293

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪             *ఇస్లాం చరిత్ర* *- 293*             ☪🕌🛐

🇸🇦🕋      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 208*      🕋🇸🇦

 *❂―――•――•――•―●―•――•――•―――❂*

*హిజ్రత్ చేసివచ్చిన మహిళల అప్పగింతను నిరాకరించడం : -*

ఆ తరువాత కొందరు మహిళా విశ్వాసులు దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి చేరడం జరిగింది. మొట్టమొదట 'హజ్రత్ ఉమ్మెకుల్సూమ్ బిన్తె ఉఖ్బా (రజి)' మక్కా నుండి పారిపోయి మదీనా వచ్చారు. వెంటనే ఆమె సోదరుడు వచ్చి, హుదైబియాలో జరిగిన ఒప్పందం ప్రకారం ఆమెను తనకు అప్పగించమని డిమాండు చేశాడు. కాని ఒప్పందంలోని ఈ షరతును అనుసరించి అతని డిమాండును తిరస్కరించడం జరిగింది. ఆ షరతులో ఇలా ఉంది. ↓

*"(ఈ ఒప్పందం ఈ షరతులకు లోబడి చేయబడినదేమిటంటే) మా పురుషుడు ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు వారిని తప్పకుండా మాకు అప్పజెప్పవలసి ఉంటుంది. వారు మీ ధర్మాన్ని అవలంబించినవారు అయినా సరే."*

కాబట్టి మహిళల ప్రస్తావన ఈ ఒప్పందంలో లేనేలేదు. అంటే, ఆ షరతుల్లో స్త్రీల సంగతి స్పష్టంగా లేదు. అప్పుడు మక్కా బహుదైవారాధకులు సంధి షరతుల్లోని పదజాలం గమనించి జరిగిన పొరపాటుకు తలలు బాదుకున్నారు.

ఆ తరువాత అల్లాహ్ ఈ విషయమై తన గ్రంథంలో ఈ ఆయత్ ను అవతరింపజేశాడు.

*"ఓ విశ్వాసులరా! విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. (ఆ విషయానికి వస్తే) వారి విశ్వాసం గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారు గనక విశ్వాసపాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మసమ్మతం కారు. వారు ఈ స్త్రీలకు కూడా ధర్మసమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. తర్వాత మీరు ఈ స్త్రీలకు మహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏ మాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చుపెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు). దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి." (ఖుర్ఆన్ 60:10).*

ఈ ఆదేశం ప్రకారం ముస్లింలు తమ అవిశ్వాస భార్యలకు తలాక్ ఇచ్చేశారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) వివాహబంధంలో బహుదైవారాధకులుగా ఉన్న ఇద్దరు భార్యలు ఉండేవారు. ఆయన ఆ ఇద్దరికీ తలాక్ ఇచ్చేశారు. ఆ తర్వాత వారిలో ఒకామెను 'ముఆవియా', మరొకామెను 'సుఫ్వాన్ బిన్ ఉమయ్యా' వివాహమాడారు. హజ్రత్ తల్హా (రజి) కూడా ముష్రిక్కు అయిన తన భార్యకు విడాకులిచ్చేశారు.

*హుదైబియా ఒప్పందపు షరతుల వల్ల ఒనగూడిన ప్రయోజనాలు : -*

పైన పేర్కొన్న హుదైబియా ఒప్పందపు షరతుల్ని గనక ఎవరైనా, వాటి నేపథ్యంతో సహా అధ్యయనం చేస్తే, వారు ఇది ముస్లిములకు లభించిన ఘనవిజయంగా తలచడంలో ఏ మాత్రం సందేహానికి గురికారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఖురైషులు అప్పటివరకు ముస్లిముల ఉనికినే గుర్తించేవారు కాదు. వారిని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. ఏదో ఓ రోజున ముస్లిముల ఈ శక్తి క్షీణించి అంతమైపోతుందని తలచేవారు.

అదేకాదు, అరేబియా ద్వీపకల్పంలో ఈ ఖురైషులు ధార్మిక పురోహితులుగా, అరబ్బులకు నాయకులుగా కూడా చెలామణి అవుతున్నారు. ఈ రూపంగానైనా వారు ఇస్లామీయ సందేశ ప్రచారానికి, సాధారణ ప్రజలకు నడుమ తమ శక్తియుక్తులన్నిటినీ ధారపోసి అడ్డుతగలాలి. ఈ నేపథ్యంలో గనక దీన్ని గమనించినట్లయితే, ముస్లిముల వైపునకు కేవలం సంధి కోసం ఒగ్గిపోవడం ముస్లిముల శక్తిసామర్థ్యాలను గుర్తించినట్లే లెక్క. ఇంకా వారు ముస్లిముల శక్తిని అణచలేము అని చాటిచెప్పడం అవుతుంది.

*ఒప్పందంలోని మూడవ షరతు గురించి వివరణ : -*

ఇక ఈ ఒప్పందంలోని మూడవ షరతు వెనుక వారి స్వార్థం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఖురైషులకు ఇదివరకు ఏ నాయకత్వపు లక్షణాలు, ఏ ధార్మిక పెత్తనం అయితే లభించాయో వాటిని వారు పూర్తిగా విస్మరించి కేవలం తమ సొంత ప్రయోజనాల్నే లెక్కలోనికి తీసుకున్నారు. ఇతరులు ఏమైపోయినా వారికి పట్టేటట్లు లేదు. అంటే పూర్తి అరేబియా ద్వీపకల్పమే ఇస్లాం ధర్మం స్వీకరించినా ఖురైషులకు దాని చింత లేదు. ఆ విషయంలో వారు ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉంటామని చెప్పడం అన్నమాట. మరి ఇది ఖురైషుల ధ్యేయం ప్రకారం, వారి ఘోర పరాజయం కాకపోతే మరేమిటి? ముస్లిముల లక్ష్యం ప్రకారం, ఇది వారి ఘనవిజయం కాకపోతే మరింకేమిటి?

       ముస్లిములకు, ముస్లిం విరోధులకు నడుమ ఏ రక్తపాత యుద్ధాలైతే జరిగాయో వాటి ధ్యేయం కూడా అదే. విశ్వాసం మరియు ధర్మం విషయంలో ప్రజలకు పూర్తి స్వాతంత్ర్యం ఉండాలన్నదే కదా! అంటే తమ ఇష్ట ప్రకారం ఏ వ్యక్తి అయినా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించవచ్చు. మరెవరైనా దైవతిరస్కార వైఖరిని అవలంబించినా అవలంబించవచ్చు. ఏ శక్తి కూడా వారి ఇష్టానికి అడ్డుగా నిలబడడానికి వీలులేదు అన్నదే. ముస్లిముల ధ్యేయం, వారి ధన సంపదను కొల్లగొట్టడంగానీ, వారిని సంహరించడంగానీ, వారిని బలవంతంగా ముస్లిములుగా మార్చడంగానీ కాదు.

       ఈ ఒప్పందం ద్వారా ముస్లిములకు పైన చెప్పిన లక్ష్యం దాని అన్ని హంగులతో సహా ప్రాప్తమైపోయింది. ఇది ఒక్కొక్కప్పుడు యుద్ధం చేసి ఘనవిజయం సాధించినా లభించని లక్ష్యం అది అన్నది మీరు గ్రహించగలరు. హుదైబియా ఒప్పందం వల్ల ఒనగూడిన స్వాతంత్ర్యం కారణంగా, ముస్లిములు ధర్మప్రచార రంగాల్లో ఎనలేని గొప్ప విజయాన్నీ పొందగలిగారు. ముస్లిముల సైన్యం సంఖ్య ఈ ఒప్పందానికి పూర్వం మూడు వేల కంటే మించి ఉండలేదు. అది కేవలం రెండు సంవత్సరాల్లోనే మక్కా విజయం నాటికి పది వేలకు చేరిపోయింది.

*ఒప్పందంలోని రెండవ షరతు గురించి వివరణ : -*

ఒప్పందంలోని రెండవ షరతు కూడా ఈ ఘనవిజయానికి సంబంధించిన ఓ భాగమే. ఎందుకంటే యుద్ధానికి కాలుదువ్వింది ముస్లిములు కాదు, ముష్రిక్కులే. దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

*"మొదటిసారిగా వారే మీతో యుద్ధానికి తలపడ్డారు."*

       ముస్లిముల సైనిక కవాతులు, సైనిక చర్యల విషయానికి వస్తే, ఖురైషులు తమ మొండి ధైర్యం, గర్వాలతో ప్రజలను అడ్డుకోకుండా ఉండాలని, సమానత్వం ప్రాతిపదికపై వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని చెప్పడం. అంటే, ప్రతి వర్గం తన తన మార్గాన్ని అనుసరించడానికి స్వాతంత్ర్యం పొంది ఉందన్న మాటే.

       ఇప్పుడు ఆలోచించండి! పది సంవత్సరాల వరకు యుద్ధం జరగకుండా చూడడం అనే ఒప్పందం, వారు తమ గర్వాన్ని వదిలి అల్లాహ్ మార్గంలో అడ్డు నిలువకుండా ఉంటామని చేసిన ఒప్పందమే కదా! యుద్ధాన్ని ప్రారంభించిన వర్గం బలహీనపడిపోయి తన ధ్యేయంలో అపజయం పొందిందనడానికి ఇది ఓ నిదర్శనం కాదా?

*ఒప్పందంలోని మొదటి షరతు గురించి వివరణ : -*

ఇక మొదటి షరతు గురించి ఆలోచిస్తే, ఆ షరతులో ముస్లిములకు అపజయం కంటే వారి విజయమే కానవస్తోంది. అది ఎలాగంటారా? ఈ షరతు వాస్తవంగా ఖురైషులు కాబా గృహంలో ముస్లిములు ప్రవేశించకుండా విధించిన నిషేధాన్ని అంతం చేస్తున్నాము అని చెప్పి చేయించిన ప్రకటనే. అయితే ఆ షరతులో ఖురైషీయులకు సంతృప్తి కలిగించిన విషయం, ఈ సంవత్సరం వారు ముస్లిములను కాబా గృహంలోనికి అడుగు పెట్టకుండా ఉండడంలో కృతకృత్యులవడం. కాని ఇది ఓ తాత్కాలికమైన మరియు విలువలేని ప్రయోజనం మాత్రమే.

ఆ తరువాత దానికి తోడు ఈ ఒప్పందంలో ఖురైషులు, ముస్లిములకు మూడు రాయితీలనిచ్చి కేవలం ఒక రాయితీ మాత్రమే పొందగలిగారు. అది ఆ ఒప్పందం నాలుగవ షరతులో ఉన్న రాయితీ. కాని ఆ రాయితీ కూడా అంత విలువలేని మామూలు రకం రాయితీ మాత్రమే. దీనివల్ల ముస్లిములకు ఎలాంటి నష్టం వాటిల్లబోదు. ఎందుకంటే ఓ ముస్లిం ముస్లింగా ఉన్నంత మట్టుకు, మదీనా నుండి దైవప్రవక్త (సల్లం)ను వదిలి పారిపోయి మక్కాకు వచ్చే ప్రసక్తే లేదు, అతను ధర్మభ్రష్టుడు అయితే తప్ప. ఒకవేళ అతను ధర్మబ్రష్టుడు అయిపోతే, ముస్లిములకు అతని అవసరమే ఉండదు. అతడు తప్పకుండా వారిని వదిలి వెళ్ళవలసిందే.

*"ఎవరైతే మమ్మల్ని వదలి ముష్రిక్కుల వైపునకు పారిపోతాడో అతణ్ణి అల్లాహ్ సర్వనాశనం చేసినట్లే"* అని దైవప్రవక్త (సల్లం) ఈ సందర్భంలోనే చెప్పి ఉండడం గమనార్హం.

ఇక మిగిలిపోయింది, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి మక్కాలో ఉంటున్నవారు, ఇంకా కొంతమంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారి కోసం మదీనా నగరమే కాకుండా అరేబియాలోని ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇదివరకు మదీనా ప్రజలు ఇస్లాం గురించి ఇంకా విని ఉండని కాలంలో సైతం, మక్కావాసుల ఆగడాలను భరించలేక అబీసీనియా ప్రాంతానికి వెళ్ళిపోలేదా? అలాగే ఈ ముస్లిముల కోసం అరేబియాలో ఏ ప్రాంతం అయినా చోటు కల్పించక మానదు. ఈ విషయమే దైవప్రవక్త (సల్లం) గారి ఈ ప్రవచనంలో చెప్పబడింది. ↓

*"వారికి చెందిన ఏ వ్యక్తి అయినా మన దగ్గరకు వస్తే, అతని కోసం అల్లాహ్ మార్గాన్ని చూపకపోడు."*

ఇలాంటి షరతులు పెట్టి ఖురైషులు ఏదో గౌరవాన్ని పొందారని అగుపడుతున్నప్పటికీ, వారు పొందిన రాయితీలన్నీ వారి మానసిక ఆందోళన, భయం, ఒత్తిడి, అపజయాలకే నిదర్శనాలు.

విగ్రహారాధక సమాజం గురించి భయం ఆవరించిందని, వారు కట్టుకున్న గుజ్జనగూడు కాస్తా కూలిపోతోందని భావించడమే. మరోవంక మహాప్రవక్త (సల్లం) ఏ విశాల హృదయంతో ఈ ఒప్పందం షరతుల్లోని నాలుగవ షరతు ఒప్పుకోవడానికి కారణం, తన సమాజం స్థయిర్యంపై, దృఢత్వంపై ఉన్న పూర్తి విశ్వాసమే. ఈ షరతును ఆయన (సల్లం) ఏ భయం వల్లనో ఒప్పుకున్నది కాదు.

*ముస్లింలకు కలిగిన మనస్తాపం, హజ్రత్ ఉమర్ (రజి)గారి వాగ్వివాదం : -*

హుదైబియా ఒప్పందంలోని షరతుల వాస్తవికత ఇది. ఈ షరతుల్లో రెండు విషయాలు మాత్రం ముస్లింలను మనస్తాపానికి గురిచేశాయి.

*మొదటిది :→* దైవప్రవక్త (సల్లం) వారితో, *"మనం కాబా గృహానికి వెళ్ళి దాని తవాఫ్ చేస్తాము"* అని చెప్పిన విషయం. అయితే ఆయన (సల్లం) తవాఫ్ చేయకుండానే వెనక్కు మరలుతున్నారు. 

*రెండవది :→* ఆయన (సల్లం) అల్లాహ్ ప్రవక్త. సత్యం ఆయన (సల్లం)కు తోడుగా ఉంది. దానితోపాటు అల్లాహ్ తన ధర్మానికి ప్రాబల్యం కలిగిస్తానని మాట కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఏ కారణం వలన దైవప్రవక్త (సల్లం) ఖురైషుల ఒత్తిడిని స్వీకరించవలసివచ్చింది? వారు ప్రవేశపెట్టిన షరతులపైనే ఎందుకు ఒప్పందం చేసుకోవలసి వచ్చింది?

ఈ రెండు విషయాలు రకరకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటు ముస్లింల భావోద్రేకాలు దెబ్బతినడం వలన వారు సంధి షరతులను లోతుగా తరచి చూడ్డానికి బదులు మనస్తాపం, దుఃఖంతో తల్లడిల్లిపోతున్నారు. బహుశా, అందరికంటే ఈ మనస్తాపానికి గురైన వారు 'హజ్రత్ ఉమర్ (రజి)' గారేనేమో.

_(↑ ఈ వృత్తాంతాన్ని, ఇస్లాం చరిత్ర - 291వ భాగంలో మనం చదువుకున్నాం.)_

*'అబూ బసీర్' దైన్యస్థితి : -*

హుదైబియా ఒప్పందంలోని షరతులు ముస్లిములకు మింగుడు పడటం లేదు. ఈ సంవత్సరం ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళటం వారి హృదయాల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. అబూ జందల్ దైన్యస్థితిని చూసి కూడా, తాము ఆయనకు సహాయపడలేక పోవటంతో వారి అహం దెబ్బతింది. ఈ సంఘటనలన్నీ వారి మనసుల్లో మెదలుతుండగానే మరో సంఘటన జరిగింది. వారి గాయాలపై మళ్ళీ కారం చల్లినట్లయింది.

*ఇందులోని వివరణను In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment