297

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 297*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 212*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 2*

*2. ఈజిప్టు చక్రవర్తి ముఖౌఖిస్ కు పంపిన లేఖ : -*

ప్రవక్త శ్రీ (సల్లం) ఓ లేఖను 'జరీహ్ బిన్ మత్తై'★ పేరున పంపించడం జరిగింది. అతని బిరుదు 'ముఖౌఖిస్'. ఇతను ఈజిప్టుకు, అలెగ్జాండ్రియాకు రాజు. ఆ లేఖ ఇలా ఉంది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్, ఖిబ్త్ చక్రవర్తి అయిన ముఖౌఖిస్ కు వ్రాయునది.*

  *సన్మార్గాన్ని అవలంబించేవానికి శుభం కలుగుగాక. నేను మిమ్మల్ని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఇస్లాం స్వీకరిస్తే మీరు క్షేమంగా ఉండగలరు. ముస్లిములైపోతే అల్లాహ్ మీకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. కాని దీన్ని తిరస్కరిస్తే ఖిబ్త్ వారి పాపం కూడా మీదే. ఓ ఖిబ్త్ ప్రజలారా! మాకూ, మీకూ మధ్య సమానంగా ఉన్న ఆ విషయం వైపునకు రండి. అదేమిటంటే అల్లాహ్ తప్ప మనం మరెవ్వరినీ ఆరాధించము అనేది, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించము అనేది మరియు మనలో ఏ ఒక్కడూ మరొకరిని అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేదే. ఒకవేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లిములము, మీరే దానికి సాక్షి అని.*☆

ఈ లేఖను అందించడానికి ఆయన (సల్లం), ''హజ్రత్ హాతిబ్ బిన్ అబీ బల్'తఅ (రజి)''ను ఎంపిక చేశారు. ఆయన ముఖౌఖిస్ దర్బారుకు చేరి ఇలా అన్నారు. ↓

*"(ఈ భూమ్మీద) మీకంటే పూర్వం ఓ వ్యక్తి గతించాడు. అతను తనను తాను మహా దేవుడని పిలుచుకున్నాడు. అల్లాహ్ అతణ్ణి చివరి వారికి, మొదటి వారికి గుణపాఠంగా చేశాడు. మొదట అతను తన ఈ అధికారం ఉపయోగించి ప్రజల పగ తీర్చుకున్నాడు. ఆ తరువాత తానే ఆ పగకు బలైపోయాడు. కాబట్టి, ఇతరులు మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోక మునుపే ఇతరులను చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి."*

ఇది విన్న ముఖౌఖిస్, *"మాకూ ఒక ధర్మమంటూ ఉంది. అంతకంటే మేలైన ధర్మం మాకు లభించనంతమట్టుకు దాన్ని త్యజించేవారము కాము"* అని అన్నారు.

దానికి హజ్రత్ హాతిబ్, *"మేము మిమ్మల్ని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నాము. దీన్ని అల్లాహ్ తక్కిన (ధర్మాల) వాటి కంటే ఉత్తమమైనదిగా చేశాడు. చూడండి! ఆ ప్రవక్త ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానించినప్పుడు ఖురైషులు అందరి కంటే కఠినులై దాన్ని వ్యతిరేకించారు. యూదులు అందరికంటే ఎక్కువగా శత్రుత్వాన్ని వహించారు. కాని 'నసారా' (క్రైస్తవులే) దీనికి దగ్గరగా ఉన్నారు. నా ఈ వయస్సు సాక్షిగా! హజ్రత్ మూసా (అలైహి), హజ్రత్ ఈసా (అలైహి) ఆగమన శుభవార్త ఇచ్చినట్లే, హజ్రత్ ఈసా (అలైహి), హజ్రత్ ముహమ్మద్ (సల్లం) గారి ఆగమన వార్తనిచ్చారు. మీరు తౌరాత్ గ్రంథవహులకు ఇంజీల్ (బైబిల్) గ్రంథం గురించి బోధించినట్లే మేము మీకు దివ్య ఖుర్ఆన్ బోధనల వైపునకు రమ్మంటున్నాం. ఏదైనా ఓ జాతిలో ప్రవక్త ప్రభవిస్తే ఆ జాతి ఆయన సమాజమైపోతుంది. ఆ జాతి ఇక ఆ ప్రవక్తను విధేయించడం తప్పనిసరి. మీరు ఆయన కాలంలో ఉన్నవారు. అదేకాదు, మేము మిమ్మల్ని మెసయ్యా ధర్మం నుండి అడ్డుకోవడం లేదు. ఆ ధర్మం భోదించిన విషయాన్నే మేము మీకు బోధిస్తున్నాం."* అని అన్నారు.

ముఖౌఖిస్ ఆ ఉత్తరాన్ని అందుకొని, గౌరవపూర్వకంగా దాన్ని ఏనుగు దంతంతో చేయబడిన డబ్బీలో వేసి దానిపై సీలు వేశాడు. దాన్ని తన స్త్రీ బానిసకు దాయమని ఇచ్చాడు. అరబీ భాష రాయగల ఒక మనిషిని పిలిపించి దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి ఈ క్రింది లేఖ రాయించాడు. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ కు చక్రవర్తి ముఖౌఖిస్ రాయునది.*

  *మీకు సలాము. అనంతరం, నేను తమ లేఖను చదివాను. ఆ లేఖలో ప్రస్తావించబడిన విషయాన్ని, తమ సందేశాన్ని అర్థం చేసుకున్నాను. నాకు తెలిసినంతమట్టుకు ఓ ప్రవక్త ఇంకా రావలసి ఉంది. ఆయన సిరియా దేశం నుండి ప్రభవిస్తాడని నా అంచనా. నేను తమ దూతను గౌరవించాను. తమ సన్నిధికి ఇద్దరు స్త్రీ బానిసలను పంపిస్తున్నాను. వీరికి ఖిబ్తీలలో గొప్ప గౌరవం ఉంది. కొన్ని వస్త్రాలను, తమరు స్వారీ చేయడానికి గాను ఓ ఖచ్చర్ (కంచర గాడిద)ను కూడా కానుకలుగా పంపిస్తున్నాను. మీకు సలాం (శుభాలు కలుగుగాక).*

ముఖౌఖిస్ అంతకంటే మరింకేమీ రాయలేదు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఇద్దరు స్త్రీ బానిసలు 'మారియా' మరియు 'సిరీన్'లు. ఖచ్చర్ పేరు 'దుల్ దుల్'. ఇది 'హజ్రత్ అమీరె మావియా' కాలం వరకు జీవించి ఉండింది.

దైవప్రవక్త (సల్లం), 'మారియా'ను తమ వద్దే ఉంచుకున్నారు. ఆమె గర్భాన దైవప్రవక్త (సల్లం) కుమారుడు 'ఇబ్రాహీం' జన్మించారు. ఇక 'సిరీన్'ను 'హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ అన్సారి (రజి)'కు అప్పజెప్పారు.

_(★→ ఈ పేరును 'అల్లామా మన్సూర్ పూరి' గారు రహెమతుల్ లిల్ ఆలమీన్ 1/78లో ప్రస్తావించారు. డాక్టర్ హమీదుల్లాహ్ గారు అతని పేరు 'బిన్ యామీన్' అని వ్రాశారు. చూడండి దైవప్రవక్త (సల్లం) గారి రాజకీయ జీవితం (రసూలె అక్రమ్ కి సియాసి జిందగి) పేజీ 141.)_

_(☆→ జాదుల్ ముఆద్ అల్ ఇబ్నె ఖైమ్ - 3/61. ఇటీవలి కాలంలోనే ఈ లేఖ లభించింది. డాక్టర్ హమీదుల్లాహ్ ఏ ఫోటో అయితే తన గ్రంథంలో ప్రచురించారో దానికి మరియు జాదుల్ ముఆద్ లేఖలో కేవలం రెండే రెండు అక్షరాల తేడా ఉంది. జాదుల్ ముఆద్ లో 'అస్లమ్ తస్లిమ్. అస్లమ్ యూతికల్లాహ్ - చివరి వరకు'. లేఖలో 'ఫస్లిమ్ తస్లిమ్ యూతికల్లాహ్' అని ఉంది. అలాగే జాదుల్ ముఆద్ గ్రంథంలోని లేఖలో 'అసిమ్ అహ్లల్ ఖిబ్త్' అని, ఈ లేఖలో 'అసిముల్ ఖిబ్త్' అని ఉంది. చూడండి, 'ప్రవక్త రాజకీయ జీవితం పుట' - 136, 137.)_

*3. పర్షియా చక్రవర్తి ఖుస్రో పర్వేజ్ కు పంపిన లేఖ : -*

దైవప్రవక్త (సల్లం) ఓ లేఖను పర్షియా చక్రవర్తి కిస్రా (ఖుస్రో)కు పంపించారు. ఆ లేఖ ఇది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *ముహమ్మద్ రసూలుల్లాహ్ తరఫున పర్షియా చక్రవర్తి కిస్రాకు రాసిన లేఖ ఇది:*

  *సన్మార్గాన్ని అవలంభించే వ్యక్తికీ, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తూ, అల్లాహ్ తప్ప వేరెవరూ ఆరాధనలకు అర్హులు కారని, ఆయన ఒక్కడూ, ఆయనకు మరెవ్వరూ సాటిలేరని, ముహమ్మద్ అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చే వ్యక్తికి శుభాలు కలుగుగాక. నేను మిమ్మల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే, జీవించి ఉన్న వానికి అతని దుష్పరిణామాలను గురించీ, తిరస్కారులకు సత్యమేదో తెలియజేయటానికీ నేను మానవులందరి తరఫున అల్లాహ్ ద్వారా పంపించబడినవాణ్ణి గనుక. కాబట్టి మీరు ఇస్లాం స్వీకరించండి క్షేమంగా ఉండగలరు. దాన్నే గనక తిరస్కరిస్తే మీ భుజస్కంధాలపై మజూస్ ల (అగ్ని ఆరాధకుల) పాప భారం కూడా పడగలదు.*

ఈ లేఖను కిస్రాకు అందించడానికి దైవప్రవక్త (సల్లం), 'హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఖుజాఫా సహమీ(రజి)'గారిని ఎంపిక చేశారు. ఆయన ఈ ఉత్తరాన్ని బహ్రైన్ పాలకునికి అందజేశారు. బహ్రైన్ పాలకుడు ఈ లేఖను తన మనిషికి ఇచ్చి కిస్రాకు పంపించాడా లేదా ఖుద్దు అబ్దుల్లాహ్ బిన్ ఖుజాఫా సహమీ (రజి) గారినే అక్కడకు పంపించాడా అనే విషయం గ్రంథాల ఆధారంగా తెలియరాలేదు.

మొత్తానికి ఈ లేఖను 'ఖుస్రో'కు చదివి వినిపించగా, అతను దాన్ని చించివేశాడు. ఎంతో గర్వాన్ని ప్రదర్శిస్తూ, *"నా పాలితుల్లో ఓ నీచమైన బానిస, తన పేరును నా పేరుకంటే ముందు రాస్తాడా?"* అని మండిపడ్డాడు.

దైవప్రవక్త (సల్లం)కు ఈ వార్త తెలియగా ఆయన (సల్లం), *"అల్లాహ్ అతని రాచరికాన్ని ఛిన్నాభిన్నం చేయుగాక"* అని శపించారు. (ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) గారు శపించినట్లే జరిగిపోయింది.)

అనంతరం కిస్రా, తన యమన్ గవర్నరు అయిన 'బాజాన్'కు లేఖ రాస్తూ, హిజాజ్ (సౌదీ)లో ఉన్న ఆ వ్యక్తి (సల్లం) వద్దకు ఇద్దరు బలాఢ్యులైన మనుషుల్ని పంపి, బంధించి నా సన్నిధికి హాజరుపరచమని ఆదేశించాడు.

బాజాన్, ఆ ఆదేశాన్ని శిరసావహిస్తూ ఇద్దరు వ్యక్తుల్ని ఎంపిక చేశాడు.  వారి ద్వారా దైవప్రవక్త (సల్లం)కు ఓ లేఖ కూడా రాసి పంపాడు. ఆ లేఖలో, దైవప్రవక్త (సల్లం), ఈ ఇద్దరి వెంట వెళ్ళి కిస్రా దర్బారులో హాజరుకావాలనే ఆదేశం ఉంది.

వారిరువురు మదీనాకు వెళ్ళి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరిన తరువాత వారిలో ఒకడు ప్రవక్త (సల్లం)తో, *"చక్రవర్తి కిస్రా, బాజాన్ గవర్నరుకు ఓ ఉత్తరం ద్వారా మిమ్మల్ని కిస్రా వద్దకు హాజరుపర్చమని ఉత్తరం రాయడం వలన ఆయన నన్ను మీ వద్దకు పంపించాడు. మీరు నా వెంట కిస్రా దగ్గరకు బయలుదేరి రావాలి."* అన్నాడు.

ఇదేకాకుండా వారిరువురు బెదిరింపు ధోరణిని అవలబించారు కూడా. దైవప్రవక్త (సల్లం) వారిరువురిని రేపు వచ్చి కలవమని చెప్పారు.

ఇటు మదీనాలో ఆసక్తికరమైన కార్యం జరుగుతూ ఉండగానే, అటు 'ఖుస్రో పర్వేజ్' కుటుంబంలోనే అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు జ్వాల భగ్గుమంది. దీని ఫలితంగా కైసరు సైన్యాల చేతిలో పార్సీ సైన్యాలు ఎడతెగకుండా అపజయాలను ఎదుర్కొంటున్నాయి. ఆ అదనులోనే ఖుస్రో తనయుడు 'షేరూయా' తన తండ్రిని హతమార్చి రాజైపోయాడు. అది మంగళవారం రాత్రి, జమాదిల్ అవ్వల్ నెల, పదవ తారీఖు హిజ్రీ శకం - 7 నాడు జరిగిన సంఘటన. దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం వహీ (దివ్యావిష్కృతి) ద్వారా తెలిసింది.

మరుసటి రోజు ఆ ఇద్దరు పర్షియా ప్రతినిధులు దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి హాజరు కాగానే, ఆయన (సల్లం) వారికి ఈ సంఘటన గురించి తెలియజేశారు.

ఇది విన్న వారిద్దరూ, *"ఏమిటీ మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? మేము ఇంతకంటే మామూలు విషయాలను మీ నేరాల్లో చేర్చి ఉన్నాం. మరి మీ ఈ మాటల్ని మేము మా చక్రవర్తికి రాసి పంపించాలా?"* అని బెదిరించారు.

*"అవును, అతనికి నా ఈ మాటలను గురించి తప్పకుండా తెలియజేయండి. అతనికి ఇంకా ఇలా కూడా రాసి పంపించండి. అతనితో చెప్పండి. నా ధర్మం, నా పాలన, కిస్రా ఇప్పటి వరకు చేరినంత దూరం చేరగలదని. అంతేకాదు ఈ పాలన అలా విస్తరిస్తూ, గుర్రాలుకాని, ఒంటెలుకాని వెళ్ళలేనంత వరకు వెళ్ళి ఆగిపోగలదని కూడా చెప్పండి. మీరిరువురు అతనితో, నీవే గనక ముస్లిం అయిపోతే ప్రస్తుతం నీ అధికారంలో ఉన్నదంతా నీదే అవుతుంది, నిన్ను నీ జాతికి రాజుగా చేస్తాను అని కూడా చెప్పండి."* అని అన్నారు ప్రవక్త (సల్లం).

ఆ తరువాత వారిద్దరు మదీనా నుండి బయలుదేరి 'బాజాన్' దగ్గరకు వెళ్ళారు. అతనికి వివరాలన్నీ తెలియజేశారు. కొన్ని రోజుల అనంతరం అతనికి ఓ లేఖ అందింది. 'షేరూయా' తన తండ్రి 'కిస్రా'ని హతమార్చాడని, ఏ వ్యక్తి గురించి తన తండ్రి 'బాజాన్'కు రాశాడో తిరిగి ఆదేశం వచ్చే వరకు అతని (సల్లం) జోలికి పోవద్దని ఉంది ఆ లేఖలో.

ఈ సంఘటన జరిగిన తోడనే 'బాజాన్' మరియు యమన్ లో ఉంటున్న అతని పర్షియన్ సహచరులంతా ముస్లిములైపోయారు.

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

*4. రోము చక్రవర్తి 'కైజరు'కు పంపించిన లేఖ : -*


No comments:

Post a Comment