296

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 296*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 211*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

           *రెండవ దశ : - - : క్రొత్త మార్పు*

హుదైబియా ఒప్పందం, యధార్థంగా ముస్లిముల జీవితంలో వచ్చిన ఓ క్రొత్త మార్పే అనాలి. ఖురైష్ జాతి, ఇస్లాం పట్ల వైరంలోను, శత్రుత్వంలోనూ తీవ్రమైన మొండి వైఖరిగల జగడాల మారి జాతి. అందుకని వారు యుద్ధంలో అపజయంపాలై శాంతి వైపునకు మొగ్గుజూపినప్పుడు, అహ్జాబ్ యుద్ధంలో కలసి పోరాడిన మూడు పక్షాల్లో - ఖురైష్, గత్ఫాన్ మరియు యూదులు - పటిష్టమైన ఒక పక్షం చిన్నాభిన్నమైపోయింది. ఖురైషులే పూర్తి అరేబియా ద్వీపకల్పంలో విగ్రహారాధనకు ప్రాతినిధ్యం వహించేవారుగా, దానికి నాయకులుగా ఉన్నందువలన, వారు యుద్ధమైదానం నుండి వైదొలగిపోగానే విగ్రహారాధకుల భావోద్రేకాలు కాస్తా చల్లబడిపోయాయి. వారి శత్రుత్వ వైఖరిలో చాలా మటుకు మార్పు వచ్చేసింది. అందుకని ఈ ఒప్పందం జరిగిన తరువాత గత్ఫాన్ వారి వైపు నుండి ఎలాంటి గొడవలు జరిగినట్లు మనకు అగుపడదు. వారేదైనా చేయగలిగారంటే అది కూడా యూదులు రెచ్చగొట్టడం మూలంగానే.

ఇక యూదుల విషయానికి సంబంధించినంత మటుకు, వారు యస్రిబ్ (మదీనా) నుండి బహిష్కరింపబడిన తరువాత 'ఖైబర్' చేరి దాన్ని తమ కుట్రలకు, కుతంత్రాలకు కేంద్రంగా మలుచుకున్నారు. అక్కడ యూదులకు చెందిన కుట్రదారులు తమ ప్రయత్నాలలో నిమగ్నమైపోయి సంక్షోభాన్ని రేకెత్తించే ప్రయత్నంలో మునిగిపోయారు. తమ చుట్టుపట్ల నివసిస్తున్న బద్దూలను ఉసిగొలుపుతూ దైవప్రవక్త (సల్లం) మరియు ముస్లిములను హతమార్చేందుకు లేదా కనీసం వారికి భారీ నష్టాన్నయినా కలిగించే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కాబట్టి హుదైబియా ఒప్పందం తరువాత దైవప్రవక్త (సల్లం) మొట్టమొదటిగా యూదుల ఆటపట్టువైన 'ఖైబర్'ను జయించి వారి ఆగడాలను మట్టుబెట్టేందుకు నిర్ణయాత్మక సైనిక చర్య చేపట్టారు.

ఎలాగైతేనేమి, హుదైబియా ఒప్పందం తరువాత ప్రారంభమైన శాంతి ఘట్టం ద్వారా ముస్లిములకు ఇస్లామీయ సందేశ ప్రచారాన్ని వ్యాపింపజేసే ముఖ్యమైన అవకాశం లభించినట్లయింది. ఇస్లామీయ ప్రచార కార్యక్రమాల కోసం, ఈ రంగంలో వారి కృషి, సైనిక చర్యలంటే ముఖ్యమైపోయింది. కాబట్టి ఆ కాలంలో జరిగిన కార్యక్రమాలను రెండు విధాలుగా విభజించి చూడడం సబబుగా తోస్తుంది.

*1. సందేశ ప్రచారం మరియు రాజులకు, సర్దారులకు లేఖలు పంపించడం.*

*2. యుద్ధ కదలికలు.*

ఈ దశలో, యుద్ధ కదలికలను గురించి చెప్పే బదులు, రాజులు ,సర్దారుల పేర పంపబడిన లేఖల గురించిన వివరాలు చెప్పడం ముఖ్యమని భావిస్తున్నాము. ఎందుకంటే, సహజంగా ఇస్లామీయ సందేశ ప్రచార ధ్యేయమే అసలు ఇస్లాం యొక్క ధ్యేయం. ఈ లక్ష్యాన్ని సాధించడానికే ముస్లిములు రకరకాల కష్టాలను, యుద్ధాలను, సంక్షోభాలను భరిస్తూ వస్తున్నారు.

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 1*

హిజ్రీ శకం - 6 చివరన దైవప్రవక్త (సల్లం) హుదైబియా నుండి మదీనాకు తిరిగివచ్చాక, వివిధ రాజుల పేరున లేఖలు రాసి వారిని ఇస్లాం సందేశం వైపునకు ఆహ్వానించారు.

మహాప్రవక్త (సల్లం) వారికి ఆ లేఖలను రాయడానికి ఉపక్రమించినప్పుడు, ఏ రాజైనా, ఏ చక్రవర్తి అయినా ఆ లేఖను స్వీకరించాలంటే దానిపై ముద్ర తప్పక ఉండాలి అనే సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన (సల్లం) ఓ వెండి ముద్రను తయారు చేయించారు. ఆ ముద్రపై *'ముహమ్మదుర్రసూలుల్లాహ్'* అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.

అలా లేఖలు రాయించి అనుభవజ్ఞులైన సహాబాలకిచ్చి దూతలుగా వారి వద్దకు పంపారు. ఈ దూతల్ని, ఖైబర్ యుద్ధానికి బయలుదేరడానికి కొన్ని రోజుల ముందు, ఒకటవ ముహర్రం హిజ్రీ శకం - 7న పంపారని 'అల్లామా మన్సూర్ పూరి' పూర్తి ఆధారాలతో చెబుతారు. వచ్చే పంక్తుల్లో ఆ లేఖలు ఆ లేఖల వలన కలిగిన ప్రతి స్పందనలను గురించి తెలుసుకుందాం.

*1. అబీసీనియా చక్రవర్తి 'నజాషీ' పేరున పంపిన లేఖ : -*

ఈ నజాషీ పేరు ''అస్'హమా బిన్ అబ్'హర్". దైవప్రవక్త (సల్లం) అతని పేర రాసిన లేఖను, 'అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి)' చేతికిచ్చి హిజ్రీ శకం - 6 చివరన లేదా హిజ్రీ శకం - 7 ప్రారంభంలో పంపించారు. 'తిబ్రీ' ఈ లేఖలోని పూర్తి పాఠాన్ని కూడా ఉటంకించాడు. అయితే ఈ లేఖలో రాయబడిన విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే, దీన్ని దైవప్రవక్త (సల్లం) హుదైబియా ఒప్పందం తరువాత రాసిన లేఖలా అగుపించదు. బహుశా ఈ లేఖలో రాసిన విషయాలు దైవప్రవక్త (సల్లం) మక్కాలో ఉన్నప్పుడే, హజ్రత్ జాఫర్ (రజి) అబీసీనియాకు హిజ్రత్ చేసి వెళ్ళేటప్పుడు రాసి ఇచ్చిన లేఖ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లేఖ చివరన ముహాజిర్ల ప్రస్తావన ఈ క్రింది మాటల్లో ఉంది.

*"నేను మీ వద్దకు నా పినతండ్రి కుమారుడైన జాఫర్ వెంట ఓ బృందాన్ని పంపించాను. వీరు మీ వద్దకు వచ్చినప్పుడు వీరికి మీ దేశంలో శరణు ఇవ్వండి. వారిపై ఎలాంటి ఒత్తిడి చేయకండి."*

బైహఖీ, హజ్రత్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించిన ఉల్లేఖనం ద్వారా మరో ఉత్తరం పూర్తి పాఠం ఇలా ఉందని రాస్తున్నారు. దాని అనువాదం ఇలా ఉంది....; ↓

*"ఈ లేఖ ముహమ్మద్ దైవప్రవక్త (సల్లం) తరఫున నజాషీ అస్'హమ్, అబీసీనియా చక్రవర్తికి రాయబడుతూ ఉంది.*

  *సన్మార్గాన్ని అనుసరిస్తూ, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి సలాం (శుభాలు). ఏ ఒక్కడూ సాటిగా రాని ఆ అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనకు భార్య గాని, కుమారుడుగాని లేరు. అలాగే ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నేను అల్లాహ్ ప్రవక్తను గనుక. కాబట్టి మీరు ఇస్లాం స్వీకరిస్తే శాంతిని పొందగలరు. 'ఓ గ్రంథవహులారా! మాకూ, మీకూ నడుమ సమానంగా ఉన్న ఆ విషయం వైపునకు రండి. అదేమిటంటే, అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించము అని, ఆయనకు ఇంకెవ్వరినీ సాటి కల్పించము అని మరియు మనలో ఏ ఒక్కరూ మరి ఒకరిని అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేది. ఒకవేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లిములము, మీరే దానికి సాక్షి అని'. మీరు ఈ సందేశాన్ని స్వీకరించకపోతే మీ జాతి నసారా (క్రైస్తవుల) పాపం అంతా మీదే అవుతుంది."*

డాక్టరు హమీదుల్లాహ్ (ప్యారిస్), ఇంకో లేఖలో ఉన్న వస్తువును తన గ్రంథంలో ఉటంకించారు. ఇది ఇటీవలే లభ్యమైన లేఖ. ఒకే ఒక పదం తేడాతో ఆ లేఖే, అల్లామా ఇబ్నె ఖైమ్ గ్రంథం జాదుల్ ముఆద్ లోనూ నిక్షిప్తమై ఉంది. డాక్టరు హమీదుల్లాహ్, ఈ లేఖలో రాసివున్న వస్తువు గురించి పరిశోధించడంలో ఆధునిక విధానాలను అనుసరించారు. ఈ లేఖ ఫోటోను తన గ్రంథంలో అచ్చువేయించారు కూడా. ఆ లేఖ అనువాదం ఇది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్, అబీసీనియా చక్రవర్తి నజాషీకి వ్రాయునది.*

  *సన్మార్గాన్ని అనుసరించే వ్యక్తికి సలాం (శాంతి కలుగుగాక). అల్లాహ్ తప్ప మరే పూజ్యుడు లేడనీ, ఆయన ఖుద్దూస్ (పవిత్రుడు) మరియు సలాం (దైవ సుగుణాల్లో ఓ సుగుణం, శాంతి) అనీ, శాంతి ప్రదాత, సంరక్షకుడు అనీ మీకు నేను తెలియపరుస్తున్నాను. 'ఈసా ఇబ్నె మర్యం (మరియం కుమారుడు ఈసా)', అల్లాహ్ తన ఆత్మను మర్యంలోకి ఊదడం వల్ల ఆమె గర్భవతి అయిందని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇది అల్లాహ్ ఆదం (అలైహి)ను సృష్టించిన తీరు అలాంటిదే. నేను, ఆయనకు ఎవరూ సాటిలేరని ఆ అల్లాహ్ వైపునకు, ఆయన విధేయతకు పరస్పరం సహకారాన్ని అందించే వైపునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దీనికితోడు, మీరు నన్ను అనుసరించాలని, నా వైపునకు ఏదైతే వచ్చిందో దాన్ని విశ్వసించమని పిలుపునిస్తున్నాను. ఎందుకంటే, నేను అల్లాహ్ ప్రవక్తను. నేను మిమ్మల్ని మీ సైన్యాన్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాను. నేను నా సందేశాన్ని మీకు వినిపించేశాను. కాబట్టి నా హితబోధను స్వీకరించండి. ధర్మమార్గాన్ని అనుసరించే వారికి శాంతి కలుగుగాక.★*

_(★→ జాదుల్ ముఆద్ లో చివరి పదం *'వస్సలాము అలా మనిత్తబ ఉల్ హుదా (ధర్మమార్గాన్ని అనుసరించే వారికి శాంతి కలుగుగాక)'* కు బదులు *'అస్లిమ్ అన్త (నీవు ముస్లిం అయిపో)'* అని ఉంది. చూడండి, జాదుల్ ముఆద్ - 3/60)_

ఏదైతేనేమి, అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి), దైవప్రవక్త (సల్లం) పంపించిన ఈ లేఖను నజాషీకి అందించగా అతను దాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు. అదే పరిస్థితిలో సింహాసనం నుండి క్రిందికి దిగి వచ్చి హజ్రత్ జాఫర్ బిన్ అబీ తాలిబ్ చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించాడు. చక్రవర్తి నజాషీ, దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి ఈ విషయం గురించి ఏ జవాబు అయితే రాసి పంపాడో దాని అనువాదాన్ని ఇక్కడ రాయడం జరిగింది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

*దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారి సన్నిధికి అస్'హమా వ్రాయునది.*

  *ఓ దైవప్రవక్తా! ఆరాధనకు అర్హుడైన ఆ అల్లాహ్ తరఫున తమకు సలాములు, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక. ఆ తరువాత.*

  *ఓ అల్లాహ్ ప్రవక్తా! నాకు మీరు పంపిన లేఖ అందింది. ఈ లేఖలో హజ్రత్ ఈసా (అలైహి)గారి ప్రస్తావన ఉంది. భూమ్యాకాశాల ప్రభువు సాక్ష్యంగా, తమరు (తమ లేఖలో) ప్రస్తావించినట్లుగానే హజ్రత్ ఈసా (అలైహి) ఓ గడ్డిపోచకంటే ఎక్కువ ఏమీ కాదు. తమరు వర్ణించిన మనిషే ఆయన.*

  *తమరు మా వద్దకు పంపించిన సందేశాన్ని తెలుసుకున్నాము. మీ పినతండ్రి కుమారునికి మరియు మీ అనుచరులకు ఆతిథ్యం ఇచ్చాము. తమరు అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను మీతో బైత్ చేశాను. మీ పినతండ్రి కుమారుని చేతి మీదుగానూ బైత్ చేశాను. ఆయన చేతి మీదుగానే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కోసం ఇస్లాం స్వీకరించాను.*

ప్రవక్త మహనీయులు (సల్లం), హజ్రత్ జాఫర్ (రజి) మరియు అబీసీనియాకు వెళ్ళిన ఇతర ముహాజిర్లను వెనక్కు పంపించమని కూడా కోరి ఉన్నారు నజాషీని. అందుకని అతను, హజ్రత్ జాఫర్ (రజి), హజ్రత్ అబూ మూసా అష్అరీ (రజి)లను ఇంకా ఇతర సహాబా (రజి)లను, హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి) వెంట వెళ్ళడానికి రెండు పడవలను కూడా సమకూర్చాడు. వీరు నేరుగా ఖైబర్ కు చేరి దైవప్రవక్త (సల్లం)ను దర్శించుకున్నారు. మరో పడవలో వీరి కుటుంబసభ్యులు నేరుగా మదీనాకు చేరుకున్నారు.

_(దైవప్రవక్త (సల్లం), అబీసీనియా రాజు నజాషీ వద్దకు పంపిన ఈ లేఖలో, ఉమ్మె హాబీబా (రజి)తో తమ నికాహ్ చేయమని కూడా రాశారు. నజాషీ, ఉమ్మె హాబీబా (రజి) స్వీకారంతో ఆమె నికాహ్ దైవప్రవక్త (సల్లం)తో చేసివేశాడు. ← ఈ వృత్తాంతంలోని వివరణను, 'రాజులకు మరియు సర్దారులకు పంపించిన లేఖలు' అనే వృత్తాంతాల తర్వాత తెలుసుకుందాం.)_

పైన పేర్కొన్న నజాషీ, తబూక్ యుద్ధానంతరం రజబ్ నెల హిజ్రీ శకం - 9లో మరణించగా, దైవప్రవక్త (సల్లం) అతని మరణం రోజున్నే సహాబా (రజి)కు అతని మరణ వార్తను తెలియజేశారు. ఆ తరువాత అతని 'గాయిబానా నమాజె జనాజా' చేశారు. అంటే అతని మృతదేహం ఎదురుగా లేకుండానే జనాజా నమాజు చేశారన్నమాట. అతని మరణాంతరం మరో రాజు సింహాసనాన్ని అధిష్టించగా దైవప్రవక్త (సల్లం) అతనికి కూడా ఓ లేఖ రాసి పంపించారు. అయితే అతను ఇస్లాం స్వీకరించింది లేనిది తెలిపే ఆధారాలు లభించలేదు.

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

*2. ఈజిప్టు చక్రవర్తి ముఖౌఖిస్ కు పంపిన లేఖ : -*

No comments:

Post a Comment