112

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐             *ఇస్లాం చరిత్ర* *- 112*             🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 27* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆


ఓ రోజు మక్కా పట్టణం పండుగ సంబరాలతో పరవశమయిపోతోంది. ప్రజలు మేళతాళాలతో, పండ్లు ఫలహారాలతో కాబాలయానికి వెళ్తున్నారు. అప్పటికే భక్త జనంతో కాబామందిరం నిండిపోయింది. పూజారులు, భక్తుల నుండి కానుకలు స్వీకరించి దేవతలకు నైవేద్యం పెడుతున్నారు. కొందరు తమ తమ ఇష్ట దేవతల ముందు సాష్టాంగపడి పోయారు. మరికొందరు వీరభక్తులు భక్తీపారవశ్యంతో ఊగిపోతున్నారు.

 *ప్రకృతి ప్రకోపం : -* 

బారెడు పైకొచ్చిన సూర్యుడు ఆ రోజు ఎందుకో డీలాపడినట్లు కనిపిస్తున్నాడు. వాడి, వేడి క్రమంగా తగ్గిపోతోంది. క్షణక్షణానికి కాంతి మందగిస్తోంది. అంతలో రివ్వున గాలులు వీచడం మొదలైంది. అనుకోని ఈ పరిణామానికి భక్తులు బిత్తరపోయి ఆకాశంకేసి చూశారు. ఆకాశం క్రమేణా ఎర్రబారసాగింది. చూస్తుండగానే అది మరింత ఎర్రగా రక్తంలా మారిపోయింది. దాంతో జనం అదిరిపోయారు. మరికాస్సేపటికే ఆకాశం ఎరుపు రంగు నుంచి నలుపు రంగులోకి మారిపోవడం జరిగింది. దాంతోపాటు నలుదిక్కుల నుంచి చీకట్లు కమ్ముకోసాగాయి. సూర్యుడు పూర్తిగా కనుమరుగైపోయాడు. కొన్ని క్షణాలలోనే ఆకాశం దట్టమైన పొగచూరినట్లు నల్లగా మారిపోయింది. వాతావరణం అంతకంతకూ భయానకంగా తయారవుతోంది. ఈ దృశ్యం చూసి ప్రజలు తీవ్రంగా భయపడిపోయారు. పూజారులు కూడా పరిస్థితి అర్థం కాక మంత్రోచ్చారణ చేస్తూ దేవతల్ని శాంతింపజేయడానికి ప్రయత్నించసాగారు. కాని వాతావరణం మారకపోగా మరింత ఉగ్రరూపం దాల్చింది.

"ఈ ఆపద నుంచి గట్టెక్కించమని దేవతలను దీనంగా విలపిస్తూ వేడుకోవాలి." అని పూజారులు, భక్తులను ఆదేశించారు. దాంతో భక్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తూ దేవతలను మొరపెట్టుకోవడం మొదలుపెట్టారు. మరికొందరు గుండెలు బాదుకుంటూ హృదయ విదారకంగా విలపించసాగారు. కాని తుఫాను గాలి ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత ఉధృతమయింది. ప్రజల్లో తీవ్రమైన భీతవాహం నెలకొన్నది. అరుపులు కేకలతో కాబా గృహం ప్రతిధ్వనిస్తోంది.

ఉధృతమైన గాలి వేగానికి నేలమీద పాదాలు నిలపడం కష్టమయిపోయింది. కొందరు గాలివాటుకు ఎగిరి కింద పడిపోతున్నారు. ఆలయంలోని స్తంభాలు, దూలాలు సైతం ఊగిపోతున్నాయి. నలువైపులా కారుచీకట్లు అలుముకున్నాయి. ఎవరెక్కడున్నారో కళ్ళు చించుకున్నా కానరావడం లేదు. గాలిహోరుల్లో ఎవరేం మాట్లాడుతున్నారో కూడా సరిగా వినిపించడం లేదు. తుఫాను ఘడియ ఘడియకు ఉదృతమవుతూ ఇళ్ళను, గుళ్ళను ఊపేస్తుంది.

ఇసుక దుమారం సుడులు తిరుగుతూ జనం మీద వచ్చి పడుతుంది. పై నుంచి కొందరు కిందపడిపోయి గావుకేకలు పెడుతున్నారు. పట్టణమంతా గాడాంధకారం అలుముకుంది. స్త్రీలు పిల్లలు ఏడుస్తున్నారు. చాలా మంది తమ తమ ఇష్టదేవతల ముందు సాగిలబడి దీనాతిదీనంగా విలపిస్తూ మొరపెట్టుకుంటున్నారు.

కాని ఆ దేవతలు వారి మొరలు ఆలకించే సూచనలు కనిపించడం లేదు. జనం భయాందోళనతో వణికిపోతూ ప్రళయం వచ్చిపడింది అని చెప్పుకోసాగారు. ఈ ఆలోచన రాగానే జనం ప్రాణాలు అరచేత పట్టుకొని అటూ ఇటూ పరుగెత్త సాగారు. కొందరు దడదడలాడుతున్న గుండెలతో విగ్రహాలను చుట్టుకుని విలపిస్తున్నారు. మరికొందరు దిక్కుతోచని స్థితిలో పడి హృదయ విదారకంగా పెడబొబ్బలు పెడుతున్నారు.

 *శాంతించిన ప్రకృతి : -* 

చివరికి ప్రజల దీనావస్థ పట్ల విశ్వప్రభువుకు దయ కలిగింది కాబోలు, కాస్సేపటికి తుఫాను ఉధృతం తగ్గుముఖం పట్టింది. చీకటి తెరలు మెల్లమెల్లగా విడిపోసాగాయి. మరి కాస్సేపటికే ప్రకృతి పూర్తిగా శాంతించింది. ఆకాశంలో కారుమేఘాలు తొలగిపోనారంభించాయి. సూర్యుడు మబ్బుల చాటు నుండి బయటపడి మళ్ళీ ప్రకాశించటం ప్రారంభించాడు. అది చూసి జనం చల్లగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణం ఇంకా మసక మసగ్గానే ఉంది. జనం, తుఫాను దెబ్బ నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.

అంతలో పడమటి దిక్కున తళుక్కుమని ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపు చూసి ప్రజలు నిర్ఘాంతపోయారు. ఇది వరకెప్పుడూ వారు అలాంటి మెరుపు చూడలేదు. అందుకే వారు మరోసారి ఆశ్చర్యంతో పాటు ఆందోళన వెలిబుచ్చారు. ఆ ఆశ్చర్యం నుంచి భక్తులు తేరుకోకముందే బిగ్గరగా ఓ స్వరం వినిపించింది....,

“అరబ్బులారా! ఇప్పుడు మీరొక మెరుపుని చూశారు కదా? రండి, ఆ మెరుపుకు కారణం ఏమిటో చెప్తాను.” అన్నాడొక డెబ్బై అయిదేళ్ళ వృద్దుడు.

ఈ మాటలు వినగానే జనం అతని దగ్గరకు చేరుకున్నారు. అబూ తాలిబ్, అతని సోదరులు, కొడుకులు కూడా అక్కడకి వచ్చి నిలుచున్నారు.

ఆ వృద్దుని రూపురేఖలు విచిత్రంగా ఉన్నాయి. పొడవయిన ముఖంతో బుగ్గలు సొట్టబోయి, దవడలు పైకి ఉబికి ఉన్నాయి. లోపలి పీక్కునిపోయి ఉన్న నిప్పుకణాల్లాంటి ఎర్రటి చిన్న కళ్ళు. తైల సంస్కారంలేని, ముగ్గుబుట్టలాంటి అతని తల వెంట్రుకలు ఉంగరాలు చుట్టుకుని ఎదురొమ్ముపై చిందరవందరగా పడివున్నాయి. జనపనారలాంటి తెల్లగడ్డం నాభివరకు పొడుగ్గా ఉంది. శుష్కించిపోయిన నల్లటి పెదాలు, గడ్డం మరియు మీసాల మధ్య నుంచి బలవంతంగా తొంగిచూస్తున్నాయి. మెడలో పొడవైన ఎముకుల దండతో పాటు, ఎడమచేతిలో మానవకపాలం, కుడిచేతిలో చేతి ఎముక కూడా ఉన్నాయి. అతని పేరు "అబ్రష్". అతను యావత్ అరేబియాలో పేరు మోసిన గొప్ప మాంత్రికుడు. 

“అందరూ నిశ్శబ్దంగా ఉండి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి." అని అన్నాడు అతను.

ప్రజలు గుసగుసలు మానేసి నిశ్శబ్దంగా ఉండి, మాంత్రికుడు చెప్పే మాటలు వినడానికి ఊపిరి బిగబట్టి ఎదురుచూడసాగారు.

“చూడండి. నా ఎడమ చేతిలో మనిషి పుర్రె ఉంది. కుడిచేతిలో మణికట్టు ఎముక ఉంది.

నాకు ఈ రెండు (పుర్రె మరియు ఎముక) బనూబకర్, బనూసాల్ తెగల మధ్య నలభై ఏళ్ళపాటు నిరంతరాయంగా భీకర యుద్ధం జరిగిన ప్రదేశంలో దొరికాయి. లోకం దీన్ని అజ్ఞానం వల్ల జరిగిన యుద్ధం అని భావించవచ్చు. కాని ఈ యుద్ధం అజ్ఞానం, అనాగరికతల పర్యవసానం కాదని; ఆత్మాభిమానం, గౌరవ ప్రతిష్ఠల కోసం జరిగిన పోరాటమని అరబ్బులకు బాగా తెలుసు. ఆత్మాభిమానం మంట కలిసి పోవడాన్ని ఏ అరబ్బయినా సహించగలడా? నా దృష్టిలో మాత్రం ఆత్మాభిమానం లేనివాడు అసలు మనిషే కాదు.

కనుక అరబ్బులారా! వినండి. ఈ పుర్రె నాకు భవిష్యత్తులో జరిగే విషయాలు తెలియజేసింది. అతి త్వరలో ప్రపంచంలో ఓ గొప్ప విప్లవం రాబోతోంది. చిల్లర దేవుళ్ళంతా చిత్తయిపోతారు. ఘోరమైన అపచారం జరుగబోతోంది. అలాంటి పరిస్థితిలో మీ కర్తవ్యం ఏమిటి? మీరు మీ దేవుళ్ళకు ఏదైనా అపచారం జరిగితే సహించగలరా?” అని అన్నాడు అబ్రష్ ప్రజల పౌరుషాన్ని రెచ్చగొడుతూ.

“సహించం. ఏ మాత్రం సహించం” అన్నారు జనం ముక్త కంఠంతో బిగ్గరగా.

“ఎవడు మా దేవుళ్ళకు అపచారం తలపెట్టేవాడు? మేము వాడి తల చితగ్గోట్టేస్తాం. మేము ప్రాణాలైనా విడుస్తాం గాని, మా దేవుళ్ళ పట్ల అపచారం మటుకు ఎన్నటికి సహించం” అంటూ గాండ్రించాడు "అబూ తాలిబ్" తమ్ముడు "అబూ లహాబ్."

అబ్రష్ : - పౌరుషం గల అరబ్బులంటే ఇలాగే ఉంటారు. మనం (మరియు) మన తాతముత్తాలు పూజిస్తూ వస్తున్న ఈ దేవతలకు అపచారం జరిగితే, ఆ అపచారాన్ని సహించేటంత నీచులమా మనం? కాదు. ఎన్నటికీ కాదు. కనుక అభిమానంగల అరబ్బులారా! వినండి. ఈ రోజు కనిపించినట్లే నలభై ఏళ్ళ కిందట కూడా ఆకాశంలో ఓ మెరుపు కనిపించింది. అదొక భయంకరమైన కాళరాత్రి. ఆ రాత్రి మన మహాదేవుడు "హుబల్" బోర్లాపడిపోయాడు. మనమంతా ఆ విగ్రహాన్ని లేపి నిలబెట్టటానికి ఎంత ప్రయత్నించిన అది నిలబడలేకపోయింది. ఆ సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది.

అబూలహాబ్ : - ఆ.... గుర్తుంది, గుర్తుంది. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతోంది. ఆ రోజు రాత్రి ఎన్నడూ లేని విధంగా ఎన్నో నక్షత్రాలు రాలిపడ్డాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించింది. ఆ రాత్రి మన "హుబల్" దేవుడు బోర్లాపడిపోయాడు. మనం ఎన్ని సార్లు లేపి నిలబెట్టినా కింద పడిపోయేవాడు.

అబ్రష్ : - అయితే వినండి. సరిగా ఆ రోజు ఉదయం మన దేవతలకు అపచారం తలపెట్టే మనిషి మన పట్టణంలో పుట్టాడు. ఈ రోజు అతని వయస్సు పూర్తిగా నలభై ఏళ్ళు అయ్యాయి. నిన్నటిదాకా అతను పేరు, ఊరూ లేని వాడిలా మౌనంగా ఉన్నాడు. ఈ రోజు నుంచి అతను ప్రజల ముందుకు వస్తాడు. విగ్రహాలకు వ్యతిరేఖంగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఏకేశ్వరుడు అయిన "అల్లాహ్" ను మాత్రమే ఆరాధించాలని ప్రచారం చేస్తాడు. అతను, మన నుండి మన దేవతలను దూరం చేస్తాడు. కనిపించని దేవుడిని ఆరాధించాలని చెబుతాడు. చివరికి యావత్తు అరబ్బులు అతని ప్రచారజాలంలో పడిపోతారు.
          ఈ విషయాలన్నీ నా చేతిలో ఉన్న ఈ పుర్రె చెబుతోంది. అయ్యయ్యో! మనకు ఎలాంటి వినాశకాలం దాపురించబోతోంది!! (అంటూ అబ్రష్ కంటతడి పెట్టాడు.)

అతడ్ని చూసి జనం కూడా కంటతడి పెట్టుకున్నారు. అందరిపై ఒక విధమైన భయం ఆవరించింది.

అబూ లహబ్ : - హుబల్ సాక్షి! కనిపించని దేవుని ముందు సాష్టాంగపడే ప్రతివాడిని నేను హతమార్చి వేస్తాను. (అంటూ అసహనంతో అరిచాడు.)

అబ్రష్ : - మీరలా చేయగలిగితే బాగానే ఉంటుంది. కాని మీరలా చేయలేరని ఈ కపాలం చెబుతోంది. మీరు, మన దేవతలకు కలిగే అపచారాన్ని మీ కళ్ళారా చూడవలసి వస్తుంది.

(అపుడు, అక్కడే ఉన్న "అబూ లహబ్" సోదరుడు "హమ్ జా" ఇలా అన్నాడు....,)

హమ్ జా : - అయితే ఈ బెడద దూరమయ్యే దారిలేదా?

అబ్రష్ : - లేకేమి, ఉంది. కాని ముందుగా మన తెగలన్నీ పరస్పర తగాదాలు, విరోధాలు మానేసి ఏకం కావాలి. ఆ తరువాత ఏకేశ్వరుడ్ని ఆరాధించే మనిషి ఎలాంటి వాడయినా, ఏ తెగకు చెందినవాడైనా సరే, అతడ్ని గట్టిగా వ్యతిరేఖిస్తామని, ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తామని, అవసరం అయితే అతడిని చంపటానికైనా వెనుకాడమని మీరంతా ప్రతిజ్ఞ చేయాలి.

ఈ మాటలు వినగానే జనంలో రక్తం ఉడికిపోయింది. అందరు తమ తమ దేవతల పేర్లు ఉచ్చరించి, వాటిని అవమానపరిచేవాడు ఏ తెగకు చెందినవాడైనా సరే, చంపి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు మూకుమ్మడిగా. 

అబూ లహబ్ : - మాంత్రిక మహాశయా! మన దేవతలకు అపచారం తలపెట్టేవాడు బహుషా బనీహాషిం తెగలో ఉన్నాడని మీ ఉద్దేశ్యం కాబోలు. నిజంగా అతను మా తెగలో గనక ఉంటే, అందరి కన్నా ముందు నా ఖడ్గమే అతడ్ని చీరేస్తుంది.

అబ్రష్ : - అది నా అభిప్రాయం కాదు. మన దేవతలకు అపచారం తలపెట్టేవాడు బనీహాషిం తెగలో ఉన్నాడని ఈ కపాలమే నాకు తెలియజేసింది. కావాలంటే అతని పేరు కూడా చూడండి. 

అని అంటూ "అబ్రష్" చుట్టూ తిరిగి పుర్రెను అందరికీ చూపించాడు.

పుర్రె మీద నల్లగా మాడిన రంగులో, స్పష్టమైన అక్షరాల్లో.... (ఆ వ్యక్తి పేరు ప్రత్యక్షమయి ఉంది.)

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment