7

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 7          Date : 17/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*జమ్ జమ్ నీటి వద్ద స్థిరపడ్డ జుర్హుమ్ తెగవారు* 

దూరదూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్చుకోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యెమన్‌ నుంచి వస్తున్న ఒక అరబ్బు తెగ ”జుర్హుమ్‌” (యెమన్‌ వాసులు నిజమైన అరబ్బులు అనబడుతారు. వారు మాట్లాడే అరబీ భాష చాలా ప్రామాణికమైనది.) దూరం నుంచి పక్షులు గుంపులుగా ఆ ప్రదేశం వైపునకు వెళ్ళడాన్ని గమనించారు. జుర్హుమ్ తెగ వారు విచారించడానికి కొందరిని ఆ పక్షులు వాలే ప్రదేశానికి పంపించారు. అక్కడికి వెళ్ళిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. నీటి వనరు ఉందని తెలిసాక ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ నిర్జన ప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతోషించారు. తనకు, తన కుమారునికి అల్లాహ్‌ పరిరక్షణ లభించిందనడానికి సూచనగా ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో అల్లాహ్‌ వారి పట్ల సాను భూతిని జనింపజేశాడు. ఆ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఇబ్రాహీమ్‌ (అలైహి) చేసిన ప్రార్థన ను అల్లహ్ ఆమోదించాడు.

ఆ ప్రదేశంలో జమ్‌జమ్‌ నీటి ఊట బయటపడినందువల్ల యెమన్‌ నుంచి అక్కడకు వచ్చిన జుర్హుమ్‌ తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడుకోవడానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతించారు. వారిని అతిథులుగా గౌరవించారు. వారిలో కొందరు తమ కుటుంబాలను అక్కడకు పిలిపించుకున్నారు. చాలా మంది ఆ ప్రదేశం (మక్కా) నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.

ఇబ్రాహీమ్‌ (అలైహి) జీవితం యావత్తు విశ్వప్రభువు పట్ల నిబద్ధతను, చెక్కు చెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉన్నవారు ఎన్నడూ నిరాశ చెందరు. అల్లాహ్‌ ఆదేశాలను ఎన్నడూ ప్రశ్నించరు. అల్లాహ్‌ ఎల్లప్పుడూ చెడుపై మంచికి విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇస్మాయీల్‌ (అలైహి) చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు అల్లాహ్‌ మరోసారి ఇబ్రాహీమ్‌ (అలైహి)ను కఠినమైన పరీక్షకు గురిచేశాడు. ఒక కల ద్వారా ఇబ్రాహీమ్‌ (అలైహి) తన ఏకైక కుమారుణ్ణి అల్లాహ్‌ కోసం జిబహ్‌ చేయాలని ఆదేశించడం జరిగింది.

(బైబిల్‌లో కూడా జిబహ్ గురించి ప్రస్తావన ఉంది. అబ్రహంకు అతని ఏకైక పుత్రుడు, ఇస్సాక్‌ను బలి ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని. కాని ఇస్సాక్‌ ఆయన ప్రథమ పుత్రుడు కాదు. ఇస్మాయీల్‌ (అలైహి) ఆయన జేష్ఠ పుత్రుడు. అంటే తన కొడుకును జిబహ్ చేయాలని ఆదేశం అందిన సమయంలో ఇబ్రహీం (అలైహి) కి ఉన్న ఏకైక పుత్రుడు ఇస్మాయీల్‌ (అలైహి) మాత్రమే. ఇస్సాక్‌ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు జన్మించారు. ఇస్మాయీల్‌ (ఆ అరబ్బు తెగల్లో కలిశారు. ఆయన సంతానంలో ప్రవక్త అరబీ (స) జన్మించారు. కాగా ఇస్సాక్‌ సంతానంలో ఇతర ప్రవక్తలు జన్మించారు. అందువల్లనే అరబ్బులు, ఇస్రాయీల్‌ (ప్రవక్త యాకూబ్‌ (అలైహి) గారి) సంతానం సోదరులని చెప్పడం జరుగుతుంది.)

ఇస్మాయీల్‌ (అ) ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుర్‌హుమ్‌ తెగవారి వద్ద ఆయన అరబీ భాషను నేర్చు కున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు. ఆయన చాలా ఆనందంగా జీవితాన్ని గడుపసాగారు. ఆయన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క దుఃఖకరమైన సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తనువు చాలించడం. ఇస్మాయీల్‌ (అలైహి)ను కంటికి రెప్పలా సాకిన హాజిరా మరణించిన సంఘటన ఆయన్ను విపరీతంగా కలచి వేసింది.

*ఇబ్రాహీమ్ (అలైహి) కోడళ్ల ప్రస్తావన* 

ఇబ్రాహీమ్‌ (అలైహి) అప్పుడప్పుడు వచ్చి కుమారుణ్ణి చూసి వెళ్ళేవారు. ఆ ఎడారిలో ఆయన కుమారుణ్ణి చూడడానికి అనేక రోజులు ప్రయాణం చేసి రావలసి వచ్చేది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయీల్‌ (అలైహి) ఇంట లేరు. (ఇబ్రాహీమ్ (అలైహి), ఇస్మాయిల్ (అలైహి) తండ్రి అని ఆమె కు తెలియదు). ఆయన భార్య ఇంట ఉండటంతో ఆమెతో ఇబ్రాహీమ్‌ (అలైహి) మాట్లాడారు. భర్త ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. అయితే ఆమె ఇబ్రాహీమ్ (అలైహి) చెప్పే విషయాలు ఏవీ వినకుండా తన భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది. తమ బీద స్థితి గురించి చెప్పుకొచ్చింది. వచ్చింది ఎవరని కూడా ఆమె అడగలేదు. కనీసం మంచి నీరు కూడా అందించలేదు. అసహనం నిండిన స్త్రీ ని ఇబ్రాహీమ్‌ (అలైహి) ఆమెలో చూశారు. అల్లాహ్‌ అనుగ్రహాలను గుర్తించే శక్తిలేని స్త్రీ ని చూశారు. ఇబ్రాహీమ్ (అలైహి) కనీసం తన ఒంటె నుంచి క్రిందికి కూడా దిగలేదు. చివరకు వెళ్తూ వెళ్తూ ఇబ్రాహీమ్ (అలైహి) తన కొడలితో , ”నీ భర్తను అడిగానని చెప్పు… ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మరచిపోవద్దని చెప్పు” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్‌ (అలైహి) ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగింది ఆయనకు చెప్పింది. వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నారని ఇస్మాయీల్‌ (అలైహి) ప్రశ్నించారు. ఆమె ఆ వ్యక్తి ఆకారాన్ని, పోలికలు ను వర్ణించింది. ఆ వచ్చింది తన తండ్రి అని ఇస్మాయిల్ (అలైహి) చెప్పారు. ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని వివరిస్తూ, సరిగా లేని ద్వారబంధం ఇంటికి తగినది కాదనీ, దాని వల్ల మనిషికి ఎదురు దెబ్బలు తగలడమే కాదు, గాయాలు కూడా అవుతాయనీ అన్నారు. అదే విధంగా ఆమె, ఇస్మాయిల్ (అలైహి) కు తగిన భార్య కాదని, ద్వారాబంధాన్ని ను మార్చమని ఇబ్రాహీమ్ (అలైహి) చెప్పిన మాటలకు అర్ధం.

కొంతకాలం తర్వాత ఇబ్రాహీమ్‌ (అలైహి) తన కుమారుణ్ణి చూడటానికి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా ఆయన కుమారుడు ఇంట లేరు. అయితే ఇంట మరో స్త్రీ ఉంది. ఆమె ఇస్మాయీల్‌ (అలైహి) మళ్ళీ పెళ్ళాడిన స్త్రీ. ఆయన ఒంటె దిగారు. ఆమె ఇబ్రాహీమ్ (అలైహి) కి నీరు అందించింది. భోజనం వడ్డించింది. ఆమెను ఆమె భర్త గురించి అడిగారు. తన భర్త వేటకు వెళ్ళారని ఆమె బదులిచ్చింది. ఆ కాలంలో ఎడారి జీవితం చాల కష్టంగా ఉండేది. ఆహారం కోసం వేటాడ్డానికి చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది.
ఆమె తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా కష్టపడి తమను పోషిస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తింది. అల్లాహ్‌ కు కృతజ్ఞతలు అర్పిస్తూ మాట్లాడింది. ఇబ్రాహీమ్‌ (అలైహి) చాలా సంతోషించారు. ఇస్మాయీల్‌ (అలైహి) కు తగిన భార్య లభించిందని ఆనందించారు. తాను ఎవరైనదీ ఆమెకు చెప్పలేదు. తాను ఒక స్నేహితుడిని అని మాత్రమే చెప్పారు. (ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఒక సందేశ రూపంలో అందించి ఆమెను ఆశ్చర్యపరచాలని భావించారు.) అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె చూపిన అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. ”నీ భర్త వచ్చిన తర్వాత నా సలాము చెప్పు. ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పు” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్‌ (అలైహి) ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జరిగింది వివరించారు. వచ్చిన అతిథి ఎలా ఉన్నారని ఇస్మాయీల్‌ (అలైహి) ప్రశ్నించారు. ఆమె వివరించిన తర్వాత ఇస్మాయీల్‌ (అలైహి) నవ్వుతూ, వచ్చినది తన తండ్రి అనీ, ఆయన నిన్ను నాకు తగిన భార్యగా అభివర్ణించారనీ, నీతో కలిసి ఉండాలని, నిన్ను కాపాడాలని కోరారని వివరించారు. ఇస్మాయీల్‌ (అలైహి) జీవితాంతం ఆమెతో కలిసి ఉన్నారు. ఆమె ద్వారా ఆయనకు సజ్జన సంతానం కలిగింది.

*కాబా నిర్మాణం* 

ఇబ్రహీమ్‌ (అ) తన కుమారుణ్ని చూసి చాలా కాలమయ్యింది. ఈసారి ఆయన ఒక అతి ముఖ్యమైన పని చేయవలసి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి ఆరాధనాలయాన్ని పునర్నిర్మించ వలసిందిగా అల్లాహ్‌ ఆయన్ను ఆజ్ఞాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధనాలయం ప్రాచీన కాలంలో ఉండేది.

ఇబ్రహీమ్‌ (అ) మక్కా లోయకు వచ్చారు. అక్కడ జమ్‌ జమ్‌ బావి వద్ద తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ) బాణాలకు పదును పెడుతుండటాన్ని చూశారు. తండ్రిని చూసి ఆయన అమితంగా సంతోషిం చారు. ఆయన హజ్రత్ ఇబ్రహీం (అలైహి)ని చూడగానే లేచి ఆయనకు ఎదురుగా వెళ్ళారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కౌగిలించుకొని పరస్పరం యోగక్షేమాలు విచారించి తెలుసుకున్నారు.

ఆ సందర్భంలో ఇబ్రహీం (అలైహి) మాట్లాడుతూ “ఇస్మాయిల్ ! అల్లాహ్ నాకు ఒక విషయం గురించి ఆదేశించాడు” అని అన్నారు.

హజ్రత్ ఇస్మాయిల్ (అలైహి) ఈ మాట విని “మంచిది" అల్లాహ్ ఏ పని గురించి ఆదేశించాడో ఆ పని చేయండి” అన్నారు.

“మరి ఈ పనిలో నువ్వేమైనా నాకు సహాయపడగలవా?” అని అడిగారు హజ్రత్ ఇబ్రహీం (అలైహి).

“తప్పకుండా సహాయపడ్తాను” అన్నారు హజ్రత్ ఇస్మాయిల్ (అలైహి).

“ఈ ప్రదేశంలో ఒక కాబా గృహాన్ని నిర్మించమని అల్లాహ్ నన్ను ఆదేశించాడు” అని చెప్పారు.హజ్రత్ ఇబ్రాహీం (అలైహి) ఓ ఎత్తయిన ప్రదేశం వైపు చూపిస్తూ.

ఇస్మాయీల్‌ (అ) ఎల్లప్పుడూ తన ప్రభువు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇరువురు కలసి కాబా గృహం పునాదులు తవ్వసాగారు. ఈ పని చేస్తున్నప్పుడు వారి నోట క్రింది పదాలు వారి హృదయాల్లోని భావాలను వ్యక్తం చేస్తూ వెలువడసాగాయి.

”ఓ ప్రభూ! మా ఇద్దర్ని ముస్లింలుగా చేయి. మా సంతానం ను, మా సంతానం యొక్క సంతానం ను, వారి సంతానం ను మొత్తం గా ముస్లిం జాతిని ఉద్భవింపజేయి. మా ప్రయత్నాల ఫలితాలను మాకు చూపించు. మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. నీవే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి. అనంత కరుణామయుడివి”.

ఇస్మాయీల్‌ (అ) రాళ్ళను మోసుకుని వస్తుంటే ఇబ్రాహీమ్‌ (అ) వాటిని అమర్చ సాగారు. కొంతకాలానికే నిర్మాణం రూపు రేఖలు దిద్దుకుంది. తమకు సహాయంగా ఎవరినీ వారు తీసుకోలేదు. గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్ళు పేర్చడానికి ఇబ్రాహీమ్‌ (అ)ఏదైనా ఎత్తు వేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయీల్‌ (అ)తో ఏదైనా మంచి రాయి, తాను నిలబడటానికి చూడమని చెప్పారు. ఇస్మాయీల్‌ (అ) ఒక పెద్ద రాయిని అక్కడికి దొర్లించారు. (ఈ రాయి వేలాది సంవత్స రాలుగా పరిరక్షించబడుతున్నది. నేడు ‘మఖామె ఇబ్రాహీమ్‌’ అన్న పేరుతో గాజు పలకల మధ్య ఉన్న రాయి ఇదే.) ఆ విధంగా కాబా గృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించ బడినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్త ముస్లింలకు (దైవ విధేయులకు) పవిత్ర గృహంగా అలరారుతోంది. విశ్వప్రభువైన అల్లాహ్‌ పట్ల తమ కృతజ్ఞతలను ముస్లింలు ఇక్కడికొచ్చి తెలియజేస్తుంటారు.

ఖురాన్ గ్రంథం లో ఇస్మాయిల్ (అలైహి) గురించి ప్రస్థావించదు. అతను మంచి వాగ్దానాపాలకుడు. సందేశహరుడైన దైవ ప్రవక్త. తన కుటుంబసభ్యులకు నమాజ్, జకాత్ గురించి అజ్ఞాపిస్తుండేవాడు. అతను తన ప్రభువు దృష్టి లో ఆమోదయోగ్యుడైన మనిషి.

ఇంతటితో ఇబ్రహీం అలైహిస్సలామ్ గారి జీవిత చరిత్ర ముగిసింది. ఇక ఆ తర్వాత ఇబ్రహీం అలైహిస్సలామ్ గారి కాలం లొనే ఉన్న మరో ప్రవక్త లూత్ అలైహిస్సలామ్ గురించి Insha Allah రేపటి ( భాగము - 8 ) నుంచి తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment