారు. అదీగాక అరబ్బుల మతభావాలను రెచ్చగొడుతూ నూతన మందిర నిర్మాణం గురించి ఓ బహిరంగ ప్రకటన కూడా చేయించారు.

ఇంతలో, "బనూ కనానా" తెగకు చెందిన ఓ వ్యక్తికి, అబ్రహా రాజు ఎత్తుగడలు తెలిసి, ఓ రాత్రి చీకటి సమయాన ఆ ఆరాధనాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసే స్థలానికి అభిముఖంగా ఉన్న గోడ దగ్గర మలవిసర్జన చేశాడు.

ఈ విషయం తెలిసిన వెంటనే "అబ్రహా" అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. జరిగిన సంఘటనకు తీవ్రమైన కోపం ప్రదర్శించాడు. కాబా గృహం పట్ల ప్రజలకున్న అభిమానం వల్లనే, కాబా గృహం పట్ల ప్రజలకున్న గౌరవప్రపత్తుల కారణంగానే తాను నిర్మించిన ఆరాధనాలయం పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని అగ్రహొదగ్రుడయిన "అబ్రహా" భావించాడు.

కాబా పట్ల అబ్రాహాకు ఉన్న కోపం, ద్వేషం ఎక్కువయ్యాయి. తీవ్రమైన ప్రతీకారంతో, ఎలాగైనా కాబా గృహాన్ని నాశనం చేయాలని భావించాడు. కాబా గృహం పై దాడికి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చాడు. అబ్రహా రాజు, తన కోసం ఓ మంచి ఏనుగును కూడా ఎంచుకున్నాడు. తన పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని కాబా గృహాన్ని నేలమట్టం చేసే ఉద్దేశ్యంతో బయలుదేరాడు.

అరవై వేల మంది నీగ్రో యోధులతో కూడిన ఈ సైనికవాహిని నురుగులు కక్కుతూ ముందుకు సాగింది. కాల్బలం, అశ్వబలం, గజబలాలతో కాలనాగులా బుసలు కొడుతూ మక్కా దిశగా దూసుకొస్తోంది.

 *అబ్రహా సైన్యాన్ని అడ్డుకున్న కొన్ని చిన్న సైన్యాలు : -* 

అబ్రహా రాజు కాబా పట్ల విద్వేషం పెంచుకున్నప్పటికీ యమన్ ప్రజలు మాత్రం కాబా పట్ల గౌరవాదరాలు ప్రదర్శించారు. కాబాను కూలదోయాలన్న అబ్రహా ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. "తునాఫర్" అనే ఒక ధర్మపరాయణుడు ప్రజలను సమీకరించి అబ్రహా సైన్యంతో పోరాడాడు. కానీ బలమైన అబ్రహా సైన్యం ముందు వారు నిలవలేకపోయారు. ఇంకా కొన్ని తెగలు కూడా అబ్రహాను వ్యతిరేకించాయి. కాని వారెవ్వరూ అబ్రహాను నిలువరించలేకపోయారు. వారందరినీ అబ్రహాం ఓడించాడు. ఓడిపోయిన తెగలు, భారీ కప్పాలు చెల్లించి అబ్రహాకు లొంగిపోవలసి వచ్చింది.

ఇలా ఓడిపోయిన తెగలకు చెందిన వారిలో కొందరిని, అబ్రహా తన వెంట మక్కాకు రమ్మన్నాడు. మక్కాకు వెళ్లే సురక్షిత మార్గం చూపాలని ఆదేశించాడు. "అబూరిగాల్" అనే వ్యక్తి అబ్రహాకు, "ముగమ్మస్" ప్రాంతానికి దారి చూపాడు. ముగమ్మస్ ప్రదేశం తాయిఫ్, మక్కాలకు మధ్యన ఉంది.

ఆ ప్రదేశంలోనే అబ్రహా సైన్యం విడిది చేసింది. ఆ ప్రాంతమంతా సైనిక కోలాహలంతో మారుమోగిపోయింది. అక్కడ వందలాది గుడారాలు వెలిశాయి. అబ్రహా తనకోసం చేసిన ప్రత్యేక శిబిరంలో కూర్చొని ఆజ్ఞలు జారీచేయసాగాడు.

అక్కడి నుంచి అబ్రహా బలమైన దళాన్ని పంపి తిహామా, ఖురైష్ తెగల పశువులను, ఒంటెలను స్వాధీనపరుచుకుని తీసుకురమ్మన్నాడు. అబ్రహా సైన్యం ఆహార అవసరాలకు ఆ పశువులు కావాలి. అలా దోచుకువచ్చిన పశువుల్లో మక్కాలోని ఖురైష్ నాయకుడు అబ్దుల్ ముత్తలిబ్ కు చెందిన రెండువందల ఒంటెలు కూడా ఉన్నాయి. హజ్ యాత్రికులకు నీటి సరఫరా చేసే బాధ్యత కూడా ఆయన నిర్వహిస్తుంటారు.

మక్కా ప్రజలు అబ్రహాను పట్టణంలోకి రాకుండా అడ్డుకోవాలని సన్నాహాలు ప్రారంభించారు. ఒక సైన్యాన్ని సమకూర్చడం మొదలుపెట్టారు.కానీ, ఆ అబ్రహా సైన్యం చాలా పెద్దది అని తెలిసిన తరువాత, అంత భారీ సైన్యాన్ని నిలువరించడం తమ వల్ల కాదని మక్కా ప్రజలు గ్రహించారు.

అబ్రహా, తను కష్ట పడకుండా, తన సైనికుల రక్తం చిందకుండా ఖురైషీయులను మాటలతో బెదిరించి వారి కాబా మందిరాన్ని కూలగొట్టడానికి నిర్ణయించుకున్నాడు. అది ఫలించకపోతే యుధ్ధ జ్వాలలు రగిలించి, మక్కాను మట్టుపెడదామవి భావించాడు.

వెంటనే రాజు అబ్రహా, హనాతా హుమైరీ అనే సందేశహరుడ్ని పిలిచి ఇలా చెప్పాడు....,

అబ్రహా : - హుమైరీ! నువ్వు తక్షణమే మా ప్రత్యేక దూతగా మక్కా వెళ్ళి అక్కడి ప్రధాన నాయకుడ్ని కలుసుకో. అతనితో మా మాటలుగా ఇలా చెప్పు : "మేము మీ కాబా మందిరం పడగొట్టడానికి వచ్చాం. మమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోలేరు. మీ దగ్గర అంతటి సైనికశక్తి లేదు. ఒకవేళ మా మాటలు పెడచెవిన పెట్టి దుస్సహాసానికి ఒడిగడ్తే మీరు సర్వనాశనమవుతారు. మా ఉద్దేశ్యం కాబాను పడగొట్టడం మాత్రమే. మీరు మా దారికి అడ్డురాకపోతే మేము మక్కా ప్రజల ధన, మాన ప్రాణాలకు ఎలాంటి హాని కలిగించమని హామీ ఇస్తున్నాం."

ఈ మాటలు అబ్రహా మాటలుగా, కాబా సంరక్షకుడికి చెప్పమని, తన దూత హుమైరీకి ఇలా చెప్పి పంపించాడు రాజు అబ్రహా.

హుమైరీ ఈ ఉత్తర్వు తీసుకొని మక్కాకు బయలుదేరాడు.

 *మక్కాలోకి ప్రవేశించిన రాజదూత హుమైరీ : -* 

మక్కా ప్రజలు అబ్రహా సైన్యం వచ్చిందని విని ఇంతకు ముందునుంచే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు హుమైరీ పట్టణంలోకి ప్రవేశించడం చూసి, మక్కా ప్రజలు మరింత ఆందోళన పడసాగారు. 

హుమైరీ, ఖురైష్ నాయకుల నివాసం ఎక్కడ ఉంది అని అక్కడ ఉన్న ప్రజలను అడిగాడు. వారు హుమైరీని, అబ్దుల్ ముత్తలిబ్ వద్దకు తీసుకువెళ్ళారు. అపుడు హుమైరీ, అబ్దుల్ ముత్తలిబ్ తో....,

హుమైరీ : - నేను యమన్ రాజు అబ్రహా యొక్క ప్రత్యేక దూతగా వచ్చాను.

అబ్దుల్ ముత్తలిబ్, హుమైరీని సాదరంగా ఆహ్వానించారు.

అబ్దుల్ ముత్తలిబ్ : - రండి, కూర్చోండి.

హుమైరీ : - నేను మా రాజు అబ్రహా గారి దగ్గర నుంచి ఒక సందేశం తెచ్చాను.

అబ్దుల్ ముత్తలిబ్ : - ఆ సందేశం ఏమిటో చెప్పండి.

హుమైరీ : - మా రాజుగారు కాబా మందిరం పడగొట్టడానికి అరవై వేలమంది సైనికులతో వచ్చారు. మీరు మా సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోలేరు. మక్కా ప్రజల పట్ల మా రాజుకు ఎలాంటి ద్వేషం, విరోధం లేవు. వారితో పోరాడాలని కాని, వారికి హాని కలిగించాలని కాని ఆయన ఉద్దేశ్యం కాదు. కాబా గృహాన్ని పడగొట్టడానికి మాత్రమే ఆయన వచ్చారు. అందుచేత మీరు మా దారికి అడ్డురాకండి. మా దారికి అడ్డురామని మీరు మాటిస్తే మక్కా ప్రజల ధన, మాన ప్రాణాలకు నేను హామీ ఇవ్వగల్గుతాను.

అబ్దుల్ ముత్తలిబ్ : - మాకు మీ రాజును ఎదుర్కొనే శక్తి లేదు. ఎదుర్కోవడానికి ప్రయత్నించం కూడా. కానీ కాబా దేవుని ఆలయం. ఆయన తలచుకుంటే తన ఆలయాన్ని కాపాడుకుంటాడు. (అని నిర్భయంగా చెప్పారు)

హుమైరీ : - సరే, మీరు మా రాజుగారి దగ్గరికి రండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆయన ముందు చెప్పుకోండి.

అబ్దుల్‌ ముత్తలిబ్ తన సహచరులతో, కుటుంబసభ్యులతో కలిసి, రాజు అబ్రహా ను కలవడానికి రాజదూత హుమైరీ వెంట బయలుదేరారు.

 *అబ్రహా రాజు విడిది చేసిన ప్రదేశానికి చేరుకున్న అబ్దుల్ ముత్తలిబ్ : -* 

తన వద్దకు వస్తున్న అబ్దుల్ ముత్తలిబ్ ను చూసిన అబ్రహా రాజు, అబ్దుల్ ముత్తలిబ్ ముఖవర్చస్సు, ఠీవి, దర్పం, హుందాతనం, గాంభీర్యం చూసి ఎంతో ప్రభావితుడయ్యాడు. ఆ వెంటనే రాజు అబ్రహా, ఆసనం మీద నుండి లేచి అబ్దుల్ ముత్తలిబ్ కు ఎదురెళ్ళి, చాలా మర్యాదగా ఆహ్వానం పలికాడు. అంతేకాదు, అబ్దుల్ ముత్తలిబ్ ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అబ్దుల్ ముత్తలిబ్ ని ఆ విధంగా రాజు తన ప్రక్కన కూర్చుండబెట్టడం అత్యున్నత స్థాయి మర్యాదకు చిహ్నం.

అపుడు రాజు అబ్రహా, అబ్దుల్ ముత్తలిబ్ తో ఇలా సంభాషించారు....,

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment