123

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 123*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 38* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

తను చెప్పదలచుకున్న సందేశాన్ని ముహమ్మద్ (సల్లం) ఖురైష్ తెగ వాళ్ళకు చెప్పలేకపోయారు. అయినా కూడా మరోసారి ప్రయత్నిద్దామనుకున్నారు. ఈ సారి ఆయన (సల్లం) ఎంతో స్పష్టంగా చెప్పాలనుకున్నారు. ఇదంతా ఏదో కలో లేక కథో కాదని, ఒకే ఒక్కడైన అల్లాహ్ ఇచ్చిన నిజమైన బహిరంగ సందేశమనీ, విగ్రహారాధన నుంచి, దుష్ట సంప్రదాయాల నుంచి ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలనీ, ఆలస్యం కాక ముందే తమలో పరివర్తన తెచ్చుకోవాలని ముహమ్మద్ (సల్లం) వారికి చివరి హెచ్చరిక చేయాలనుకున్నారు.

తను చెప్పాలనుకున్నది ప్రజలకు తెలియజెప్పడానికి ఇక ఆయన (సల్లం)కు తెలిసిన మార్గం ఒకే ఒక్కటి మిగిలి ఉంది. అదే "సఫా" కొండను అధిరోహించి, దైవసందేశాన్ని ప్రజలకు చాటిచెప్పడం.

 *సఫా కొండ పై నుంచి ధర్మ ప్రచారం : -* 

అల్లాహ్ ధర్మప్రచార సందర్భంలో, పినతండ్రి అయిన అబూ తాలిబ్ దైవప్రవక్త (సల్లం)కు చేదోడు వాదోడుగా ఉంటారన్న ధైర్యం కలగగా, ఓ రోజు ప్రవక్త (సల్లం) "సఫా" కొండ పైకి ఎక్కి "యా సబాహా" (అయ్యో! ఉదయమా!!) అని కేక వేశారు. అరబ్బుల ఆచారం ప్రకారం, శత్రుదాడి గురించి తెలపాలంటే ఓ ఎత్తయిన ప్రదేశం పైకి పోయి ఈ పదాలే పలుకుతూ కేక వేసేవారు. 

ఈ కేక విని ఖురైష్ కు చెందిన తెగలన్నీ ఆయన (సల్లం) దగ్గరకు చేరగా, దైవప్రవక్త (సల్లం) వారికి దేవుని ఏకత్వం, తన దైవదౌత్యం మరియు అంతిమ దినాన్ని విశ్వసించమని పిలుపునిచ్చారు. *ఈ సంఘటనకు సంబంధించిన కొంత విషయం సహీ బుఖారి గ్రంథంలో ఇబ్నె అబ్బాస్ (రజి) ద్వారా ఇలా ఉల్లేఖించడం జరిగింది : ↓* 

ఎప్పుడైతే *"వ అన్జిర్ అషీరతకల్ అఖ్'రబీన్"* ఆయత్ అవతరించిందో దైవప్రవక్త (సల్లం) సఫా కొండ మీదకు ఎక్కి ఖురైష్ తెగలను ఉద్దేశించి, "ఓ బనీ ఫహర్! ఓ బనీ అద్దీ!" అంటూ ఒక్కొక్కరి పేరు పెట్టి పిలిచి ఓ చోట సమావేశపరచారు. ఇలాంటి పిలుపును అరబ్బులు ప్రమాద సంకేతంగా తలపోసేవారు.

అందుకే అందరు హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. అక్కడికి చేరలేని వాడు సైతం, విషయం ఏమిటో తెలుసుకురమ్మని తన మనిషిని అచ్చటికి పంపించాడు. మొత్తానికి ఖురైష్ అంతా వచ్చేశారు. అబూ లహబ్ కూడా అక్కడికి వచ్చాడు. ఆ తరువాత ప్రవక్త (సల్లం) వారందరినీ ఉద్దేశించి....,

ముహమ్మద్ (సల్లం) : - "(ప్రజలారా!) ఈ కొండకు ఈవల లోయలో, ఒక అశ్వదళం మనపై దండెత్తడానికి సిద్ధంగా ఉంది." అని నేను చెబితే మీరు దీన్ని విశ్వసిస్తారా?

"ఖచ్చితంగా విశ్వసిస్తాము! మీరు ఎన్నడూ అబద్ధం చెప్పినట్లు మేమెరుగము. మీరెప్పుడూ సత్యాన్నే చెబుతారన్న అనుభవం మాకుంది." అని ఏకకంఠంతో బదులు పలికారు అక్కడున్న ప్రజలు.

ముహమ్మద్ (సల్లం) : - అయితే వినండి! నేను ఓ భయంకరమైన శిక్ష, యాతనల గురించి హెచ్చరించడానికి పంపబడినవాణ్ణి. మిమ్మల్ని ఒక పెద్ద శిక్ష గురించి భయపెట్టడానికి వచ్చాను. మీరు గనుక ఈ అవిశ్వాసాన్ని, బహుదైవారాధనను మానుకోకపోతే మీకు శిక్ష తప్పదు. భయంకరమైన నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రళయం రోజు దేవుడు ఆగ్రహించి మిమ్మల్ని నరకాగ్నిలో పడవేయదలిస్తే నేను మిమ్మల్ని ఏ మాత్రం రక్షించలేను. నరకాగ్ని నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మీరంతా దేవుడు ఒక్కడే అని విశ్వసించండి. నన్ను దేవుని ప్రవక్తగా అంగీకరించండి. (అని హెచ్చరించారు)

ఇది విన్న అబూ లహబ్, "నీవు నాశనంగాను! మమ్మల్ని ఈ మాట చెప్పడానికే ఓ చోట కూడగట్టావా?" అని చిర్రుబుర్రులాడాడు. ఈ సందర్భంలోనే *దివ్యఖుర్ఆన్* అధ్యాయం *"తబ్బత్ యదా అబీ లహబ్"* అవతరించింది. *"అబూ లహబ్ రెండు చేతులు నాశనమైపోవుగాక. అతను సర్వనాశనమైపోవుగాక"* అని దీని అర్థం.

 _అబూ లహబ్ అసలు పేరు అబ్దుల్‌ ఉజ్జా. తన అందచందాల రీత్యా, దేదీప్యమానమైన ముఖవర్చస్సు దృష్ట్యా అతను అబూలహబ్ (జ్వాలాముఖి)గా పిలువబడేవాడు. ఇకపోతే; పరిణామం రీత్యా కూడా అతడు అగ్నిజ్వాలలకే ఆహుతి కావలసి ఉంది. చూడబోతే అతడు మహాప్రవక్త (సల్లం)కు స్వయాన పినతండ్రి. కాని సైద్ధాంతికంగా మాత్రం మహాప్రవక్త (సల్లం)కు బద్ధవిరోధి. అతని భార్య ఉమ్మె జమీల్ కూడా శత్రుత్వంలో భర్తకు ఏ మాత్రం తీసిపోదు. (వీటి గురించి మరింత వివరణగా రానున్న పుటల్లో తెలుసుకుందాం)._ 

 _(కొన్ని, ముహమ్మద్ (సల్లం) సీరత్ పుస్తకాలలో, "సూరతుల్ లహబ్" అవతరణ సందర్భం వేరేలా ఉంది. కానీ "సహీహ్ బుఖారీ గ్రంథంలో - సురయె లహబ్" లో ఈ సురా అవతరణ సందర్భం ఇదే ఖచ్చితమైనదని పొందుపరచి ఉంది.)_ 

ఈ సంఘటనకు చెందిన మరో భాగాన్ని ఇమామె ముస్లిం తన గ్రంథం సహీలో అబూ హురైరా (రజి) ఉల్లేఖించినట్లు రాశారు. ఆయన కథనం ప్రకారం, *"వ అన్జిర్ అషీరతకల్ అఖ్'రబీన్"* అనే దైవవాణి అవతరించినప్పుడు దైవప్రవక్త (సల్లం) ఓ పిలుపునిచ్చారు. ఈ పిలుపు అందరినీ పిలిచిన పిలుపు. ఆయన (సల్లం) ఖురైష్ తెగతో, "ఓ ఖురైష్ ప్రజలారా! మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, ఓ బనీ కఅబ్! మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకోండి. ఓ ముహమ్మద్ కూతురు ఫాతిమా! నిన్ను నీవు నరకం నుండి రక్షించుకో. ఎందుకంటే మిమ్మల్ని అల్లాహ్ (పట్టు) నుండి రక్షించే శక్తి నాకు లేదు. అయితే మీతో నాకు వంశం, బంధుత్వం రీత్యా సంబంధం ఉంది. ఆ సంబంధం ప్రకారమే మిమ్మల్ని హెచ్చరించగలను.

ఈ పిలుపు కేవలం సందేశ ప్రచారార్థమే. దైవప్రవక్త (సల్లం), తన దగ్గరి బంధువులకు, తెగలకు, ఇక నుండి దైవదౌత్యాన్ని బలపరచడం మీదనే మన పరస్పర సంబంధాలు ఆధారపడి ఉంటాయని, ఏ జాతి, తెగల దూరాభిమానాలలో అరబ్బులు చిక్కుకొని ఉన్నారో అవి దైవ హెచ్చరికతో అంతమైపోయాయని నిక్కచ్చిగా తెలియజేయడం జరిగింది.

 *బాహాట సత్య ప్రకటనకు బహుదైవారాధకుల ప్రతిచర్య : -* 

ఈ నినాద ప్రతిధ్వని ఇంకా మక్కా చుట్టూ ప్రక్కల వ్యాపించిందో లేదో, అల్లాహ్ మరో ఆదేశాన్ని అవతరింపజేశాడు.

 *“ఫస్'దఅ బిమా తూమరు వ ఆరిజ్ అనిల్'ముష్రికీన్” (కనుక ఓ ప్రవక్తా! నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చాటు. షిర్కు చేసే వారిని ఏ మాత్రం లెక్కచేయకు.) (ఖుర్ఆన్ 15:94)* 

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) అంటే బహుదైవారాధన దురాచారాలను, దాని అసత్య పోకడలను ఎండగట్టనారంభించారు. విగ్రహాల యధార్థతను, వాటి రుగ్మతల్ని విడమరచి చెప్పనారంభించారు. ప్రవక్త (సల్లం) ఉదాహరణలిస్తూ, ఈ విగ్రహాలు ఎంత వివశనమైనవో, ఎంత పనికిమాలినవో, వాటిని ఆరాధించేవారు దైవానికి, ఈ విగ్రహాలకు నడుమ ఎలా సంబంధం ఏర్పరచుకున్నారో, వారు అవలంభించే ఈ వైఖరి ఎంత మూర్ఖమైనదో హేతుబద్ధంగా తర్కించి మరీ వివరించేవారు.

ముష్రిక్కులను (బహుదైవారాధకులను), విగ్రహారాధకులను, మార్గభ్రష్టులుగా నిందించినందుకు మక్కా నగరం అంతా ఆగ్రహం పట్టలేక మూకుమ్మడిగా ఆయనకు ఎదురు తిరిగింది. ఆశ్చర్య తిరస్కారాలతో ఊగిపోయింది. అంటే, అది ప్రశాంత వాతావరణాన్ని భయబ్రాంతులకు గురిచేసిన ఓ ఫెళఫెళారావమన్న మాట. అందుకని ఖురైషులు హఠాత్తుగా సంభవించిన ఈ విప్లవాన్ని వ్రేళ్ళతో సహా పెకలించడానికి లేచి నిలబడ్డారు. కారణం, దాన్ని సమర్ధిస్తే తాతముత్తాతల నాటి నుండి వచ్చే ఆచార సంప్రదాయాలు పూర్తిగా తుడుచుకుపోతాయి అని వారి భయం.

 *అల్లాహ్ యేతర శక్తుల దైవత్వాన్ని నిరాకరించడం : -* 

దైవదౌత్యాన్ని, ప్రళయదినాన్ని విశ్వసించడమంటే, తమను తాము పూర్తిగా దైవదౌత్యానికి అంకితం చేయవలసి ఉంటుందన్నది. ఆ మార్గాన్ని తు.చ. తప్పకుండా అనుసరించాల్సి ఉంటుందన్న విషయం ఖురైషులకు బాగా తెలుసు. అంటే, ఇతర విషయాలను ప్రక్కనబెట్టి, స్వయంగా తమ సంపదపైగాని, తమ ప్రాణాల విషయంలో గాని వారికి ఎలాంటి అధికారం ఉండబోదు. మరో విధంగా చెప్పాలంటే, మక్కా వాసులకు ధార్మికంగా ఇతర అరబ్బులపై ఉన్న ఆధిక్యత, నాయకత్వం పూర్తిగా అంతం అయిపోతాయి. అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త ఇష్టానికి వ్యతిరేకంగా తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడానికి వీలుండదు. అంటే, బడుగు వర్గాలపై వారు ఏయే అత్యాచారాలు జరుపుతున్నారో, పొద్దస్తమానం ఏయే పాపాల్లో లీనమైపోయి ఉన్నారో వాటన్నింటిని ఒక్కసారిగా వదలి వేయవలసి వస్తుందని వారి భాద. ఖురైషులు దీన్ని బాగా ఎరుగుదురు. అందుకని ఈ అవమానాన్ని భరించడం కోసం వారు ఏ మాత్రం సిద్ధంగా లేరు. ఇదంతా చేస్తున్నది, ఏదో గౌరవం పొందాలనో లేదా ఏదో ప్రయోజనం సమకూర్చుకోవాలనో మాత్రం కాదు. అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో చెప్పినట్లుగా,

 *“కాని మానవుడు ఇక ముందు కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు” ( ఖుర్ఆన్ 75:5)* అనేదాని కోసం.

ఖురైషులకు ఇదంతా తెలుసు. అయితే వచ్చిన చిక్కల్లా, వారి ముందు ఉన్న వ్యక్తి సత్యసంధుడు, అమానతుదారుడు, మానవ విలువలు, నైతికతల ప్రతిబింబం. ఓ సుదీర్ఘ కాలం వరకు వారు తమ తాతముత్తాతల చరిత్రలో అలాంటి సద్గుణశీలుణ్ణి కనీవినీ ఎరుగరు. ఒకవేళ అతన్ని అడ్డుకోదలిస్తే అడ్డుకునేదెలా? ఈ విషయంలో వారు సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయారు.

బాగా ఆలోచించిన తరువాత వారికి ఓ మార్గం అగుపించింది. ప్రవక్త (సల్లం) పినతండ్రి అబూ తాలిబ్ వద్దకు వెళ్ళి, ఆయన్ను ఆ కార్యం నుండి వారించమని నచ్చజెబుతాం అని తీర్మానించుకున్నారు. ఈ ప్రణాళికను విజయవంతం చేయడానికి వారు ఓ హేతువును కూడా కనుగొన్నారు. దాని ప్రకారం, ముహమ్మద్ (సల్లం) వారి ఆరాధ్యుల్ని వదిలేయలమని చెప్పడం, వాటికి ఎలాంటి లాభనష్టాలను చేకూర్చే శక్తి లేదని చెప్పడం వగైరాలు. ఆ ఆరాధ్యులను నిందించడం లాంటిదనీ, గొప్ప దూషణ అనీ, అదే కాకుండా అదే మార్గంపై నడిచిన తమ తాతముత్తాతల్ని మూర్ఖులు, మార్గభ్రష్టుల క్రింద జమ చేసినట్లు అవుతుందని నమ్మబలకడమే ఆ హేతువు. ఖురైషుకు ఈ పన్నాగమే సహేతుకమనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా దాన్నే అనుసరించారు.

Insha Allah రేపటి భాగములో, అబూ తాలిబ్ ని కలసి ఖురైషీయులు చర్చించిన విషయాల గురించి....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

  ☆☆☆☆☆☆ *మా సలాం* ☆☆☆☆☆☆

No comments:

Post a Comment