105

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 105*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 20* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *వ్యాపార రీత్యా సిరియా వెళ్ళిన యువ ముహమ్మద్ (సల్లం)* 

మహనీయ ముహమ్మద్ (సల్లం) వ్యాపారంలో నిజాయితీపరుడు (అమీన్) గా పేరు మోసినా, ఆయన తన గుణగణాలతో కొనుగోలుదారులను ఎంత ఆకట్టుకుంటున్నా, ఆర్థిక పరిస్థితి మాత్రం ఎలాంటి ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయింది.

పెదనాన్న అబూ తాలిబ్ ప్రేమాభిమానాలు తనపై యధాతథంగా కొనసాగుతున్నాయి. కాని ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించసాగింది. మగవాళ్ళంతా పని చేస్తే కాని అందరికి కడుపు నిండని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి చూసి అబూ తాలిబ్ ఆందోళన చెందారు. ఓ రోజు అబూ తాలిబ్, ముహమ్మద్ (సల్లం) ని పిలిచి ఇంటి దుస్థితి ఏకరవుపేడ్తూ ఇలా అన్నారు....,

“ముహమ్మద్ (సల్లం)! మనిద్దరం కలసి ఉండడం నాకెంతో ఇష్టం. కాని నీకు తెలియనిది ఏముంది. నా వ్యాపారం సరిగా నడవడం లేదు. మన ఆర్థిక స్థితి రోజురోజుకు దిగజారిపోతున్న సంగతి నీకు తెలుసు. కుటుంబపోషణకు అందరం కృషి చేయకపోతే మనం గడచి గట్టేక్కలేము. ఖదీజాకు, తన వ్యాపారం చూసుకోవడానికి ఒకరి అవసరం ఉంది. ఆమె నా సహాయం కోరింది. నువ్వు వెళ్ళి ఆమెకు సహాయపడతావని, నిన్ను ఆమె దగ్గరకు పంపించాలనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే ఆమె వ్యాపారంలో నిన్ను కుదుర్చుతాను. ఏమంటావ్ బాబు?” అని అన్నారు.

అప్పటికే ముహమ్మద్ (సల్లం) కు ఇరవై నాలుగు సంవత్సరాలు నిండాయి. పెదనాన్న సలహాను వెంటనే అంగీకరిస్తూ “అలాగే కానివ్వు పెదనాన్న!” అన్నారు ఆయన. ఆ మరునాడే అబూ తాలిబ్ ఖదీజా దగ్గరకు వెళ్ళి మాట్లాడారు.

 *ఖదీజా గురించి : -* 

"ఖదీజా బింతే ఖువైలిద్" మక్కా పట్టణంలో గొప్ప శ్రీమంతురాలు. బానిసలు, పరిచారికలతో ఆమె ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతు ఉంటుంది. ఆమె వ్యాపారం యమన్, యస్రిబ్ (మదీనా), సిరియా, పాలస్తీనా మొదలైన దేశాల దాకా విస్తరించి ఉంది. ఆమె వివాహం మొదట "అతీఖ్ బిన్ ఆయాజ్" తో జరిగింది. కానీ అతీఖ్ కొన్నాళ్లకే చనిపోవడం వల్ల, ఖదీజా మళ్ళీ "అబూహాల బిన్ జిరాదా" వివాహమాడారు. అతని ద్వారా ఆమెకు హాలా, హారీస్, హింద్ అనే ముగ్గురు మగ పిల్లలు పుట్టారు. అయితే అబూహాలా కూడా కొంత కాలానికి మరణించాడు. ఖదీజా మళ్ళీ విషాదసాగరంలో మునిపోయారు. మరికొన్నాళ్లకు తండ్రి ఖువైలిద్ కూడా చనిపోయాడు.

ఇలా కష్టాల మీద కష్టాలు వచ్చిపడటం వల్ల ఆమెకు వైవాహిక జీవితం పై విరక్తి కలిగింది. ఇప్పుడామె వ్యాపారంలో వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగం నిరుపేదలు, అనాథలు, వితంతువుల కోసం వెచ్చిస్తూ ప్రజాసేవలో ప్రశాంత జీవితం గడపసాగారు.

ఖదీజా, ముహమ్మద్ (సల్లం) సత్యసంధత, నిజాయతీలను గురించి అప్పుడప్పుడు ప్రజల నోట వింటూ ఉండేవారు. అందువల్ల ఆ యువకుడ్ని తన వ్యాపారంలో పెట్టుకుంటే బాగుంటుంది అని భావించారు. వెతకబోయే తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు ఇప్పుడా అవకాశం కూడా వచ్చింది.

అబూ తాలిబ్ (ఖదీజా దగ్గరికి) వచ్చి (ముహమ్మద్ (సల్లం) ని వ్యాపారంలో పెట్టుకోవడం గురించి ఖదీజా తో) మాట్లాడగానే, ఆమె వివరాల్లోకి పోకుండా ముహమ్మద్ (సల్లం) ని తన వ్యాపారంలో పెట్టుకోవడానికి వెంటనే అంగీకరించారు.

 *ఖదీజాని కలిసిన ముహమ్మద్ (సల్లం) : -* 

ముహమ్మద్ (సల్లం) ఖదీజా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె, తన వ్యాపారానికి సంబంధించిన లెక్కలు చూసుకుంటూ ఉంది. ఎంతో అందంగా, స్వచ్ఛంగా, మిలమిల మెరిసే నల్లటి కళ్ళతో ఉన్న ఆ యువకుణ్ణి చూసి ఆమె మది సంతోషించింది. అపుడు ఖదీజా, ముహమ్మద్ (సల్లం) తో...., "నేను ఒక నిజాయితీపరుడి కోసం చూస్తున్నాను. నా వర్తక బృందాలను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళే బాధ్యతాయుతమైన మనిషి నాకు కావాలి. మీ పెదనాన్న అబూ తాలిబ్ మీ పేరును సూచించారు." అని అన్నది.

ఆమె అప్పగిస్తున్న బాధ్యతలను నిర్వర్తించడానికి ముహమ్మద్ (సల్లం) సమ్మతించారు. వారిద్దరూ, నిర్వర్తించాల్సిన బాధ్యతలను గురించి చర్చించారు. అవి ఏమంటే; "ఒక్కొ వర్తక బృందానికి ఎన్ని ఒంటెలు అవసరమవుతాయి. ఎంత పరిమాణంలో ఆహారాన్ని, నీటిని, వ్యాపారస్తులు తమతో తీసుకునిపోవాలి. ఎలాంటి వస్తువులు తీసుకునిపోవాలి. వాటిని ఎంత ధరకు విక్రయించాలి. మరీ ముఖ్యంగా వర్తకులు ఏ దారుల గుండా, ఏయే కాలాల్లో ప్రయాణించాలి." ఈ విషయాల గురించి చర్చించారు.

ఈ మాటలన్నీ పూర్తయ్యాక ముహమ్మద్ (సల్లం), ఆమె దగ్గర సెలవు తీసుకున్నారు. ముహమ్మద్ (సల్లం) తిరిగి వెళ్తుంటే, ఖదీజా ఆయనను పిలిచి...., "ముహమ్మద్ (సల్లం)! అందరూ మిమ్మల్ని "అమీన్" అని పిలుస్తారు కదూ! నమ్మకస్థులుగా మీరు పేరు పొందారు. నా దగ్గర పని చేస్తున్నంత కాలం మీరు ఆ పేరును నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను." అని అన్నది. ఆ పేరును నిలబెట్టుకుంటానని ముహమ్మద్ (సల్లం), ఖదీజా కు మాటిచ్చారు.

 *సిరియాకు పయనం : -* 

ఆ తరువాత కొన్నాళ్ళకు, యువ ముహమ్మద్ (సల్లం) నాయకత్వంలో ఒక వాణిజ్య బృందం సిరియా పోవడానికి బయలుదేరింది. అందులో ముహమ్మద్ (సల్లం) కు సహాయకారిగా ఖదీజా నమ్మినబంటు "మైసరా" కూడా ఉన్నాడు.

ఈ వాణిజ్య బృందం సిరియా దేశం పోయి, "బస్రా" పట్టణం సమీపంలో విడిదిచేసింది. అక్కడ యువ ముహమ్మద్ (సల్లం) ఎంతో అనుభవశాలిలా వ్యాపారం చేశారు. కొనుగోలు వర్తకులతో ఎంతో నేర్పుగా, నిజాయితీగా, ఉదాత్తమయిన వైఖరితో, సత్ప్రవర్తనతో వ్యవహరించారు. వ్యాపారంలో తలమునకలై ఉన్నపుడు కూడా ఆయన తన సహజ ధోరణి విడనాడలేదు. ఏకాంత సమయం చిక్కినపుడల్లా దైవచింతన, అక్కడి ప్రజల్లో ఉన్న విభిన్న విశ్వాసాలు, ఆచారాలను గురించే ఆలోచించేవారు.

వర్తక బిడారాలు విడిది చేసిన చోట మోడుబారిన ఓ చెట్టుంది. ఒక రోజు ముహమ్మద్ (సల్లం) ఆ చెట్టు క్రింద కూర్చున్నారు. ఆ తరువాత కాస్సేపటికే ఆ చెట్టు చకచకా చిగురించి, పచ్చని ఆకులతో, రెమ్మలతో అలరారిపోయింది. అప్పుడు "మైసరా" ఏదో పనిలో నిమగ్నుడై ఉన్నాడు. దగ్గరలోనే ఒక క్రైస్తవ మఠం కూడా ఉంది. ఆ మఠంలో ఉంటున్న "నస్తూర్" అనే (క్రైస్తవ) సాధువు "మైసరా" ను కలుసుకోవడానికి వచ్చాడు. "మైసరా" ప్రతి సంవత్సరం వర్తకానికి వచ్చి ఇక్కడ విడిది చేస్తుండటం వల్ల "నస్తూర్" సాధువుతో అతనికి బాగా పరిచయం ఏర్పడింది.

"నస్తూర్" కొత్తగా వచ్చిన ముహమ్మద్ (సల్లం) ని చూసి, మైసరా తో....,

నస్తూర్ : - (మైసరా!) నీ వెంట వచ్చిన ఈ యువకుడు ఎవరు? ఇతని వంశం ఏమిటి?

మైసరా : - (ఇతని పేరు ముహమ్మద్!) ఇతను ఖురైష్ వంశస్థుడు.

నస్తూర్ : - ఇతని గుణగణాలు ఏమిటీ? ఎలాంటి వాడు?

మైసరా : - మంచి గుణవంతుడు, నిజాయితీపరుడు. ఆడినమాట తప్పనివాడు, పవిత్రుడు, సృష్టి విచిత్రాలను పరిశీలిస్తూ, ప్రజల జీవన వ్యవహారాలను గమనిస్తూ ఎప్పుడూ దైవచింతనలో ఉంటాడు.

నస్తూర్ : - అతని కళ్ళు ఎలా ఉంటాయి? (అడిగాడు కుతూహలంతో)

మైసరా : - నల్లగా, విశాలంగా ఉంటాయి. తెల్లగుడ్డు మీద సన్నటి ఎర్రచార కూడా ఉంది. కనుబొమ్మలు నల్లగా, సన్నగా ఉంటాయి.

నస్తూర్ : - అయితే మైసరా! నీవు వర్ణించిన ఈ సుగుణాలు, గుర్తులు కలిగి ఉండి, ఈ చెట్టు క్రింద ఆగిన వ్యక్తి గొప్ప దైవప్రవక్త కాగలుగుతాడు.

తర్వాత ఆ క్రైస్తవ సాధువు చెట్టు క్రింద కూర్చున్న ముహమ్మద్ (సల్లం) దగ్గరకి వచ్చి...., అరబ్బు జాతిలోని ఆచారాలు, విశ్వాసాలను గురించి ప్రశ్నించాడు. దానికి, ముహమ్మద్ (సల్లం) అన్ని విషయాలు చెప్పారు. తర్వాత వాటిని గురించి నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు నస్తూర్. ముహమ్మద్ (సల్లం), తన జాతిలో కొనసాగుతున్న దురాచారాలను ఖండిస్తూ తన అయిష్టత వెలిబుచ్చారు. చివరికి ఆ సాధువు, క్రైస్తవ మతాన్ని గురించి అడిగాడు. దానికి ముహమ్మద్ (సల్లం) ఎలాంటి సంకోచం లేకుండా ఆ మతంలో ఉన్న మంచి విషయాలతో పాటు చెడు విషయాలను గురించి కూడా వివరంగా తన అభిప్రాయాలను చెప్పారు. అప్పుడా సాధువు తృప్తిగా ఊపిరి పీలుస్తూ...., “ఈ యువకుడు భవిష్యత్తులో మహాపురుషుడు, మహాప్రవక్త అవుతాడు" అని మనస్సులో తలపోస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

 *తిరుగు ప్రయాణం : -* 

కొన్ని రోజుల తర్వాత వర్తక బిడారాలు, సిరియా దేశం నుంచి మక్కా పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యాయి. ఆ సంవత్సరం వ్యాపారంలో, ఇది వరకు ఎన్నడూ లేని ఎక్కువ లాభాలు వచ్చాయి. దానితో మైసరా ఎంతో సంతోషించాడు. అతనికి యువ ముహమ్మద్ (సల్లం) పై అమితమయిన గౌరవభావం ఏర్పడింది.

వర్తక బిడారాలు మక్కా సమీపంలో "జహ్రాన్" అనే ప్రదేశానికి చేరుకున్నాయి. మైసరా ఎంతో సంబరపడుతూ...., “ముహమ్మద్ (సల్లం)! తొందరగా ఖదీజా దగ్గరకెళ్ళి, ఆమెకు వ్యాపార శుభవార్తను వినిపించు.” అన్నాడు.

అప్పుడు ముహమ్మద్ (సల్లం) వర్తక బిడారాలకు ముందుగా ఒంటెపై ఎక్కి బయలుదేరాడు. మధ్యాహ్నం ఎండ పెట పెట లాడుతుంది. సూర్యుడు ఆకాశం మధ్యకు వచ్చి తన వాడి కిరణాలను మరింత తీక్షణం చేశాడు. 

హజ్రత్ ఖదీజా చల్లటిగాలి కోసం మేడ మీదకి వెళ్ళి పచార్లు చేయసాగారు. ఏదో తీయని తెలియని భావాలతో, తను వ్యాపార నిమిత్తం పంపిన యువ ముహమ్మద్ (సల్లం) కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన గుణగణాలను గురించి ఇంతకూ ముందే ఎన్నో విషయాలు విని ఉన్నందున ఆ మాటలే మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి. అంతలో అకస్మాత్తుగా దూరాన కనిపించిన దృశ్యంతో ఆమె (ఖదీజా) ఆలోచనలకు అంతరాయం కలిగింది.

ఒక వర్తక బిడారం పట్టణంలోకి ప్రవేశిస్తోంది. ఖదీజా ఎంతో ఆదుర్దాగా అటువైపే కళ్ళప్పగించి చూడసాగారు. అది మరికాస్త దగ్గరగా వచ్చింది. ఖదీజా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన మనో వీధిలో మెదులుతున్న యువ ముహమ్మద్ (సల్లం) ఒంటె మీద వడివడిగా వస్తున్నారు. ఆమె గబగబా మెడ మీద నుంచి కిందకి దిగారు. అటు ముహమ్మద్ (సల్లం) ఒంటె దిగి నడచుకుంటూ వస్తున్నారు.

ఆమె పట్టరాని సంతోషంతో ప్రధాన ద్వారం దగ్గరకెళ్ళి ఆయనకు స్వాగతం చెప్పారు. క్షేమంగా తిరిగ వచ్చినందుకు సంతోషం వ్యక్తపరిచారు. ఆ తరువాత లోపలికి తీసుకెళ్ళి సాదరంగా కూర్చోబెట్టారు. ఆమె మనసులో ఒక్కసారిగా అనేక ప్రశ్నలు ఉదయించాయి. అవి ఆమె నోట వెలువడక ముందే ముహమ్మద్ (సల్లం), తన ప్రయాణ అనుభూతి, వ్యాపార విషయాలు అన్నీ వివరంగా చెప్పడం ప్రారంభించారు.

బస్రాలో తాను ఏ ఏ సరుకులు అమ్మింది, ఏ ఏ వస్తువులు కొన్నది, ఎంత లాభం వచ్చింది మొదలైన విషయాలు పూస గుచ్చినట్లు చెబుతుంటే ఖదీజా ఎంతో ఆసక్తికరంగా, కుతూహలంతో వినసాగారు. వ్యాపారంలో ఇది వరకెన్నడూ రానంత లాభాలు రావడంతో ఆమె ముహమ్మద్ (సల్లం) పట్ల మరింత ప్రభావితురాలయ్యారు.

ఈలోగా భారీ వస్తుసామగ్రితో మైసరా కూడా వచ్చేశాడు. వచ్చీరాగానే ఖదీజాను కలుసుకొని, వ్యాపారంలో ముహమ్మద్ (సల్లం) ప్రదర్శించిన నైపుణ్యం, తెలివితేటలను గురించి విశేషంగా వర్ణించి చెప్పాడు. అంతేగాకుండా, ముహమ్మద్ (సల్లం) గురించి క్రైస్తవ సాధువు "నస్తూర్‌" చెప్పిన శుభవార్త కూడా వినిపించాడు. తిరుగు ప్రయాణంలో దారిలో జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి ఇలా తెలియజేశాడు....,

“బస్రా నుంచి బయలుదేరి వస్తుంటే దారిలో మన ఒంటెలు బాగా అలసిపోయి నడవలేని స్థితికి వచ్చాయి. అప్పటికే తోటివర్తకులు చాలా దూరం పోయారు. ప్రయాణం ఇలాగే సాగితే నేను వెనుకబడిపోయి ఒంటరివాణ్ణయి పోతానేమోనని భయమేసింది. కాస్త తొందరగా ముందుకు నడిచి, ముహమ్మద్ (సల్లం) దగ్గరకు చేరుకొని విషయం చెప్పాను. ముహమ్మద్ (సల్లం), మన ఒంటెల్ని పడుకోబెట్టి ముకుతాళ్ళు లాగి వదలి అదిలించాడు. అంతే, అవి ఒక్కసారిగా లేచి అసలేమీ జరగనట్లు వడివడిగా పరుగెత్తసాగాయి.” 

దానికి ఖదీజా...., “అయితే ఆయనలో చాలా అద్భుత విశేషాలే ఉన్నాయి!” అని అన్నారు ఆశ్చర్యపోతూ.

ఆ రోజు నుంచి ఖదీజా మనస్సు అప్రయత్నంగా ముహమ్మద్ (సల్లం) పై లగ్నమయింది.

"అబూహాలా" చనిపోయాక, ఆమె పునర్వివాహ ప్రసక్తినే అసహ్యించుకునేవారు. ఖదీజా, తన దృష్టినంతటినీ వ్యాపారంపై, ప్రజాసేవపై మాత్రమే కేంద్రీకరించి ప్రశాంత జీవితం గడపసాగారు. అంచేత ఆమె భావావేశాలపై, గాంభీర్యతా మంచుపొర దట్టంగా పేరుకున్నది.

కాని ఇప్పుడు తన వ్యాపారంలో ముహమ్మద్ (సల్లం) ప్రవేశించడంతో, ఈ మంచుపొర క్రమంగా కరిగిపోతూ, దానికింద పడి వాడిపోయిన ప్రేమ కుసుమాలు మెల్లగా వికసించసాగాయి. ఖదీజా హృదయంలో, ముహమ్మద్ (సల్లం) నిలువుచిత్రం రూపుదిద్దుకోసాగింది.

అందువల్ల ఆమె ఇప్పుడు అహర్నిశలూ ఆయన్ని గురించే ఆలోచిస్తూ ఉండసాగారు. ఎవరితో కలిసి ఏది మాట్లాడినా చివరికి ఆమె ముహమ్మద్ (సల్లం) ప్రస్తావనే తెచ్చి, ఆయన గుణగణాల్ని ఎంతో కొనియాడేవారు. ఎలాగైనాసరే ఆ యువకుడ్ని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఖదీజా నిర్ణయానికి వచ్చారు.

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment