127

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 127*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 42* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 *సూరతుల్ కాఫిరూన్ అవతరణ : -* 

ఓ రోజు కాబా దగ్గర కొందరు అవిశ్వాసులు (ఖురైషీయులు) గుమికూడి ముహమ్మద్ (సల్లం) గురించి వింతగా చెప్పుకుంటున్నారు.

“ముహమ్మద్ (సల్లం) చెప్పే వింతమాటలు విన్నారు కదా! మనం చచ్చిపోయాక మళ్ళీ బ్రతికించబడతామట! ఇక్కడ చేసిన కర్మల్ని గురించి ప్రశ్నించడం జరుగుతుందట!! సత్కర్మలకు సత్ఫలం, దుష్కర్మలకు దుష్ఫలం లభిస్తుందట!!! అయ్యో! ఎప్పుడైనా విన్నామా మనం ఇలాంటి మాటలు? ఆ పైన స్వర్గనరకాలు కూడా ఉంటాయట!” అని అన్నాడు ఆ ఖురైషీయులలోని ఓ వ్యక్తి.

“ఇదంతా ఎందుకు? ముహమ్మద్ (సల్లం)నే పిలవండి. అతను (సల్లం) చెప్పింది నిజమైతే ఋజువు చూపమని అడుగుదాం. అబద్దమయితే అతడ్ని హింసించడానికి మనకు సాకు దొరుకుతుంది. అప్పుడు మన చర్యలకు పల్లెత్తి మాట్లాడే వాడుండడు” అన్నాడు మరో వ్యక్తి.

 _(ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం, ఈ సమయంలో మహానీయ ముహమ్మద్ (సల్లం) కాబా ప్రదక్షిణ చేస్తున్నారు. అప్పుడు కొంతమంది ఖురైష్ నాయకులు, ఆయన (సల్లం)తో భేటి అయినప్పుడు "సూరతుల్ కాఫిరూన్" అవతరించింది. ఆధారాలతో సహా ఉన్న ఈ హాదీసునే మనం పరిగణలోకి తీసుకోవాలి.)_ 

ఖురైషీయులు, ముహమ్మద్ (సల్లం)తో....,

ఖురైషీయులు : - ముహమ్మద్ (సల్లం)! సొంతజాతికే ఎసరుపెట్టే నీలాంటి వాడ్ని మేము ఇదివరకెన్నడూ చూడలేదు. అనాదిగా వస్తున్న మా మతంలో తప్పులు పడుతున్నావు. మా దేవతల్ని నిందిస్తున్నావు. మా తాతముత్తాతలను తెలివిమాలినవారిగా జమకట్టావు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా?
               ముహమ్మద్ (సల్లం)! ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. మా మాట విన్నావంటే మేము నిన్ను గుండెలకు హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

ముహమ్మద్ (సల్లం) : - ముందు విషయం ఏమిటో చెప్పండి?

ఖురైషీయులు : - నీవు మా దేవతలను విమర్శించడం మానుకుంటే మేము నీకు మా అందరిలో గొప్ప ధనికుడయ్యేటంత ఎత్తున ధనం సేకరించి ఇస్తాం. నీవు కోరిన స్త్రీని తెచ్చి నీకు పెళ్ళి చేస్తాం. మేము ప్రతి విషయంలో నీ వెనకాలే నడుస్తాం. నీకు ఈ మాట నచ్చకపాతే మేము మరొక విషయం ప్రతిపాదిస్తాం!

ముహమ్మద్ (సల్లం) : - ఏమిటా విషయం?

ఖురైషీయులు : - ఒక సంవత్సరం మీరు మా దేవతలు లాత్, ఉజ్జాలను ఆరాధించండి. మరొక సంవత్సరం మేము మీ దేవుడ్ని ఆరాధిస్తాం.

దైవప్రవక్త (సల్లం) : - సరే, కొంచెం ఆగండి. నా ప్రభువు దగ్గరనుండి ఏం ఆజ్ఞ వస్తుందో!

అప్పుడు ఈ అధ్యాయం అవతరించింది. ↓

 *ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (1). లా అఅ్,బుదు మా తఅ్,బుదూన్ (2). వలా అన్'తుమ్ ఆబిదూన మాఅఅ్,బుద్ (3). వలా అన ఆబిదుమ్ మా అబత్'తుమ్ (4). వలా అన్'తుమ్ ఆబిదూన మాఅఅ్,బుద్ (5). లకుమ్ దీనుకుమ్ వలియదీన్ (6). (ఖుర్ఆన్ 109:1-6)* 

 _(↑ పై దివ్యఖుర్ఆన్ వాక్యాల తెలుగు తర్జుమా ↓)_ 

 *(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: "ఓ తిరస్కారులారా! (1). మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు (2). నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు (3). మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను (4). మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు (5). మీ ధర్మం మీది, నా ధర్మం నాది (6)."* 

 _(ఈ సూరాలోని ‘కాఫిరూన్’ (సత్వతిరస్కారులు, విశ్వసించటానికి నిరాకరించినవారు) అనే పదం ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. వారెవరో "అల్లాహ్"కే తెలుసు. ఎందుకంటే ఈ సూరా అవతరించిన తరువాత మక్కాకు చెందిన అనేకమంది అవిశ్వాసులు విశ్వసించి, "అల్లాహ్"ను ఆరాధించారు. (ఫత్'హుల్ ఖదీర్)._ 

 _చెప్పిన విషయమే ఇంకొకసారి చెప్పబడింది. కొంతమంది అనువాదకులు మొదటి వాక్యాలను (2, 3) వర్తమాన కాలంగా, తరువాతి వాక్యాలకు (4,5) భవిష్యత్ కాలంగా తీసుకున్నారు. దీని గురించి మరీ అంతగా సతమతం కావలసిన అవసరం ఏమీ లేదంటారు "ఇమామ్ షౌకానీ". ఎందుకంటే విషయాన్ని నొక్కి వక్కాణించటానికి మాటను పునరావృతం చేయటం అరబీ భాష విశిష్ఠత._ 

 _"దివ్యఖుర్ఆన్"లో కూడా అనేక కోట్ల ఈ శైలి అవలంబించబడింది. ఉదాహరణకు: అర్రహ్మాన్ సూరా, ముర్సలాత్‌ సూరాలలో ఒకే ఆయతు అనేకసార్లు పునరావృతం అవుతుంటుంది. "అల్ కాఫిరూన్" సూరాలో ఒకటికి రెండుసార్లు చెప్పిన మాటే చెప్పటంలోని ఉద్దేశం ఏమిటంటే, “ఓ అవిశ్వాసులారా! మీరంతా కోరుతున్నట్లు నేను ఏకేశ్వరోపాసనా మార్గాన్ని వీడి బహుదైవోపాసనా మార్గాన్ని అవలంబించటమన్నది ఎన్నటికీ జరగని పని. ఒకవేళ దేవుడు మీ నొసట సన్మార్గ భాగ్యం రాసి ఉండకపోతే మీరు ఏకదైవారాధనకు నోచుకోలేరు.)_ 

 *ఖురైషీయుల ఆక్రోశం : -* 

దైవప్రవక్త (సల్లం) ఈ సందేశం వినిపించగానే, ఖురైషీయులు ముక్కుపుటాలు ఎగురేసారు. ఆయన (సల్లం) వైపు కొరకొర చూస్తూ పిడికిళ్ళు బిగించారు.

“నిజంగా నీవు దైవప్రవక్త అయితే మేము అడిగేవి చేసి చూపించు. అప్పుడు నిన్ను నమ్మి నీ మాటలు వింటాము” అన్నాడు ఓ నాయకుడు.

“ఔనౌను. జమ్ జమ్ కంటే మధురంగా ఉండే సెలయేటిని ఇక్కడ సృష్టించమని నీ ప్రభువును అడుగు. పోనీ సిరియా, ఇరాఖ్ దేశాలలో ప్రవహించే నదుల వంటివి అయినా ఇక్కడ ప్రవహింపజేయమను.” అన్నాడు మరొకడు వెంటనే.

“నీవు దైవప్రవక్త అయితే నీ ప్రభువును అడుగు, ఆనందంగా గడపడానికి నీకో ఉద్యానవనం గల రాజమహల్ సృష్టించి, వెండి బంగారాలు, వజ్రవైఢూర్యాలు తెప్పించమను. నీవెం ప్రవక్తవయ్యా! మాలాగే పొట్ట కోసం కాళ్ళు అరిగేలా తిరిగి చెమట కార్చేవాడివి. నీవు కూడా ప్రవక్తవేనా?” మరొక నాయకుడు అన్నాడు వెటకారంగా.

“యమామాలో ఉండే "రహ్మాన్" అనేవాడే కదూ నీకిదంతా నేర్పుతున్నది? అయితే బాగా విను. మేము "రహ్మాన్"ని ససేమిరా నమ్మం. మా కళ్ళముందు నీవు ఆకాశం మీదికి ఎక్కిపోయి నీ ప్రవక్త నియామకం గురించి స్వయంగా దేవుని చేత వ్రాయించి తీసుకురా. దాన్ని చదివితే గాని మేము నిన్ను నమ్మం.” అన్నాడు మరొకతను ఎత్తిపొడుస్తూ.

"మేము కొలిచే దైవకన్యలు దేవుని కుమార్తెలు. కాదంటే దేవుడ్నే సరాసరి మా ముందుకు రప్పించు. లేకపోతే మిన్ను విరిగి మా నెత్తిమీద పడేలా చెయ్యి, చూద్దాం. నువ్వేదో దైవశిక్ష వచ్చిపడుతుందని మమ్మల్ని బెదిరిస్తున్నావుగా! ఆ శిక్ష ఏదో ఇప్పుడే రప్పించు, మేము ఓ సారి కళ్ళారా చూస్తాం అదెలా ఉంటుందో.” అన్నాడు వారిలో వేరొక మూర్ఖుడు.

దానికి మహానీయ ముహమ్మద్ (సల్లం)...., “నా ప్రభువు పవిత్రుడు. నేను ఆయన ఆదేశించినట్లు నడచుకునే ప్రవక్తను మాత్రమే. "అల్లాహ్" అందరికంటే గొప్పవాడు. ఆయన తలచుకుంటే మీరడిగే వస్తువుల కంటే విలువైనవి కూడా నాకు అనుగ్రహిస్తాడు. పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే తియ్యటి సెలయేరులుగల నిత్యనూతన శోభతో అలరారే ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనాలలో అందమైన మేడలు కూడా ప్రసాదిస్తాడు.” అని చెప్పారు ప్రశాంత హృదయంతో.

“ముహమ్మద్ (సల్లం)! మేము నీ ముందు ఎన్నో విషయాలు ఉంచాం. కాని నీవు ఒక్కటి వినలేదు. అన్నిటిని త్రోసిపుచ్చావు. ఇక కాచుకో నిన్ను, నీ శిష్యుల్ని ఏం చేస్తామో చూడు. నిన్ను కాపాడటానికి ఎవరు అడ్డుపడతారో చూస్తాం.” అన్నారు అవిశ్వాసులు బెదిరిస్తూ.

 *హింసా దౌర్జన్యాలు : -* 

●దైవదౌత్యపు నాలుగవ సంవత్సరం ఇస్లామీయ సందేశప్రచారం బహిర్గతమై నలువైపుల మారుమ్రోగుతున్న తరుణంలో, బహుదైవారాధకులు దాన్ని అణచివేయడానికి చేబట్టిన ఎత్తుగడలు, కుతంత్రాలను గురించి పైన చెప్పడం జరిగింది. ఇవన్ని సమయానుసారం కొనసాగుతూపోయాయి. వారాలు, నెలలు గడచిపోయినా అంతకుతప్ప అడుగు ముందుకు వేయలేదు. ఇంకా దౌర్జన్యాన్ని, ఒత్తిడిని ప్రారంభించలేదు. అయితే వారి ఈ ఎత్తుగడలేవి ఇస్లామీయ ధర్మ ప్రచారానికి అడ్డువేయడంలో విఫలమవుతూ ఉన్న కారణంగా అందరూ తిరిగి ఓ చోట సమావేశమయ్యారు. ఇరవై అయిదు మంది ఖురైషీ సర్దారుల ఓ కమిటీ ఎన్నుకోబడింది. దీనికి అధ్యక్షుడు దైవప్రవక్త (సల్లం) పినతండ్రి "అబూ లహబ్".

ఈ కమిటీ పరస్పర అవగాహనతో బాగా అలోచించి దైవప్రవక్త (సల్లం) మరియు ఆయన సహాబా (అనుచరగణం)కు వ్యతిరేకంగా ఓ తిరుగులేని తీర్మానాన్ని మంజూరు చేసింది. ఈ తీర్మానం ప్రకారం, ఇస్లాం ధర్మాన్ని వ్యతిరేకించడానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లం)ను బాధించడం, ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నవారిని రకరకాలుగా హింసించి వారిపై దౌర్జన్యం చేయడంలో ఎలాంటి లోటును రానివ్వకుండా చూడడం.●

●బహుదైవారాధకులు ఈ తీర్మానాన్ని ఆమోదించి దాన్ని అమలు చేయడానికి గట్టి నిర్ణయం చేసుకున్నారు. ముస్లింలు, ముఖ్యంగా బలహీన ముస్లింల విషయంలో ఈ పని చాలా తేలికైనది. అయితే దైవప్రవక్త (సల్లం) విషయంలో మాత్రం పెద్ద చిక్కులు వచ్చిపడతాయి. దైవప్రవక్త (సల్లం) వ్యక్తిగతంగా గౌరవనీయులు, మూర్తిత్వంగలవారు. మిత్రులు, శత్రువులు సైతం ఆయన (సల్లం)ను గౌరవించేవారు. అలాంటి వ్యక్తికి ఎవరు ఎదురుబడ్డప్పటికి అతడు ఆయన (సల్లం)ను గౌరవ దృష్టితోనే పలుకరించేవాడు. ఓ పిచ్చివాడే లేదా నీచుడే ఆయన (సల్లం) ఎడల నీచంగా ప్రవర్తించగలడు.

ఈ వ్యక్తిగత ఔన్నత్యమే కాకుండా ఆయన (సల్లం)కు "అబూ తాలిబ్" అండదండలు కూడా ఉన్నాయి. అబూ తాలిబ్ కు వ్యక్తిగత మరియు సమాజంలో ఉన్న పలుకుబడి కారణంగా, ఏ ఒక్కడూ ఆయన మాటకు ఎదురుచెప్పడం లేదా ఆయన కుటుంబ విషయాల్లో తలదూర్చే ధైర్యం చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితి, ఖురైష్ ను పెద్ద చిక్కుల్లో పడవేసింది. అయితే ఏ సందేశమైతే వారి ధార్మిక పెత్తనాన్ని, ప్రాపంచిక నాయకత్వాన్ని కూకటి వ్రేళ్ళతో పెకలించబోతోందో, ఆ సందేశప్రచారం ఎడల ఎలా ఉపేక్ష చూపడం అన్నది కూడా ఓ గొప్ప ప్రశ్నే.

ఎట్టకేలకు బహుదైవారాధకులు "అబూ లహబ్" నాయకత్వంలో దైవప్రవక్త (సల్లం) మరియు ముస్లింలపై హింసా దౌర్జన్యాల పరంపరను ప్రారంభించారు. నిజానికి, ఖురైషులు ఈ విధానాన్ని ఆలోచించక పూర్వం నుండే అబూ లహబ్ వైఖరి మాత్రం, దైవప్రవక్త (సల్లం) గారి ఎడల అంత కఠినంగానే ఉంటూ వచ్చింది. అతను "బనీ హాషిమ్" (విందులో) సమావేశమైనప్పుడు చేసిన నిర్వాకం, ఆ తరువాత "సఫా" కొండపై ప్రవర్తించిన తీరు గురించి మనం వెనుకటి పుటలో చదువుకున్నదే. కొన్ని ఉల్లేఖనాల్లో "సఫా" కొండపై అతను (అబూ లహబ్) దైవప్రవక్త (సల్లం)ను కొట్టడానికి ఓ రాయిని కూడా చేతిలోకి తీసుకున్నట్లు ఉంది.●

దైవదౌత్యానికి పూర్వం అబూ లహబ్ ఇద్దరు కుమారులు “ఉత్బా” మరియు “తైబా”ల వివాహం దైవప్రవక్త (సల్లం) గారి ఇద్దరు కుమార్తెలు “రుకయ్యా” మరియు “ఉమ్మె కుల్సూమ్” తో జరిగి ఉంది. అయితే దైవదౌత్య పదవి లభించాక అతను (అబూ లహబ్) ఎంతో కఠినంగా ప్రవర్తిస్తూ వారిద్దరికి తలాక్ (విడాకులు) ఇప్పించాడు.

అలాగే, దైవప్రవక్త (సల్లం) రెండవ కుమారుడు "అబ్దుల్లాహ్" చనిపోయినప్పుడు అబూ లహబ్ ఎంతో సంబరపడిపోతూ తన మిత్రుల దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి, “ముహమ్మద్ ‘అబ్తర్’ (వంశహీనుడు) అయిపోయాడని” శుభవార్తనందించాడు. "హజ్" కాలంలో అబూ లహబ్ దైవప్రవక్త (సల్లం) సందేశాన్ని ఖండించడానికి ఆయన (సల్లం) వెనుకాల, సంతల్లో జరిగే సమావేశాల్లోనికి వెళ్ళేవాడు అన్న విషయం మనకు తెలిసిందే. "తారిక్ బిన్ అబ్దుల్లాహ్ ముహారబీ" ఉల్లేఖనం ద్వారా తెలిసేదేమిటంటే, ఇతను కేవలం ఆయన (సల్లం)ను ఖండిచడం మట్టుకే సరిపెట్టుకునే వాడుకాదు, రాళ్ళు కూడా విసిరేవాడు, ఆ రాళ్ళు విసరడం వల్ల ఆయన (సల్లం) మడిమలు రక్తసిక్తమైపోయేవి.

 *దైవప్రవక్త (సల్లం) కుమార్తెల విడాకుల విషయంలోని మరింత వివరణ : -* 

అవిశ్వాసులు ఈ సారి మరో ఎత్తుగడ వేసారు. దైవప్రవక్త (సల్లం) కుమార్తెలను వారి భర్తల నుండి శాశ్వతంగా వేరుచేసి కసి తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఓ రోజు వారు (ఖురైషీయులు) దైవప్రవక్త (సల్లం) పెద్దల్లుడు "అబుల్ ఆస్ బిన్ ఉమయ్యా" చుట్టూ చేరి "జైనబ్ (రజి) బిన్తే ముహమ్మద్ (సల్లం)"కు విడాకులివ్వమని ఒత్తిడి చేశారు. కాని "అబుల్ ఆస్" నిరాకరిస్తూ....,

అబుల్ ఆస్ : - ఇది మా భార్యా భర్తల వ్యవహారం. మీరు అనవసరంగా నా మీద ఒత్తిడి తీసుకురాకండి. జైనబ్ (రజి), తన తండ్రి ధర్మం అవలంభించిందని నాకు తెలుసు. దానివల్ల ఏమవుతుంది? ఆమె నా భార్య. నేను ఆమెను విడచి ఒక్కక్షణం కూడా ఉండలేను.

అవిశ్వాసులు (ఖురైషీయులు) తమపట్టు విడవకుండా...., “నీవు జైనబ్ (రజి)కు విడాకులిస్తే, మేము నువ్వు కోరుకున్న యువతితో నీ పెళ్లి చేస్తాం” అన్నారు.

అబుల్ ఆస్ : - దైవసాక్షిగా చెబుతున్నాను. జైనబ్ (రజి) నాకెంతో ప్రియమైన భార్య. నేను ఆమెను ఎలాంటి పరిస్థితిలోనూ వదలిపెట్టను. (కరాఖండిగా)

అవిశ్వాసులు ఈ మాటలు విని అతడ్ని దూషిస్తూ వెళ్ళిపోయారు. (ఆ తర్వాత) వారు "అబూ లహబ్" దగ్గరకు పోయి అతని కోడళ్ళకు విడాకులిప్పించి పంపేయమని చెప్పారు.

అబూ లహబ్, దైవప్రవక్త (సల్లం)కు స్వయాన పెదనాన్న అయినప్పటికీ "ఇస్లాం" ధర్మాన్ని తిరస్కరించి ఆయన (సల్లం)పై కక్ష పెంచుకున్నాడు. అందువల్ల అవిశ్వాసుల ప్రతిపాదన వినగానే అతను తన కొడుకులు "ఉత్బా బిన్ అబూ లహబ్" మరియు "ఉతైబా బిన్ అబూ లహబ్"లకు చెప్పి, "రుఖియా బిన్తే ముహమ్మద్ (సల్లం)" మరియు "ఉమ్మెకుల్సూమ్ బిన్తే ముహమ్మద్ (సల్లం)"లకు విడాకులు ఇప్పించాడు.

అంతటితో ఊరుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా దైవప్రవక్త (సల్లం)ను వేధించడం మొదలెట్టాడు. అతని భార్య "ఉమ్మె జమీల్" కూడా భర్త (అబూ లహబ్)కు ఏమాత్రం తీసిపోలేదు. ఆమె దైవప్రవక్త (సల్లం) ఇంటి ముంగిట కసువు, ఇతర మాలిన్యాలను పోసేది. అప్పుడప్పుడు దైవప్రవక్త (సల్లం) నడిచే బాటలో ముండ్లకంప కూడా పడవేసేది.

ఈ విషయంలోని వివరణను మరియు తరువాత జరిగినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment