120

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 120*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 35* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 (మునుపటి భాగము కొనసాగింపు) ----- ఉస్మాన్ బిన్ అప్పాన్, తల్హా బిన్ ఉబైదుల్లా, జుబైర్ బిన్ అవ్వామ్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, సాద్ బిన్ అబీవఖ్కాస్ తదితరులు ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత వీరంతా దైవప్రవక్త (సల్లం) సూచన ప్రకారం ఇస్లాం ప్రచారం రహస్యంగా చేయటం ప్రారంభించారు.

ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం, ఆ తరువాత స్త్రీ పురుషులు గుంపులు గుంపులుగా ఇస్లాంలో చేరిపోతున్న విషయం ఎట్టకేలకు మక్కాలో చర్చనీయాంశమైంది.

ఇస్లాం ప్రచారం గురించి క్రమంగా బయటి ప్రజలకు కూడా తెలిసిపోయింది. దాంతో జనంలో కలకలం బయలుదేరింది. అందరూ దైవప్రవక్త (సల్లం)ను వింతగా చూడటం మొదలుపెట్టారు. మరికొందరు ముక్కుపుటాలు ఎగరేశారు. ఇంకొందరు హేళన చేశారు.

వీరంతా రహస్యంగా ముస్లిములుగా మారినవారు. దైవప్రవక్త (సల్లం) కూడా వారికి ధార్మిక భోధన గరపుటకు, వారి మార్గదర్శకం కోసం రహస్యంగానే వారిని ఓ చోట చేర్చేవారు. ఎందుకంటే సందేశ ప్రచార కార్యం అప్పటి వరకు వ్యక్తిగతంగా తెరమరుగునే నడుస్తోంది గనుక. ఇటు ఖుర్ఆన్ ముద్దస్సిర్ సూరా (అధ్యాయం) ప్రారంభ ఆయత్ లు అవతరించడంతోనే దైవవాణి క్రమబద్ధంగా ఊపందుకుంది. ఈ కాలంలో మొదట చిన్న చిన్న ఆయత్ లు అవతరించనారంభించాయి. ఇవి మనోహరమైన ఒకే తీరు ప్రాసాక్షరాలతో అంతం కావడం మూలంగా హృదయాలను ఇట్టే ఆకర్షించి మనస్సుకు ఓ రకమైన శాంతిని చేకూర్చేవి. ఇదే కాదు, ఈ ఆయత్ లలో, మనస్సును పరిశుద్ధపరిచే సుగుణాలను, ప్రాపంచిక వ్యసనాల్లో, సుఖభోగాల్లో చిక్కుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి చెప్పడం, స్వర్గనరక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించడం జరిగింది. ఈ దివ్యవాణి వాక్యాలు విశ్వాసుల్ని, అప్పటి మానవ సమాజానికి అతీతంగా మరో ప్రపంచంలో ఉన్నట్లుగా అనుభూతిని కలుగజేసేవి.

హజ్రత్ జిబ్రీల్ (అలైహి) తరచుగా వస్తూ దైవప్రవక్త (సల్లం)కు దైవసందేశం అందజేసి పోతుండేవారు. దైవప్రవక్త (సల్లం) దాన్ని (దైవసందేశాన్ని) ఎప్పటికప్పుడు ప్రజలకు వినిపిస్తుండేవారు.

 *సూరతుల్ జుహా అవతరణ : -* 

ఒక సారి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) వారికి జబ్బు చేసింది. రెండుమూడు రాత్రులు ఆయన (సల్లం) తహజ్జుద్ నమాజుకై లేవలేకపోయారు. ఒక స్త్రీ వచ్చి ఆయన (సల్లం)ను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో, "ముహమ్మద్ (సల్లం)! నీ దెయ్యం నిన్ను విడిచిపెట్టినట్టుందే. నాకు తెలిసినంతవరకు రెండు మూడు రాత్రులు నుండి అది నీ దగ్గరకు రావటం లేదు కదూ!" అన్నది. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఈ సూరా ను అవతరింపజేశాడు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె "అబూ లహబ్" భార్య అయిన "ఉమ్మె జమీల్".

 *పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా! కుదుటపడిన రాత్రి సాక్షిగా! (ఓ ముహమ్మద్ (సల్లం)!) నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టనూ లేదు, విసిగిపోనూ లేదు. నిశ్చయంగా నీ కోసం చివరికాలం తొలికాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. నీ ప్రభువు త్వరలోనే నీకు (గొప్ప బహుమానం) వొసగుతాడు. దాంతో నీవు సంతోషపడతావు. ఏమిటి, నువ్వు అనాధగా ఉండటం చూసి, ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? మరి నిన్ను మార్గం తెలియని వానిగా గ్రహించి, సన్మార్గం చూపలేదా? ఇంకా - నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేయలేదా? కాబట్టి (ఓ ప్రవక్తా) నువ్వు కూడా అనాధ పట్ల దురుసుగా ప్రవర్తించకు. యాచించేవానిని కసిరికొట్టకు. ఇంకా నీ ప్రభువు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు. (ఖుర్ఆన్ 93:1-11)* 

ఈ సందేశం వల్ల వచ్చిన ధైర్యంతో ముహమ్మద్ (సల్లం) ధర్మప్రచారం తిరిగి ప్రారంభించారు. దాంతో ఒక్కొక్కరే ఇస్లాం పరిధిలోకి రాసాగారు.

ఇలా మూడవసారి అబూఉబైదా బిన్ జిరాహ్, అర్ఖమ్ , అబూసల్మా అబ్దుల్ అసద్ బిన్ హిలాల్, ఉస్మాన్ బిన్ మజ్ వూన్, ఖదామా బిన్ మజ్ వూన్, సయీద్ బిన్ జైద్, ఫాతీమా బిన్త్ ఖత్తాబ్, అబ్దుల్లా బిన్ మాస్ వూద్, జాఫర్ బిన్ అబూతాలిబ్, మొదలైనవారు ఇస్లాం స్వీకరించారు.

అయితే దైవదౌత్య భారం అంతటితో తీరేది కాదు. అది వెన్ను విరిచే బాధ్యతాభారం. అంచేత దైవప్రవక్త (సల్లం) అనుక్షణం ఈ బాధ్యతను గురించే ఆలోచిస్తూ ఉండేవారు.

ఈ భావనే ముహమ్మద్ (సల్లం)ను కూడా వణికింపజేస్తోంది. ఆయన ఓ రోజు దుప్పటి కప్పుకుని పడుకున్నారు. కాని దైవదౌత్య బాధ్యత ఆయన్ని ఓ పట్టాన నిద్ర పోనివ్వలేదు.

 *సూరతుల్ ముజ్జమ్మిల్ అవతరణ : -* 

ఈ ఆయతులు అవతరించినప్పుడు దైవప్రవక్త (సల్లం) దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నారు. దేవుడు ఆయన (సల్లం) పరిస్థితిని వివరిస్తూ కర్తవ్య బోధ చేశాడు.

 *ఓ వస్త్రమును కప్పుకున్నవాడా! కొద్దిసేపు మినహా రాత్రంతా (నమాజులో) నిలబడు. సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో. లేదా దానిని మరికొద్దిగా పెంచుకో. ఖుర్ఆన్ ను మాత్రం బాగా - ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు. నిశ్చయంగా మేము నీపై ఒక బరువైన వాక్కును వేయనున్నాము. నిశ్చయంగా రాత్రి వేళ లేవటం మనో స్థిమితానికి ఎంతో ఉపయుక్తమైనది. మాట సూటిగా వెలువడటానికి అది ఎంతో అనువైనది. నిశ్చయంగా పగటిపూట నీకు సుదీర్ఘమైన వ్యాపకాలున్నాయి. అందుకే నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. అన్నింటినీ వదిలి ఆయన వైపే మనసును లగ్నం చేయి. ఆయన తూర్పు - పడమరలకు ప్రభువు. ఆయన తప్ప వేరొక ఆరాధ్యదైవం లేడు. కాబట్టి నీవు ఆయన్నే నీ కార్యసాధకునిగా చేసుకో. వారు చెప్పే మాటలకు ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు. ధిక్కార వైఖరికి ఒడిగట్టిన ఈ శ్రీమంతుల సంగతిని నాకు వదిలిపెట్టు. వారికి మరింత గడువును ఇవ్వు. (ఖుర్ఆన్ 73:1-11)* 

 *రహస్యంగా నమాజు చేయడం : -* 

ఇబ్నె హష్షామ్ కథనం ప్రకారం, ప్రవక్త (సల్లం) మరియు సహాబా (అనుచరులు) నమాజు వేళల్లో కొండ సానువుల్లోనికి వెళ్ళి, వారి జాతి కంటబడకుండా నమాజు చేసేవారు. ఓసారి అబూ తాలిబ్, దైవప్రవక్త (సల్లం) మరియు హజ్రత్ అలీ (రజి) కలిసి నమాజు చేస్తుండగా చూశారు. అడిగి తెలుసుకోగా యదార్థం ఏమిటో తెలిసిపోయింది. అప్పుడాయన (అబూ తాలిబ్) కుమారునితో దానిపైన్నే  స్థిరంగా ఉండమని ఉద్బోధించారు.

 _(↑ ఈ ఉల్లేఖనంలోని మరింత వివరణ ↓)_ 

ఇస్లాం పరిధి క్రమంగా విస్తరిస్తూపోతోంది. దాంతోపాటే ప్రజల్లో వ్యతిరేకత పవనాలు ఉధృతం కాసాగాయి. ముస్లింలు తమ ఇండ్లలో సయితం రహస్యంగా నమాజు చేయడం కష్టమైపోతోంది. వారు దైవప్రవక్త (సల్లం) ఇంటిని కేంద్రంగా చేసుకుని నమాజు చేద్దామంటే, అక్కడ ఇరుగు పొరుగువాళ్ళు పోరు ఎక్కువైపోయింది. అందువల్ల వారు కొండల్లో, కోనల్లో రహస్యంగా నమాజు చేయడం ప్రారంభించారు.

ఇలా ముస్లింలు పట్నం వెలపల ఓ కొండ ప్రదేశంలో నమాజు చేస్తుంటే, ఓ సారి "అబూ తాలిబ్" అటుగా రావడం జరిగింది, అప్పుడక్కడ దైవప్రవక్త (సల్లం) తో పాటు అలీ (రజి) కూడా ఉన్నారు. అబూ తాలిబ్ వారిద్దరని చూసి....,

అబూ తాలిబ్ : - మీరు అవలంభించిన ఈ ధర్మం ఏమిటీ? (అని అడిగారు)

ముహమ్మద్ (సల్లం) : - ఇది మన పితామహుడు ఇబ్రాహీం (అలైహి) అనుసరించిన ధర్మమే, దీన్ని "ఇస్లాం" అని అంటారు. ఇందులోని అంశమే ఈ నమాజు.

అబూ తాలిబ్ : - కాని, నీ ముందు దేవతా విగ్రహం ఏదీ లేదుకదా?

ముహమ్మద్ (సల్లం) : - నేను విగ్రహాలను ముందు పెట్టుకుని ప్రార్థన చేయను.

అబూ తాలిబ్ : - మరి ఎవరి కోసం ఈ ప్రార్థన?

ముహమ్మద్ (సల్లం) : - యావత్తు విశ్వవ్యవస్థను, అందులోని సమస్త చరచారాలను సృజించిన సృష్టికర్త కోసం, ఆయన గోచర, అగోచరాలన్నీ ఎరిగినవాడు.

అబూ తాలిబ్ : - ఈ ప్రార్థన పధ్ధతి ఎవరు నేర్పారు నీకు?

ముహమ్మద్ (సల్లం) : - దైవదూత జిబ్రీల్ (అలైహి) నేర్పాడు. పెదనాన్న! క్రైస్తవ సాధువు బహీరా నా గురించి చెప్పిన భవిష్యత్ వాణి మీకు గుర్తుందనుకుంటాను.

అబూ తాలిబ్ : - ఆ.... గుర్తుంది!

ముహమ్మద్ (సల్లం) : - దేవుడు నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనిప్పుడు దైవప్రవక్తను. నాపై దైవ సందేశం అవతరిస్తోంది.

అబూ తాలిబ్ : - నీపై అవతరించిన దైవసందేశం ఏమిటీ?

అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఖుర్ఆన్ లోని కొన్ని సూక్తులు పఠించారు. ఈ సూక్తులు అబూ తాలిబ్ ని ప్రభావితం చేశాయి. కాని ఆయన హృదయకవాటాలు పూర్తిగా తెరచుకోలేదు.

అబూ తాలిబ్ : - ఈ సూక్తులు చాలా బాగున్నాయి. నీ ప్రార్థనా పధ్ధతి కూడా బాగుంది. మన వంశంలో ఒక దైవప్రవక్త జన్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది.

ముహమ్మద్ (సల్లం) : - పెదనాన్న! మీరు కూడా ఇస్లాం స్వీకరిస్తే బాగుంటుంది!

అబూ తాలిబ్ : - బాబు! ఈ ధర్మం అవలంబించాలని నాకూ ఉంది. కాని తాతముత్తాలనాటి సాంప్రదాయక మతం వదలిపెట్టాలంటే నాకెందుకో సిగ్గుగా ఉంది. జనం నా గురించి, "నీవు తమ్ముడి కొడుకు మాట విని అతని ధర్మం స్వీకరించావా?" అనడిగితే నేనేం సమాధానం ఇవ్వాలి? నా ఆత్మాభిమానం, వంశమర్యాదలు ఏమై పోవాలి? అంచేత నేను మటుకు ఈ ధర్మాన్ని అనుసరించలేను. నీవు నిరభ్యంతరంగా దీన్ని అనుసరించవచ్చు. నేను బ్రతికి ఉన్నంత కాలం నిన్నెవరూ ప్రతిఘటించలేరు.

తరువాత అబూ తాలిబ్, తన కొడుకు అలీ (రజి) వైపు తిరిగి, “బాబు అలీ (రజి)! నీవు అవలంభించిన ధర్మం చాలా బాగుంది. జీవితాంతం దాన్నే అంటిపెట్టుకుని ఉండాలి. అలాగే ముహమ్మద్ (సల్లం)ని ఎన్నటికి వదలిపెట్టకు.” అని చెప్పి వెళ్ళిపోయారు.

అబూ తాలిబ్ ఇస్లాం స్వీకరించలేదు. కాని , ఆయన మాటలు దైవప్రవక్త (సల్లం)కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఆయన (సల్లం) లోలోన ఎంతో సంతోషించారు.

కొన్నాళ్ళకు హజ్రత్ అర్ఖమ్ (రజి) ముస్లింల సామూహిక నమాజు కోసం తన ఇంటిని కేటాయించారు. ఆ ఇల్లు సఫా కొండకు దిగువభాగంలో ఉంది. జనం రాకపోకలు అటు వైపు అంతగా ఉండవు. అక్కడి నుంచి కాబా గృహం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని విధాలా సురక్షితమైన చోటది. ఆ రోజు నుండి ముస్లింలు అర్ఖమ్ (రజి) ఇంట్లో నిశ్చింతగా సామూహిక నమాజు చేయనారంభించారు.

 *ఖురైష్ (తెగ)కు చూచాయగా అందిన సమాచారం : -* 

ఈ ఘట్టంలో జరిగిన దైవసందేశం ప్రచారం, వ్యక్తిగతంగా, రహస్యంగా జరుగుతున్నప్పటికీ, ఖురైష్ దీన్ని చూచాయగా తెలుసుకోవడం జరిగిందన్న విషయం, వారు దీనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయం వివిధ సంఘటనల ద్వారా తెలుస్తోంది.

ముహమ్మద్ గజాలి గ్రంథస్తం చేసిన విషయం ప్రకారం, ఈ వార్తలు ఖురైష్కు చేరిపోయాయి. అయితే ఖురైష్ దానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. బహుశా వారు, ముహమ్మద్ (సల్లం)ను కూడా, దైవత్వం, దైవత్వపు హక్కుల గూర్చి చర్చించే, ఉమ్మియా బిన్ అబీసలత్, ఖుస్ బిన్ సాయిదా, అమ్రూ బిన్ నుఫైల్ వగైరాల్లాంటి ఓ వ్యక్తిగానే ఉపేక్షించడం జరిగిందేమో. అయితే ఖురైష్ ఆయన (సల్లం)గారి ప్రాచుర్యం, ప్రభావ వ్యాప్తి గురించి శంకించడం మాత్రం జరిగింది. వారి దృష్టి ఇతర సంఘటనలు, వాటి పరిణామాలు ప్రవక్త (సల్లం) సందేశ ప్రచారం పై కూడా నిలిచిపోయింది.

మూడు సంవత్సరాల వరకు ఈ దైవసందేశం ప్రచార కార్యక్రమం రహస్యంగా, వ్యక్తిగతంగా సాగింది. ఈ నడుమ విశ్వాసుల ఓ జమాఅత్ (వర్గం) తయారైపోయింది. ఈ జమాఅత్ సోదరభావం, పరస్పరం సహాయ సహకారాలను అందించుకుంటూ అల్లాహ్ సందేశాన్ని ప్రజలకు అందిస్తూపోయింది. అదే కాదు, ఈ సందేశానికి ఓ స్థాయిని కూడా కల్పించాలనే దృఢసంకల్పంతో ఉంది. ఆ తరువాత అవతరించిన దైవవాణిలో దైవప్రవక్తను, బాహాటంగా తన జాతికి సత్యధర్మాన్ని బోధించమని, వారిని దైవమార్గం వైపునకు పిలువమని, అసత్యంతో ఢీ కొనమని, విగ్రహాల యదార్థతను బట్టబయలు చేయమని ఆదేశించడం జరిగింది.

Insha Allah రేపటి భాగములో బహిరంగ దైవసందేశ ప్రచారం గురించి....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment