128

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 128*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 43* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 *అవిశ్వాసులు మహానీయ ముహమ్మద్ (సల్లం)ను అగౌరవంపాలు చేసే సందర్భం* 

దైవప్రవక్త (సల్లం) పెదనాన్న "అబూ లహబ్" వీలు చిక్కినప్పుడల్లా దైవప్రవక్త (సల్లం)ను వేధించడం మొదలెట్టాడు. అతని భార్య "ఉమ్మె జమీల్" కూడా భర్త (అబూ లహబ్)కు ఏమాత్రం తీసిపోలేదు. ఆమె దైవప్రవక్త (సల్లం) ఇంటి ముంగిట కసువు, ఇతర మాలిన్యాలను పోసేది. అప్పుడప్పుడు దైవప్రవక్త (సల్లం) నడిచే బాటలో ముండ్లకంప కూడా పడవేసేది.

అబూ లహబ్ భార్య "ఉమ్మె జమీల్". ఆమెను "ఉర్వా"గా కూడా పిలుస్తారు. ఈమె "హరబ్ బిన్ ఉమయ్యా" కుమార్తె మరియు "అబూ సుఫ్యాన్" సోదరి కూడా. ఆమె కూడా దైవప్రవక్త (సల్లం) ఎడలగల శతృత్వంలో తన భర్తకు ఏమీ తీసిపోలేదు. దైవప్రవక్త (సల్లం) నడిచే బాటలో, గుమ్మం ముందు రాత్రి పూట చీకటిలో ముళ్ళను పరిచేది. దుర్భాషలాడేది. తన నాలుకకు కళ్ళెం లేకుండా ప్రవక్త (సల్లం) గురించి దుష్ప్రచారం చేసేది. ఆయన (సల్లం)ను తిట్టి శాపనార్థాలు పెట్టడం, నిందలు, అపవాదులు వేయడం, ఆయన (సల్లం)కు వ్యతిరేకంగా విషాన్ని వెదజల్లడం, భయంకర యుద్ధ వాతావరణాన్ని సృష్టించటం ఆమె పనిగా పెట్టుకుంది. అందుకని "దివ్యఖుర్ఆన్" ఆమెను “హమ్మాలతల్ హతబ్ (కట్టెలు మోసేది)" అనే ఖితాబునిచ్చింది. (కట్టెలు మోయడం అంటే జగడాలు సృష్టించడం అనేది అరబిక్ సామెత).

 *"దివ్యఖుర్ఆన్"* లో తన భర్త అభిశంసన అవతరించిందన్న విషయం తెలుసుకోగానే దైవప్రవక్త (సల్లం)ను వెదుకుతూ బయలుదేరింది ఉమ్మె జమీల్. మహాప్రవక్త (సల్లం) దైవగృహమైన కాబా దగ్గర "మస్జిదె హరామ్"లో కూర్చుని ఉన్నారు. ఆయన (సల్లం) ప్రక్కన అబూ బక్ర్ (రజి) కూడా ఉన్నారు. కంకర రాళ్ళు ఆమె పిడికిట ఉన్నాయి. ఆమె వారి ముందుకు రాగానే దైవప్రవక్త (సల్లం) ఒక్కరే అగుపడకుండా "అల్లాహ్" ఆమె దృష్టిని పోగొట్టాడు. కేవలం ఒక్క అబూ బక్ర్ (రజి)నే చూడగలిగింది. అబూ బక్ర్ (రజి) ముందుకు, ఉమ్మె జమీల్ రాగానే....,

ఉమ్మె జమీల్ : - అబూ బక్ర్ (రజి)! నీ మిత్రుడు ఎక్కడ? నన్ను తూలనాడుతున్నాడు అని నాకు తెలిసింది. అతనే గనక నాకు కనబడితే అతని ముఖంపై ఈ కంకర రాళ్ళు విసరికొడతాను. నేను కూడా పద్యాలు చెప్పగలను.

అని చెబుతూ ఇలా కవిత్వం చెప్పనారంభించింది.

“మేము ‘ముజమ్మమ్’ ★ ను ధిక్కరించాము, అతని ఆదేశాన్ని ఉలంఘించాము, అతని ధర్మాన్ని అసహ్య దృష్టితో చూశాము, దాన్ని వదిలిపెట్టాము.”

 _(★ → బహుదైవారాధకులు అక్కసుగా "ముహమ్మద్" అనే పదాన్ని "ముజమ్మమ్" అని పలికేవారు. ముహమ్మద్ కు వ్యతిరేక పదం అది. "ముహమ్మద్" అంటే శ్లాఘనీయుడు అని, "ముజమ్మమ్" అంటే నిందింపదగినవాడు అని అర్థం)_ 

ఇలా చెప్పిన తరువాత వెనక్కు మరలి వెళ్ళిపోయింది. అపుడు అబూ బక్ర్ (రజి) దైవప్రవక్త (సల్లం) తో....,

అబూ బక్ర్ : - ప్రవక్తా (సల్లం)! ఆమె మిమ్మల్ని చూడలేదా?

ముహమ్మద్ (సల్లం) : - లేదు, ఆమె నన్ను చూడలేదు. "అల్లాహ్" ఆమెను గ్రుడ్డిదానిగా చేశాడు.

"అబూబక్ర్ బజాజ్" కూడా ఈ సంఘటనను ఉల్లేఖించటం జరిగింది. ఆ ఉల్లేఖనంలో అదనంగా ఈ పదాలు కూడా ఉన్నాయి.

ఆమె అబూ బక్ర్ (రజి) దగ్గర నిలబడి, "అబూ బక్ర్! నీ సహచరుడు మా “హజ్జో” చేస్తున్నాడు (అంటే మమ్మల్ని కవనంలో తిడుతున్నాడు అని అర్థం)" అని చెప్పగా, ఆయన (అబూ బక్ర్) దాన్ని ఖండిస్తూ, "కాదు! ఈ కట్టడం యజమాని అయిన "అల్లాహ్" సాక్షిగా! ఆయన (సల్లం) కవిత్వం చెప్పడం గాని, దాన్ని వల్లించడం గాని ఎన్నడూ చేయలేదు" అన్నారు. ఆమె దానికి "నీవు నిజమే చెబుతున్నావు" అని చెప్పి వెళ్ళిపోయింది. 

 *పొరుగింటి వారితో పడరాని పాట్లు : -* 

అబూ లహబ్, దైవప్రవక్త (సల్లం)కు పొరుగువానిగా ఉంటూనే ఇలా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అతని ఇల్లు, ప్రవక్త(సల్లం) గారి ఇంటిని ఆనుకునే ఉండేది. అలాగే ఇతర పొరుగువారు కూడా ఆయన (సల్లం)ను, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు బాధలకు గురిచేస్తూ ఉండేవారు.

ఇబ్నె ఇస్'హక్ కథనం ప్రకారం, దైవప్రవక్త(సల్లం)ను ఆయన ఇంటిలో భాధించేవారు అబూ లహబ్, హకమ్ బిన్ అబిల్ ఆస్ బిన్ ఉమయ్యా, ఉక్బా బిన్ అబీ ముఅయిత్, అద్దీ బిన్ హమ్రా సకఫీ, ఇబ్నుల్ అస్దా హుజ్లీలు. వీరంతా ఆయన (సల్లం)కు పొరుగున ఉంటున్నవారే. వీరిలో "హకమ్ బిన్ అబిల్ ఆస్" తప్ప ఎవ్వడూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. వారి హింసల తీరు ఎలా ఉండేదంటే, ఆయన (సల్లం) నమాజు చేస్తున్నప్పుడు వారిలో ఎవడో ఒకడు మేక గర్భాశయాన్ని ఆయన (సల్లం)పై పడేటట్లు విసిరేసేవాడు. పొయ్యిపై పాత్రను ఎక్కించి వారు మేక గర్భాశయాన్ని అందులో పడేటట్లు చేసేవారు. అది వారి వంటకపు ఆచారం. దైవప్రవక్త (సల్లం) ఇక చేసేదిలేక ఓ గూడు కట్టుకుని అందు నిలబడి నమాజు చేస్తూ తనను తాను రక్షించుకునేవారు.

మొత్తానికి ఈ అశుద్దాన్ని ఆయన (సల్లం)పై విసిరినపుడల్లా ఆయన (సల్లం) దాన్ని ఓ కర్రకు తగిలించుకుని బయటకు తెచ్చి గుమ్మంలో నిలబడి, “ఓ అబ్దే మునాఫ్! ఇదేనా పొరుగువారు చేసే పని” అని అడిగి దాన్ని పారవేసేవారు.

 *వేరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

దైవప్రవక్త (సల్లం) నివసిస్తున్న ఇంటికి పొరుగునే "అబూ లహబ్" ఇల్లు ఉంది. ఆ రెండు ఇళ్ళను వేరుచేస్తూ మధ్యలో ఒక పిట్టగోడ ఉంది. అందువల్ల అబూ లహబ్, అతని భార్య ఉమ్మె జమీల్ వీలు చిక్కినప్పుడల్లా ఆయన (సల్లం)ను వేధించడానికి ప్రయత్నించేవారు.

ఒకరోజు అబూ లహబ్ ఇంటికి వస్తూ దారిపక్క పడివున్న మేక పేగులు తీసుకొని వచ్చాడు. దాన్ని (తన భార్య) ఉమ్మె జమీల్ కి ఇచ్చాడు. ఉమ్మె జమీల్ అవకాశం చూసి ఆ పేగుల్ని పిట్టగోడ మీద ఉంచి నక్కి చూడసాగింది. అప్పుడు దైవప్రవక్త (సల్లం) తమ ఇంటి ముంగిట నమాజ్ చేస్తున్నారు. ఆయన (సల్లం) సజ్దాలోకి పోగానే ఉమ్మె జమీల్, ఆ మేక పేగుల్ని ఆయన (సల్లం) మీదికి విసిరి పడేసింది. దాంతో ఆ పేగుల్లోని మలినమంతా దైవప్రవక్త (సల్లం) శిరస్సు, బట్టలపై పడి దుర్వాసన వెలువడింది. దైవప్రవక్త (సల్లం) సజ్దా నుండి తల పైకెత్తి చూశారు. ఉమ్మె జమీల్, ఆమె భర్త అబూ లహబ్ విరగబడి నవ్వుతూ నిల్చున్నారు.

అంతలో హజ్రత్ ఖదీజా (రజి) లోపలి నుంచి బయటికి వచ్చారు. దైవప్రవక్త (సల్లం)పై పడిన పేగులు, మలినం చూసి ఎంతో బాధపడ్డారు. వెంటనే వాటిని తుడిచి నీళ్ళతో కడిగారు.

అవిశ్వాసులు ఎన్నెన్ని అకృత్యాలకు పాల్పడినా దైవప్రవక్త (సల్లం) చూస్తూ సహించడం తప్ప పల్లెత్తుమాట అనేవారుకాదు.

 *తబ్బత్ యదా అబీలహబివ్ఁ వతబ్బ్ (1). మా అగ్'నా అన్'హు మాలుహూ వమా కసబ్ (2). సయస్'లా నారన్'జాత లహబ్ (3). వమ్ రఅతుహూహమ్మా లతల్ హతబ్ (4). ఫీ జీదిహా హబ్'లుమ్ మిమ్ మసద్ (5). (ఖుర్ఆన్ 111:1-5)* 

 _( ↑ పై దివ్యఖుర్ఆన్ వాక్యాల తెలుగు తర్జుమా ↓ )_ 

 *అబూ లహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి. వాడు సయితం నాశనమైపోయాడు (1). వాడి ధనంగానీ, వాడి సంపాదన గాని వాడికేమాత్రం పనికిరాలేదు (2). త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు (3). ఇంకా అతని భార్య, పుల్లలు మోసేఆమె కూడా (నరకానికి పోతుంది) (4). ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది (5).* 

 _(అబూ లహబ్ అసలు పేరు అబ్దుల్‌ ఉజ్జా. తన అందచందాల రీత్యా, దేదీప్యమానమైన ముఖవర్చస్సు దృష్ట్యా అతను అబూలహబ్ (జ్వాలాముఖి)గా పిలువబడేవాడు. ఇకపోతే; పరిణామం రీత్యా కూడా అతడు అగ్నిజ్వాలలకే ఆహుతి కావలసి ఉంది. చూడబోతే అతడు మహాప్రవక్త (సల్లం)కు స్వయాన పినతండ్రి. కాని సైద్ధాంతికంగా మాత్రం మహాప్రవక్త (సల్లం)కు బద్ధవిరోధి. అతని భార్య ఉమ్మె జమీల్ కూడా శత్రుత్వంలో భర్తకు ఏ మాత్రం తీసిపోదు.)_ 

 _1 → (సాధారణంగా పెద్ద నష్టం సంభవించినప్పుడు చేతులు విరిగిపోయాయి అంటారు. అబూ లహబ్ పతనాన్ని సూచించే పలుకులు ఇవి. వాడు మహాప్రవక్త (సల్లం)ను శపించిన సంగతి తెలిసిందే. కాని దేవుడు వాడి శాపాన్ని వాడి పైన్నే తిప్పికొట్టాడు. అంతే కాదు, చాలా శీఘ్రంగానే వాడు చావనున్నాడన్న సంగతి కూడా ఈ సూరాలో తెలుపబడింది. చెప్పినట్లే జరిగింది కూడా._ 

 _బద్ర్ యుద్ధం జరిగిన కొన్నాళ్ళకే వాడు (అబూ లహబ్) ప్లేగు లాంటి ఒక విచిత్రమైన రోగంతో, కుళ్ళి, కృశించి చచ్చాడు. అతని కుటుంబసభ్యులెవరూ అతని దగ్గరకు పోలేదు. మూడు రోజుల వరకూ శవం అలాగే పడి ఉండింది. కుళ్ళి కంపుకొట్ట సాగింది. ఎట్టకేలకు అతని కొడుకులు, అంటు వ్యాధులు వ్యాపిస్తాయేమోనన్న భయంతో అసహ్యించుకుంటూనే అల్లంత దూరం నుంచి అతని శరీరంపై రాళ్లు, మట్టి వేసి పూడ్చివేశారు. (ఐసరుత్తఫాసీర్))_ 

 _2 → (సంపాదనలో అతని పదవులు, పరువుప్రతిష్టలు, సంతానం - అన్నీ 2 చేరిఉన్నాయి. అంటే దేవుడతన్ని శిక్షించదలుచుకున్నప్పుడు అతని ఆస్తిపాస్తులుగానీ, అలుబిడ్డలుగానీ, అధికారాలుగానీ ఏమీ ప్రయోజనం కాలేకపోయాయి.)_ 

 _4 → (అంటే ఆమె నరకంలో కట్టెలు మోనుకుంటూ వచ్చి తన భర్త (అబూ లహబ్‌)ను కాల్చే అగ్ని పై వేస్తూ ఉంటుంది. దాంతో ఆ అగ్ని మరింతగా మండుతుంది. ఇదంతా దేవుని తరఫున విధించబడినది. ఎందుకంటే ఆమె ఇహలోకంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ విశ్వాసులను అవమానపరిచేది. పరలోకంలో కూడా తన భర్తను శిక్షించటంలో తోడ్పడుతుంది. (ఇబ్నె కసీర్)_ 

 _మరికొన్ని ఆధారాల ప్రకారం ఆమె (ఇహలోకంలో) ముళ్ళ చెట్లు మోసుకుంటూ వచ్చి దైవప్రవక్త (సల్లం) మార్గంలో వేసేది. వేరొక ఆధారం ప్రకారం చాడీలు చెప్పే దురలవాటును ఎత్తిచూపటానికి ఇలా అనబడింది. ఈమె ఖురైషు అవిశ్వాసుల వద్దకు వెళ్ళి దైవప్రవక్త (సల్లం)ను పరోక్షంగా నిందించేది. దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా జనులను రెచ్చగొట్టేది.) (ఫత్'హుల్ బారీ)_ 

మహానీయ ముహమ్మద్ (సల్లం)ని బాధలకు గురిచేస్తూ, ఆగని అవిశ్వాసుల ఆగడాలు Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment