84

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 84* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

 *అరబ్బుల నైతిక విలువలు* 

అజ్ఞాన కాలపు అరబ్బుల్లో నీచపు అలవాట్లు, భ్రష్టుభావాలు, అవివేకం మరియు స్థిరబుద్ధికి భిన్నమైన చేష్టలు ఉండివుండడం నిర్వివాదాంశం. అయితే వారిలో కొన్ని నైతిక విలువలు కూడా ఉండేవి. వాటిని గమనించిన ఏ వ్యక్తి అయినా ముక్కు పై వ్రేలు వేసుకోకమానడు. ఉదాహరణకు కొన్ని....,

 *1.దాతృత్వం : -* ఈ సుగుణం అజ్ఞాన అరబ్బులందరిలోనూ కానవచ్చేది. ఈ ద్రాతృత్వ గుణంలో ఒకరికంటే మరొకరు మించిపోయే ప్రయత్నం చేసేవారు. అరేబియా కవన సాహిత్యంలోని సగానికిపైగా పద్యపాదాలు ఈ దాతృత్వంతో నిండిపోయినందుకు వారు గర్వించేవారు. ఈ ద్రాతృత్వం పునాదులపైనే ఒకరు తన గురించి గొప్పలు చెప్పుకుంటే, మరొకడు ఇంకొకరి దాతృత్వాన్ని శ్లాఘించేవాడు. తీవ్రమైన చలి, పస్తుల కాలంలో ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ఆ గడ్డుకాలంలోనూ దాతృత్వపు భావన పెల్లుబికి ఆ ఇంటి యజమాని, తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఏకైక పెంటి ఒంటెను జిబహ్ చేసి ఆతిథ్యమిచ్చేవాడు. ఈ ఔదార్యం ఫలితంగానే వారు పెద్ద పెద్ద రక్తపరిహారాలను, జరిమానాలను, ఆర్థిక భారాలను నెత్తికేసుకునేవారు. ఇలా ప్రజలను వినాశనం, రక్తపాతం నుండి రక్షించి ఇతర ధనవంతులు, సర్దారులను తలదన్నినట్లుగా గర్వించేవారు.

      ఈ ఔదార్య భావన ఫలితంగానే వారు మద్యపానంపై విర్రవీగేవారు. మద్యపానం గర్వించదగిన విషయం కాదు అని వారికి తెలిసినా, అది ఔదార్యాన్ని, దాతృత్వాన్ని సులభతరం చేస్తుందని వారి నమ్మకం. ఎందుకంటే నిషా మత్తులో సంపదను నీళ్ళప్రాయంగా దానమివ్వడం మనిషికి అంత కష్టంగా అనిపించకపోవడమే. కాబట్టి వీరు ద్రాక్ష చెట్టును ఔదార్యంగాను, ద్రాక్ష సారాయిని "బిన్తుల్ కరమ్" (ఔదార్యజనితం) గాను భావించేవారు. అజ్ఞాన కాలపు కవనాల్లో ఈ ఔదార్యగుణం, పొగడ్త, స్వోత్కర్ష, ఔన్నత్యాన్ని చాటే ఓ అధ్యాయంగా కనపడుతుంది.

వారు జూదమూ ఆడేవారు. ఇదీ ఆ ఔదార్యగుణ ఫలితమే. అది కూడా దానధర్మాలు చేసే ఓ మార్గమని తలచేవారు. జూదమాడే వారికి వచ్చిన లాభం నుండి మిగిలినదంతా నిరుపేదలకు పంచి పెట్టడం జరిగేది. అందుకే దివ్యఖుర్ఆన్, సారాయి, జూదపు ప్రయోజనాన్ని నిరాకరించకుండా ఇలా సెలవిచ్చింది.

 *"ఈ రెంటి పాపం వాటి నుండి వచ్చే లాభం కంటే అధికం" (2-219)* 



 *2.మాటకు కట్టుబడి ఉండడం : -* ఇది కూడా అజ్ఞాన కాలపు అరబ్బుల్లోని నైతిక సుగుణాల్లో ఒకటి. ప్రమాణం అంటే వారి దృష్టిలో ధర్మం లాంటిది. సంతతం దానికి కట్టుబడి ఉండేవారు. ఈ మార్గంలో తమ సంతానం యొక్క ప్రాణాలు పోయినా, ఇల్లు గుల్లయిపోయినా వారికి తక్కువే. దీన్ని అర్థం చేసుకోవాలంటే, హానీ బిన్ మస్ ఊద్ షైబానీ, సమూఆయిల్ బిన్ ఆద్ లేదా హాజిబ్ బిన్ జరారహ్ సంఘటనలు చాలు.

 *3.ఆత్మాభిమానం : -* ఆత్మాభిమానై ఉండడం, దౌర్జన్యం, పీడనను సహించకపోవడం కూడా అజ్ఞానపు నైతిక విలువల్లో ఒకటి. దీని కారణంగా వారిలో శౌర్యం, ఆత్మాభిమానం హద్దుమీరిపోయి ఉండేది. వెంటనే రోషపూరితులయ్యేవారు. అవమానకరమని అనిపించిన చిన్న చిన్న విషయాల్లో సయితం కత్తులు దూసి నిలబడేవారు. రక్తపాతం కూడా జరిగేది. ఈ మార్గంలో వారికి ప్రాణం అంటే లెక్కే ఉండేది కాదు.

 *4.సంకల్ప సాధన : -* అజ్ఞాన అరబ్బులు ఓ పనిని గౌరవప్రదమైనది, కీర్తిదాయిని అని అనుకుంటే దాన్ని సాధించడానికి తమ ప్రాణాలను సయితం పణంగా పెట్టి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసేవారు. అది కూడా వారిలోని ఓ ప్రత్యేకత.

 *5.సహనం, సంయమనం : -* ఇది కూడా అజ్ఞాన అరబ్బుల్లో ఉండిన శ్లాఘనీయ ప్రత్యేకత. అయితే ఇది వారి మితిమీరిన శౌర్యపరాక్రమాలు మరియు ఎల్లవేళలా యుద్దాలలో పాల్గొనడం వల్ల బయటకు కానవచ్చేది కావు.

 *6.ఎడారి దేశదిమ్మరుల నిరాడంబరత : -* అంటే నాగరికత, కల్మషాలు, ఎత్తుగడలు తెలియకపోవడం. దీని ఫలితంగా వారిలో సత్యం, నీతి, నిజాయితి చోటుచేసుకుని ఉండడం. మోసం, దగా, మాటను జవదాటడం అంటే అసహ్యించుకునేవారు.

 _అరేబియా ద్వీపానికి మిగతా ప్రపంచంతోగల భౌగోళిక సంబంధ బాంధవ్యాలే కాకుండా అరబ్బుల్లోని ఈ నైతిక విలువల కారణంగానే మానవాళి నాయకత్వానికి మరియు దైవదౌత్య భారం మోయడానికే ఈ జాతిని ఎన్నుకోవడం జరిగింది అని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ నైతిక విలువలు కొన్ని సందర్భాల్లో కల్లోలాన్ని, అశాంతిని రేకెత్తించడానికి కారణభూతమై అప్పుడప్పుడు భయంకర సంఘటనలు కూడా చోటుచేసుకునేవి. అయితే స్వతహాగా ఇవి చాలా అమూల్యమైన నైతిక విలువలు. కొంత సంస్కరణతో మానవ సమాజానికి ప్రయోజనకరమైనవిగా మారడానికి ఆస్కారముంది. ఈ కార్యాన్నే ఇస్లాం ధర్మం నిర్వహించగలిగింది._ 

 _బహుశా ఈ నైతికతల్లో మాటకు కట్టుబడి ఉండడం అనే సుగుణం తర్వాత ఆత్మాభిమానం, దాని దృఢత్వం; సంకల్పసాధన అతి విలువైనవి, ప్రయోజనకరమైనవి. కారణం, ఈ ప్రచండ శక్తి, సంకల్పశుద్ధి, సంకల్పసాధన లేకుండా అరాచకాన్ని, కల్లోలాన్ని అంతమొందించి న్యాయవ్యవస్థను పునరుద్ధరించడం సాధ్యం కాకపోయేది._ 

 _అజ్ఞాన అరబ్బుల్లో మరికొన్ని సుగుణాలు కూడా ఉండేవి కాని వాటిని వివరించడం ఇక్కడ అనవసరం._ 

 *ఇంతటితో అజ్ఞానకాలపు అరబ్బుల జీవనవిధానం అయిపోయింది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి జీవిత చరిత్రలోకి అడుగుపెడదాం.* 

 *ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వంశావళి : -* 

దైవప్రవక్త (స) వంశావళిని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం, చరిత్రకారులు, వంశజ్ఞులు అందరూ ఏకీభవించిన భాగం. ఈ వంశావళి "అద్ నాన్" వరకు వెళ్ళి ఆగిపోతుంది. రెండవ భాగం గురించి చరిత్రకారుల మధ్య అభిప్రాయభేదం ఉంది. కొందరు దీనిని ఒప్పుకుంటారు, కొందరు నిరాకరిస్తారు. ఈ వంశావళి "అద్ నాన్" పైన "హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)" వరకూ వెళ్ళి ఆగుతుంది. ఇక మూడవ భాగం. ఇందులో కొన్ని తప్పులు దొర్లాయి. ఈ వంశావళి "హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)" నుండి పైకి హజ్రత్ "ఆదం (అలైహి)" వరకూ వెళ్ళి ఆగుతుంది. వెనుకటి పుటల్లో ఈ విషయాన్ని చూచాయగా చెప్పుకోవడం జరిగింది. మనకు ఇప్పుడు సమయం లేనందువల్ల ఈ మూడు భాగాల గురించి తెలుసుకోవడం కంటే దైవప్రవక్త (స) గారి ముత్తాత హాషిమ్ నుంచి తెలుసుకుందాము.

 *● ముహమ్మద్ (స.అ.వసల్లం) తండ్రి అబ్దుల్లాహ్.* 

 *● అబ్దుల్లాహ్ తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ (షైబా).* 

 *● అబ్దుల్ ముత్తలిబ్ తండ్రి హాషిమ్ (అమ్రూ).* 

 *● హాషిమ్ తండ్రి అబ్దె మునాఫ్ (ముగీరా).* 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి జీవిత చరిత్రలో భాగంగా, ఆయన ముత్తాత హాషిమ్ బిన్ అబ్దె మునాఫ్ నుంచి తెలుసుకుందాము.

Insha Allah రేపటి భాగము - 85 లో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చనిపోయిన రోజు గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత భాగము - 86 నుండి ఆయన (స) జీవిత చరిత్రను మొదలుపెడదాం.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆      
                (rafeeq)

☆☆      Salman       +919700067779   ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment