295

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 295*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 210*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

మక్కా నుంచి సిరియాకు పోయే, సిరియా నుండి తిరిగొచ్చే వర్తక బిడారాలన్నీ ఈ ప్రాంతం గుండానే వచ్చి పోవలసి ఉంటుంది. హుదైబియా ఒప్పందం ప్రకారం మక్కా నుండి పారిపోయే ముస్లింలు మదీనా వెళ్ళడానికి వీలులేనందున వారంతా ఈ ప్రాంతానికే వచ్చి చేరుకొని, ఇక్కడకు వచ్చే వాణిజ్య బృందాలపై గెరిల్లాదాడులు చేస్తూ వాటిని దోచుకోవడం ప్రారంభించారు.

ఇలా ఈ పీడిత ముస్లింలే మక్కా ఖురైషీయులకు పెద్ద బెడదగా తయారయ్యారు. ఏ సంధి షరతుల వల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని భావించారో ఆ సంధి షరతులే ఇప్పుడు వారి బ్రతుకు తెరువుకు అవరోధాలుగా మారి ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ పోరు పడలేక ఖురైషీయులు మదీనా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు మొర పెట్టుకున్నారు. మదీనాకు వచ్చే ముస్లింలను మక్కాకు తిరిగి పంపించాలనే ఒప్పంద నియమాన్ని మార్చుకోవాలని, సముద్రతీరాన ఉన్న శరణార్థుల్ని మదీనా పిలిపించుకొని తమను ఇక్కట్ల నుంచి గట్టెక్కించమని వేడుకున్నారు ఖురైష్ నాయకులు.

*ఖురైషీయులు, తమలో ఒక రాయబారిని దైవప్రవక్త (సల్లం) వద్దకు పంపి, అబూ బసీర్ (రజి) సమస్యను పరిష్కరించుకున్న విధానం మరింత వివరంగా....; ↓*

*దైవప్రవక్త (సల్లం) వద్దకు ఖురైష్ రాయబారి : -*

ఒకరోజు ఎవరో రౌతు మదీనా వైపు రావటం ముస్లింలకు కనిపించింది. అతను కూడా కొత్తగా ఇస్లాం స్వీకరించి మక్కా నుంచి పారిపోయి వస్తున్నాడని ముస్లింలు అనుకున్నారు. వారు, అతనికి ఎదురుగా వెళ్ళి, *"ముస్లింగా మారి ఇక్కడికి వచ్చావా బాబు! అయితే వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. ఈ నగరం నీకు అనువైన స్థలం కాదు. ఎందుకంటే ఖురైషులతో మాకు ఒప్పందం ఉంది. ఖురైషుల నుంచి మేము నిన్ను విడిపించలేము."* అంటూ, అతని ముందు తమ అశక్తతను వెల్లడిస్తూ మాట్లాడారు. తాము ముస్లింలమైనందున ఒప్పందాన్ని ఎన్నటికీ ఉల్లంఘించలేమని ఖరాకండీగా చెప్పేశారు. మదీనా కాకుండా మరెక్కడికైనా వెళ్ళమనీ, అల్లాహ్ సహాయంపై నమ్మకం ఉంచమని వారు అతనికి సలహానివ్వసాగారు.

వారి మాటలు విన్న ఆ మనిషి బిగ్గరగా నవ్వేశాడు. *"మీరు పొరబడుతున్నారు. నేను ముస్లింను కాను. నేను మా ప్రజల మతాన్ని ఎన్నటికీ వదలిపెట్టను. నేను ఖురైషుల తరఫున రాయబారిగా వచ్చాను. ఎంతో ముఖ్యమైన విషయమై ముహమ్మద్ (సల్లం)తో మాట్లాడటానికి నేనిక్కడికి వచ్చాను."* అని చెప్పాడు.

*"ఖురైషులు ఈ సమయంలో రాయబారం ఎందుకు పంపి ఉంటారు?"* అని ముస్లింలు పునరాలోచనలో పడిపోయారు. వారు ఆ వచ్చిన వ్యక్తిని ముహమ్మద్ (సల్లం) దగ్గరకి తీసుకువెళ్ళారు.

ఆ వ్యక్తి, దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడుతూ, *"ముహమ్మద్ (సల్లం)! ఇంతకు ముందు మా దగ్గరి నుంచి పారిపోయిన అబూ బసీర్ (రజి) విషయం గురించి మీతో మాట్లాడటానికి ఖురైషులు నన్ను పంపారు. అతను ఒక ఎడారిలో దాక్కున్నాడు. మక్కా నుంచి పారిపోతున్న ముస్లింలు అబూ బసీర్ (రజి) దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. అబూ బసీర్ (రజి), అతని అనుచరులు మా మీద యుద్ధం ప్రకటించారు. వారు మా వ్యాపార బృందాలను అడ్డుకొని మా సరుకును దోచుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అడగటానికి నేను మీ దగ్గరికి వచ్చాను. మదీనాకు వచ్చే ముస్లింలను మక్కాకు తిరిగి పంపించాలనే ఒప్పంద నియమాన్ని మనం ఉభయులం కలసి మార్చుకుంటే, ఇకముందు ఆ సమస్య ఉండదని మా అభిప్రాయం. వారు మీ వెంట ఉండటమే మాకు శ్రేయస్కరం. తద్వారా కొత్తగా ఇస్లాం స్వీకరించేవారు అబూ బసీర్ (రజి) వర్గంలో చేరకుండా ఉంటారు. లేకపోతే అబూ బసీర్ (రజి) అనుచరుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే వారి చేతుల్లో మేము ముప్పతిప్పలు పడతాము."* అన్నాడు.

ఒప్పందంలోని ఆ నియమాన్ని మార్చడానికి దైవప్రవక్త (సల్లం) సంతోషంగా అంగీకరించారు. పరిస్థితుల్లో వచ్చిన ఈ మార్పుకు ముస్లింలు చాలా సంతోషించారు. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ సోదరులు ఇప్పుడు తమతోనే ఉంటారు. తమతోనే కలసి, శాంతీసుహృధ్బావ వాతావరణంలో అల్లాహ్ ను ఆరాధిస్తారు. ఈ పరిణామం ముస్లింలకు అమితమైన ఆనందాన్ని ఇచ్చింది.

ఆ తరువాత మహాప్రవక్త,(సల్లం), హజ్రత్ అబూ బసీర్ (రజి) దగ్గరకి ఓ లేఖ పంపి, అమీస్ లో నిరాశ్రయజీవితం గడుపుతున్న శరణార్థుల్ని తీసుకొని మదీనా వచ్చేయమని ఆజ్ఞాపించారు.

ఈ లేఖ అబూ బసీర్ (రజి) దగ్గరకు చేరుకునే సమయంలో అబూ బసీర్ (రజి) వ్యాధిగ్రస్తులయి ఉన్నారు. అంచేత ఆయన (రజి) అబూ జందల్ (రజి)ని పిలిచి దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞ వినిపిస్తూ, *"నీవు వెంటనే మనవాళ్ళను తీసుకొని మదీనా వెళ్ళిపో"* అని చెప్పారు.

హజ్రత్ అబూ జందల్ (రజి) అనుచరుల్ని తీసుకొని హిజ్రీ శకం - 7వ సంవత్సరం మదీనా చేరుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకే హజ్రత్ అబూ బసీర్ (రజి) చనిపోయారు.

ఇప్పుడు యావత్తు ముస్లింలు సంతోషంతో గడపసాగారు. మక్కా, మదీనాల మధ్య సురక్షితమైన రాకపోకలు ప్రారంభమయ్యాయి. దాంతో మక్కా ప్రజలు మదీనా వచ్చి తమ బంధుమిత్రుల్ని కలుసుకొని, వారితో లావాదేవీలు జరుపుకునే అవకాశం లభించింది. వారిలో అనేకమంది బహుదైవారాధకులు ముస్లింల జీవనసరళిని సమీపం నుంచి చూసి ప్రభావితులై ఇస్లాం స్వీకరించడం మొదలెట్టారు.

ముస్లింలు, మొదట్లో ఏ ఒప్పందాన్ని తమకు అవమానకరమైనదిగా, ఘోరపరాజయంగా తలచారో, అదే ఇప్పుడు వారి ప్రతిష్ఠను ఈ విధంగా పెంచి అధ్బుత విజయంగా పరిణమించింది.

*ఖురైష్ సోదరుల ఇస్లాం స్వీకారం : -*

ఈ సంధి జరిగిన తరువాత హిజ్రీ శకం - 7, ప్రారంభకాలంలో 'హజ్రత్ అమ్రూ బిన్ ఆస్ (రజి)', 'హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)', 'హజ్రత్ ఉస్మాన్ బిన్ తల్హా (రజి)'లు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిములైపోయారు★. వీరు దైవప్రవక్త (సల్లం)గారి సన్నిధిలో హాజరవగా, వారిని చూసి ఆయన (సల్లం), *"మక్కా తన కాలేయ శకలాలను మాకు అప్పగించింది."* అని పలికారు.

_(★→ ఈ సహాబాలు హిజ్రీ శకం ఏ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు అన్న విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నాయి. 'అస్మా ఉర్రిజాల్' గ్రంథాల్లో ఈ సంఘటన హిజ్రీ శకం - 7వ సంవత్సరంలో జరిగినట్లుంది. హజ్రత్ అమ్రూ బిన్ ఆస్ (రజి) అబీసీనియా నుండి తిరిగివచ్చిన తరువాత హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) మరియు హజ్రత్ ఉస్మాన్ బిన్ తల్హా (రజి)లు ఇస్లాం స్వీకరించారన్నది తెలిసిన విషయమే. కారణం ఏమిటంటే, ఆయన అబీసీనియా నుండి తిరిగివచ్చి మదీనాకు బయలుదేరేటప్పుడు వీరిద్దరూ ఆయన్ను కలిశారు. ఈ ముగ్గురు కలిసి దైవప్రవక్త (సల్లం)గారి సన్నిధికి చేరి ఇస్లాం స్వీకరించారు. అంటే వీరంతా హిజ్రీ శకం - 7వ సంవత్సర ప్రారంభకాలంలోనే ముస్లిములయ్యారు. (వల్లాహు ఆలమ్))_

*తరువాతది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment