130

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  130* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 45* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *మహానీయ ముహమ్మద్ (సల్లం)పై ఆగని అవిశ్వాసుల హింసాదౌర్జన్యాలు* 

(ఆయన (సల్లం)ను వేధించటంలో, దైవప్రవక్త (సల్లం) పెదనాన్న) ''అబూ లహబ్" లాగానే "అబూ జహల్" అనే మరో కర్కోటకుడు ఉన్నాడు. ఆ పేరు (అజ్ఞాన పిత)ను బట్టే అతనికి ఏమాత్రం బుద్ధి లేదని తెలుస్తోంది. "అబూ జహల్", దైవప్రవక్త (సల్లం)కు దగ్గరి బంధువు కాకపోయినా, వరసకు పెదనాన్న అవుతాడు. అతను కూడా దైవప్రవక్త (సల్లం)కు బద్ధవిరోధి అయ్యాడు. అతనిలో జాలి, కరుణ అనేవి ఏ కోశానా లేవు. నీతి నియమాలు అంతకన్నా లేవు. అతను దైవప్రవక్త (సల్లం)ను ఎప్పుడూ ఏదో విధంగా వేధించడం, అల్లరి చేయడమే పనిగా పెట్టుకున్న పరమదుర్మార్గుడు. ఆయన (సల్లం)పై దుష్ప్రచారం చేసి, ఇతరులను కూడా ఉసిగొల్పుతాడు.

అబూ జహల్ అప్పుడప్పుడు దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి *"దివ్యఖుర్ఆన్"* వింటూ ఉండేవాడు. అయితే అది కేవలం వినడం మట్టుకే. విశ్వసించడం గాని, దాన్ని గౌరవించి భయపడడంగాని చేసేవాడు కాదు. అతను దైవప్రవక్త (సల్లం)ను తన సూటిపోటి మాటలతో బాధించేవాడు. దైవమార్గ అవలంబనను అడ్డుకునేవాడు. పైగా తన నిర్వాకానికి గర్వపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ తానేదో ఘనకార్యం చేసినవాడిలా తలచేవాడు. *"దివ్యఖుర్ఆన్"* లో ఇతని ఈ ప్రవర్తనను వివరిస్తూ ఈ క్రింది వాక్యాలు అవతరించాయి. *“ఫలాసద్దఖవలాసల్లా”* (చివరి వరకు).

 *వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు, నమాజు చేయనూ లేదు (1). పైగా వాడు (సత్యాన్ని) ధిక్కరించాడు, వెను తిరిగిపోయాడు (2). మిడిసిపడుతూ, తన ఇంటివారల వైపు వెళ్ళిపోయాడు (3). శోచనీయం. నీ వైఖరి కడు శోచనీయం (4). మరి విచారకరం. నీ ధోరణి మిక్కిలి విచారకరం (5). (ఖుర్ఆన్ 75:31-35)* 

 _(ఈ మానవుడు దైవప్రవక్త (సల్లం)ను, "దివ్యఖుర్ఆన్"ను త్రోసిపుచ్చాడు. నమాజు కూడా చేయలేదు. దైవప్రవక్త (సల్లం)ను ఎదిరించటమేగాక, విశ్వాసం (ఈమాన్) పట్ల విముఖత చూపాడు. అహంకారంతో విర్రవీగుతూ, తానేడో ఘనకార్యం చేసినట్లుగా నిక్కుతూ ఇంటికెళ్ళిపోయాడు. ఓ ధిక్కారీ! నువ్వు ఊహించని విపత్కర స్థితిని, దేవుడు నీపై తెచ్చిపెట్టుగాక.)_ 

 *అబూ జహల్, దైవప్రవక్త (సల్లం)ను బెదిరించే మరో సంఘటన : -* 

మొదటి రోజున దైవప్రవక్త (సల్లం)ను నమాజు చేస్తూ చూసి ఆ రోజు నుండే ఆయన (సల్లం)ను నమాజు చేయకుండా అడ్డుకోనారంభించిన వ్యక్తి అతను. ఆ వ్యక్తి ఎవరో కాదు, "అబూ జహల్".

ఓ సారి మహాప్రవక్త (సల్లం) ముకామె ఇబ్రాహీం (కాబా గృహానికి ఆనుకొని ఉన్న ఓ స్థలం) వద్ద నిలబడి నమాజు చేస్తున్నారు. ఇది చూసిన అబూ జహల్, దైవప్రవక్త (సల్లం)తో....,

అబూ జహల్ : - ఓ ముహమ్మద్ (సల్లం)! ఇక్కడ నమాజు చేయరాదని నీకు చెప్పానా? లేదా? (అని అడుగుతూ బెదిరించాడు.)

దానికి దైవప్రవక్త (సల్లం) కూడా అంతే ఘాటుగా, తీవ్రమైన బెదిరింపుతో సమాధానం ఇచ్చారు. 

ముహమ్మద్ (సల్లం) : - నువ్వెంటి నాకు చెప్పేది. నేను నా ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తున్నాను.

అబూ జహల్ : - ముహమ్మద్ (సల్లం)! నన్ను బెదిరిస్తున్నావా? జాగ్రత్తగా ఉండు! దైవసాక్షిగా చెబుతున్నా!! చూడు, ఈ మక్కా నగరంలో నా అనుయాయులు, నా మద్దతుదారులు, నా సభాసదులు అందరికన్నా ఎక్కువన్న సంగతిని మరచిపోకు! (అని బెదిరించాడు)

అబూ జహల్ ఈ విధంగా బడాయి ప్రకటించగా, "అల్లాహ్" దానికి సమాధానంగా ఈ "ఖుర్ఆన్" వాక్యాన్ని అవతరింపజేశాడు. *“ఫల్ యద్'వునాదియహ్”* (చివరి వరకు).

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవప్రవక్త(సల్లం) అతని మెడ దగ్గర చొక్కాను పట్టుకుని ఊపుతూ, *“అవ్'లా లక ఫఅవ్'లా! సుమ్మ అవ్'లాలక ఫఅవ్'లా* (ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది! నీకు మాత్రమే శోభిస్తుంది.) అని అన్నారు.

దానికి ఆ దైవవిరోధి, “ఓ ముహమ్మద్ (సల్లం)! నన్ను బెదిరిస్తున్నావా! దైవసాక్షి!! నీ దేవుడూ, నీవూ కలసి నన్నేమీ చేయలేరు. నేను ఈ మక్కా నగరానికి ఇరువైపులా ఉన్న రెండు కొండల నడుమ నడిచే వారిలో అందరికంటే గౌరవనీయుణ్ణి సుమా!” అని విర్రవీగాడు.

 *అడ్డు తగిలేవాడిని నీవు చూశావా? (1). ఒక దాసుణ్ణి, అతను నమాజు చేస్తుండగా (అడ్డుకున్నాడు) (2). ఇదిగో చూడు! ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే.... (3). లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే.... (అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి?) (4). ఇదిగో చూడు!  వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ, ముఖం త్రిప్పుకుని పోతుంటే.... (వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటి?) (5). ఏమిటి, అల్లాహ్ తనను గమనిస్తున్నాడన్న విషయం అతనికి తెలియదా? (6). కానేకాదు. ఒకవేళ వాడు గనక (తన వ్యతిరేక ధోరణిని) మానుకోకపోతే మేము వాడి నుదుటి జుత్తును పట్టి ఈడుస్తాము (7). అబద్ధాలతో, దురంతాలతో కూడుకున్న (వాడి) నుదుటి జుత్తును (8). (కావాలంటే) వాడు తన సలహా మండలి సభ్యులను (సహాయార్థం) పిలుచుకోవచ్చు (9). మేము కూడా (నరక) భటులను పిలుస్తాము (10). (ఖుర్ఆన్ 96:9-19).* 

 _(1→ మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం)కు అడ్డుతగిలే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇస్లాం కు బద్ధవిరోధి అయిన అబూ జహలే అని "ఖుర్ఆన్" వ్యాఖ్యాతలంటున్నారు.)_ 

 _(3→ అంటే, సన్మార్గాన ఉన్న వ్యక్తిని నమాజు చేయకుండా ఆపడం ముమ్మాటికీ దౌర్జన్యమే.)_ 

 _(4→ అంతిమ దైవప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లం) బోధించే విషయాలు మామూలు విషయాలు కావు. అవి ఏకదైవారాధన (తౌహీద్), సదాచారణ (అమలె సాలెహ్), చిత్తశుద్ధి (ఇక్లాస్)తో కూడుకున్న విషయాలు. వాటి ద్వారా మానవ సమాజంలో ధర్మపరాయణత, దైవభీతి, పరలోక భీతి వంటి సుగుణాలు ఆవిర్భవిస్తాయి. అవి మనుషులను నరకాగ్ని నుండి కాపాడుతాయి. మరి ఇలాంటి ఉత్తమ విషయాలను నిరోధించటం సమంజసమా! వీటిని ప్రబోధించే వ్యక్తిని బెదిరించటం సహేతుకమా??)_ 

 _(5→ ముహమ్మద్ (సల్లం)ను పొద్దస్తమానం వేధిస్తూ వెంటపడిన అబూ జహల్ పోకడలు మంచివేనా? అతని పెడసరి ధోరణి వల్ల మానవతకు కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పండి?)_ 

 _(6→ ఏమిటీ, సర్వోన్నత ప్రభువు అయిన అల్లాహ్, సదా తన చేష్టలను చూస్తూనే ఉంటాడని అబూ జహల్ కు తెలియదా?)_ 

 _(7→ అంటే, దైవప్రవక్త (సల్లం) పట్ల విరోధాన్ని మానుకోకపోతే, ఆయన (సల్లం) నమాజు చేస్తుండగా ఆటంకాలు సృష్టించే పనిని మానుకోకపోతే, మేము వాడి ముంగురులు పట్టి ఈడుస్తాము.)_ 

 _(8→ అంటే, అబూ జహల్ ఇస్లాంకు వ్యతిరేకంగా సత్యవిరుద్ధమైన ప్రగల్భాలు పలికేవాడు. పైగా జంకూ గొంకూ లేకుండా పాపకార్యాలకు పాల్పడేవాడు.)_ 

 _(10→ ఒకవేళ అతను గనక తన భజనపరులను పిలిచివుంటే, అప్పటికప్పుడే దైవదూతలు అతడ్ని పట్టుకుని శిక్షించి ఉండేవారు.)_ 

మొత్తానికి దైవప్రవక్త (సల్లం) ఇంత గద్దించినా అబూ జహల్ మాత్రం తన వైఖరిని వీడలేదు. మరింత చెలరేగిపోయాడు.

 *అబూ జహల్ అకృత్యాల గురించి మరో సంఘటన : -* 

కాబా గృహాన్ని కేవలం ఏకేశ్వరారాధన కోసం ప్రవక్త ఇబ్రాహీం (అలైహి), ఆయన కుమారుడు ఇస్మాయీల్ (అలైహి) కలసి నిర్మించిన దేవాలయం. కాని, ప్రజలు ఈ వాస్తవాన్ని విస్మరించి అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించసాగారు. ఇప్పుడు అంతిమ దైవప్రవక్తగా మహనీయ ముహమ్మద్ (సల్లం) దాన్ని ఏకేశ్వరాలయంగా పునరుద్ధరించడానికి నడుం బిగించారు. దాని కోసం ఆయన (సల్లం) నమాజు వేళల్లో కాబాలయానికి వెళ్ళి నమాజ్ చేయడం ప్రారంభించారు. నమాజు ముగిసిన తరువాత అవకాశం లభిస్తే ప్రజలకు దైవసందేశం వినిపించడానికి కూడా ప్రయత్నించేవారు.

అయితే బహుదైవారాధకులు దాన్ని సహించేవారు కాదు. దైవప్రవక్త (సల్లం)ను అసహ్యించుకునేవారు. కొందరు దూషణలకు కూడా పాల్పడేవారు.

ఒకరోజు దైవప్రవక్త (సల్లం) విశ్వప్రభువు నిర్దేశించిన పధ్ధతి ప్రకారం కాబాలయంలో నమాజు చేయసాగారు. ఖురైషీయులు ఈ పద్ధతి చూసి ముఖ౦ చిట్లించుకున్నారు. వారిలో, దుర్మారుగుడు "అబూ జహల్" కూడా ఉన్నాడు. అపుడు అబూ జహల్,ఖురైష్ సర్దారులను సంబోధిస్తూ...., 

అబూ జహల్ : - (ఖురైషీయులారా!) ముహమ్మద్ (సల్లం) మీ ముందే తన ముఖానికి మట్టిని పులుముకుంటున్నాడు కదా (అంటే సజ్దా చేస్తున్నాడని అర్థం. ఇది కక్షతో పలికిన పలుకులు)!

దానికి ఖురైషీయులు, "అవును" అని సమాధానమిచ్చారు.

అబూ జహల్ : - లాత్, ఉజ్జా దేవుళ్ళ సాక్షి! నేను అతణ్ణి (ఈ పరిస్థితిలో) గనక చూస్తే, అతని మెడను కాళ్ళ క్రింద వేసి తొక్కేస్తాను, అతని ముఖాన్ని మట్టి పట్టేటట్టు నలిపేస్తాను. (అని ప్రతిజ్ఞ చేశాడు)

ఆ తరువాత అబూ జహల్, దైవప్రవక్త (సల్లం)ను నమాజు చేస్తూ ఉండగా చూసి, ఆయన (సల్లం) మెడను తొక్కేద్దామనే ధీమాతో ఆయన (సల్లం) వైపు నడిచాడు. అలా రెండడుగులు వేయగానే, తన రెండు చేతులతో దేని నుండో రక్షణ పొందటానికి ఊపుతూ వెంటనే తిరుగుముఖం పట్టి వచ్చేశాడు. అబూ జహల్ వాలకం చూసిన ఖురైషీయులు నిర్ఘాంతపోయారు. అపుడు ఖురైషీయులు, అతణ్ణి ఉద్దేశించి....,

ఖురైషీయులు : - ఓ అబుల్ హకం! ఏదో చేస్తానని వెళ్ళావ్ కదా! ఏమైంది నీకు? 

అబూ జహల్ : - నాకూ, ఆయన (సల్లం)కు నడుమ ఓ అగ్ని గుండం అడ్డంగా ఉంది. అబ్బో అది ఎంతో భయాన్ని గొలుపుతోంది.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), ఈ సంఘటనను గురించి తన అనుచరులకు వివరిస్తూ...., “అతనే గనక నా దగ్గరకు వచ్చి ఉంటే దైవదూతలు అతని అవయవాలను ఒక్కొక్కటిగా మాయం చేసేవారే” అని సెలవిచ్చారు.

దైవప్రవక్త (సల్లం)గారి ఎడల ప్రజల్లో ఉన్న మర్యాద, గౌరవం, అందరిలోకెల్లా ఆయన (సల్లం) ప్రత్యేక వ్యక్తిత్వం, ఔన్నత్యం విషయంలో ఎంతమాత్రం సందేశం లేదు. అయినప్పటికి ఆయన (సల్లం)పై ఈ హింసాదౌర్జన్యాలు, ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. మక్కాలో ఆయన అందరికంటే గౌరవనీయుడు. దానికితోడు అబూ తాలిబ్ ఆయన (సల్లం)ను రక్షణ కవచంగా కాపాడుతూనే ఉన్నా అంత కఠినంగా హింసించడం జరుగుతూనే ఉంది. ఇక సాధారణ ముస్లిములపై జరుగుతున్న ఆగడాలు సరేసరి. ముఖ్యంగా వారిలోని బలహీన వర్గాలకు చెందినవారిపై జరుపుతున్న అత్యాచారాలకు ఇక అడ్డేముంటుంది. అవి మరింత దారుణంగా, భయంకరంగా ఉండేవి. ప్రతి తెగ, ముస్లిములుగా మారిన తనవారిని రకరకాలుగా శిక్షించేది. ఇక తెగ, వంశం ఏదీ లేని అనామకులపై అక్కడి అల్లరిమూకల్ని ఉసిగొల్పి ఖురైష్ సర్దారులు ఆనందించేవారు, ఆ ఆగడాలను విని ఎంత కఠిన హృదయుడైన చలించిపోతాడు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment