103

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 103*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 18* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *హిల్ ఫుల్ ఫుజూల్ ఒప్పందం* 

ఓ రోజు జుబైద్ పట్టణం నుంచి ఒక వ్యాపారి ఒంటె మీద సరుకులు తీసుకుని మక్కా నగరానికి వచ్చాడు. మక్కా మార్కెట్ లో ఒకచోట ఆ వ్యాపారి సరుకులు దించుకుని వ్యాపారం ప్రారంభించాడు. అప్పుడు "ఆస్ బిన్ వాయిల్" అనే నగరవాసి ఒకతను వచ్చి ఆ సరుకుల్ని కొనుగోలు చేశాడు. అయితే పైకం ఎల్లుండి ఇస్తానని చెప్పాడు.

వ్యాపారి : - పర్వాలేదు. అలాగే ఇవ్వండి. కాని మాట తప్పకూడదు సుమా!

ఆస్ బిన్ వాయిల్ : - మాట తప్పడం మా జాతిలోనే లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. పైకం మొత్తం ఎల్లుండి సాయంత్రానికల్లా మీ చేతుల్లో పెడతాను.

కాని మూడో రోజు నిర్ణీత సమయం దాటిపోయినా, ఆస్ బిన్ వాయిల్ మార్కెట్ వైపు తిరిగి చూడలేదు. దాంతో ఆ వ్యాపారి ఆన్ బిన్ వాయిల్ ఇంటికి వెళ్ళి పైకం అడిగాడు.

ఆస్ బిన్ వాయిల్ : - పైకం కొంచెం తక్కువ పడింది. రెండు రోజుల్లో మీ పైకం మొత్తం సర్దేస్తాను, మీరేమి కంగారు పడకండి.

వ్యాపారి రెండు రోజుల తరువాత మళ్ళీ అతనింటికి వెళ్ళి అడిగాడు. 

ఆస్ బిన్ వాయిల్ : - ఏమిటి! నీకు నేను డబ్బు ఇవ్వాలా! ఎందుకూ? (అన్నాడు ఆన్ నిర్లక్ష్యంగా)

వ్యాపారి : - ఎందుకేమిటి, మీరు నా దగ్గర సరుకులు కొని రెండు రోజుల తరువాత డబ్బిస్తానని చెప్పి ఇప్పుడిలా అంటారేమిటి? (అన్నాడు నిర్ఘాంతపోయి చూస్తూ)

ఆస్ బిన్ వాయిల్ : - భలే వాడివిలే, వెళ్ళు వెళ్ళు, నేను నీ దగ్గర ఎలాంటి సరుకు కొనలేదు.

వ్యాపారి : - అయ్యో ! ఏమిటి ఈ అన్యాయం?”.

ఆస్ బిన్ వాయిల్ : - అన్యాయం లేదు గిన్యాయం లేదు వెళ్ళవయ్యా! అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు వెళ్ళు. (అన్నాడు దబాయింపు ధోరణిలో)

వ్యాపారి : - అయ్యా! మీ వాగ్దానం ఏమైంది? పరదేశిని, పేద వ్యాపారిని దోచుకోవడం మీకు భావ్యమేనా! (అన్నాడు ఏడుపు ముఖంతో)

ఆస్ బిన్ వాయిల్ : - తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటావా, రక్తపు మడుగులో పడి గిలగిల కొట్టుకుంటావు. (అన్నాడు, ఆ వ్యాపారి వైపు ఉరిమి చూస్తూ)

పాపం వ్యాపారి నోరుముసుకొని వెళ్ళిపోయాడు బిక్కమొహం వేసుకొని. 

“ఇప్పుడు నా గతేమిటీ? ఎక్కడికి పోవాలి? ఎవరు సహాయం చేస్తారు?” అనుకుంటూ అతను కొందరు ఖురైష్‌ నాయకుల దగ్గరికెళ్ళి తన గోడు వెలబోసుకున్నాడు. కాని వారిలో ఒక్కడూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

విదేశస్థుడైన పేద వ్యాపారి పూర్తిగా నిరాశచెందాడు. అమ్ముకోవడానికి తెచ్చుకున్న సరుకును ఆస్ దోచుకున్నాడు. నగరనాయకులకు తన అసహాయ స్థితి పట్ల చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పుడు తన గతేమిటీ? ఇలా విచారిస్తూ అతను మక్కాలోని ఓ కొండగుట్టపై ఎక్కి అరబ్ సంప్రదాయం ప్రకారం చొక్కా చించుకొని గావుకేకలు పెట్ట నారంభించాడు.

“ఖురైషీయులారా! బనూ హాషిం వంశస్థులారా! అబ్దుల్ ముత్తలిబ్ సంతానమా!! నాకు అన్యాయం జరిగింది. ఆస్ బిన్ వాయిల్ నా వ్యాపార సామాగ్రి దోచుకున్నారు. ఈ అన్యాయం అరికట్టండి. నాకు సహాయం చేయండి.” (అని అరిచాడు)

ఖురైషీయులు ఈ కేకలు విని అటువైపు చూశారు. కాని ఆస్ పేరు వినగానే అతనికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి వెనుకంజ వేశారు. ఆ పీడుతుడ్ని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.

“ఖురైష్ నాయకులారా! కాబా ధర్మకర్తలారా!! మీ న్యాయ దృక్పథం ఏమయింది? మీ పౌరుషం ఎక్కడ మంట కలిసిపోయింది? ఆస్ లాగా మీరు కూడా దగాకోరులై పోయారా?” అంటూ వ్యాపారి మరోసారి ఎలుగెత్తి అరిచాడు.

ఈ కేకలు కాబా మందిరంలో కూర్చొని మాట్లాడుతున్న కొందరు ఖురైష్ నాయకుల చెవుల్లో కూడా పడ్డాయి. వారిలో అబ్దుల్‌ ముత్తలిబ్‌ కొడుకు జుబైర్‌ ఈ మాటలు వినగానే అదిరిపడ్డాడు. అతనిలో పౌరుషం పురివిప్పింది.

“మనం పౌరుషంలేని వాళ్ళంకాము. పీడితుడ్ని ఆదుకోవడం మన విధి. అన్యాయాన్ని అరికట్టడం మన ధర్మం. పదండి అతనికి సహాయపడదాం.” అంటూ జుబైర్‌ లేచి నిలబడ్డాడు. అతని స్నేహితులు కూడా అతడ్ని అనుసరించారు.

వారందరూ జుబైదీ వ్యాపారి దగ్గరికెళ్ళి, అతనికి జరిగిన అన్యాయం గురించి వివరంగా తెలుసుకున్నారు. వారిలో జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ తన సానుభూతి వ్యక్తపరుస్తూ ఇలా అన్నాడు:

"విచారించకు. నీకు అన్యాయం జరిగింది. నీవు మా పౌరుషం రెచ్చగొట్టావు. అంచేత మేము నీ ఫిర్యాదు త్రోసిపుచ్చలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు మా అండదండలుంటాయి. పద నావెంట. నీకు నష్ట పరిహారం దొరికేదాకా నీవు మా ఇంట్లో అతిధిగా ఉండు.” అని అన్నాడు జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్. (ఈ జుబైర్ ఎవరనగా, ముహమ్మద్ (సల్లం) పెదనాన్న)

 జుబైది వ్యాపారి ఈ మాటలు విని సంతోషించాడు. అతని ఆశ చిగురించింది. ఆ వ్యాపారి, జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ వెంట అతని ఇంటికి బయలుదేరాడు.

మరుసటి రోజు జుబైర్ ప్రోద్బలంతో అబ్దుల్లా బిన్ జుదాన్ ఇంట్లో ఖురైష్ అగ్ర నాయకులు సమావేశమయ్యారు.

"జుబైదీ వ్యాపారికి గనక మనం న్యాయం చేకూర్చకపోతే మన వ్యాపారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఫుజ్జార్ యుద్ధం తిరిగి చెలరేగే ప్రమాదం కూడా లేకపోలేదు” అన్నాడు ఒక నాయకుడు.

“నీవు చెబుతున్నది నిజమే. అంచేత ఆ ప్రమాదం తలెత్తక ముందే అతనికి జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించటమే సర్వ విధాల శ్రేయస్కరం” అన్నాడు మరొకడు.

“మీరు మన తెగలో ఎంతో గౌరవనీయులు, వ్యవహారదక్షత గలవారు. మీలాంటి వారు అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ముందుకు రాకపోతే జుబైదీ వ్యాపారికి మద్దతుగా మరెవరూ గళం విప్పుతారు? అతను మన పౌరుషం రెచ్చగొట్టాడు” అన్నాడు జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్

“ఔను. ఇది మన పౌరుషానికి సంబంధించిన సమస్య. మనం ఈ వ్యాపారి కోసం అవసరం అయితే కత్తి దూయడానికైనా వెనుకంజ వేయకూడదు. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు భవిష్యత్తులో జరుగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికోసం మన అభిప్రాయాలతో ఏకీభవించేవారు మరికొందరు కావాలి. అప్పుడే మనం ఏదైనా చర్య తీసుకోగలుగుతాము” అన్నాడు వేరొక నాయకుడు. 

“సోదరులార! మన పట్టణంలోనే అనేక సంవత్సరా క్రితం జరిగిన “హిల్ ఫుల్ ఫుజూల్” ఒప్పందాన్ని మీరు మరచినట్లున్నారు. “హిల్ ఫుల్ ఫుజూల్” ఒప్పందానికి ఆద్యులైన ఫజల్ బిన్ హారీస్, ఫజల్ బిన్ వదా, ఫజల్ బిన్ ఫుజాలా ప్రముఖులు ఈనాడు మన మధ్య లేకపోవచ్చు. కాని వారి కృషిని జ్ఞప్తికి తెచ్చే ఆ ఒప్పందం ఇప్పటికి సజీవంగా ఉంది. దాన్నే మనం పునరుద్దరించి అమలుపరిస్తే బాగుంటుందేమో ఆలోచించండి” అన్నాడు వారందరిలో వయోవృద్ధుడు, అనుభవశాలి అయిన అబ్దుల్లా బిన్ జుదాన్.

“మీరు బాగా గుర్తు చేశారు. ఇంతకంటే మంచి ప్రతిపాదన మరేముంటుంది? ఈ ప్రతిపాదన నాకిష్టమే” అన్నాడు జుబైర్ సంతోషం వెలిబుచ్చుతూ.

“ఈ ప్రతిపాదన మాకు కూడా నచ్చింది. “హిల్ ఫుల్ ఫుజూల్” ని పునరుద్దరించుదాం” అన్నారు ఇతరులు కూడా జుబైర్ తో ఏకీభవిస్తూ.

ఆ తర్వాత సరికొత్త ఒప్పందం రాశారు. అందులో షరతులు ఇలా పేర్కొన్నారు :

1. మనలో ఏ ఒక్కడూ ఇతరుల హక్కును కొల్లగొట్టడు.

2.మనం బలవంతుడి నుండి బలహీనుడి హక్కు, స్థానికుడి నుండి బాటసారి హక్కును ఇప్పిస్తాము.

3.దౌర్జన్యపరుడికి వ్యతిరేఖంగా పీడితునికి సహాయపడటం జరుగుతుంది.

ఒడంబడిక పత్రం మీద చర్చల్లో పాల్గొన్న నాయకులంతా సాక్షులుగా సంతకాలు పెట్టారు. ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా అమలుపరుస్తామని ప్రమాణాలు కూడా చేశారు. జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ తన కృషి ఫలించినందుకు సంతోషం వెలిబుచ్చుతూ....,

జుబైర్ : - దేవుని దయ వల్ల అనుకున్న పని నెరవేరింది. ఇక ఆస్ దగ్గరకి వెళ్దాం పదండి” (అన్నాడు లేచి నిలబడుతూ.)

అబ్దుల్లా బిన్ జుదాన్ : - అప్పుడే పని పూర్తీ కాలేదు. కూర్చో, మనం ఈ ఒప్పందంలో చేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన సాక్షిని మరచిపోయాం. అతని సాక్ష్యం లేకుండా ఒప్పందానికి పరిపూర్ణత రాదు.

జుబైర్ : - ఎవరా సాక్షి? బనూహాషిం వంశ నాయకులంతా ఒప్పందంలో పాల్గొన్నారు కదా! ఇంకెవరు మిగిలారు?”

అబ్దుల్లా బిన్ జుదాన్ : - నీ తమ్ముడి కొడుకు ముహమ్మద్ (సల్లం). వయస్సులో చిన్నవాడైనా, బుద్ధి వివేచనల్లో మనందరిని మించినవాడు. మనం వయసు మల్లిన వాళ్ళం. ఎప్పుడూ ఇహలోకం నుంచి ప్రయాణం కడతామో తెలియదు. ముహమ్మద్ (స) నవయువకుడు. అతని సాక్ష్యం వల్ల ఒప్పందం సుదీర్ఘ కాలం మనగలిగే అవకాశం ఉంటుంది.

“ఔనౌను. ముహమ్మద్ (సల్లం) చాలా మంచి అబ్బాయి. ఎంతో వివేచనాపరుడు కూడా. పిలిపించండి అతడ్ని” అన్నాడు ఒకడు అబ్దుల్లాను సమర్ధిస్తూ.

కాస్సేపటికి ఆ సభలో నవయౌవనంలో అడుగుపెట్టిన పదహారేళ్ళ ముహమ్మద్ (సల్లం) ప్రత్యక్షమయి క్షణకాలంలో సభికుల చూపుల్ని ఆకట్టుకున్నారు. ఆయన అక్కడి పెద్దలందరికీ సలాం చేసి పెదనాన్న జుబైర్ పక్కన చాప మీద కూర్చున్నారు.

అబ్దుల్లా బిన్ జుదాన్, ముహమ్మద్ (సల్లం) తో....,

అబ్దుల్లా బిన్ జుదాన్ : - ముహమ్మద్ (సల్లం)! మేమంతా శాంతి స్థాపన కోసం "హిల్ ఫుల్ ఫుజూల్" ఒప్పందాన్ని పునరుద్దరించాము. ఇందులో సాక్షిగా నీవు కూడా చేరాలి. ఏమంటావ్?

ముహమ్మద్ (సల్లం) : - అంతకంటే మహాభాగ్యం మరేం కావాలి నాకు. శాంతి స్థాపన కోసం నేను ఎల్లప్పుడూ సిద్దమే.

జుబైర్ : - నా తమ్ముడి కొడుకు శాంతిదూత. శాంతి ప్రియత్వం ఇతని స్వభావంలోనే ఉంది. హాషిం వంశానికే వన్నెతెచ్చిన సౌశీల్యమూర్తి ఇతను” (అన్నాడు సంతోషంతో ముహమ్మద్ (సల్లం) ని వెన్నుతడుతూ.)

అబ్దుల్లా బిన్ జుదాన్ ఒడంబడిక పత్రంలో ముహమ్మద్ (సల్లం) సాక్షాన్ని చేర్చి, ఆయన చేత కూడా ప్రమాణం చేయించాడు. ఆ తర్వాత అందరూ కలసి "ఆస్ బిన్ వాయిల్" ఇంటికెళ్ళి తలుపు తట్టారు.

ఆన్ తలుపు తెరచి ఒక్కసారిగా అంతమంది తన ఇంటి మీదకి రావడం చూసి నిర్ఘాంత పోయాడు. అపుడు జుబైర్, ఆస్ తో....,

జుబైర్ : - ఆస్! నీవు జుబైదీ వ్యాపారికి ఇవ్వాల్సిన బాకీ డబ్బు వెంటనే ఈ క్షణమే ఇచ్చెయ్యి. లేదంటావా, మేమంతా కలసి నీకు వ్యతిరేఖంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. రక్త పాతానికైనా వెనుకాడం.

"ఆస్ బిన్ వాయిల్" ఓ సారి వారందరినీ పరికించి చూసి, పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించాడు. వెంటనే లోపలికెళ్ళి డబ్బు తీసుకువచ్చి జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ చేతిలో పెట్టాడు. జుబైర్ ఆ డబ్బును ఆ జుబైదీ వ్యాపారికి అందించాడు. తర్వాత అందరూ సంతోషంతో తమ తమ ఇళ్ళకు వెళ్లిపోయారు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment