129

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  129* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 44* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *మహానీయ ముహమ్మద్ (సల్లం)పై ఆగని అవిశ్వాసుల హింసాదౌర్జన్యాలు* 

"ఉక్బా బిన్ ముఅయిత్" అయితే హింసా దౌర్జన్యంలో మరీ పెచ్చు పెరిగిపోయాడు. "సహీ బుఖారి" గ్రంథంలో "అబ్దుల్లా బిన్ మస్ఊద్" ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) బైతుల్లాహ్ (కాబా గృహం) వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్, అతని కొందరు మిత్రులు అక్కడనే కూర్చుని ఉన్నారు. అంతలో కొందరు మరికొందరిని సంబోధిస్తూ...., “ముహమ్మద్ సజ్దా (సాష్టాంగం) చేసినప్పుడు, ఫలానా తెగకు చెందిన ఒంటె పొట్టపేగుల్ని ఆయన (సల్లం) వీపుపై పెట్టడానికి ఎవరు సిద్ధపడతారు” అని సవాలు విసిరారు.

దీనికి ఆ జాతికి చెందిన దురదృష్టవంతుడు "ఉక్బా బిన్ ముఅయిత్" ఆ ఒంటె పొట్ట పేగుల్ని ఎత్తుకు వచ్చి ప్రవక్త (సల్లం) సాష్టాంగపడేంత వరకు ఎదురుచూస్తూ నిలుచున్నాడు. ఆయన (సల్లం) సాష్టాంగపడగానే ఆ పొట్టపేగుల్ని ఆయన రెండు గూడల నడుమ పడవేశాడు. ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్న "అబ్దుల్లా బిన్ మస్ఊద్", “నేను ఇదంతా చూస్తూనే ఉన్నాను. కాని ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను, ప్రవక్త (సల్లం)ను రక్షించే బలం నాకుంటే ఎంత బాగుండు!” అని వాపోయారు. 

ఆయన (అబ్దుల్లా బిన్ మస్ఊద్) కథనం ప్రకారం, ఆ ఒంటె పొట్ట ప్రేగుల్ని దైవప్రవక్త (సల్లం)పై పడవేసి వారు పట్టలేని ఆనందంతో ఒకరిపై ఒకరు పడి నవ్వుకుంటున్నారు. దైవప్రవక్త (సల్లం) అలా సజ్దాలోనే ఉండిపోయారు. తలపైకి ఎత్తలేకపోయారు. చివరికి (దైవప్రవక్త గారి కుమార్తె) హజ్రత్ ఫాతిమా (రజి) వచ్చి ఆ అశుద్ధ పదార్థాన్ని ఆయన (సల్లం) వీపుపై నుండి తీసి క్రింద పడవేయడం జరిగింది.అప్పుడుగాని దైవప్రవక్త (సల్లం) తలపైకి ఎత్తలేకపోయారు. ఆ తరువాత ఆమె (రజి), *“ఓ అల్లాహ్! ఖురైష్ ను పట్టుకో (శిక్షించు).”* అని మూడుమార్లు శపించారు. ఈ శాపం ఖురైష్ కు రుచించలేదు. ఎందుకంటే వారి నమ్మకం ప్రకారం, ఈ (కాబా) ప్రదేశం ప్రార్థనలు స్వీకరించబడే ప్రదేశం గనక.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) ఒక్కొక్కరి పేరు చెబుతూ ఇలా శపించారు: *“ఓ అల్లాహ్! అబూ జహల్ ను శిక్షించు. ఉత్బా బిన్ రబీయాను, షైబా బిన్ రబీయాను, వలీద్ బిన్ ఉత్బాను, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ను మరియు ఉత్బా బిన్ అబీ ముఅయిత్ ను శిక్షించు.”* 

ఆయన (సల్లం) ఏడవ వ్యక్తి పేరు కూడా ఉచ్ఛరించారుగాని ఉల్లేఖనకర్తకు ఆ పేరు జ్ఞాపకం లేదు - ఇబ్నె మస్ఊద్ (రజిఅన్) తన ఉల్లేఖనంలో ఇలా చెబుతారు. “నా ప్రాణం ఏ దైవం ఆధీనంలోనైతే ఉందో ఆ దైవం సాక్షి! మహా ప్రవక్త (సల్లం) ఎవరెవరి పేర్లనైతే ఆనాడు ఉచ్ఛరిస్తూ శపించారో వారంతా బద్ర్ యుద్ధంలో బావిలో మృతులుగా పడి ఉండడం కనబడింది.

 *సూరతుల్ హుమాజహ్ అవతరణ : -* 

“ఉమయ్యా బిన్ ఖల్ఫ్” దైవప్రవక్త (సల్లం)ను చూడగానే దుర్భాషలాడడం పనిగా పెట్టుకున్న వ్యక్తి. అతని గురించే దివ్యగ్రంథంలో ఈ ఆయత్ అవతరించింది. *"వైలుల్లికుల్లి హుమజతిల్ లుమజా"* (ప్రజలను దెప్పిపొడవడంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచడంలో ఆసక్తి కనబరిచేవాడు సర్వనాశన మావుతాడు). ఇబ్నె హష్షామ్ కథనం ప్రకారం, హుమజా అనే వాడు బాహాటంగా దెప్పిపొడిచేవాడు, కన్నుగీటేవాడు అని; లుమజా అంటే పరోక్షంగా లోపాలను ప్రజల ముందుంచి వారిని అగౌరవం పాలు చేస్తూ బాధించేవాడని అర్థం.

 *"వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజహ్ (1). అల్లజీ జమఅ మాలవ్ఁ వఅద్దదహ్ (2). యహ్'సబు అన్న మాలహూ అఖ్'లదహ్ (3). కల్లా లయుమ్'బజన్న ఫిల్ హుతమహ్ (4). వమా అద్'రాక మల్ హుతమహ్ (5). నారుల్లాహిల్ మూఖదహ్ (6). అల్లతీ తత్తలిఉ అలల్ అఫ్ ఇదహ్ (7). ఇన్నహా అలైహిమ్ ముఅ్'సదహ్ (8). ఫీ అమదిమ్ ముమద్'దదహ్ (9). (ఖుర్ఆన్ 104:1-9)* 

 _(↑ పై దివ్యఖుర్ఆన్ వాక్యాల తెలుగు తర్జుమా ↓)_ 

 *(ఇతరుల) తప్పులెన్నుతూ, పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికీ మూడుతుంది (1). వాడు ధనాన్ని పొగుచేసి, పదే పదే లెక్కపెడుతూ ఉంటాడు (2). తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడనుకుంటున్నాడు (3). ఎన్నటికీ అలా జరగదు. వాడు తుత్తునియలు చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు (4). ఆ తుత్తునియలు చేసివేసే దాని గురించి ఏమనుకున్నావు? (5). అది అల్లాహ్ రాజేసినటువంటి అగ్ని (6). అది హృదయాల వరకు చొచ్చుకుపోయేటటువంటిది (7). ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండీ మూసివేయబడుతుంది (8). వారు పొడవాటి స్తంభాల (అగ్నికీలల) మధ్య (చిక్కుకుని ఉంటారు) (9).* 

 _("హుమజహ్", "లుమజహ్" పదాలను కొంత మంది ఒకే అర్థంలో తీసుకున్నారు. మరికొంతమంది రెండు వేర్వేరు అర్థాలతో తీసుకున్నారు. "హుమజహ్" అంటే అదేపనిగా ఇతరులలోని లోపాలను ఎంచటం అనీ, "లుమజా" అంటే ఒకరి వీపు వెనుక నిందించటమనీ అన్నారు. కళ్ళతో, చేతులతో సైగలు చేస్తూ హేళన చేయటం “హుమజా” క్రిందకి వస్తుందని, నోటితో నిదించటం “లుమజహ్” గా పరిగణించబడుతుందని ఇంకా కొందరు వ్యాఖ్యానించారు.)_ 

 _(డబ్బును లెక్కపెట్టి ఉంచటం, ధనాన్ని సర్దిపెట్టటం స్వతహాగా తప్పుకాదు. కాని డబ్బును దైవమార్గంలో ఖర్చుపెట్టకుండా, జకాత్ సదకా వంటి దానధర్మాలు చేయకుండా కడుపులు కొట్టి, మూటలు కట్టి దాచటం, పదే పదే దాన్ని సర్దిపెడుతూ మురిసిపోతూ ఉండడమే ఖండించదగినది. మనిషికి ధనవ్యామోహం ఎక్కువైపోయినప్పుడే ఇలా చేస్తాడు)_ 

 _(“అఖ్'లద” అనే పదానికి సరైన తర్జుమా “తనను ఎల్లకాలం సజీవంగా ఉంచేది” అని. అంటే ఈ ధనం వల్ల తన ఆయుషు పెరుగుతుందని, తానెన్నటికీ చావనని వాడనుకుంటున్నాడా?)_ 

 _(వాడి అంచనా సరైనది కాదు. ఇలాంటి పిసినిగొట్టు ఎవరయినాసరే “హుతమహ్”లో పారేయబడతాడు.)_ 

 _(“హుతమా” అనేది నరకానికి గల అనేక పేర్లలో ఒక పేరు. అది నుజ్జు నుజ్జు చేసి వేసేది.)_ 

 _(దాని భయంకర స్థితిని వర్ణించటానికి ఈ విధంగా ప్రశ్నించటం జరిగింది. అది ఎంత తీవ్రంగా దహించే అగ్ని అంటే, అది మీ బుద్ధి జ్ఞానాలకు అందనిది. అది మీ ఆలోచనలకు అందనిది.)_ 

 _(దాని ఉష్ణోగ్రత (సెగ) హృదయాంతరాళాల దాకా చొచ్చుకుపోతుంది. ఆ మాటకొస్తే ప్రపంచంలోని అగ్ని సయితం తక్కువేమి కాదు. అది కూడా ప్రతి వస్తువునూ దహించి వేస్తుంది. కాని ప్రపంచంలోని అగ్ని మానవ హృదయంలోకి చొచ్చుకోకముందే మనిషి చచ్చిపోతాడు. అయితే, నరకాగ్ని అలా కాదు. అది గుండెల దాకా చేరినప్పటికీ అక్కడ మనిషికి చావు రాదు. చావుకోసం మనిషి కోరుకుంటాడు. కాని చావు రాదు.)_ 

 _(నరకమార్గాలు, ద్వారాలు అన్నీ మూసివేయబడతాయి. తత్కారణంగా నరకవాసులు బయటికి పారిపోలేరు. పైగా వారిని ఇనుప మేకులతో బంధించటం జరుగుతుంది. అవి మామూలు మేకులు కావు, స్తంభాల్లా ఉంటాయి. కొంతమంది ఇనుప గొలుసులని, గుదిబండలనీ అభిప్రాయపడ్డారు.)_ 
_______

"ఉమయ్యా బిన్ ఖల్ఫ్" సోదరుడు "ఉబై బిన్ ఖల్ఫ్", "ఉక్బా బిన్ అబీ ముఅయిత్"లు ప్రాణ స్నేహితులు. ఓ సారి "ఉక్బా బిన్ అబీ ముఅయిత్", దైవప్రవక్త (సల్లం) దగ్గర కూర్చుని ఆయన (సల్లం) చెప్పిన మాటల్ని విన్నాడు. ఈ విషయం "ఉబై బిన్ ఖల్ఫ్" తెలిసింది. అతను ఉక్బాను గట్టిగా మందలించాడు. అదే కాకుండా వెళ్ళి దైవప్రవక్త (సల్లం) ముఖంపై ఉమ్మేసి రమ్మని పురమాయించాడు. చివరికి ఉక్బా, ఉబై చెప్పినట్లుగానే చేసివచ్చాడు. స్వయంగా "ఉబై బిన్ ఖల్ఫ్" ఓసారి చీకిపోయిన ఎముకను తెచ్చి నుజ్జునుజ్జుగా చేసి దైవప్రవక్త (సల్లం) వైపు గాలిలో ఊదేసాడు. 

"అక్నస్ బిన్ షురైఖ్ సఖఫీ" అనేవాడు కూడా దైవప్రవక్త (సల్లం)ను హింసించే వారిలో ఒకడు. *"దివ్యఖుర్ఆన్"* లో అతని తొమ్మిది అవలక్షణాలు వివరించడం జరింగింది. దాని ద్వారా అతని ప్రవర్తన ఎలాగుండేదో అర్థమవుతుంది.

 *నువ్వు అదేపనిగా ప్రమాణాలు చేసే తుచ్ఛుని మాట వినకు. వాడు (ఎంతసేపటికీ చులకనగా) మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు. మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపాత్ముడు వాడు. మిక్కిలి కర్కశుడు. వీటన్నింటికీ తోడు కళంకితుడు. (ఖుర్ఆన్ 68:10-13)* 

 _(ఇది అవిశ్వాసుల నైతిక పతనానికి, దివాలాకోరుతనానికి ప్రతిబింబం. అందుకే వారితో ఎలాంటి రాజీకి రాకూడదని ప్రవక్తకు తాకీదు చేయడం జరిగింది. ఈ నైతిక అవగుణాలు ఒకానొక వ్యక్తికి సంబంధించినవా లేక సాధారణంగా అవిశ్వాసులందరికీ అవి వర్తిస్తాయా? అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఒక ప్రత్యేక పాత్రను ఉద్దేశించి ఈ ఆయతులు అవతరించాయన్న ఉల్లేఖనాలు కొన్ని ఉన్నాయి. అయితే అవి ప్రామాణికమైనవి కావు. అందువల్ల ఈ దుర్గుణాలు ఉన్న అవిశ్వాసులందరికీ అవి వర్తిస్తాయని చెప్పవచ్చు. "జనీమ్" అంటే అక్రమ సంతానం అని అసలు అర్థం. అంటే పరువులేనివాడు, నిందార్హుడు అన్న మాట.)_ 

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment