124

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 124*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 39* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 _(నిన్నటి భాగముతో కలిపి చదవాలని మనవి)_ 

 *అబూ తాలిబ్ వద్దకు వెళ్ళిన ఖురైష్ ప్రతినిధి బృందం : -* 

ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం, ఖురైష్ కు చెందిన కొందరు పెద్ద మనుషులు అబూ తాలిబ్ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు.

“ఓ అబూ తాలిబ్! నీ సోదర కుమారుడు మా దేవతల్ని నిందిస్తున్నాడు. మా మతాన్ని తప్పుపడుతున్నాడు. మేమంతా మందబుద్ధిగల వాళ్ళమట. మా తాతముత్తాతలు మార్గభ్రష్టులట. నీవు ఆయన (సల్లం)ను అలా అనకుండా వారిస్తావా లేదా మా మధ్య నుండి తప్పుకుంటావా? నీవు కూడా మాలాగే అతను భోదించే ధర్మాన్ని వ్యతిరేకమైన ధర్మాన్నే అనుసరిస్తున్నావు కనుక, అతన్ని వారించడానికి మేము చాలు” అన్నారు. జవాబుగా అబూ తాలిబ్ వారితో సద్వర్తనతో మెలుగుతూ ఏదో నచ్చజెప్పి వెనక్కు పంపించివేశారు. దైవప్రవక్త (సల్లం) మాత్రం తన మార్గాన్నే అనుసరిస్తూ అల్లాహ్ ధర్మాన్ని వ్యాపింపజేయడానికి సందేశాన్ని అందిస్తూనే ఉన్నారు.

 *"హజ్" యాత్రికులు ప్రవక్త (సల్లం) మాటలను వినకుండా చేసేందుకు సలహా సంఘం ఏర్పాటు* 

ఆ రోజుల్లోనే ఖురైష్ కు మరో చిక్కు ఎదురైంది. అంటే, బాహాటంగా దైవసందేశ ప్రచారం ఆరంభమై కొన్ని నెలలు గడిచాయో లేదో హజ్ కాలం వచ్చేసింది. అరేబియా మూలమూలల నుండి గుంపులు గుంపులుగా హజ్ యాత్రికులు మక్కాకు వస్తారన్న విషయం ఖురైషులకు బాగా తెలుసు. అందుకని ఆ హజ్ యాత్రికులు ముహమ్మద్ (సల్లం) గారి మాటలకు ప్రభావితులు కాకుండా ఉండాలంటే, ఏదో ఒకటి వారి మనస్సుల్లో నాటాల్సి వస్తుంది. కావున వారందరూ ఈ విషయాన్ని చర్చించేందుకు “వలీద్ బిన్ ముగైరా” ఇంట సమావేశమయ్యారు. అపుడు "వలీద్ బిన్ ముగైరా"....,

వలీద్ : - సోదరులారా! ముహమ్మద్ (సల్లం) ప్రచారంతో అతని అనుచరుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అతడిని గట్టిగా ప్రతిఘటించకపోతే త్వరలోనే మనం సమాజంలో అప్రతిష్ఠపాలు కావలసి వస్తుంది. అంచేత వెంటనే అతని మీద తగిన చర్య తీసుకోవాలి. హజ్ దినాలు వస్తున్నాయి. బయటి నుంచి అనేక మంది యాత్రికులు వస్తారు. మనమంతా తక్షణమే ఒక నిర్ణయానికి రావాలి.
           ఈ విషయమై మీరందరూ ఒకే ఒక మాట మీద నిలబడాలి. మీలో ఎలాంటి అభిప్రాయభేదం ఉండడానికి వీల్లేదు. మీలోనే ఒకడు చెప్పింది మరో వ్యక్తి ఖండించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

“కానీయండి! ఏం చెబుతారో మీరే చెప్పండి.” అని అక్కడ హాజరైన ఖురైషీయులు "వలీద్" అనే అడిగారు.

వలీద్ : - లేదు, మీరే చెప్పండి. నేను వింటాను.

దానికి ఆ ఖురైషీయులలో ఒకరు, “అతను (ముహమ్మద్-సల్లం) ఓ కాహిన్ (జ్యోతిష్యుడు) అని ప్రచారం చేద్దాం." అన్నారు.

“లేదు, దైవసాక్షి! అతను కాహిన్ కాడు. మనం చాలా మంది కాహిన్ లను చూశాం. అతనిలో కాహిన్లలో ఉన్న గొణుగుడు లేదు. వారిలా మాట్లాడేవాడు కాదు.” అని సమాధానం ఇచ్చాడు వేరొకతను.

“అలా కాకపోతే అతడి (ముహమ్మద్-సల్లం)ని ఓ ఉన్మాదిగా చిత్రిద్దాం." అని వారిలోనే ఇంకొకరు అన్నారు.

“అబ్బే! ఇతను ఉన్మాది కూడా కాడు. మనం చాలా మంది పిచ్చి వాళ్ళను, ఉన్మాదుల్ని చూశాం. వారి పరిస్థితిని కూడా గమనించినవాళ్ళం. ఆ వ్యక్తిలో (ముహమ్మద్-సల్లం లో) ఉన్మాదుల్లాంటి ఏ సూచనా మనకు కానరాదు. వారిలా పిచ్చిపిచ్చి ప్రేలాపనలు కూడా అతను చేయడం లేదు.” అని దానికి సమాధానంగా మరొకరు.

“మరైతే అతను ఓ కవి అని వారిని నమ్మబలుకుదాం” అని ఒకరి సలహా! 

వలీద్ బిన్ ముగైరా : - అతను కవి కూడా కాదు. మనకు కవిత్వానికి సంబంధించిన ఛందస్సు సైతం బాగా తెలుసు. మొత్తానికి అతను కవి కూడా కాడు.

"అతను ఓ ఇంద్రజాలికుడు అని చెబుదాం" అన్నారు అక్కడున్న వారిలో కొందరు.

వలీద్ బిన్ ముగైరా : - అతను ఓ ఇంద్రజాలికుడు కూడా కాడు. మనం ఇంద్రజాలికుల్ని, వారి జాల విద్యను కూడా చూసే ఉన్నాం. ఇతను వారిలా మంత్రాలు చదివి, త్రాళ్ళను ముడులుగా వేయడం లాంటివి ఏమీ చేయడం లేదు.

“ఇవేమి కాకపోతే మరేమని ఆ యాత్రిక బృందాలను నమ్మబలకగలం?” అని ప్రశ్నించారు వారు.

దానికి వలీద్ బిన్ ముగైరా కల్పించుకుని...., “దైవసాక్షి! అతని మాటలు అతి మధురమైనవి. అతని వ్రేళ్ళు పటిష్టమైనవి. దాని శాఖలు ఫలవంతమైనవి. మీరు ఏ మాట చెప్పినా దాన్ని అసత్యంగా భావిస్తారు వారు. అయితే, ఈ విషయంలో సరియైన మాట ఒక్కటే. "అతను ఇంద్రజాలికుడు. అతను భోదించే వాణి అంతా ఇంద్రజాలమే. దాని ద్వారా తండ్రీకుమారుల్లో, అన్నదమ్ముల్లో, భార్యాభర్తల్లో, కుటుంబానికి కుటుంబానికి నడుమ చీలికలు ఏర్పడుతున్నాయి." (ఈ విధంగా ముహమ్మద్ (సల్లం) విభేదాలు సృష్టిస్తున్నాడు అని ప్రచారం చేద్దాం).” అని అన్నాడు.

చివరికి వారంతా ఈ సలహాను ఏకీభవిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. 

కొన్ని ఉల్లేఖనాల్లో; వలీద్ బిన్ ముగైరా, ఖురైష్ ప్రజలు ఇచ్చిన సలహాలన్నింటినీ త్రోసిపుచ్చగా, వారంతా "నీవే మచ్చలేని సలహా ఏదైనా ఇవ్వు." అని అడిగారు. దానికి అతను, “ఆగండి, నన్ను కొంత ఆలోచించుకోనివ్వండి” అని చెబుతూ దీర్ఘంగా ఆలోచించి పైన చెప్పిన సలహాను వారి ముందుంచాడు.

ఈ వ్యవహారానికే సంబంధించి వలీద్ విషయంలో ముద్దస్సిర్ సూరాలో పదహారు ఆయత్ లు (11 నుండి 26) వరకు అవతరించాయి. వీటిలోని కొన్ని ఆయత్ లలో అతని ఆలోచనా తీరు ఎలాంటిదో కూడా చెప్పడం జరిగింది. దివ్యఖుర్ఆన్ లోని ఆ ఆయత్ ల అర్థం ఇది.

 *నన్నూ, నేను ఒంటరిగా పుట్టించినవాడినీ వదిలిపెట్టు (వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడికి నేను విరివిగా సంపద ఇచ్చాను. ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులను కూడా (ఇచ్చాను). ఇంకా వాడి కోసం అన్ని విధాలా సుఖసౌఖ్యాల సామాగ్రిని సమకూర్చాను. అయినా నేను వాడికి ఇంకా... ఇంకా ప్రసాదించాలని వాడి (పిచ్చిగా) ఆశపడుతున్నాడు.* 

 *అలా జరగదు. వాడు మా ఆయతుల (సూచనల)కు బద్ధవిరోధిగా తయారయ్యాడు. త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను. వాడు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. వాడు నాశనంగాను! ఎటువంటి ప్రతిపాదన చేశాడు వాడు. మరి వాడు నాశనమైపోను! ఎలాంటి (తప్పుడు) ప్రతిపాదన చేశాడు.* 

 *తరువాత వాడు దృష్టిని సారించాడు (ఆలోచించాడు). ఆపైన నుదురు చిట్లించాడు. పాడు ముఖం పెట్టుకున్నాడు. అటుపిమ్మట వీపు త్రిప్పుకున్నాడు. గర్వం ప్రదర్శించాడు. (చివరికి)ఇలా అన్నాడు: "ఇది పూర్వం నుంచీ నకలు చేయబడుతూ వస్తున్న మాయాజాలం మాత్రమే. ఇది మానవ వాక్కు తప్ప మరేమీ కాదు.* 

 *నేను త్వరలోనే వాణ్ణి నరకాగ్నికి ఆహుతి చేస్తాను. ఆ నరకాగ్ని ఎటువంటిదో నీకేం తెలుసు? (ఖుర్ఆన్ 74:11-27)* 

మొత్తానికి ఈ తీర్మానం జరిగాక దాన్ని అమలు చేసే పని మొదలయింది. 

 *హజ్ సమయం : -* 

హజ్ యాత్ర శుభ సమయం రానే వచ్చింది. దేశం నలుమూలల నుండి వేలాది మంది యాత్రికులు, హజ్ చేసేందుకు వచ్చారు. సమయం కోసం కాచుకొని ఉన్న ఖురైషీయులు, అనుకున్న పథకం ప్రకారం మహానీయ ముహమ్మద్ (సల్లం) పై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు.

కొందరు మక్కాకు చెందిన దైవతిరస్కారులు హజ్ యాత్రికులు వచ్చే వివిధ మార్గాల్లో కూర్చుని, ఆ మార్గాల ద్వారా ప్రయాణం చేసే హజ్ యాత్రికుల్ని ప్రవక్త (సల్లం) గారి నుండి వచ్చే ప్రమాదం గురించి హెచ్చరిస్తూ వివరాలను అందించసాగారు.

ఈ ప్రచారం యాత్రికుల్లో కార్చిచ్చులా వ్యాపించింది. అంచేత కొందరు ముహమ్మద్ (సల్లం)ను కలుసుకోవడానికే భయపడ్డారు. మరికొందరు మనకెందుకులే అనుకొని యాత్ర అనంతరం తిరిగి వెళ్ళిపోయారు. చాలా మంది కాబా యాత్ర తర్వాత స్వస్థలం చేరుకొని తమ బంధుమిత్రులకు వింతగా చెప్పుకున్నారు.

ఇలా దైవప్రవక్త (సల్లం) పేరు అనతికాలంలోనే దేశమంతా వ్యాపించిపోయింది. శత్రు దుష్ప్రచారం వల్ల ఒక్కోసారి ఇస్లామీయ ఉద్యమానికి ప్రయోజనం కూడా చేకూరుతుంది. దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా ఖురైష్ బహుదైవారాధకులు ప్రారంభించిన ఈ కొత్త ప్రచారం విని నిజానిజాలేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో, ఇతర ఊళ్ళ నుంచి కొందరు మక్కా పట్టణానికి బయలుదేరారు. అలా మక్కా వచ్చినవారిలో అనేక మంది ఇస్లాం స్వీకరించి దైవప్రవక్త (సల్లం)కు అనుచరులుగా మారారు.

ఈ విధంగా అవిశ్వాసుల కుట్ర బెడిసికొట్టింది. ఇస్లాంను తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తే అది మరింత విస్తృతం కాసాగింది. దాంతో ఖురైషీయులు, జరిగిన పొరపాటు గ్రహించి తలబాదుకున్నారు. 

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment