95

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 95*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 10* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

అసామాన్య తేజస్సుతో వెలిగిపోతున్న తన కుమారుడు ముహమ్మద్ (సల్లం) ని చూసి ఆమినా అమితానందంతో పొంగిపోయారు. "ఈ సమయంలో నా భర్త అబ్దుల్లాహ్ కూడా ఉంటే ఎంతో బావుండేది!!" అని బాధపడ్డారు.

బాబు ముఖంలో ఆమినాకు, ఒంటెక్కి తన వైపు కడసారిగా చూస్తున్న భర్త ఛాయలు కనిపించాయి. "తన కొడుకును చూసుకొని ఆయన ఎంత మురిసిపోతారో!" అని ఊహించుకోసాగింది.

"ఆయన సిరియా నుంచి ఎప్పుడు తిరిగొస్తారో....,"

కాని, అబ్దుల్లాహ్ ఇక రాలేడని, కానరానిలోకాలకు శాశ్వతంగా వెళ్ళిపోయాడని తెలుసుకునేందుకు ఆమినాకు ఎక్కువ సమయం పట్టలేదు.

 *అబ్దుల్లాహ్ మరణం : -* 

"అసలు వ్యాపారం కోసం పొతే సిరియాలో ఆయన ఎన్నాళ్ళు ఉంటారో! ఆయన్ని చూడడానికి నేనే సిరియా బయలుదేరితే! వాడిగా నడిచే ఒంటెను ఎక్కి వెళితే మక్కా నుంచి ప్రయాణం ఎన్ని రోజులు పడుతుంది!"  ఇలా ఆమినా, తన మనసులో పరిపరివిధాలా ఆలోచించుకుంటూ భర్త రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూడసాగారు.

భర్త రాక గురించి సిరియా నుంచి వచ్చే ప్రతి వాణిజ్య బృందాన్ని ఆమె అడగడం ప్రారంభించారు. “ఎవరు అబ్దుల్ ముత్తలిబ్ కొడుకు అబ్దుల్లాహ్ నా? అతడ్ని ఫలానా కొండ ప్రాంతం గుండా తోటి వర్తకులతో కలసి పోతుంటే చూశాం! అని కొందరు...., “ఫలానా చోట విడిది చేసి ఒంటెలకు మేత వేస్తుంటే చూశాం” అని మరికొందరు...., “ఆయన్ని ఫలానా ఊళ్ళో ఒంటె మీదెక్కి పోతుంటే చూశాం" అని ఇంకొందరు....

“అంతేనా! సిరియా నుంచి తిరిగివస్తుంటే ఎవరూ చూడలేదా?” అని ఆమినా తనలో తానే అనుకోని కాస్తంత నిరుత్సాహపడ్డారు.

"ఏమైనప్పటికి మా ఆయన ఈ పాటికి సిరియా నుంచి బయలుదేరి ఉండవచ్చు. ఎరుపు ఒంటెపై రాజదర్పంతో హుందాగా కూర్చుని భుజానికి నేను స్వహస్తాలతో కట్టిచ్చిన నీటి తిత్తితో ఆయన ఎప్పుడో అకస్మాత్తుగా వస్తారు! ఔనౌను, ఆయన అకస్మాత్తుగా వచ్చి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఖర్జూరపు చెట్ల మధ్య నుంచి పున్నమి చంద్రుడిలా ప్రకాశిస్తూ ప్రత్యక్షమవుతారు. బంధుమిత్రులు ఎదురెళ్ళి ఆయనకు ఘన స్వాగతం చెపుతారు." ఈ విధంగా ఆమినా ఆలోచనలలో రోజులు, వారాలు, నెలలు గడచిపోతున్నాయి. కానీ అబ్దుల్లాహ్ ఇంకా రాలేదు.

కొడుకు రాక విషయమై అబ్దుల్ ముత్తలిబ్ కూడా కొంచెం ఆందోళన పడసాగారు. ఓ రోజు సాయంత్రం మదీనా నుంచి ఓ వాణిజ్యబృందం వచ్చిందని తెలిసింది. వర్తకులు, సుదీర్ఘ ప్రయాణం చేసినందువల్ల బాగా అలసిపోయారు. అందుచేత తెల్లవారగానే వచ్చి అబ్దుల్ ముత్తలిబ్ కు అబ్దుల్లాహ్ గురించి సమాచారం అందజేయాలని అనుకున్నారు. కాని అబ్దుల్ ముత్తలిబ్ కు అప్పటిదాకా ఆగే ఓపిక లేదు. స్వయంగా తానే వాళ్ళను కలుసుకుని కనుక్కుందాం అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరారు.

వర్తకులు అబ్దుల్ ముత్తలిబ్ ని చూడగానే, అబ్దుల్లాహ్ గురించి అడగడానికే వస్తున్నారని ఆయన ఉద్దేశం గ్రహించారు. మాటామంతీ అయింది. ఆ తర్వాత కొడుకు విషయం తెలియజేశారు. 

"అబ్దుల్లాహ్ సిరియా నుంచి మదీనా వచ్చి ఆగాడు. మేము మదీనా నుంచి బయలుదేరినప్పుడు అతను జ్వరంతో ఉన్నాడు." అని ఆ వ్యాపారస్తులు తెలియజేశారు.

ఈ మాట విని అబ్దుల్ ముత్తలిబ్ మరింత ఆందోళన చెందారు. "అబ్దుల్లాహ్ కు ఆరోగ్యం బాగోలేదు అన్న ఈ సంగతి వింటే ఆమినా మరింత దిగులు చెందుతుంది" అని అబ్దుల్ ముత్తలిబ్ విచారం పైకి కనబడనీయకుండా లోలోన అణచి ఉంచారు. అపుడు అబ్దుల్ ముత్తలిబ్ ఇంటికి వెళ్ళి, తన కోడలికి విషయం తెలియజేస్తూ....,

అబ్దుల్ ముత్తలిబ్ : - అమ్మాయ్ ఆమినా! మన అబ్దుల్లాహ్ సిరియా నుంచి మదీనా వచ్చి ఉన్నాడటమ్మా! అబ్దుల్లాహ్ కు ఆరోగ్యం కాస్త బాగలేదంట.

ఆమినా : - ఏమిటీ! ఆయన అనారోగ్యంతో ఉన్నారా? (అని అడిగింది కాస్తంత కంగారు పడుతూ)

అబ్దుల్ ముత్తలిబ్ : - సుదీర్ఘమైన ఎడారి ప్రయాణం కదా, ఒళ్ళు కదిలి కాస్త జ్వరం వచ్చి ఉంటుంది. మన బంధువుల ఇంట్లో బస చేసాడట. వాళ్ళు అన్ని విధాలా అబ్దుల్లాహ్ కి సేవలు చేస్తూ ఉండవచ్చు. రేపే నేను మదీనాకు హారీస్ ని పంపిస్తాను. అతను వెళ్ళి అబ్దుల్లాహ్ ను తీసుకొస్తాడు. నువ్వేమి కంగారు పడకు.

"ఆయనకి జ్వరం వచ్చిందా! మదీనాలో ఆగిపోయారా!! ఓహ్ దైవమా! ఏమిటీ ఈ అగ్ని పరీక్ష!” ఆమినా హృదయం బాధగా మూలిగింది. ఆమినా చుట్టూ విచార మేఘాలు ఆవరించాయి. మనసు కకావికలమై పోయింది. ఒక్కోసారి భయంకరమైన ఆలోచనలు వచ్చేవి. అంతలోనే అనిర్వచనీయమైన ఆశాకిరణంతో ఆమె కళ్ళు మెరిసిపోయేవి. కాని ఆ మెరుపు ఎంతోసేపు ఉండేది కాదు. మేఘమాలికల మధ్య కలువరేడు పరుగిడుతున్నపుడు కనిపించే జిలుగువెలుగుల్లా మారిపోయేది వాతావరణం.

"అమ్మా! ఇలాంటి స్థితిలో అంత విచారంగా ఉండకూడదు. పైగా మీరు ఇప్పుడు బాలింత. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోకండి. మీ ఆయన నిండు ఆరోగ్యంతో తిరిగొస్తారు." అని అన్నది ఆమినా సేవకురాలు, ఆమినా పడుతున్న ఆవేదన చూసి.

అబ్దుల్ ముత్తలిబ్ ఏదో పని ఉండి బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు తమ తమ పనుల్లో మునిగిపోయారు. కాని ఆమినా మనసు మదీనాలో ఉండిపోయింది. మాటిమాటికి అవే ఆలోచనలు! కళ్ళ ముందు గాలికి రెపరెపలాడుతున్న ఆశాదీపం!

"అబ్దుల్లాహ్ తిరిగి వచ్చినట్టు, తన కొడుకును చూసుకుని అబ్దుల్లాహ్ మురిసిపోయినట్టు...." ఈ విధమైన ఆలోచనల్లో ఆమినా మునిగిపోయింది. ఇంట్లో ఏదో అలికిడి అయినందువల్ల, ఆమినా ఆలోచనచాయని తెగిపోయింద

ఒక్కసారిగా మళ్ళీ అంధకారం అలుముకుంది. వికసించిన పూలన్నీ ముడుచుకుపోయాయి. తన ముందు ఆయన లేరు. ఆయన నీడ కూడా లేదు. ఆమినా మనస్సు మరోసారి మూగగా రోధించింది. శరీరం ఢీలా పడిపోయింది. ఊహలు నీరుగారిపోయాయి.

అయినా కూడా ఆమినా ఆశాజీవి. ఆ ఆశతోనే ఆమె కళ్ళు అలసిపోకుండా అబ్దుల్లాహ్ కోసం అనుక్షణం నిరీక్షిస్తూ ఉన్నాయి. “ఆయన వస్తారు. తప్పక వస్తారు. బహుశా పట్టణ శివార్లలోకి వచ్చేసి ఉంటారు." మళ్ళీ ఇవే ఆలోచనలు.

ఇంతలో....,“అమ్మా ఆమినా....!” అనే ఈ పిలుపుతో ఆమినా వెనక్కి తిరిగి చూశారు. “మదీనా నుంచి వర్తక బిడారం వచ్చిందట. మీ మామగారు వర్తకుల్ని కలుసుకుని వస్తున్నారు” అన్నది ఓ నడికారు మహిళ.

ఈ విషయం విని ఆమినా గుండెలు క్షణం పాటు దడదడలాడాయి. అంతలో అబ్దుల్ ముత్తలిబ్ కాళ్ళుఈడ్చుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. అబ్దుల్ ముత్తలిబ్ ముఖం బాగా వాడిపోయింది. తన నుదుటిపై నుంచి చెమట చుక్కలు రాలుతున్నాయి. అబ్దుల్ ముత్తలిబ్ తలవెంట్రుకలు చిందరవందరగా పడివున్నాయి. ఆయన తలపాగా సగం జారి మెడ మీద వ్రేలాడుతుంది. “అమ్మా... ఆమినా.....!” అని చెప్పి, ఆ తరువాత ఆయన చెప్పలేకపోయారు.

ఆమినా : - ఏమిటి మామయ్యా! ఏమయింది? ఆయన ఎక్కడ? (అని కంగారుగా అడిగింది, వేగంగా కొట్టుకుంటున్న తన గుండెతో)

అబ్దుల్ ముత్తలిబ్ : - ఆమినా ....! అబ్దుల్లాహ్ మనకిక లేడమ్మా....!! నీ కొడుకు ముహమ్మద్ అనాధ అయ్యాడు తల్లీ....!! (అంటూ అబ్దుల్ ముత్తలిబ్ భోరున విలపించారు.)

ఆమినాకు, తన కాళ్ళ కింద భూమి చీలినట్లయింది! ఒక్కసారిగా ప్రపంచమంతా అంధకారం అయినట్లు, ఆకాశం ఫెళ ఫెళా విరిగిపడినట్లు.... ఒక్కసారిగా ఆమినా కంపించిపోయింది. తన సర్వసాన్ని కోల్పోయింది.

తన కొడుకును కళ్ళారా చూసుకోకుండానే, కడచూపు జ్ఞాపకంతో తన భార్యను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు అబ్దుల్లాహ్.

అయిపోయింది.... అంతా అయిపోయింది.... మనసే ముక్కచెక్కలయి పోయింది.... మనుగడకే అర్థం లేకుండా పోయింది.

ఆమినా హృదయవిదారకంతో వెక్కిళ్ళతో వెక్కి వెక్కి విలపించారు. ఆమె కళ్ళు సెలయేరులై పారసాగాయి. ఇరుగుపొరుగు మహిళలు వచ్చి ఆమెను ఓదార్చడానికి వృధా ప్రయాసపడసాగారు. కొందరైతే ఆమెను ఓదార్చడానికి వచ్చి, స్వయంగా తామే కంటతడి పెట్టుకున్నారు. ఆ శోకంలో మునిగిపోయిన ఆమినాను చూసి, ఆమె స్నేహితురాళ్ళు మరింత చలించిపోయారు.

“అబ్దుల్లాహ్! ఆమినాను ఒంటరిదాన్ని చేసి పోయావా! నీ ముసలితండ్రిని చూడు ఎలా కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నాడో! ఇక కాబా యాత్రికులకు నీలాగా ఎవరు ఆతిథ్యమిస్తారయ్యా! అయ్యయ్యో! నీ కొడుకును ఒక్కసారైనా చూసుకోలేక పోయావే!!” అని, ఈ వెక్కిళ్ళ ఏడ్పులతో అబ్దుల్ ముత్తలిబ్ ఇల్లు ప్రతిధ్వనించసాగింది.

మక్కా చంద్రుడు మదీనాలో అస్తమించాడు. ఆమినా హృదయ వీణ శాశ్వతంగా మూగబోయింది.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment