260

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 260*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 175*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*హజ్రత్ జైనబ్ (రజి)తో దైవప్రవక్త (సల్లం) వివాహం : -*

దాదాపు, హిజ్రీ శకం - 5లో దైవప్రవక్త (సల్లం), హజ్రత్ జైనబ్ (రజి)ను కూడా వివాహం చేసుకున్నారు. ఈమె (రజి), దైవప్రవక్త (సల్లం)కు స్వయాన మేనత్త కూతురవుతారు.

'హజ్రత్ జైనబ్ (రజి)' వివాహం మొదట 'హజ్రత్ జైద్ (రజి)'తో జరిగింది. హజ్రత్ జైద్ (రజి), దైవప్రవక్త (సల్లం) పెంపుడు కొడుకు★. అంతకు ముందు జైద్ (రజి) బానిసగా జీవితం గడిపారు. దైవప్రవక్త (సల్లం), ఆయన్ను చేరదీసి పెంచి పెద్దచేశారు. తరువాత ఆయన (రజి) కులం, జాతి, తెగ అనే వివక్షల్ని, సాంఘిక అసమానతలను అంతమొందించడానికి జైద్ (రజి) వివాహం జైనబ్ (రజి)తో జరిపించారు.

_(★→ *"దైవప్రవక్త (సల్లం), జైద్ (రజి)ని దత్త పుత్రునిగా ఎందుకు చేసుకున్నారు? మరియు వారిద్దరి మధ్య సంబంధం ఏమిటి?"* అనే విషయాలలోని వివరణను దయచేసి చదవండి ఇస్లాం చరిత్ర - 107వ భాగం.)_

*↑ ఈ వృత్తాంతంలోని మరింత వివరణ ↓*

జైద్ (రజి) యుక్తవయస్సుకు చేరుకున్నారు. తన కుమారునిగా పెరిగిన ఆయన (రజి)కు ఓ మంచి అరబ్బు మహిళతో వివాహం జరిపించాలని దైవప్రవక్త (సల్లం) కోరుకున్నారు. 'జహష్' కుమార్తె 'జైనబ్' సంబంధం దైవప్రవక్త (సల్లం)కు నచ్చింది. ఆమె ఎవరో కాదు, స్వయానా దైవప్రవక్త (సల్లం) మేనత్త అయిన 'ఉమైమా' కూతురే!

కాని, పెళ్ళికూతురు అన్నయ్య 'అబ్దుల్లాహ్'కు ఈ సంబంధం నచ్చలేదు. జైద్ (రజి) ఒకప్పుడు బానిస జీవితం గడిపినవారు. అలాంటి సాధారణ వ్యక్తి, అరబ్బుల్లో ఒక ఉన్నత తెగకు చెందిన తన చెల్లెలికి సరిజోడు ఎలా కాగలరని ఆయన ప్రశ్నించారు.

ఇటు, జైనబ్ (రజి) కూడా తన అన్నయ్య మాటను సమర్థిస్తూ దైవప్రవక్త (సల్లం) తీసుకువచ్చిన సంబంధాన్ని త్రోసిపుచ్చారు. వారిరువురి తిరస్కార ధోరణిపై అల్లాహ్ ఈ క్రింది ఖుర్ఆన్ వాక్యాలను అవతరింపజేశాడు.

*"(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనయినా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త!)." (ఖుర్ఆన్ 33:36).*

ఈ వాక్యాలు చెవిన పడగానే జైనబ్ (రజి), ఆవిడ అన్నయ్య ఇద్దరూ తమ మాటను వెనక్కు తీసుకున్నారు. అల్లాహ్ అభీష్టం ముందు శిరసావహించడానికి వారు సిద్ధమయ్యారు.

ఎట్టకేలకు జైద్ (రజి) - జైనబ్ (రజి)ల వివాహం జరిగింది. అల్లాహ్ వారి అదృష్టంలో రాసివుంచినంత కాలం వారిరువురూ భార్యాభర్తలుగా జీవితం గడిపారు.

*దంపతుల మధ్య తగాదాలు : -*

జైద్ (రజి), తన శక్తిమేరకు కష్టపడి పనిచేసి భార్యను సుఖపెట్టటానికి కృషి చేశారు. కొన్నాళ్ళ తర్వాత ఆ దంపతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. జైద్ (రజి) సహించలేక ఒకనాడు భార్యకు విడాకులు ఇవ్వాలని భావించారు. ఆ విషయమై దైవప్రవక్త (సల్లం)ను సంప్రదించారు. *"జైద్! నీ భార్య జైనబ్, నా మేనత్త కూతురు. అసలు మీ పెళ్ళి జరిగేది కాదు. అల్లాహ్ ప్రమేయంతో మీ ఇద్దరి వివాహం జరిగింది. కనుక ఓపిక పట్టు. తనతోనే కలిసి జీవించు."* అని దైవప్రవక్త (సల్లం) నచ్చజెప్పి పంపించారు.

రోజులు గడుస్తున్న కొద్దీ ఆ దంపతుల మధ్య విభేదాలు పెరుగుతూనే పోయాయి. జైనబ్ నుంచి తనకు విడాకులు ఇప్పించమని దైవప్రవక్త (సల్లం)ను జైద్ (రజి) మాటిమాటికి అడుగుతుండేవారు. ఆఖరికి జైద్ (రజి) పరిస్థితిపై దైవప్రవక్త (సల్లం)కు జాలి కలిగింది. *"ఇక నీకు ఏది సముచితంగా కనిపిస్తే అది చేయి"* అని ఆయన (సల్లం) జైద్ (రజి)తో అన్నారు. ఆ అవకాశం కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న జైద్ (రజి) భార్యకు విడాకులిచ్చేశారు.

అనేక నెలలు గడిచిపోయాయి. తర్వాత దైవప్రవక్త (సల్లం) స్వయంగా జైనబ్ (రజి)కు వివాహ సందేశం పంపించారు. ఆమె కూడా దైవప్రవక్త (సల్లం)ను వివాహం చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించారు.

ఇక ఈ వివాహం ప్రజల్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాహ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ జనం ఆయన (సల్లం)ను వేధించడం మొదలుపెట్టారు. అరబ్బు బహుదైవారాధకుల ఆచారం ప్రకారం దత్త కుమారుని భార్యను వివాహం చేసుకోరాదు. దత్త కుమారుడు సొంత కుమారుని లాంటివాడేనని ఆ కాలం ప్రజల నమ్మకం. అప్పుడు దైవప్రవక్త (సల్లం)పై ఈ క్రింది వాక్యాలు అవతరించాయి.

ఈ వాక్యాలు బహుదైవారాధకుల నోళ్ళు మూయించాయి. ఆస్తి పంపకాల వ్యవహారంలోగాని, మరే వ్యవహారంలోనైనా గాని దత్తపుత్రుల పట్ల కన్న కుమారుల మాదిరిగా వ్యవహరించటాన్ని ఈ వాక్యాలు సవాలు చేశాయి. మొత్తానికి దత్త కుమారుణ్ణి సొంత కుమారునిగా చేసే చట్టమేదీ లేదని అల్లాహ్ ఈ వాక్యాల్లో నిరూపించాడు.

*"(ఓ ప్రవక్తా! ఆ సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకో) అల్లాహ్ అనుగ్రహించిన వ్యక్తితో, నువ్వు సయితం ఉపకారం చేసిన వానితో "నువ్వు నీ భార్యను నీ దగ్గరే ఉండనివ్వు, అల్లాహ్ కు భయపడు" అని చెప్పేవాడివి. కాని అల్లాహ్ బయటపెట్టాలని ఉన్న ఒక విషయాన్ని నువ్వు నీ మనసులోనే దాచిపెట్టావు. నువ్వు జనులకు భయపడేవాడివి. నిజానికి నువ్వు భయపడటానికి అల్లాహ్ యే ఎక్కువ హక్కుదారుడు. మరి జైద్ ఆ స్త్రీతో తన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. దత్తపుత్రులు తమ భార్యల లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత (వారికి విడాకులిచ్చిన పిమ్మట) వారి భార్యల (ను వివాహమాడే) విషయంలో ముస్లింలు ఎలాంటి సంకోచానికీ లోను కాకుండా ఉండేటందుకు మేమిలా చేశాము. అల్లాహ్ ఆజ్ఞ అమలు జరిగి తీరవలసిందే." (ఖుర్ఆన్ 33:37).*

జైనబ్ (రజి) వివాహం దైవప్రవక్త (సల్లం)తో ఈ విధంగా జరిగింది. అందుకనే జైనబ్ (రజి) తన సవతుల వద్ద గొప్పలు చెప్పుకుంటూ, *"దైవప్రవక్త (సల్లం)తో మీ పెళ్ళిళ్ళు, మీ తండ్రుల, మీ సంరక్షకుల పెద్దరికంలో జరిగాయి. కాని నా పెళ్ళి మాత్రం అల్లాహ్ మధ్యవర్తిత్వంతో జరిగింది."* అని అంటుండేవారు.

మొత్తానికి దైవప్రవక్త (సల్లం) - జైనబ్ (రజి)ల వివాహం అజ్ఞానకాలం నాటి ఒక మూఢాచారాన్ని సంస్కరించటానికి తోడ్పడింది. రక్తసంబంధాల ప్రాముఖ్యతను,  ఆస్తివారసత్వ పంపకాలను గురించి ఈ వివాహం మరింత స్పష్టంగా వివరించింది. సామాజిక జన జీవనంలో ఒకరు మరొకరికి దన్నుగా నిలిచినంత మాత్రాన, ఒకరు మరొకరితో అతి సన్నిహితంగా మెలిగినంత మాత్రాన వారి మధ్య రక్తసంబంధం పుట్టుకురాదు.

అయితే ఇటువంటి పరోపకార భావాలకు బహుశా ఇస్లాంలో స్థానం లేదని తలపోయటానికి కూడా వీల్లేదు సుమా! స్త్రీ పురుషుల మధ్య రక్త సంబంధం లేనప్పుడు ఖుర్ఆన్ నిర్ధారించిన వైవాహిక కట్టుబాట్లు వారికి వర్తించవని చెప్పటమే ఈ సంఘటన పరమార్థం.

ఇతరుల పిల్లల్ని దత్తత తీసుకున్నంత మాత్రాన వారు తమ కన్న తల్లిదండ్రులకు కాకుండా పోరు. ఆ పిల్లలు తమ పేర్లతో పాటు తమ తల్లిదండ్రుల పేర్లనూ నిశ్చింతగా రాసుకోవచ్చు. అలా రాయాలి కూడా! ప్రజలు కూడా వారిని వారి కన్న తల్లిదండ్రుల పేర్లతోనే పిలవాలి. ఇది ఖుర్ఆన్ ఆదేశం.

తాము దత్తత తీసుకున్న పిల్లలకే ఆస్తి మొత్తాన్ని ధారాదత్తం చేస్తామని అంటే ఇస్లాం ధర్మం ఒప్పుకోదు. అలా చేస్తే రక్తసంబంధీకుల హక్కును కొల్లగొట్టినట్లవుతుంది. అలా అని మనిషిలోని సహజమైన భావాలను, ఆత్మీయతా అనురాగాలను ఇస్లాం ధర్మం నిర్దాక్షిణ్యంగా అణచి వేయదు. తాము కోరుకుంటే ఆస్తిలో మూడోవంతు దత్తపుత్రునికే ఇచ్చుకోవచ్చు. మిగిలినది మాత్రం రక్తసంబంధీకులకే దక్కాలి.

*గ్రహించవలసిన పాఠాలు : -*

----» దైవప్రవక్త (సల్లం) జీవితంలోని ఈ అపూర్వ సంఘటనపై ఇస్లాం శత్రువులు తీవ్ర అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దైవప్రవక్త (సల్లం) తన దత్త కుమారుని భార్యపై మోజు పడ్డారని (ఈ అనుచితమైన మాటను మన నోటితో అనవలసి వస్తున్నందుకు అల్లాహ్ మనల్ని క్షమించాలని ప్రార్థిస్తున్నాం), అందుకే జైద్ (రజి) చేత ఆయన భార్యకు విడాకులు ఇప్పించారని కొంతమంది దుర్మార్గులు పనిగట్టుకొని దైవప్రవక్త (సల్లం)పై నిందారోపణలకు దిగారు. కాని వారి ఈ ఆరోపణలు పసలేనివి.

    జైనబ్ (రజి) స్వయానా దైవప్రవక్త (సల్లం) గారి మేనత్త కూతురు. తను పుట్టినప్పటి నుంచి దైవప్రవక్త (సల్లం)కు తన గురించి బాగా తెలుసు. జైనబ్ (రజి)ను వివాహమాడాలనే కోరిక గనక తన మనసులో ముందు నుంచి ఉన్నట్లయితే ఆయన (సల్లం) ఆమెను జైద్ (రజి)తో వివాహం చేసేవారు కాదు. పైగా మంచి యవ్వనంలో ఉన్నప్పుడే ఆయన (సల్లం) ఆమెను వివాహమాడేవారు. తన యాభై సంవత్సరాల వయసు దాకా ఆగవలసిన అవసరం ఆయన (సల్లం)కు లేదు. అదీకాక ఆయన (సల్లం) జైనబ్ (రజి)ను వివాహమాడినప్పుడు ఆమెకు నడివయసు దాటింది. అంతేకాదు, జైనబ్ కు విడాకులు ఇవ్వవద్దని దైవప్రవక్త (సల్లం) జైద్ (రజి)కు పదే పదే తాకీదు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. జైనబ్ పట్ల సహనంతో ఉండటం ఇక తన వల్ల కాదని అన్నప్పుడు మాత్రమే దైవప్రవక్త (సల్లం) ఆయనకు విడాకుల అనుమతి ఇచ్చారు.

-----» దైవప్రవక్త (సల్లం) జైనబ్ (రజి)ని దైవాజ్ఞ మేరకే వివాహమాడారన్న విషయం అర్థమైతే, ఆవిడతో ఆయన (సల్లం) వివాహం గురించి అసలు ఇంత చర్చ అనవసరం. అల్లాహ్ తన ఆజ్ఞను దేన్నయినా అమలు పరచదలచుకున్నప్పుడు, ప్రజల్లో ఒక అత్యుత్తమ ఆదర్శాన్ని నెలకొల్పడం కోసం, సాధారణంగా ప్రవక్త ద్వారానో లేక ప్రవక్త సమీప వ్యక్తుల ద్వారానో దాన్ని అమలు పరుస్తాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి.

*ఈ వృత్తాంతంలోని మరింత వివరణ కోసం, అహ్'సనుల్ బయాన్ ఖుర్ఆన్ అనువాదంలోని 33:36,37 ఆయత్ ల వివరణను చదవండి.*

*In Sha Allah రేపటి భాగంలో 🛡⚔ "అగడ్త యుద్ధం (కందక యుద్ధం)" ⚔🛡....; →*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment