294

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 294*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 209*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*'అబూ బసీర్ (రజి)' దైన్యస్థితి : -*

హుదైబియా ఒప్పందంలోని షరతులు ముస్లిములకు మింగుడు పడటం లేదు. ఈ సంవత్సరం ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళటం వారి హృదయాల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. అబూ జందల్ దైన్యస్థితిని చూసి కూడా, తాము ఆయనకు సహాయపడలేక పోవటంతో వారి అహం దెబ్బతింది. ఈ సంఘటనలన్నీ వారి మనసుల్లో మెదలుతుండగానే మరో సంఘటన జరిగింది. వారి గాయాలపై మళ్ళీ కారం చల్లినట్లయింది.

మహాప్రవక్త (సల్లం) మదీనాకు తిరిగివచ్చి నిశ్చింతగా ఉన్నప్పుడు, మక్కా నుంచి ఓ ముస్లిం పారిపోయి మదీనాకు వచ్చాడు. ఆయన పేరు అబూ బసీర్ (రజి). ఈయన 'సఖీఫ్' తెగకు చెందినవారు. సఖీఫ్ తెగ ఖురైష్ మిత్రపక్షం.

అబూ బసీర్ (రజి)ను మక్కాలో ఖురైషులు విపరీతంగా బాధించారు. ఈ సంగతి ఆయన్ను చూస్తేనే తెలిసిపోతుంది. ముస్లింలు, తనకు కుశల ప్రశ్నలు వేసినప్పుడు ఆయన (రజి) తన దురవస్థ గురించి ఇలా చెప్పుకొచ్చారు. ↓

*"ముస్లిములారా! ఒకప్పుడు ముహమ్మద్ (సల్లం) సందేశం మీద నాకు విపరీతమైన కోపం ఉండేది. ఆయన (సల్లం) మక్కా వదలిపెట్టి మదీనాకు వలస వచ్చినప్పుడు ఆయన్నొక తిరుగుబాటుదారునిగా, తన వంశానికి చెడ్డ పేరు తీసుకువచ్చిన వానిగా నేను భావించాను. ఒక రోజు ఎవరో ఖుర్ఆన్ పారాయణం చేస్తుంటే విన్నాను. ఆ శబ్దం వినకూడదని నేను చాలా ప్రయత్నించాను. కాని ఏదో తెలియని శక్తి నన్ను అక్కణ్నుంచి కదలకుండా ఆపింది. నేను బలవంతాన అక్కడి నుంచి వెళ్ళిపోదామని నిశ్చయించాను. కాని ఆ కొద్ది సమయంలోనే నేను ఖుర్ఆన్ పారాయణంలోని అందానికి, దాని శైలికి ముగ్ధుణ్ణయ్యాను. ఆ విధంగా నేను ఇస్లాంకు దగ్గరవుతూ కొద్ది రోజులకే ముస్లింనైపోయాను. ఇటీవల నేను మదీనాకు వచ్చి ముస్లింలతో కలసి జీవించాలనుకున్నాను. నా ఉద్దేశ్యం ఖురైషులకు తెలియజేస్తే, వారు నన్ను బంధించి నిర్దాక్షిణ్యంగా వేధించారు. ఆఖరికి అల్లాహ్ దయతో కాపలాదారుల కండ్లు గప్పి నేను పారిపోయి వచ్చాను. మీతో కలసి జీవించాలనీ, మీతో కలసి అల్లాహ్ మార్గంలో కృషి చేయాలని నా చిరకాల వాంఛ."*

అబూ బసీర్, ఈ మాటలు చెబుతుండగానే ఖురైషుకు చెందిన ఇద్ధరు వ్యక్తులు ఆయన్ని వెతుక్కుంటూ అక్కడకి వచ్చారు. వచ్చీ రాగానే ఆ వ్యక్తులు, దైవప్రవక్త (సల్లం)తో, *"ఓ ముహమ్మద్ (సల్లం)! మాకు తెలిసినంత మటుకు నీవు నీ చిన్నతనంలో కూడా ఆడినమాట తప్పేవాడవు కాదు. అబూ బసీర్ మా మతాన్ని వదలిపెట్టాడు. మా ఆచారాలను కాలరాశాడు. అతనో తిరుగుబాటుదారు. మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని బంధించి తీసుకువెళ్లే హక్కు మాకుంది."* అన్నారు.

ఒక వైపు అసహాయ స్థితిలో ఉన్న అబూ బసీర్ (రజి) దీన వదనం! మరో వైపు ఖురైషీయులతో చేసుకున్న శాంతి ఒప్పందం!! దైవప్రవక్త (సల్లం) క్షణం పాటు ఆలోచనలో పడ్డారు. తరువాత ఓ నిర్ణయానికి వచ్చారు.

ఆయన (సల్లం), అబూ బసీర్ (రజి)ని ఉద్దేశిస్తూ, *"అబూ బసీర్ (రజి)! ఖురైషీయులతో మనం ఒప్పందం చేసుకొని ఉన్నాం. మనం ఒప్పందాన్ని ఉల్లఘించలేము కదా! ఒప్పందాన్ని ఉల్లంఘించడం అధర్మం. అందువల్ల నీవు నీ తెగవాళ్ళ దగ్గరకి తిరిగి వెళ్ళిపో."* అన్నారు బాధగా.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), ఖురైషులను సంబోధిస్తూ, *"నేను ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. అబూ బసీర్ (రజి)ని తీసుకెళ్ళండి. అల్లాహ్ త్వరలోనే అతన్ని, ఇతర ముస్లింలను రక్షించే మార్గం తీసుకువస్తాడు."* అని చెప్పారు.

అప్పుడు అబూ బసీర్ (రజి), ప్రవక్త (సల్లం)తో ఇలా అన్నారు ↓

*"దైవప్రవక్తా! మీరు నన్ను మళ్ళీ అవిశ్వాసుల దగ్గరకి పంపి వారి దౌర్జన్యకాండకు బలికమ్మంటున్నారా? అల్లాహ్ నన్ను వారి కబంధహస్తాల నుండి కాపాడాడు. కాని మళ్ళీ నన్ను వారి దగ్గరకు...."*

*"భయపడకు నాయనా! సహనం వహించు. అల్లాహ్ ఏదోమార్గం చూపించకపోడు. వారి హింసాకాండకు గురవుతున్నవారు ఇంకా కొందరన్నారు. అల్లాహ్ వారిని అలాగే వదలిపెట్టడు. వెళ్ళు బాబు! వెళ్ళు."* అని బదులిచ్చారు ప్రవక్త (సల్లం).

దైవప్రవక్త (సల్లం) గుండెను రాయిచేసుకొని ఆ అభాగ్యజీవిని ఖురైషులకు అప్పగించారు. ఖురైష్ మనుషులు హజ్రత్ అబూ బసీర్ (రజి)ని బంధించి తమతో పాటు తీసుకువెళ్ళారు. ముస్లింలు ఏమీ చేయలేక ఆ దీనుడి వైపు అసహాయంగా చూస్తూ కంటతడి పెట్టుకున్నారు.

*ఖురైష్ వ్యక్తిని హతమార్చిన అబూ బసీర్ (రజి) : -*

ఖురైష్ మనుషులిద్దరు అబూ బసీర్ (రజి)ని తీసుకొని 'జుల్ హలీఫా' అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకుందామని ఆగిపోయారు.

వారందరూ అక్కడ కూర్చుని ఖర్జూరాలు తింటున్నప్పుడు, అబూ బసీర్ (రజి), ఆ ఇద్దరు ఖురైషులలో ఒకర్ని ఉద్దేశించి, *"ఓ ఫలానా వ్యక్తీ! దైవసాక్షి! నీ కరవాలం ఎంతో మేలైనదిగా తోస్తుందే."* అని పొగిడారు.

అతను ఆ పొగడ్తకు తన కరవాలాన్ని ఒరలో నుండి బయటకు తీసి, *"అవును, ఏమనుకున్నావు? ఇది ఎంత మేలైన కరవాలమో! నేను దీన్ని ఎన్నోమార్లు ఉపయోగించాను తెలుసా?"* అని తన ప్రతాపాన్ని చాటుకున్నాడు.

*"ఏదీ, నన్ను కూడా చూడనీ, అది ఎలాంటిదో చూస్తాను."* అని అన్నారు అబూ బసీర్ (రజి).

అతను, ఆయన చేతికి ఆ కరవాలాన్ని అందించగానే, ఒకే వ్రేటుతో అతని తలను నరికేశారు అబూ బసీర్ (రజి).

ఈ హఠాత్పరిణామం చూసి రెండవ వ్యక్తి పలాయనం చిత్తగించాడు. అతను నేరుగా మదీనాకు వెళ్ళి మస్జిదె నబవీలో చొరబడ్డాడు. అతణ్ణి చూడగానే దైవప్రవక్త (సల్లం), *"ఇతను ఏదో ప్రమాదంలో పడినట్లున్నాడే?"* అని అంటూ, ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ, *"ఏమిటి ఇలా వచ్చావు? క్షేమమే కదూ!?"* అని అడిగారు.

దానికి ఆ ఖురైషు వ్యక్తి, *"ఏం చెప్పను మహాశయా! అబూ బసీర్ (రజి), నాతో పాటు వచ్చిన వ్యక్తిని చంపేశాడు. నేనెలాగో తప్పించుకొని వచ్చాను. లేకుంటే నాకూ అదేగతి పట్టేది."* అన్నాడు.

అంతలోనే అబూ బసీర్ (రజి) కూడా అక్కడకి వచ్చి, *"దైవప్రవక్తా! మీరు నన్ను ఖురైషీయులకు అప్పగించి మీ కర్తవ్యం నెరవేర్చుకున్నారు. ఇక మీపై ఎలాంటి బాధ్యతలేదు. కాని నేను నా ఆత్మరక్షణ కోసం ఈ పని చేశాను. ఇప్పుడు నేను ముస్లింలతో కలిసి ఉండటానికి వచ్చాను."* అని అన్నారు.

కాని, దైవప్రవక్త (సల్లం) తన సహచరులతో, *"ఇప్పుడు నేను ఒప్పందంలో ఉన్నాను. ఆ ఒప్పందాన్ని గౌరవించడం విధి. అబూ బసీర్ (రజి) ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను. కాని మదీనాలో ఉండటానికి నేను ఆయన్ని అనుమతించలేను. ఆయన్ని మరెక్కడికైనా వెళ్ళమనండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా నా ప్రాంతం ఆయనకు ఆశ్రయం అవుతుందని, అల్లాహ్ ఆయన ప్రార్థనల్ని, ఆరాధనల్ని స్వీకరిస్తాడని నేను ఆశిస్తున్నాను."* అన్నారు.

మరో దారి లేక అబూ బసీర్ (రజి) మదీనా విడచి వెళ్ళవలసి వచ్చింది. ఆయన (రజి) మనసు ఎంతో బాధపడింది. ఎక్కడికి వెళ్ళాలో పాలుపోని పరిస్థితి! అత్యంత దైన్యస్థితిలో అబూ బసీర్ (రజి) తిరిగి వెళ్ళిపోవడం ముస్లింలను మరోమారు కంట తడిపెట్టించింది. ముస్లింలు మరింత భావోద్వేగానికి లోనయ్యారు.

*మక్కా నుంచి పారిపోయి వస్తున్న ముస్లింలను తిరిగి వెనక్కి పంపడం : -*

హుదైబియా ఒప్పందంలో ఒక షరతు ఈ విధంగా ఉంది.... ; ↓

*"మక్కా నుండి ఎవరైనా పారిపోయి మదీనా వెళ్ళిపోతే అతడ్ని మక్కాకు తిరిగి పంపివేయాలి. కాని మదీనా నుండి ఎవరైనా మక్కాకు వస్తే అతడ్ని మదీనాకు తిరిగి పంపడం జరగదు."*

ఈ షరతు ప్రకారం దైవప్రవక్త (సల్లం) మక్కా నుండి పారిపోయి వచ్చిన ముస్లింలను తిరిగి మక్కాకు తిప్పి పంపుతూ ఉండేవారు. ఇలా కొంతమంది ముస్లింలను తిప్పిపంపారు.

*వాణిజ్య బృందాలపై దాడులు : -*

హజ్రత్ అబూ బసీర్ (రజి) మదీనా నుంచి నేరుగా సముద్ర తీరానికి పోయి 'అమీస్' అనే చోట ఆగిపోయారు. వెంట తెచ్చుకున్న ఖర్జూర పండ్లతో, సముద్రపు చేపలతో క్షుద్భాధ తీర్చుకుంటూ అక్కడే కాలం గడపసాగారు.

మక్కాలో ఖురైషీయుల హింసా దౌర్జన్యాలకు గురై అష్టకష్టాలు అనుభవిస్తున్న ఇతర ముస్లింలు ఈ విషయం తెలుసుకొని ఒక్కొక్కరే రహస్యంగా అబూ బసీర్ (రజి) దగ్గరకి చేరుకోవడం ప్రారంభించారు. 'సుహైల్' కొడుకు 'హజ్రత్ అబూ జందల్ (రజి)' కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా కొంతకాలానికే మక్కా నుండి డెబ్భై మందికి పైగా ముస్లింలు పారిపోయి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. వారిది ఓ బృందమే తయారైపోయింది.

మక్కా నుంచి సిరియాకు పోయే, సిరియా నుండి తిరిగొచ్చే వర్తక బిడారాలన్నీ ఈ ప్రాంతం గుండానే వచ్చి పోవలసి ఉంటుంది. హుదైబియా ఒప్పందం ప్రకారం మక్కా నుండి పారిపోయే ముస్లింలు మదీనా వెళ్ళడానికి వీలులేనందున వారంతా ఈ ప్రాంతానికే వచ్చి చేరుకొని, ఇక్కడకు వచ్చే వాణిజ్య బృందాలపై గెరిల్లాదాడులు చేస్తూ వాటిని దోచుకోవడం ప్రారంభించారు.

ఇలా ఈ పీడిత ముస్లింలే మక్కా ఖురైషీయులకు పెద్ద బెడదగా తయారయ్యారు. ఏ సంధి షరతుల వల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని భావించారో ఆ సంధి షరతులే ఇప్పుడు వారి బ్రతుకు తెరువుకు అవరోధాలుగా మారి ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ పోరు పడలేక ఖురైషీయులు మదీనా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు మొర పెట్టుకున్నారు. మదీనాకు వచ్చే ముస్లింలను మక్కాకు తిరిగి పంపించాలనే ఒప్పంద నియమాన్ని మార్చుకోవాలని, సముద్రతీరాన ఉన్న శరణార్థుల్ని మదీనా పిలిపించుకొని తమను ఇక్కట్ల నుంచి గట్టెక్కించమని వేడుకున్నారు ఖురైష్ నాయకులు.

ఖురైషీయులు, తమలో ఒక రాయబారిని దైవప్రవక్త (సల్లం) వద్దకు పంపి, అబూ బసీర్ (రజి) సమస్యను పరిష్కరించుకున్న విధానం మరింత వివరంగా....; ↓

*In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment