261

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 261*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 176*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 1* ⚔🛡

("1. సరియ్యా అబీ సల్మా (ఇస్లాం చరిత్ర - 250)" నుంచి "గజ్వయె దూమతుల్ జందల్ (ఇస్లాం చరిత్ర - 258)" వరకు జరిగిన సైనిక చర్యలు) ఇలా ఎడతెగకుండా జరిగిన సైనిక చర్యలు, యుద్ధాలు ముగిసిన తరువాత అరేబియా ద్వీపకల్పంలో ప్రశాంతత నెలకొంది. శాంతిభద్రతలు ఎల్లెడలా వ్యాపించాయి. ఎటు చూసినా ప్రశాంత వాతావరణమే కానవచ్చింది.

కాని, యూదులకు మాత్రం ఇంకా స్పృహ రాలేదు. వారు తమ కుట్రలు, కుతంత్రాల వల్ల అనేక రకాలుగా అగౌరవంపాలైనా వారికి ఇంకా బుద్ధి రాలేదు. వీరు తమ ఈ వైఖరి వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామాల నుండి ఎలాంటి గుణపాఠమూ నేర్చుకోలేదు.

బనూ నజీర్ తెగ తాను సృష్టించిన అలజడుల మూలాన మదీనా నుంచి ఇదివరకే బహిష్కరించబడింది. అప్పుడు ఆ తెగవాళ్ళు ఖైబర్ కు పోయి స్థిరపడ్డారు. అయితే వారు తమకు జరిగిన పరాభవానికి ఉడికిపోతూ పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

మదీనా నుండి దేశ బహిష్కరణకు గురై ఖైబర్ చేరిన తరువాత వారు, విగ్రహారాధకులు మరియు ముస్లింల నడుమ జరుగుతున్న సంఘర్షణ ఫలితాలను వేచిచూడనారంభించారు. కాని పరిస్థితులు ముస్లింలకే అనుకూలంగా మారడం గమనించి, ఎటు చూసినా ముస్లింల మాటే చెల్లడం చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. క్రొత్త తరహా కుట్రను ప్రారంభిస్తూ వారు ముస్లింలపై చిట్టచివరి ప్రహారం చేయడానికి సంసిద్ధులయ్యారు. దీని ఫలితంగా నామరూపాల్లేకుండా పోతామనే ధ్యాసే వారికి లేకుండాపోయింది. ఈ లక్ష్యసాధన కోసం యూదులు ఓ భయంకరమైన క్రొత్త పథకాన్ని సిద్ధం చేశారు.

బనూ నజీర్ తెగకు చెందిన ఇరవై మంది సర్దారులు కలసి మక్కాలోని ఖురైషు నాయకుల వద్దకు వెళ్ళారు. వారిని దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా యుద్ధం కోసం పురికొల్పుతూ, తమ సహాయం కూడా ఉంటుందని నమ్మ పలికారు. అణగారిన వారి ద్వేషాన్ని ఉత్తేజపరుస్తూ, *"భయమెందుకు? మేము మీకు తోడుగా ఉన్నాం. ఈ సంగతి చెప్పి మీకు వాగ్దానం చేయడానికే మేము ఇంత దూరం వచ్చాం."* అని చెప్పారు.

ఈ మాటలు విని ఖురైషీయుల హృదయాలలో నూతన ఉత్తేజం ఉప్పొంగింది. ఖురైషులు, యూదుల ఈ కల్లిబొల్లి మాటలను నమ్మి యుద్ధం కోసం సంసిద్ధం కాసాగారు. ఉహద్ యుద్ధం రోజున, తిరిగి బద్ర్ మైదానంలో తలపడడానికి సిద్ధంగా ఉండమని సవాలు విసిరి ఉండడం, ఆ సవాలును తామే విరమించుకోవడం వల్ల వారికి తలకొట్టేసినట్లయింది. ఇప్పుడు యుద్ధం చేసి తాము పోగొట్టుకున్న గౌరవమర్యాదలను తిరిగి రాబట్టుకోవచ్చు, తాము విసిరిన సవాలును కూడా నిలుపుకోవచ్చు అని భావించారు. తమకు యూదుల మద్దతు దొరికినందుకు తెగ సంబరపడిపోయారు. ఆ సంబరంలో యూద నాయకులకు ఖరీదైన ఆతిథ్యమిచ్చి సత్కరించారు.

*"ఎంత మంచివారు మీరు! అసలు మీలాంటి వారంటేనే మాకిష్టం. ముహమ్మద్ (సల్లం)కు శత్రువులయి అతడ్ని తుదముట్టించడానికి సిధ్ధమయినవారిని మేము ప్రాణప్రదంగా ప్రేమిస్తాం."* అన్నారు వారు ఆనందసాగరంలో మునిగితేలుతూ.

*"సోదరులారా! మీదగ్గర ఇదివరకటి నుంచే దైవగ్రంథం ఉంది. ముహమ్మద్ (సల్లం)తో మాకున్న భేదాభిప్రాయం కూడా మీరెరగనిది కాదు. మీరే చెప్పండి.... మా మతం గొప్పా లేక ముహమ్మద్ (సల్లం) మతం గొప్పా? (★మీరు గ్రంథ ప్రజలు. ఈ విషయంలో మా కర్తవ్యం ఏమిటో మీరే నిర్ణయించాలి. అయితే ఒక మాటకు సమాధానం చెప్పండి; ఒకే దేవుణ్ణి పూజించే ముహమ్మద్ మతం కన్నా వివిధ దేవుళ్ళ విగ్రహాలను పూజించే మా మతం గొప్పదా కాదా?)"* అని అడిగారు ఖురైష్ బహుదైవారాధకులు.

*"ఏమిటీ! ముహమ్మద్ మతాన్ని గురించి అడుగుతున్నారా? మీ మతం ఎక్కడా, అతని మతం ఎక్కడా! సత్యం ఎక్కడా, అసత్యం ఎక్కడా!! మీ మతం ముందు ముహమ్మద్ మతం ఏపాటిది? (★మీ మతం విషయంలో మీరు ఎటువంటి సందేహానికి లోనుకావలసిన అవసరం లేదు. మీరు అనుసరిస్తున్న మతమే సరైనది. ముహమ్మద్ (సల్లం) అనుసరిస్తున్న మతం సరైనది కాదు. మీ విగ్రహాలు తలుచుకుంటే కీడు తలపెట్టగలవు. తలచుకుంటే వరాలు కూడా ప్రసాదించగలవు. ఒక్కడైన ముహమ్మద్ దేవునికి ఈ అధికారాలేవీ లేవు. అసలు ఇటువంటి సందర్భంలో మీరు మీ మెదడులోకి ఇటువంటి అనుమానాలు రానీయకండి. లేకపోతే ముహమ్మద్ (సల్లం)తో యుద్ధం చేయాలనే మీ నిర్ణయం చల్లబడే ప్రమాదముంది. బనూ ఖురైజా యూదులతోనూ, ఇతర అరబ్బు తెగలవారందరితోనూ మేము ఒక కూటమిని తయారు చేస్తాం. మనందరం కలసికట్టుగా ముహమ్మద్ (సల్లం) కథను కంచికి చేర్చుదాం.)"* అన్నారు యూదులు.

_(★→ వేరొక ఉల్లేఖనం ప్రకారం)_

*"శభాష్! మీరే మా శ్రేయోభిలాషులు. మత గ్రంథాలన్నీ క్షాళనచేసిన మీరు అసత్యం చెప్పరని మాకు తెలుసు."* యూదులు పన్నిన ఉచ్చులో బిగుసుకు పోతున్నామని గ్రహించని ఖురైషీయులు వారి స్తోత్రగానాలకు పూనకం వచ్చినవారిలా ఊగిపోయారు.

*"మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ముహమ్మద్ (సల్లం)తో మేము పొరాడుతూనే ఉంటాం. అతని ధర్మం ఎంతవరకు వ్యాపిస్తుందో మేము కూడా చూస్తాం. ముహమ్మద్ (సల్లం)ని, అతని ధర్మాన్ని సర్వనాశనం చేసిగాని వదలిపెట్టం."* తిరుగులేని నిర్ణయం వ్యక్తపరిచారు ఖురైషులు యూదుల ముందు.

యూదులు విసిరిన ఉచ్చులో ఖురైష్‌ నాయకులు పూర్తిగా బిగుసుకు పోయారు. యుద్ధానికి పోవలసిన తేదీ కూడా నిశ్చయమైపోయింది.

యూదులు అంతటితో ఊరుకోలేదు. వారు అరేబియాలోని ఇతర తెగల దగ్గరకు కూడా పోయి విషబీజాలు నాటడం ప్రారంభించారు. ఖురైషులను ఒప్పించినట్లే వారిని కూడా కదన రంగంలోకి దుమకడానికి సిద్ధపరిచారు. సభలు జరిపి ఉద్రేక పూరితమైన ఉపన్యాసాలతో ప్రజలను రెచ్చగొట్టారు. 'బనూ గత్ఫాన్' తెగలోకి పోయి వారికి అనేకనేక ఆశలు చూపిస్తూ, *"మీరు ఈ యుద్ధంలో మాతో సహకరిస్తే, మేము ఖైబర్ లో పండే పంటలో సగం మీకిస్తాం."* అన్నారు. బనూ గత్ఫాన్ తెగ వారూ యుద్ధానికి సిద్ధపడ్డారు.

అదేవిధంగా వారు బనీ అసద్, ఫజారా, ముర్రా తెగల దగ్గరికి కూడా పోయి తమ పథకాన్ని అమలుపరిచారు. వారందరికీ నూతన ధర్మం వల్ల పొంచివున్న ప్రమాదం గురించి తీవ్రంగా హెచ్చరించారు. తమ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు సైతం తెగించి పోరాడాలని ఉద్రేకపరిచారు. ఆశల గుర్రాలు ఎక్కించి అదిలించి వదలిపెట్టారు.

ఇలా యూదుల రాజకీయ నాయకులు విజయవంతంగా దైవధిక్కారుల గొప్ప గొప్ప తెగలను, సమూహాలను దైవప్రవక్త (సల్లం)కూ, ఆయన సందేశానికీ, ముస్లింలకూ వ్యతిరేకంగా యుద్ధాగ్నిలో దూమకడానికి సిద్ధపరిచారు.

*ఇప్పుడు దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా యావత్తు అరేబియా ఒకటైపోయింది. ఒక్క యూదులేమిటీ! బహుదైవారాధకులేమిటీ!! సమస్త దుష్టశక్తులు, మిథ్యావాదులు సత్యజ్యోతిని ఆర్పడానికి సమయాత్తమయ్యారు. కారుణ్యమూర్తి (సల్లం)ని కడతేర్చడానికి కంకణం కట్టుకున్నారు.*

తీర్మానాలు అయ్యాయి. నిర్ణయాలు జరిగాయి. పథకాలు రూపొందాయి. సైనిక సమీకరణ ప్రారంభమయింది. భారీఎత్తు ఆయుధాలు, ఇతర అవసరాలు సమకూరాయి. కొన్ని రోజుల్లోనే బ్రహ్మాండమైన సైనికపటాలం తయారయింది.

*యుద్ధానికి బయలుదేరిన శత్రుసైన్యం : -*

ఆ తరువాత వారు తాము అనుకున్న పథకం ప్రకారం దక్షిణ దిశ నుండి ఖురైష్, కనానా మరియు తహామాలో నివసించే ఇతర మిత్రపక్షాల తెగలతో సహా మదీనా వైపునకు బయలుదేరారు. ఈ సైన్యం సర్వసైన్యాధ్యక్షుడు "అబూ సుఫ్'యాన్". ఈ సైనికుల సంఖ్య మొత్తం నాలుగు వేలు. ఇది 'మర్రఉజ్జొహ్రాన్'కు చేరగానే 'బనీ సులైమ్' తెగ కూడా వచ్చి వీరితో కలిసిపోయింది. అటు ఆ సమయంలోనే తూర్పు వైపు నుండి గత్ఫాన్ తెగలైన ఫజారా, ముర్రా మరియు అహ్'జాలు కూడా బయలుదేరారు. ఫజారా సైన్యాధ్యక్షుడు 'యుమైనా బిన్ హస్న్', బనూ ముర్రా కమాండరు 'హారిస్ బిన్ ఔఫ్' మరియు బనూ అహ్'జా నాయకుడు 'మస్అర్ బిన్ రఖీలా'లు. వీరి వెంటే బనూ అసద్, ఇంకా ఇతర తెగలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు.

ఈ తెగలన్నీ అనుకున్న సమయంలో, నిర్ణీత కార్యక్రమాన్ననుసరించి మదీనాకు బయలుదేరారు. బాగా బలిసి కండలు తిరిగిన *పదివేల మంది* రక్తపిపాసులు సిద్ధమయ్యారు! ఆపాదమస్తకం ఉక్కు కవచాలతో, ధగధగ మెరిసే ధనుర్బాణాలతో, కళ్ళు చెదిరే ఖడ్గాలతో కూడిన ఈ సైనిక మహావాహిని ఆవేశపు కెరటాలను లేపుతూ, ఉద్రేకపు నురుగులు కక్కుతూ మదీనా దిశగా ప్రవహించింది!!

*మదీనా పొలిమేర్లలో శత్రు సైన్యం : -*

కొన్ని రోజులలోనే మదీనా దాపున పది వేల మంది సైనికులతో కూడిన ఓ మహాసేన ఓ చోట చేరుకుంది. ఇంత బ్రహ్మాండమైన సేనకు పూర్తి మదీనా జనసంఖ్య (స్త్రీలు, పిల్లలు, వృద్ధులు మరియు యువకులను కలిపి) కూడా తక్కువే. ఒకవేళ దాడి చేయడానికి వచ్చిన ఈ సేనావాహిని మదీనా పొలిమేరల్లోకి వచ్చేస్తే ముస్లిములకు పెద్ద ప్రమాదమే వాటిల్లగలదు. వారు నామరూపాల్లేకుండా పోతారనడంలో సందేహం కూడా లేదు. అయితే మదీనా నాయకత్వం ఎంతో మెలుకువ మరియు జాగ్రత్తలు కలిగిన నాయకత్వం. ఆ నాయకత్వం ఎల్లప్పుడూ పరిస్థితులను గమనిస్తోంది. దాన్ని బేరీజు వేసుకోవడానికి జరగబోయే సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించే వివేచన గల నాయకత్వం అది. దైవవిరోధుల ఈ మహాసేన కదలికలను గమనించిన మదీనా వేగులు వెంటనే దైవప్రవక్త (సల్లం)కు పరిస్థితులను గురించి తెలియజేశారు.

అరబ్ తెగలన్నీ ఏకమై మదీనాపై విరుచుకు పడనున్నాయన్న వార్త అందగానే మహాప్రవక్త (సల్లం), అధిష్ఠానవర్గానికి చెందిన సలహా సంఘాన్ని సమావేశపరిచారు. వారితో ఆత్మరక్షణకు సంబంధించిన సలహాలు ఇవ్వమని అడిగారు.

ప్రవక్త (సల్లం) సంజ్ఞ చేయగా ఉమర్ (రజి) వారి పరిస్థితిని వివరించారు. మదీనా పట్టణానికి మూడు వైపుల చిన్న చిన్న కొండలు, ఖర్జూరపు తోటలతో నిండిపోయి సందులేకుండా ఉన్నందున పట్టణం సురక్షితంగా ఉంది. ఒకే ఒకవైపు మాత్రం దాడి చేయడానికి వీలుగా ఖాళీగా ఉంది. కనుక సమస్యల్లా పట్టణాన్ని ఈ వైపు నుంచి ఎలా రక్షించుకోవాలన్నదే.

అబూ బక్ర్ (రజి), అలీ (రజి), జైద్ (రజి)లు ఈ విషయం గురించి చర్చించారు. కాని కొద్దిసేపటికే నిశ్శబ్దమైపోయారు. ఎవరికీ ఏ పరిష్కారమూ తట్టలేదు.

*"ఓ దైవప్రవక్తా! మీ ముందు నిలబడి మాట్లాడే సాహసం చేస్తున్నందుకు నన్ను క్షమించాలి. కాని మీ సమస్యను పరిష్కరించగలను."* అని ఓ యువకుడు అన్నాడు.

ప్రవక్త (సల్లం) తల పైకెత్తి ఆ మాట్లాడిన అతని వైపు చూశారు. అతని పేరు 'హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజి)'. ఈరాన్ దేశస్తుడు. ఇటీవలే అతనికి, ఇస్లాం స్వీకరించినప్పుడు బానిసత్వం నుంచి స్వేచ్ఛ లభించింది. ఈరాన్ జాతీయుడైన సల్మాన్ (రజి), ఈరాన్ యుద్ధ తంత్రాలను గురించి బాగా ఎరిగినవారు. అనుభవశాలి కూడా.

*"మరైతే చెప్పు సల్మాన్. మాకు సలహా అవసరం ఉంది."* అని ప్రవక్త (సల్లం) ప్రతిస్పందించారు.

*"నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు మా దేశంలో మా నగరం మీద తరచూ ముట్టడులు జరిగేవి. మేము అవసరం ఉన్నంత మేరకు పొడవాటి గుంటను త్రవ్వి, శత్రువులు ప్రవేశించకుండా నిరోధించేవాళ్ళం. ఈ విధంగా మేము మా ఆత్మరక్షణ చేసుకునేవారం. అదే పని, మదీనాలోకి శత్రువులు ప్రవేశించే కీలక ప్రదేశంలో సైన్యాన్ని సమీకరించి, చుట్టూ కందకం త్రవ్వటం అసాధ్యమేమీ కాదు. తద్వారా శత్రువులు కందకాన్ని దాటి ఇటువైపుకు రావడం కష్టతరమైన పని."* అని తన సలహాను వ్యక్తపరిచాడు సల్మాన్.

*"అద్భుతమైన ఆలోచన! మేము అరబ్బులము. ఎప్పుడూ శత్రువులతో ముఖాముఖి యుద్ధం చేస్తుంటాం. మేమెప్పుడూ అటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించలేదు."* ఇంతకుముందు ఎన్నడూ వినని ఈ విషయాన్ని విని అబూ బక్ర్ (రజి) నిర్ఘాంతపోయి అన్నారు.

*"నైపుణ్యమో కాదో! కానీ ఆలోచన మాత్రం బ్రహ్మాండం!"* అన్నారు ఉమర్ (రజి).

*"అల్లాహ్ కృప నీ మీద ఉండుగాక సల్మాన్! చాలా మంచి సలహా ఇచ్చావు."* అన్నారు ప్రవక్త (సల్లం).

ఇది ఎంతో బుద్ధీవివేకాలతో కూడిన సలహా. అరబ్బులకు (శత్రు సైనికులకు కూడా) ఈ యుద్ధ విధానం గురించి తెలియదు. దైవప్రవక్త (సల్లం) వెంటనే ఈ సలహాను అమలుపరచాలని ఆజ్ఞాపించారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment