262

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 262*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 177*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 2* ⚔🛡

*పదివేల మంది సైనికులతో, ముస్లింలపై దండెత్తడానికి మదీనా వైపు పయనిస్తున్న శత్రు సైన్యం; వారు మదీనా పొలిమేర్లలోకి రాకముందే, తమతో తలపడేందుకు శత్రువులు మదీనాకు బయలుదేరారని దైవప్రవక్త (సల్లం)కు అందిన వార్త : -*

*శత్రు సైన్యాన్ని తమ దరిదాపులకు రానీయకుండా, మదీనా పట్టణానికి ఉత్తరం వైపు, శత్రువులు ప్రవేశించేందుకు అనువుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో కందకాన్ని త్రవ్వాలని ప్రవక్త (సల్లం)కు సల్మాన్ ఫార్సీ (రజి) సలహా ఇచ్చిన తరువాత : -*

ఇది ఎంతో బుద్ధీవివేకాలతో కూడిన సలహా. అరబ్బులకు (శత్రు సైనికులకు కూడా) ఈ యుద్ధ విధానం గురించి తెలియదు. దైవప్రవక్త (సల్లం) వెంటనే ఈ సలహాను అమలుపరచాలని ఆజ్ఞాపించారు.

తక్షణమే ముస్లింలు రంగంలోకి దిగారు. పారలు, పలుగులు సేకరించారు. 'బనీ ఖురైజా' తెగ యూదులు ముస్లింలతో ఇదివరకే స్నేహ ఒప్పందం చేసుకొని ఉన్నారు. అంచేత కందకం త్రవ్వకానికి కావలసిన పనిముట్లు చాలా వరకు వారి నుంచే లభించాయి.

*మొదలైన కందక త్రవ్వకం : -*

మదీనా పట్టణం ఉత్తర దిశను వదిలేసి మిగిలిన మూడు దిశలు, లావా కొండ శిలలతో, కొండలతో మరియు ఖర్జూరపు తోటలతో పరివేష్టించబడి ఉంది. మహాప్రవక్త (సల్లం) ఓ నైపుణ్యంగల సైన్యాధ్యక్షునిలా, మదీనాపై దాడి కేవలం ఉత్తర దిశ నుండే జరగవచ్చని ఊహించారు. కాబట్టే ఆయన (సల్లం) మదీనాకు ఉత్తర దిశగా కందకాన్ని త్రవ్వించడం జరిగింది.

ప్రతి పదిమంది గల బృందానికి నలభై మూరల కందకం త్రవ్వే పనిని అప్పగించేశారు. ముస్లిములు ఎంతో కష్టపడి ఏకాగ్రతతో ఆ అగడ్తను త్రవ్వే పనిని మొదలెట్టారు. మహాప్రవక్త (సల్లం) వారిని ప్రోత్సహిస్తూ, ఆయన (సల్లం) కూడా ఆ త్రవ్వకంలో పాలుపంచుకున్నారు.

స్వయంగా తమ నాయకుడు కూడా పనిలో పాల్గొనడం చూసి అనుచరులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయడం మొదలెట్టారు. పని చక చకా సాగుతోంది.

అది శీతాకాలం. రాత్రివేళల్లో విపరీతమైన చలి. పైగా అనేకమంది అనుచరులు తిండిలేక మూడేసి రోజులు పస్తులు కూడా ఉండవలసి వచ్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ముస్లింలు ఎంతో నిగ్రహంతో పని చురుగ్గా చేయసాగారు.

_సహీ బుఖారీ గ్రంథంలో 'హజ్రత్ సహెల్ బిన్ సఅద్ (రజి)' ఇలా ఉల్లేఖిస్తున్నారు....; ↓_

"మేము దైవప్రవక్త (సల్లం)తో కలసి అగడ్తను త్రవ్వుతున్నాం. ముస్లింలు తమ భుజాలపై మట్టి తట్టలు పెట్టుకొని మోస్తున్నారు. ఈ సందర్భంలోనే మహాప్రవక్త (సల్లం) అల్లాహ్ ని ఇలా వేడుకుంటున్నారు.

*"ఓ అల్లాహ్! జీవితం కేవలం పరలోక జీవితమే. ముహాజిర్లు, అన్సారులు ఉభయుల్నీ మన్నించు.""*

_హజ్రత్ అనస్ (రజి) గారు ఉల్లేఖించిన మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది....; ↓_

"దైవప్రవక్త (సల్లం) కందకం వైపునకు వచ్చి చూడగా అన్సార్లు మరియు ముహాజిర్లు కలసి ఉదయం పూట ఎముకలు కొరికే చలిలో త్రవ్వకం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి సహాయపడడానికి వారి వద్ద బానిసలు కూడా లేరు. ఆకలి బాధలోనూ వారి ఈ కష్టాన్ని చూసి మహాప్రవక్త (సల్లం) ఇలా దుఆ చేశారు. ↓

*"ఓ ప్రభూ! జీవితం తప్పకుండా పరలోక జీవితమే. కాబట్టి అన్సారులను, ముహాజిర్లను మన్నించు."*

ఇది విన్న అన్సారులు, ముహాజిర్లు దానికి సమాధానంగా, *"మేము బ్రతికి ఉన్నంత కాలం, సతతం జిహాద్ చేయడానికి ముహమ్మద్ (సల్లం)గారి చేతి మీదుగా ప్రమాణం చేసి ఉన్నాం."* అన్నారు."

_సహీ బుఖారీ గ్రంథంలోనే మరో ఉల్లేఖనం హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రజి) ఉల్లేఖించినట్లుంది. ఆయన ఇలా అంటారు....: ↓_

"నేను మహాప్రవక్త (సల్లం) కందకం నుండి మట్టి మోస్తూ వెళ్ళగా చూశాను. ఇలా మోస్తున్నప్పుడు ఆయన (సల్లం) పొట్టంతా దుమ్ముతో కప్పివేయబడి ఉంది. ఆయన (సల్లం) గారికి పొట్టపై దట్టంగా వెంట్రుకలు ఉన్నాయి. ఆ పరిస్థితిలోనే ఆయన, అబ్దుల్లా బిన్ రవాహా యుద్ధ సమయంలో చెప్పిన పద్యపాదాలను వల్లిస్తూ ఉండగా విన్నాను. ఆ పద్యపాదాలు ఇలా ఉన్నాయి. ↓

*"ఓ అల్లాహ్! నీవే లేకపోతే మేము సన్మార్గాన్ని పొందేవారం కాదు. దానధర్మాలు చేయడం, నమాజు సల్పడం చేసేవారం కాదు. ఓ అల్లాహ్! మాపై స్థిమితాన్ని వర్షింపజెయ్యి. యుద్ధమే చేయాల్సి వస్తే మమ్మల్ని స్థిరంగా ఉంచు. వీరు మాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారు. వారేగనక ఏదైనా సంక్షోభాన్ని రేకెత్తిస్తే మేము దానికి తలవంచేవారం కాదు."*

దైవప్రవక్త (సల్లం) చివరి అక్షరాలను కొంత ఒత్తి పలికేవారని హజ్రత్ బరా (రజి) చెబుతారు. మరో ఉల్లేఖనంలోని ఆ చివరి పద్యపాదాలు ఇలా ఉన్నాయి.

*"వారు మాపై జులుము చేశారు. వారే మమ్మల్ని సంక్షోభంలోకి నెట్టదలచుకుంటే మాత్రం మేము వారికి తలవంచేవారం కాదు.""*

ముస్లింలు ఉత్సాహంగా ఓ వైపు అలా పని చేస్తూ పోతుంటే మరో ప్రక్క అంతే తీవ్రమైన ఆకలి బాధతోనూ అలమటిస్తున్నారు. ఆ పరిస్థితి చూసేవారి గుండెలు పగిలిపోగలవు.

ఓ ఉల్లేఖనంలో....; *"దైవప్రవక్త (సల్లం) గారి వద్దకు రెండు దోసిళ్ళ జౌ ధాన్యం తీసుకురావటం జరిగింది. దానికి కొంత నూనెను కలిపి ఆయన తినడానికి పని చేసే వారి ముందు ఉంచేవారు. అది మ్రింగుడు పడని ఆహార పదార్థం. అయితే అందులో నుండి సువాసన వెలువడింది."* అని ఉంది.

ఒక సహాబీ (రజి) ఇలా ఉల్లేఖిస్తున్నారు....; *"మేము ఆకలి బాధను భరించలేక దైవప్రవక్త (సల్లం) ముందుకు వచ్చి మా పొట్టలపై కట్టబడివున్న ఒక్కొక్క రాయిని చూయించాం. అది చూసిన మహాప్రవక్త (సల్లం) తన పొట్ట మీద నుండి చొక్కాను ఎత్తి చూయించగా, దాని మీద రెండు రాళ్ళువేసి కట్టుకొని ఉన్నారు (అది చూసి మేము సిగ్గుపడ్డాము).*

_కందకం త్రవ్వేటప్పుడు దైవప్రవక్త (సల్లం) ద్వారా అనేక చమత్కారాలు వెలుగులోనికి వచ్చాయి. అవేమిటంటే....; ↓_

అనస్ (రజి) అనే బాలుడు దైవప్రవక్త (సల్లం) ఆకలితో కడుపు మీద కట్టుకున్న రాళ్ళు చూసి చాలా ప్రభావితుడయ్యాడు. అతను వెంటనే కందకం త్రవ్వుతున్న తన తండ్రి అబూ తల్హా (రజి) దగ్గరికి వెళ్ళి తెలియజేశాడు.

హజ్రత్ అబూ తల్హా (రజి) కూడా ఈ సంగతి విని చాలా బాధపడ్డారు.

*"అయితే బాబూ! నువ్వు వెంటనే దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి, భోజనం చేయడానికి మా నాన్న పిలుస్తున్నారని చెప్పి ఆయన (సల్లం)ను మన ఇంటికి పిలుచుకురా. ఆయన (సల్లం)తో పాటు మరో ఇద్దరు ముగ్గురు వచ్చినా పరవాలేదు. కాని ఒక విషయం గుర్తుపెట్టుకో. మన ఇంట్లో భోజనం కొద్దిగానే ఉంది. అంచేత నువ్వు దైవప్రవక్త (సల్లం) ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయం తెలియజేసి పిలుచుకురా."* అని చెప్పారు అబూ తల్హా (రజి).

అనస్ (రజి) వెంటనే దైవప్రవక్త (సల్లం) వద్దకు పరుగెత్తారు. కాని అక్కడ దైవప్రవక్త (సల్లం) అనేకమంది అనుచరుల మధ్య కూర్చొని ఉన్నారు. అందువల్ల అనస్ (రజి) వచ్చిన పనేంటో చెప్పకుండా మౌనంగా నిల్చున్నారు.

అయితే దైవప్రవక్త (సల్లం) ఆ అబ్బాయిని చూడగానే, *"ఏమిటి నిన్ను అబూ తల్హా (రజి) పంపించాడా?"* అని అడిగారు.

*"ఔనండీ!"* అన్నారు అనస్ (రజి).

అప్పుడు దైవప్రవక్త (సల్లం) అనుచరుల్ని ఉద్దేశించి, *"సహచరులారా! అబూ తల్హా (రజి) ఇంటికి పదండి. ఆయన మాకు ఈ పూట మనకు భోజనం ఏర్పాటు చేశాడు."* అన్నారు బిగ్గరగా అందరికి వినపడేలా.

దైవప్రవక్త (సల్లం) పిలుపు విని దాదాపు ఎనభై మంది అనుచరులు సిద్ధమయ్యారు. దైవప్రవక్త (సల్లం) వారందరినీ వెంటబెట్టుకొని అబూ తల్హా (రజి) ఇంటికి బయలుదేరారు.

అనస్ (రజి) ఈ పరిస్థితి చూసి కంగారుపడుతూ ఇంటికి పరుగెత్తారు.

*"నాన్నా! నాన్నా!! దైవప్రవక్త (సల్లం) చాలా మందిని పిలుచుకొస్తున్నారు."* అన్నారు ఆయన రొప్పుతూ.

*"ఉమ్మె సులైమ్! విన్నావుగా, ఇప్పుడేం చేద్దాం?"* అన్నారు అబూ తల్హా (రజి).

*"కానివ్వండి. అల్లాహ్ యే మనకు సహాయం చేస్తాడు."* అన్నారు హజ్రత్ ఉమ్మె సులైమ్ (రజి) ఏ మాత్రం కంగారుపడకుండా.

అంతలో దైవప్రవక్త (సల్లం) అనుచరుల్ని తీసుకొని వచ్చారు.

హజ్రత్ అబూ తల్హా (రజి), దైవప్రవక్త (సల్లం) చెవి దగ్గరకొచ్చి, *"దైవప్రవక్తా! ఇంట్లో రెండు రొట్టెలు మాత్రమే ఉన్నాయి."* అన్నారు మెల్లిగా.

*"మరేం పరవాలేదు. నీవు రొట్టెలతో పాటు నేతిగిన్నె కూడా తెచ్చి నా ముందు పెట్టు."* అన్నారు ప్రవక్త (సల్లం) చిరునవ్వుతో.

హజ్రత్ అబూ తల్హా (రజి) లోపలికెళ్ళి ఒక పాత్రలో రొట్టెలతో పాటు నేతిగిన్నె పెట్టుకొని తీసుకొచ్చారు.

అప్పుడు దైవప్రవక్త (సల్లం), నేతిగిన్నెను పైకెత్తి వంచితే అందులో నుంచి రెండు మూడు బొట్లు నెయ్యి రొట్టె మీద పడింది. దాన్ని చూపుడు వ్రేలితో మొత్తం రొట్టె మీద రాశారు. వెంటనే ఆ రొట్టె పైకి ఉబుకుతూ పాత్ర అంచుదాకా వచ్చింది. దాని మీద ఓ వస్త్రం కప్పి *"బిస్మిల్లాహ్ అల్లాహుమ్మ ఆజమ్ ఫీహల్ బర్'కత్"* అని పఠించారు.

ఆ తరువాత పదేసి మంది చొప్పున అనుచరుల్ని భోంచేయడానికి లోపలికి పిలిచారు. అప్పుడు పదేసి మంది అనుచరులు వచ్చి వస్త్రం కింద చేయి పెట్టి ఒక్కొక్క రొట్టె తీసుకొని తినడం ప్రారంభించారు. మొదటి విడత పది మంది కడుపునిండా తిని వెళ్ళగానే రెండవ విడత పది మంది వచ్చేవారు.

ఇలా మొత్తం ఎనభై మంది కడుపునిండా తిని లేచారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) కూడా తిన్నారు. అయినా రొట్టెలు ఏ మాత్రం తరగకుండా పాత్ర నిండా అలానే ఉన్నాయి. చివరికి అబూ తల్హా (రజి), ఆయన భార్యాపిల్లలు కూడా, దైవప్రవక్త (సల్లం) ద్వారా బహిర్గతమైన ఈ మహిమను తలుచుకుంటూ కడుపునిండా తిన్నారు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....; →*

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment