300

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🌹🌹🌹         *ఇస్లాం చరిత్ర* *- 300*         🌹🌹🌹

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 215*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 5*

*8. అమ్మాన్ రాజుకు రాసిన లేఖ : -*

దైవప్రవక్త (సల్లం) ఓ లేఖను అమ్మాన్ రాజు 'జైఫర్', అతని సోదరుడు 'అబ్ద్' పేరున రాసి పంపించారు. ఆ ఇరువురి తండ్రి పేరు జలందీ. ఆ లేఖ ఇలా ఉంది: ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *ముహమ్మద్ (సల్లం) బిన్ అబ్దుల్లాహ్ తరఫున జలందీ కుమారులు జైఫర్ మరియు అబ్ద్ పేర.*

  *ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వ్యక్తికి సలాం (శుభాలు).* తరువాత -
  *నేను మీ ఇరువురిని ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే క్షేమంగా ఉండగలరు. ఎందుకంటే నేను మానవాళి అందరికీ అల్లాహ్ ప్రవక్తను అయినందువలన, జీవించి ఉన్న ప్రతివానికి అతని దుష్పరిణామాలను గురించి హెచ్చరించవలసి ఉంది. దైవతిరస్కారులు నా మాట సత్యమైనది అని తెలుసుకోవాలి. మీరిరువురే గనక ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే, మీరిరువురిని పాలకులుగానే కొనసాగించగలను. మీరే గనక ఇస్లాం ధర్మాన్ని స్వీకరించకపోతే, మీ రాచరికం మంట గలిసిపోతుంది. మీ రాజ్యంపై అశ్వాల దాడి జరుగగలదు. మీ రాచరికంపై నా ప్రవక్త పదవే ప్రాబల్యం పొందగలదు.*

ఈ లేఖను తీసుకువెళ్ళడానికి దూతగా 'హజ్రత్ అమ్రూ బినుల్ ఆస్ (రజి)'గారిని ఎంపిక చేయడం జరిగింది. హజ్రత్ అమ్రూ (రజి) బయలుదేరి అమ్మాన్ చేరి 'అబ్ద్'ను కలిశారు. ఆ ఇరువురు అన్నదమ్ముల్లో ఇతనే దూరదృష్టి గలవాడు. ఆలోచనాపరుడూను.

అమ్రూ (రజి), అబ్ద్ తో, *"నేను మీ వద్దకు, మీ అన్న వద్దకు దైవప్రవక్త (సల్లం) గారి దూతగా వచ్చాను."* అన్నారు.

అతను, *"నా సోదరుడు వయస్సులోనూ, రాజుగానూ నాకంటే పెద్దవాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఆయన వద్దకు పంపిస్తాను. ఉత్తరం ఆయనకు ఇచ్చేద్దురుగాని"* అని చెప్పి, *"అవునూ! మీరు దేని వైపునకు ఆహ్వానిస్తున్నట్లు?"* అని అడిగాడు.

అపుడు హజ్రత్ అమ్రూ (రజి) మరియు అబ్ద్ ల మధ్య సంభాషణ ఇలా కొనసాగింది....; ↓

*అమ్రూ : -* మేము అల్లాహ్ మార్గం వైపునకు ఆహ్వానిస్తున్నాం. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు. ఆయన తప్ప మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారందరినీ వదిలేయాలి. ముహమ్మద్ (సల్లం) అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం పలుకమని చెబుతున్నాము.

*అబ్ద్ : -* ఓ అమ్రూ! నీవు నీ జాతి సర్దారు కుమారుడివి. చెప్పు, నీ తండ్రి ఏం చేశాడో? ఎందుకంటే అతణ్ణే నీవు అనుసరించవలసి ఉంది.

*అమ్రూ : -* ఆయన, ముహమ్మద్ (సల్లం)ను విశ్వసించకనే మరణించాడు. కాని నేను మాత్రం ఆయన ఇస్లాం స్వీకరించి ఉంటే ఎంత బాగుండేదో అనేదే నా బాధ. నేను ఆయన మార్గాన్నే అవలంబించాను కాని అల్లాహ్ నాకు ఇస్లాం ధర్మ ఋజుమార్గాన్ని చూపించాడు.

*అబ్ద్ : -* నీవు ఆయన్ను ఎప్పుడు అనుసరించావు?

*అమ్రూ : -* ఇటీవలే.

*అబ్ద్ : -* నీవు ఇస్లాం స్వీకరించినది ఎక్కడ?

*అమ్రూ : -* నజాషీ వద్ద ఉన్నప్పుడు. నజాషీ కూడా ఇస్లాం స్వీకరించిన విషయం నీకు తెలుసా?

*అబ్ద్ : -* మరి అతని జాతి అతని రాచరికాన్ని స్వీకరించిందా?

*అమ్రూ : -* అవును. దాన్ని ఆ జాతి కొనసాగనిచ్చింది. అతన్నే అది అనుసరించింది.

*అబ్ద్ : -* క్రైస్తవ మత ఫాదరీలు, సన్యాసులు కూడా ఆయన్ను అనుసరించారా?

*అమ్రూ : -* అవును.

*అబ్ద్ : -* ఓ అమ్రూ! నీవేం మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించావా? మనిషి ఏ వైఖరి అయినా అసత్యం కంటే చెడ్డది కాదు సుమా?

*అమ్రూ : -* నేను అసత్యం పలకడం లేదు. దాన్ని మేము ధర్మసమ్మతమైనదిగా తలిచేవారం కాము.

*అబ్ద్ : -* 'హిరక్ల్'కు నజాషీ ఇస్లాం స్వీకరించిన విషయం తెలియదేమో అని నేననుకుంటున్నాను.

*అమ్రూ : -* ఎందుకు కాదు! అది అతనికి తెలిసిందే.

*అబ్ద్ : -* మరి ఈ విషయం నీకెలా తెలిసింది?

*అమ్రూ : -* నజాషీ 'హిరక్ల్'కు కప్పం కడుతూ ఉండేవాడు. కాని అతను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తరువాత దైవప్రవక్త (సల్లం) యొక్క ప్రవక్తా పదవిని ధృవపరచిన తరువాత అతను, 'దైవసాక్షి! అతను నాకు ఒక్క దిర్హంను చెల్లించమన్నా నేను చెల్లించేవాణ్ణి కాదు' అని అన్నాడు. ఈ విషయం 'హిరక్ల్'కు తెలిసినప్పుడు అతని సోదరుడు యనాక్, 'ఏమిటీ నీకు కప్పం కట్టకుండా ఉన్న ఆ బానిసను, నీ ధర్మం కాకుండా మరొకరి ధర్మాన్ని అనుసరించే ఆ బానిసను ఇట్టే వదిలేస్తావా?' అని అడిగాడు. దానికి హిరక్ల్, 'నేను అతణ్ణి ఏమీ చేయలేను. దైవసాక్షిగా చెబుతున్నాను. నాకే గనుక ఈ రాచరికం పోతుందనే భయం లేకపోతే నేను కూడా అతను అనుసరించిన మార్గాన్నే అనుసరించేవాణ్ణి' అన్నాడు.

*అబ్ద్ : -* ఓ అమ్రూ! నీవు అనేది ఏమిటో కొంత ఆలోచించి మాట్లాడు.

*అమ్రూ : -* దైవసాక్షి! నేను నిజమే పలుకుతున్నాను.

*అబ్ద్ : -* సరే! ఆయన దేన్ని గురించి ఆదేశిస్తున్నారు మరియు ఏ విషయం గురించి వారిస్తున్నారో చెప్పు.

*అమ్రూ : -* ఆయన అల్లాహ్ ఆదేశాలను పాటించే ఆదేశం ఇస్తున్నారు. అలాగే ఆయన అవిధేయత నుండి మిమ్మల్ని వారిస్తున్నారు. సత్కార్యాలు చెయ్యమని, బంధువుల ఎడల సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశిస్తున్నారు. జులుము, అత్యాచారం, వ్యభిచారం, మద్యపానం వలదని, రాళ్ళు, విగ్రహాలు మరియు శిలువను పూజించకూడదని చెబుతూ వాటి నుండి మమ్మల్ని అడ్డుకుంటున్నారు.

*అబ్ద్ : -* ఆయన దేని వైపునకైతే పిలుస్తున్నారో అది ఎంత మేలైన విషయం! నా సోదరుడే ఈ విషయంలో నాతో ఏకీభవిస్తే, మేము ప్రయాణించి అక్కడికి వెళ్ళి ముహమ్మద్ (సల్లం)ను విశ్వసించేవాళ్ళం. ఆయనను ధృవపరిచేవాళ్ళం. కాని, నా సోదరుడు దీనికంటే రాచరికాన్నే అధికంగా ప్రేమిస్తున్నాడు. అతను దాన్ని వదలి ముహమ్మద్ (సల్లం) అనుయాయునిగా మారడం కష్టమే.

*అమ్రూ : -* అతనే గనక ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిం అయిపోతే మహాప్రవక్త (సల్లం), అతనికి తన జాతిపై ఉన్న అధికారాలను అలానే కొనసాగించగలరు. అయితే మీ ధనవంతుల నుండి మాత్రం 'సదఖా' వసూలు చేయడం జరుగుతుంది.

*అబ్ద్ : -* ఇంకేం కావాలి? సరే, సదఖా అంటే ఏమిటీ?

దీనికి సమాధానంగా అమ్రూ (రజి), రకరకాల సొత్తుల నుండి దైవప్రవక్త (సల్లం) ఏయే సదఖాలు తీయమని ఆదేశించారో వాటన్నిటి వివరాలు ఆయన ముందు ఉంచారు. ఒంటె గురించిన సదఖా గురించి చెప్పినప్పుడు అబ్ద్, అమ్రూ (రజి)తో, *"ఓ అమ్రూ! వాటికవే సొంతంగా వెళ్ళి చెట్లను మేసి వచ్చే పశువుల్లో నుండి కూడా సదఖా ఉందా?"* అని అడిగాడు.

*అమ్రూ : -* అవును.

*అబ్ద్ : -* దైవసాక్షిగా చెబుతున్నాను! ఇంత విశాలమైన భూభాగం మరియు జనసాంద్రత గల మా జాతి దీన్ని ఒప్పుకుంటుందని నేననుకోను.

అమ్రూ (రజి), అతని దివాణంలో కొన్ని రోజుల వరకు వేచి ఉన్నారు. అబ్ద్, తన సోదరుని వద్దకు వెళ్ళి వివరాలన్నీ చెప్పి వస్తున్నాడు. ఓ రోజు అబ్ద్ సోదరుడు రాజు జైఫర్, అమ్రూ (రజి)ని పిలిపించాడు. అమ్రూ (రజి) లోనికి ప్రవేశించబోగా పహారా దారులు ఆయన (రజి) రెక్కలు పట్టుకొని ఆపేశారు. జైఫర్, అమ్రూ (రజి)ని వదలమని వారిని ఆదేశించగా వారు ఆయన్ని విడిచిపెట్టేశారు. అమ్రూ (రజి), ఆ రాజు దగ్గరకు వెళ్ళి కూర్చోబోగా, ఆ పహారాదార్లే ఆయన్ని కూర్చోకుండా అడ్డుకున్నారు.

అమ్రూ (రజి), రాజు వైపు చూశారు. రాజు, ఆయన (రజి)తో, *"నీవు తెచ్చిన సమాచారమేమిటో చెప్పు!"* అని అడిగాడు.

సీలు వేసిన ఉత్తరాన్ని అమ్రూ (రజి) జైఫర్ కి ఇచ్చివేశారు. అతను దాని సీలు తీసి చదివి తన సోదరునికి అందించాడు. తమ్ముడు కూడా దాన్ని అలానే చదివాడు. కాని అతని వాలకం తన అన్నకంటే మెత్తగా కనబడింది. ఆ తరువాత రాజుకు, అమ్రూ (రజి)కి నడుమ ఈ సంభాషణ జరిగింది.

*జైఫర్ : -* ఖురైషులు ఏ వైఖరిని అవలంభించారో చెప్పు.

*అమ్రూ : -* వారంతా ఆయన (సల్లం)కు విధేయులైపోయారు. కొందరు ఇస్లాం ధర్మం ఎడల ప్రేమతో, మరికొందరు కరవాలం ఎడల భయంతో.

*జైఫర్ : -* ఆయన (సల్లం) వెంట ఉన్నదెవరు?

*అమ్రూ : -* అందరూ ఆయన (సల్లం) వెంటే ఉన్నారు. వారందరూ ఇస్లాం ధర్మాన్ని ఏరికోరి స్వీకరించినవారే. ఇతర అన్ని విషయాలకంటే దీనికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వారికి అల్లాహ్ మార్గదర్శకత్వం ద్వారా, తమ బుద్ధీవివేకాల ద్వారా తాము ఇప్పటి వరకు మార్గభ్రష్టులమై ఉన్నామనే విషయం తెలిసింది. ఇక మీ ప్రాంతంలో మీరు తప్ప ఇంకెవరైనా అలా అపమార్గంలో ఉన్నారో లేదో నాకు తెలియదు. మీరే గనక ఇస్లాం ధర్మాన్ని స్వీకరించక, దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారికి విధేయత చూపకపోతే, మిమ్మల్ని మా ఉష్ట్రారోహులు, అశ్వారోహులు తమ కాళ్ళ క్రింద వేసి నలిపేస్తారు. మీ పచ్చిక బయళ్ళు మటుమాయమైపోతాయి. కాబట్టి మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి. క్షేమంగా ఉండగలరు. దైవప్రవక్త (సల్లం) మిమ్మల్ని మీ జాతికి నాయకునిగా పాలకునిగా చేస్తారు. మీ దగ్గరకు ఆశ్వికదళంగాని, పదాతిదళంగాని రానేరదు.

*జైఫర్ : -* ఈ రోజు నన్ను ఆలోచించుకోనీ. రేపు తిరిగి వచ్చేయి.

ఆ తరువాత అమ్రూ (రజి) అతని తమ్ముడు అబ్ద్ ఇంటికి తిరిగి వచ్చేశారు. అబ్ద్, అమ్రూ (రజి)తో, *"అమ్రూ? అతనికే గనక రాచరికపు దురాశ అడ్డుకోకుంటే ఇస్లాం తప్పక స్వీకరిస్తాడు అనే నమ్మకం నాకుంది."* అని అన్నాడు.

అమ్రూ (రజి), రెండో రోజు దర్బారుకు వెళ్ళగా, రాజు జైఫర్ అనుమతి ఇవ్వడానికి నిరాకరించాడు. కాబట్టి అమ్రూ (రజి), అతని తమ్మునితో కలసి అతనింటికి వచ్చి, *"రాజు దగ్గరకు నేను వెళ్ళలేకపోయాను."* అని చెప్పగా; అబ్ద్, ఆయన్ను తన సోదరుని వద్దకు తీసుకువెళ్ళాడు.

అపుడు రాజు, అమ్రూ (రజి)తో, *"నేను మీ ఆహ్వానం గురించి బాగా ఆలోచించాను. నేనే గనక నా రాజ్యాన్ని, ఇప్పటి వరకు ఇంకా నా రాజ్యంలో ప్రవేశించని దళాల అధిపతికి అప్పగిస్తే నేను అరేబియాలోనే అతి బలహీనునిగా తలచబడతాను. ఒకవేళ మీ అశ్వికదళం, ఉష్ట్రారోహులే ఇక్కడికి వస్తే, మీకు ఇప్పటి వరకు ఎదురుకాని యుద్ధం జరిగి తీరుతుంది."* అని చెప్పాడు.

అమ్రూ (రజి), *"సరే, నేను రేపు వెళ్ళిపోతున్నాను."* అని చెప్పగా, అతను తన సోదరునితో ఏకాంతంలో మాట్లాడుతూ, *"ఈ ప్రవక్త ఎవరిపైనైతే ప్రాబల్యం సంపాదించారో వారి ముందు మనమెంత? ఆయన ఎవరి వద్దకైతే తన సందేశాన్ని పంపించారో వారు ఈయన ఆహ్వానాన్ని స్వీకరించినవారే."* అని చెప్పాడు.

రెండవ రోజు అమ్రూ (రజి)ని దర్బారుకు పిలువనంపారు. ఆ రాజు మరియు అతని సోదరుడు ఇద్దరూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ప్రవక్త (సల్లం)ను ధృవపరిచారు. సదఖా వసూలు చేయడానికి, వారి నడుమ తీర్పుజెప్పడానికి అమ్రూ (రజి)ని స్వతంత్రునిగా వదిలేశారు.ఎవరైనా అమ్రూ (రజి)తో విభేదిస్తే వారిద్దరూ ఆయన (రజి)కి సహాయపడ్డారు.

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బట్టి చూస్తే, ఇతర రాజుల వద్దకు పంపిన లేఖల కంటే ఈ ఇద్దరి వద్దకు పంపిన లేఖ ఆలస్యంగా చేరింది. బహుశా ఇది మక్కా విజయం తరువాత జరిగిన సంఘటన కావచ్చు.

ఈ లేఖల ద్వారా దైవప్రవక్త (సల్లం) తన సందేశాన్ని అన్ని దేశాల పాలకుల వద్దకు పంపడం జరిగింది. ఫలితంగా కొందరు ఇస్లాం స్వీకరించగా, కొందరు దాన్ని తిరస్కరించారు. అయితే తిరస్కరించిన వారికి కూడా ఇస్లాం ఏమిటో తెలిసిపోయింది. వారి మనస్సులో ప్రవక్త (సల్లం) గారి ధర్మం, ఆయన పేరు బాగా నాటుకుపోయి సుపరిచితమైంది.

*హుదైబియా ఒప్పందం తరువాతి సైనిక చర్యలు : - ↓*

*In Sha Allah రేపటి భాగంలో....; →*


4 comments: