119

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 119*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 34* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

                   *వుజూ, నమాజ్* 

ఒక రోజు ముహమ్మద్ (సల్లం) మక్కా శివార్లలో దైవదూత (జిబ్రీల్ (అలైహి)) కోసం నిరీక్షిస్తూ పచార్లు చేయసాగారు. మనస్సులో భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి ఒకటే ఆలోచనలు! “దైవాన్ని ప్రార్థించే పధ్ధతి ఏమిటీ? ప్రవక్త కాక ముందైతే మనస్సుకు తోచిన విధంగా దైవధ్యానం చేసేవాడు. కాని ఇప్పుడు అల్లాహ్, తనను ప్రవక్తగా నియమించి మార్గదర్శక ఆదేశాలు పంపుతున్నాడు. అందువల్ల దైవారాధన విధానం కూడా ఆయన (సల్లం) భోదించే తీరులోనే ఉండాలి మరి.” అనుకున్నారు ఆయన(సల్లం). 

ఈ విషయాలు తెలియజేయడానికే జిబ్రీల్ (అలైహి) ప్రత్యక్షమయ్యారు. ఆయన (జిబ్రీల్ (అలైహి)) ఓ గుట్ట మీద గరికనేలను కాలితో తన్నగానే అక్కడ ఒక (నీటి) ఊట ఉబికివచ్చింది. ఆ నీటితో జిబ్రీల్ (అలైహి) వుజూ చేసి, నమాజ్ చేయడానికి ముందు ఇలా పరిశుభ్రం కావాలని చెప్పారు. అది చూసి దైవప్రవక్త (సల్లం) అలాగే వుజూ చేశారు. తరువాత జిబ్రీల్ (అలైహి) నమాజు చేసి చూపారు. అది చూసి దైవప్రవక్త (సల్లం) కూడా ఆయన చేసినట్లే నమాజు చేశారు.

ఆ తరువాత ఆయన (సల్లం) ఇంటికొచ్చి అర్థాంగి ఖదీజా (రజి) ఎదుట వుజూ చేసి చూపారు. హజ్రత్ ఖదీజా (రజి) అదే విధంగా వుజూ చేశారు. తరువాత దైవప్రవక్త (సల్లం) నమాజు చేయగా, ఆమె ఆయన్ని అనుసరించారు.

 *ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన అలీ (రజి) మరియు జైద్ (రజి)లు : -* 

దైవప్రవక్త (సల్లం), ఆయన శ్రీమతి ఖదీజా (రజి) చేసే ఈ కొత్త ఆరాధనా పధ్ధతి చూస్తుంటే వారింట్లో ఉండే, దైవప్రవక్త (సల్లం) గారి పెదనాన్న అబూతాలిబ్ గారి కుమారుడు అలీ (రజి)కి ఎంతో విచిత్రంగా తోచింది. ఆ బాలుడు ఇంతకు ముందెప్పుడూ ఈ విధంగా వారిద్దరూ ప్రార్థన చేయడం చూడలేదు. అందువల్ల అదేమిటో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. ప్రార్థన పూర్తికాగానే, "ఏమిటదీ, ఇలా చేస్తున్నారు మీరు?" అని అడిగాడు పదేళ్ళ అలీ కుతూహలంతో.

ముహమ్మద్ (సల్లం) : - ఇది, అల్లాహ్ మానవుల కోసం పంపిన ధర్మం బాబు! దీన్ని ఇస్లాం అంటారు. గత ప్రవక్తలంతా, లోకానికి ఇస్లాం ధర్మాన్నే భోధించారు.

అలీ : - అలాగా! మరి ఈ రుకూ, సజ్దాలేమిటి? (మరింత ఆశ్చర్యంతో అడిగాడు)

ముహమ్మద్ (సల్లం) : - అల్లాహ్ నన్ను ప్రవక్తగా నియమించాడు బాబూ! మార్గం తప్పిన ప్రజలకు సన్మార్గం చూపి, వారికి మంచి మంచి విషయాలు తెలియజేయడానికి, దైవారాధన కోసం వారిని ప్రేరేపించడానికి ఆయన నాపై తన వాణిని అవతరింపజేస్తున్నాడు. మనం చేసే రుకూ, సజ్దాలు ఆ దైవం కోసమే.

అలీ : - అయితే చాలా మంచి విషయమే. మరి మీరు నమ్ముతున్న ధర్మాన్ని నేనూ నమ్మవచ్చా? మీతో పాటు నేను కూడా ప్రార్థన చేయవచ్చా?

ముహమ్మద్ (సల్లం) : - తప్పకుండా తమ్ముడూ! అలాగే చెయ్యి. యావత్తు ప్రపంచానికి దేవుడు ఒక్కడే ఆయనకు మరెవరూ సాటి లేరు. ఆయనే ఆరాధనకు అర్హుడు. నువ్వు కూడా ఆయన్నే ఆరాధించు. విగ్రహాలను వదలి ఆ దేవుడినే నమ్ముకో బాబు!

అలీ : - అయితే నేను మా నాన్న గారిని అడిగి చెప్తా.

     అలా అన్నాడేగాని, ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. దైవప్రవక్త (సల్లం) భోదించిన మాటలే మాటిమాటికి మననం చేసుకుంటూ తీవ్రంగా ఆలోచించాడు. తెల్లవారిన తరువాత దైవప్రవక్త (సల్లం) దగ్గరకు పోయి ఇలా అన్నాడు....,

అలీ : - నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని అనుసరించడానికి నిర్ణయించుకున్నాను. దీని కోసం నాకు, మా నాన్నను అడగాల్సిన పనిలేదు. ఎలా ప్రార్థన చేయాలో చెప్పండి.

ఈ మాటలు విని దైవప్రవక్త (సల్లం) ఎంతో సంతోషించారు. అలీని ప్రేమగా కౌగలించుకుని అతనికి నమాజు చేసే పధ్ధతి నేర్పారు. అలీ (రజి)తో పాటు ప్రవక్త పెంపుడు కొడుకు జైద్ (రజి) కూడా దైవప్రవక్త (సల్లం) ఇంట్లో ఉంటున్నాడు. వారిద్దరు కలిసి మెలసి ఉండేవాళ్ళు. ఏది చేసినా ఇద్దరు కలిసే చేసేవారు. అలీ (రజి) కొత్త ధర్మం స్వీకరించిన సంగతి వినగానే జైద్ (రజి) కూడా దైవప్రవక్త (సల్లం)పై విశ్వాసం ప్రకటించి ఇస్లాం పరిధిలోనికి వచ్చాడు. వాళ్ళిద్దరు దైవప్రవక్త (సల్లం)ను ఎంతగానో గౌరవించేవారు. ఆయన (సల్లం) ఆజ్ఞను అంగుళం కూడా జవదాటేవారు కాదు. దైవప్రవక్త (సల్లం) కూడా వాళ్ళను అమితంగా ప్రేమించేవారు.

 *నమాజు : -* 

ప్రారంభంలో అవతరించిన దివ్యావిష్కృతిలో "నమాజు" ఆదేశం కూడా ఉంది. "మకాతిల్ బిన్ సులైమాన్" కథనం ప్రకారం, ఇస్లాం ప్రారంభ దశలో అల్లాహ్ రెండు రకాతులు ఉదయం, రెండు రకాతులు సాయంత్రం సమయ నమాజులు ఫర్జ్ చేశారని ఉంది. దీనికి కారణం దైవాదేశం ఇలా ఉందని చెబుతారు ఆయన.

 *"వ సబ్బిహ్ బిహందిరబ్బిక బిల్ అషీయ్యి వల్ అబ్'కార్" (ఖుర్ఆన్ 40:55)* 

 *(ఉదయం, సాయంత్రం నీ ప్రభువును స్తుతిస్తూ, ఆయన పరిశుద్ధతను కొనియాడు.★)* 

 _(★ → ఈ ఆయత్ యొక్క అర్థం ఇంకా ఉంది. మనకు అవసరమైన దానిని మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది.)_ 

ఇబ్నె హజర్ కథనం ప్రకారం, ప్రవక్త (సల్లం), ఆయన అనుచరగణం (సహాబా), మేరాజ్ సంఘటనకు పూర్వమే నమాజు చేసేవారు. అయితే, ఐదు పూటల నమాజు కంటే ముందు ఏ నమాజైనా విధిగా చేయబడిందా లేదా? అన్న విషయంలో ధర్మవేత్తల నడుమ అభిప్రాయబేధాలున్నాయి. కొందరు, సూర్యోదయానికి పూర్వం మరియు సూర్యాస్తమయం తరువాత ఒక్కో నమాజు విధిగా చేయబడిందని వాదిస్తారు.

హారిస్ బిన్ ఉసామా ఇబ్నె లహీయా మాధ్యమంగా, హజ్రత్ జైద్ బిన్ హారిస్ (రజి), మహాప్రవక్త (సల్లం)గారు ప్రవచించారని ఉటంకిస్తూ, దైవప్రవక్త (సల్లం) వద్దకు ప్రారంభంలో దివ్యావిష్కృతి వచ్చినప్పుడు, హజ్రత్ జిబ్రీల్ (అలైహి) వచ్చి ఆయన (సల్లం)కు "వుజూ" చేసే విధానాన్ని నేర్పారు. వుజూ అయిన పిదప చేతిలో కొంచెం నీరు తీసుకొని మర్మాంగం పై చల్లారు. ఇబ్నెమాజా ఇదే భావం వచ్చే మరో ప్రవచనాన్ని ఉల్లేఖించడం జరిగింది. బరా బిన్ ఆజిబ్, ఇబ్నె అబ్బాస్ (రజి)లు కూడా ఇలాంటి హాదీసులనే ఉల్లేఖించారు. ఇబ్నె అబ్బాస్ (రజి) ఉల్లేఖించిన హాదీసు (ప్రవచనం)లో ఈ నమాజు మొదట విధి అయిన నమాజులకు చెందిన నమాజే అని చెప్పడం జరిగింది.

 *ఇస్లాం స్వీకరించిన దైవప్రవక్త (సల్లం) స్నేహితుడు అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) : -* 

అబూబక్ర్ సిద్దీఖ్ (రజి), ప్రవక్త (సల్లం)కు ప్రాణ స్నేహితులు. ప్రవక్త (సల్లం) అంటే అబూబక్ర్ సిద్దీఖ్ (రజి)కు ఎంతో నమ్మకం. ప్రవక్త (సల్లం) ఏది చెబితే అదే సత్యమని నమ్మే మనిషి. *"అల్లాహ్ ఒక్కడే"* అన్న ప్రవక్త (సల్లం) యొక్క సందేశాన్ని ఖదీజా (రజి), అలీ (రజి), జైద్ (రజి)లతో పాటు అబూబక్ర్ (రజి) కూడా ఎటువంటి సందేహం లేకుండా బలపర్చారు.

దైవప్రవక్త (సల్లం) ఓ రోజు భావి కార్యక్రమం గురించి ఆలోచిస్తుంటే ఆయన (సల్లం) స్నేహితుడు అబూబక్ర్ వచ్చాడు. మిత్రులిద్దరూ కాస్సేపు అదీఇదీ మాట్లాడుకున్నారు. తరువాత దైవప్రవక్త (సల్లం) విషయం మార్చుతూ....,

ముహమ్మద్ (సల్లం) : - అబూబక్ర్! నీవు నన్ను ఎలాంటి వాడని భావిస్తున్నావు?

అబూబక్ర్ సిద్దీఖ్ : - ఏమిటీ, ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు!! నీ సంగతి నాకు తెలియనిదేముంది? నువ్వు ఎంతో మంచివాడవు, సత్యవంతుడవు, నిజాయితీపరుడవు.

ముహమ్మద్ (సల్లం) : - సరే, ఒకవేళ నేను దైవప్రవక్తనని, నాపై దైవసందేశం అవతరిస్తోందని అంటే నువ్వు నమ్ముతావా?

అబూబక్ర్ సిద్దీఖ్ : - తప్పకుండా నమ్ముతాను. నీవు అబద్ధమాడినట్లు, తప్పుడు మాటలు పలికినట్లు నేనింత వరకు వినలేదు.

ముహమ్మద్ (సల్లం) : - అయితే విను. నేనిప్పుడు అల్లాహ్ తరఫున ప్రవక్తగా నియమించబడ్డాను. నాపై దైవసందేశం అవతరిస్తున్నది. దాని ప్రకారం నీవు కూడా దైవేతర శక్తులన్నింటిని వదలిపెట్టి ఒక్క దేవుడ్ని మాత్రమే ఆరాధించు. ఆయనే సర్వసృష్టికర్త. జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి.

అబూబక్ర్ సిద్దీఖ్ : - నిస్సందేహంగా నీవు దైవప్రవక్తవే. నేను సర్వసృష్టికర్త అయిన ఏకేశ్వరుడ్ని విశ్వసిస్తున్నాను.

ఈ మాటలు విని దైవప్రవక్త (సల్లం) పరమానందభరితులయ్యారు. ఆ రోజు నుండి ఆయన తన దగ్గరకొచ్చేవారికి కొత్త ధర్మం గురించి హితోపదేశం చేయడం ప్రారంభించారు.

ఈ విధంగా దైవప్రవక్త (సల్లం) తన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి ముందు తాను దైవప్రవక్తనని ప్రకటించి, హితోపదేశం చేస్తూ రహస్య ప్రచారం చేయసాగారు. అదే విధంగా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) కూడా ప్రచారం ప్రారంభించారు. ఆయన తన దగ్గరకు వచ్చిన "అబ్ద్ అమ్ర్ బిన్ ఔఫ్" అనే వ్యక్తికి దైవసందేశం వినిపించి ఇస్లాం స్వీకరించమని అన్నారు. "అబ్ద్ అమ్ర్" తక్షణమే ఇస్లాం స్వీకరించారు.

 *కల యొక్క గూడార్థం తెలుసుకొని ఇస్లాం స్వీకరించిన "ఖాలిద్ బిన్ సయీద్" : -* 

ఆ తరువాత ఓ రోజు ఉదయాన్నే "ఖాలిద్ బిన్ సయీద్" అనే యువకుడు ఆందోళన పడుతూ (అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) దగ్గరకు) వచ్చాడు. వచ్చిరాగానే విషయం చెప్పనారంభించాడు.

ఖాలిద్ : - (అబూబక్ర్!) రాత్రి నేనొక కలగన్నాను. దాని భావం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఇందులో తప్పకుండా ఏదో గూడార్థం ఉంటుందని భావిస్తున్నాను. ఆ గూడార్థం మీరు చెబుతారని వచ్చాను.

అబూబక్ర్ సిద్దీఖ్ : - ఇంతకూ నువ్వు ఏం కలగన్నావో చెప్పు!

మక్కాలో హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి)కు నిజాయితీగల పెద్ద మనిషిగా, మంచి వ్యాపారవేత్తగా పేరు పలుకుబడులు ఉండడంతో పాటు, ఆయన కలల గూడార్థం చెబుతారని కూడా ప్రతీతి ఉంది.

ఖాలిద్ : - నేను రాత్రి భయంకరమైన ఓ కల గన్నాను. ఆ కలలో నేనొక అగ్నిగుండం అంచున నిలబడి ఉన్నాను. దాని మంటలు తీవ్రంగా ప్రజ్వరిల్లుతున్నాయి. కాస్సేపటికి మా నాన్న వచ్చి నన్ను ఆ అగ్నిగుండంలోకి నెట్టడానికి ప్రయత్నించాడు. నేను ఆయన పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మా నాన్న, నన్ను అగ్నిగుండంలోకి త్రోస్సేయడానికి మళ్ళీ ప్రయత్నించాడు. ఇలా మేమిద్దరం పెనుగులాడుతుంటే హఠాత్తుగా ఎవరో వచ్చి రెండు చేతులతో నా నడుం గట్టిగా పట్టుకుని నన్ను అగ్నిగుండంలో పడనీయకుండా మా నాన్న చేరనుండి లాగి విడిపించాడు. తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తే ముహమ్మద్ బిన్ అబ్దుల్లా (సల్లం) కనిపించారు. అంతలో నాకు మెలుకువ వచ్చింది.

అబూబక్ర్ సిద్దీఖ్ : - ఖాలిద్! నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నేను నిన్ను అభినందిస్తున్నాను. కలలో నిన్ను రక్షించిన మనిషి ఇప్పుడు దైవప్రవక్త అయ్యారు. నువ్వు ఆయనకు విధేయుడయి ఇస్లాం ధర్మం స్వీకరించు. దాని ద్వారానే నువ్వు నరకాగ్ని నుండి రక్షించబడతావు.

ఖాలిద్ ఈ మాట విని నేరుగా దైవప్రవక్త (సల్లం) దగ్గరకి వెళ్ళాడు. ఆయన (సల్లం)కు తన కల గురించి తెలియజేసి ఇస్లాం స్వీకరించాడు.

 *ఇస్లాం స్వీకరించిన "ఉస్మాన్ బిన్ అప్ఫాన్" : -* 

ఆ రోజుల్లోనే "ఉస్మాన్ బిన్ అప్ఫాన్" అనే ఓ ధనికుడు వ్యాపార నిమిత్తం సిరియా పోయి మక్కా తిరిగి వస్తున్నాడు. దారిలో ఓ చోట రాత్రివేళ విడిది చేసి నిద్రపోతుంటే *“పడుకున్నవాడా! మేలుకో మక్కాలో "అహ్మద్" బయల్పడ్డాడు”* అని దిక్కులు పిక్కుటిల్లేలా ధ్వని వినిపించింది. దాంతో ఉస్మాన్ చివాలున లేచి కూర్చున్నాడు. చూస్తే ఎవరూ కనిపించలేదు. కాని ఆ పలుకులు మాత్రం అతని చెవుల్లో మాటిమాటికి ప్రతిధ్వనించసాగాయి.

ఉస్మాన్ వ్యాపార సామాగ్రితో అక్కడి నుంచి కదిలి మళ్ళీ ప్రయాణం సాగించాడు. మక్కా ఇంకా కొన్ని మైళ్ళ దూరం ఉండగా ఆయన్ని, "తల్హా బిన్ ఉబైదుల్లా" అనే మిత్రుడు కలిశాడు. అతను బస్రా పర్యాటన విశేషాలు తెలియజేస్తూ ఇలా చెప్పాడు.

తల్హా : - నేను బస్రా గుండా వస్తుంటే ఒక సాధువు ఎదురై *"మక్కా ప్రజలలో "అహ్మద్" అవతరించాడా?"* అని అడిగాడు. నేను *"అహ్మద్"* ఎవరన్నాను. దానికి ఆ సాధువు *"అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కొడుకు. ఆయన అంతిమ దైవప్రవక్త"* అని సమాధానం ఇచ్చాడు.

అప్పుడు ఉస్మాన్ ఎడారిలో అర్థరాత్రి తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పాడు. ఆ తరువాత వారిద్దరూ మక్కా చేరుకుని హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) దగ్గరకు వెళ్లారు. ఆయన ముందు తమ అనుభవాలను గురించి చెప్పుకున్నారు. హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) వెంటనే వారిద్దరిని దైవప్రవక్త (సల్లం) సన్నిధికి పిలుచుకుని వెళ్ళారు. అక్కడ తల్హా, ఉస్మాన్ లు దైవప్రవక్త (సల్లం) హితోక్తులు విని ఇస్లాం స్వీకరించారు.

ఇలా ఉస్మాన్ బిన్ అప్పాన్, తల్హా బిన్ ఉబైదుల్లా, జుబైర్ బిన్ అవ్వామ్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, సాద్ బిన్ అబీవఖ్కాస్ తదితరులు ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత వీరంతా దైవప్రవక్త (సల్లం) సూచన ప్రకారం ఇస్లాం ప్రచారం రహస్యంగా చేయటం ప్రారంభించారు.

ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం, ఆ తరువాత స్త్రీ పురుషులు గుంపులు గుంపులుగా ఇస్లాంలో చేరిపోతున్న విషయం ఎట్టకేలకు మక్కాలో చర్చనీయాంశమైంది.

ఇస్లాం ప్రచారం గురించి క్రమంగా బయటి ప్రజలకు కూడా తెలిసిపోయింది. దాంతో జనంలో కలకలం బయలుదేరింది. అందరూ దైవప్రవక్త (సల్లం)ను వింతగా చూడటం మొదలుపెట్టారు. మరికొందరు ముక్కుపుటాలు ఎగరేశారు. ఇంకొందరు హేళన చేశారు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment