292

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 292*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 207*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 9*

*'అబూ జందల్'ను అప్పగించడం : -*

ఒప్పంద పత్రం రాయడం ఇంకా పూర్తి కానేలేదు. అంతలో ఒక యువకుడు మక్కా నుంచి పారిపోయి రొప్పుతూ ముస్లింల దగ్గరకి వచ్చాడు. కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. వాడిపోయిన అతని ముఖంలో దైన్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ పీడితుడు ఎవరో కాదు, ఖురైషుల తరఫున సంధి కోసం రాయబారిగా వచ్చిన సుహైల్ బిన్ అమ్రూ కుమారుడే. ఇతని పేరు 'అబూ జందల్'. ఇస్లాం స్వీకరించిన నేరానికి అతని జీవితం మక్కాలో దుర్భరమైపోయింది. ఖురైషీయుల చేతుల్లో ఎన్ని బాధలు పడ్డాడో ఈ అభాగ్య జీవి! వారి నుండి తప్పించుకోవడానికి మరెన్ని తిప్పలు పడవలసి వచ్చిందో!!

*"ముస్లింలారా! నేను ఇస్లాం స్వీకరించాను. మదీనాకు వలసపోతుంటే ఖురైషులు నన్ను బంధించి ఉంచారు. ఎలాగో వారి నుంచి తప్పించుకొని వచ్చాను. ఇకపై నేను ముస్లింలతో కలసి ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను కూడా మీతో పాటు మదీనా తీసుకువెళ్ళండి."* అని దైవప్రవక్త (సల్లం)ను, ముస్లింలను ఉద్దేశించి ప్రాధేయపడసాగాడు అబూ జందల్.

ఆ దృశ్యం చూసి తండ్రి హృదయం ఎంతగానో బాధపడింది. అయినా గుండె రాయి చేసుకొని కుమారుని వంక గుర్రుగా చూశాడు సుహైల్. తర్వాత దైవప్రవక్త (సల్లం)ను ఉద్దేశించి, *"ముహమ్మద్ (సల్లం)! వీడు నా కొడుకు. నేను వీడి సంరక్షకుడ్ని. మన మధ్య ఇప్పుడే ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నేను నా కుమారుణ్ణి నా వెంట మక్కాకు తీసుకువెళ్తాను. వీడిని మీరు నాకు అప్పగించాలి."* అన్నాడు.

*"ఇంకా మేము ఈ సంధిపత్రాన్ని రాయటమే పూర్తి చేయలేదు కదా!"* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"సంధిపత్రం రాయడం పూర్తికాకపోయినా సంధిషరతులు మన మధ్య ముందే నిర్ణయమైపోయాయి."* అన్నాడు సుహైల్.

*"సరే, నీవు ఇతన్ని నా కోసమైనా వదిలిపెట్టు."* అని కోరారు మహాప్రవక్త (సల్లం).

*"లేదు. నేను వీడిని మీ కోసమైనా వదిలేది లేదు."* అన్నాడు సుహైల్.

*"లేదు. అలా అనకు. అతణ్ణి వదిలేయి, నా మాట విను."* అన్నారు తిరిగి మహాప్రవక్త (సల్లం).

*"అయితే నేను మీతో ఎలాంటి ఒప్పందం చేసేదే లేదు."* అన్నాడు సుహైల్ కటువుగా.

మహాప్రవక్త (సల్లం) ఎంతో అనునయంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కాని సుహైల్ మొండికేశాడు. దైవప్రవక్త (సల్లం) హృదయం బాధగా మూలిగింది. కాసేపు తల వంచుకొని మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత ఆయన (సల్లం), అబూ జందల్ వైపు చూస్తూ, *"అబూ జందల్! సహనం వహించు. దీన్ని పుణ్యకార్యంగా భావించు. అల్లాహ్ నీకోసం, నీ వెంట ఉన్నటువంటి బలహీన ముస్లింల కోసం ఏదైనా మార్గం చూపకపోడు. మీ కష్టాలను తీర్చకమానడు. మేము ఖురైషులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మేము వారికి, వారు మాకు దైవాన్ని సాక్షిగా చేసి ప్రమాణం చేసుకున్నాము. అందుకని మేము ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లఘించలేము."* అని అన్నారు బాధగా.

ఆ తర్వాత ఒప్పంద నియమాల నమోదు కార్యక్రమం ముగిసింది. ఈ సమయంలో సుహైల్ ఎలాంటి అభ్యంతరాన్నీ వ్యక్తం చేయలేదు. అక్కడున్న వారందరికీ ఒప్పంద పత్రం చదివి వినిపించబడింది. ఇరుపక్షాలవారు ఆ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దానికి సాక్షుల్ని కూడా నియమించడం జరిగింది. ఒప్పంద షరతులు ముస్లింలను కించపరిచినట్లుగా ఉన్నప్పటికీ ముస్లింలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. తమ అసంతృప్తిని లోలోపలే దిగమింగారు.

ఇక ఆ తర్వాత సుహైల్, తన కుమారుడ్ని గట్టిగా పట్టుకొని సంకెళ్ళతో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళసాగాడు.

ఆ సమయంలో అబూ జందల్, *"ముస్లిములారా! నేను తిరిగి ముష్రిక్కుల వద్దకు వెళ్ళాలా? వీరు నా ధర్మం గురించి నన్ను బాధలకు గురి చేస్తారు."* అని పెద్దగా అరవనారంభించాడు.

ఇది చూసిన హజ్రత్ ఉమర్ (రజి) ఒక్క దూకులో అబూ జందల్ దగ్గరకు వచ్చి చేరారు. అబూ జందల్ నడుస్తూ ఉండగా ఆయన (రజి) అతని వెంటే నడుస్తూ, *"అబూ జందల్! సహనం వహించు. వీరు ముష్రిక్కులు. వీరి రక్తం, కుక్క రక్తం"* అంటూ తన కరవాలం పిడిని అబూ జందల్ చేతికి దగ్గరగా చేస్తూ పోతున్నారు. బహుశా అబూ జందల్ ఈ కరవాలం తీసుకొని తన తండ్రిని నరికేస్తారేమో అని ఉద్దేశ్యంతో. కాని ఆయన తన తండ్రిని చంపే ధైర్యం చేయలేదు. అలా ఆ ఒప్పందం అమలులోకి వచ్చేసింది.

ఒప్పంద పత్రం పూర్తి అయిన తరువాత ఆ ఒప్పందం ప్రకారం 'బనూ ఖుజాఅ' తెగ దైవప్రవక్త (సల్లం)గారి పక్షాన చేరినట్లయింది. వీరు వాస్తవంగా అబ్దుల్ ముత్తలిబ్ కాలం నుండే 'బనూ హాషిమ్'కు మిత్రపక్షంగా ఉంటూ ఉండేవారు. మరోవంక 'బనూ బక్ర్' తెగవారు ఖురైషుల పక్షాన చేరిపోయారు.

*ఉమ్రా సంకల్పం నుండి బయటపడడానికి చేసిన ఖుర్బానీ మరియు శిరోముండనం : -*

దైవప్రవక్త (సల్లం), హుదైబియా ఒప్పంద పత్రాన్ని పూర్తి చేసి సహాబా (రజి)తో, *"ముస్లిములరా! ఖురైషులతో మనకు ఒప్పందం కుదిరింది. కనుక ఇక మీ జంతువులను ఖుర్బానీ చేసేయండి. శిరోముండనం చేయించుకోండి లేదా వెంట్రుకలు కత్తిరించుకోండి. ఇహ్రామ్ దీక్షను విరమించండి. ఇక మనం మన ఇళ్ళకు వెళ్ళిపోదాం."* అని ప్రకటించారు.

కాని ఏ ఒక్కడూ తన స్థానం నుంచి లేవలేదు. ఆయన (సల్లం) ఈ విషయాన్ని మూడు సార్లు అన్నారు. అయినా ఎవ్వరూ లేచి నిలబడలేదు. అప్పుడు మహాప్రవక్త (సల్లం) కాస్త అసహనంతో గుడారంలోకి వెళ్ళిపోయారు. ముఖకవళికల్ని బట్టి ఆయన (సల్లం) ఆందోళనలో ఉన్నారని పసిగట్టిన ఆయన భార్య హజ్రత్ ఉమ్మె సల్మా (రజి), *"ఏమయింది దైవప్రవక్తా! ఎందుకలా ఉన్నారు?"* అని అడిగారు.

*"ఈరోజు ప్రజలకు ఏమయిందో, నా ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా లేరు. నా ప్రజలు నా మాటను తిరస్కరించారు."* అని దైవప్రవక్త (సల్లం) బదులిచ్చారు.

అప్పుడు ఉమ్మె సల్మా (రజి), ఆయన (సల్లం)కు ధైర్యం చెబుతూ, *"దైవప్రవక్తా! మీ ఆచరణలోనే వారికి గొప్ప ఆదర్శం ఉంది. వారికి అందరికంటే గొప్ప ఆదర్శమూర్తి మీరు. ముందు మీరు బయటికి వెళ్ళి మీ జంతువులను ఖుర్బానీ ఇవ్వండి. మీ తలవెంట్రుకలు గొరిగించుకోండి. మీ ఆదర్శాన్ని వారు తప్పకుండా అనుసరిస్తారని నాకు నమ్మకం ఉంది."* అని సలహా ఇచ్చారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) బయటకు వచ్చి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా అలానే చేశారు. అంటే హదీ జంతువును జిబహ్ చేశారు. మంగలిని పిలిపించి తల గొరిగించుకున్నారు.

దైవప్రవక్త (సల్లం) ఇలా చేస్తుండగా చూసి సహచరులు కూడా లేచి తమ తమ హదీ జంతువుల్ని జిబహ్ చేశారు. పరస్పరం ఒకరి తలను మరొకరు గొరుగుకున్నారు. ఆ పరిస్థితి, వారికి కలిగిన మనస్తాపం వల్ల ఒకరిని ఒకరు పొడుచుకుంటారేమో అనేలా ఉంది. ఆ సందర్భంలో ఆవును, ఒంటెను ఏడుగురి తరఫున జిబహ్ చేయడం జరిగింది.

దైవప్రవక్త (సల్లం), అబూ జహల్ ఒంటెను జిబహ్ చేశారు. దాని ముక్కున ఓ వెండి ముక్కెర ఉంది. దాన్ని ఇలా జిబహ్ చేయడానికి కారణం, ముష్రిక్కులు కోపంతో తల్లడిల్లిపోవాలన్నదే.

ఆ తరువాత మహనీయ ముహమ్మద్ (సల్లం), తల గొరిగించుకున్న వారి మన్నింపు కోసం మూడు సార్లు దుఆ చేశారు. కత్తెరతో వెంట్రుకలు కత్తిరించుకున్న వారి కోసం ఒక్కమారే దుఆ చేశారు.

*మదీనాకు తిరుగు ప్రయాణం : -*

ఆ తరువాత అందరూ హదీ పశువుల్ని జిబహ్‌ చేసి మదీనాకు తిరుగు ప్రయాణమయ్యారు.

ఖురైషీయులు విధించిన దారుణ షరతులు దైవప్రవక్త (సల్లం) ఎందుకు ఆమోదించారో ఎంత ఆలోచించినా సహాబా (రజి)లతో పాటు ఉమర్ (రజి)కి అర్థం కాలేదు. ఈ విషయాన్ని గురించి ఉమర్ (రజి) తిరుగు ప్రయాణంలో కూడా దైవప్రవక్త (సల్లం)ను అనేకసార్లు అడిగారు. కాని దైవప్రవక్త (సల్లం) ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. దాంతో ఉమర్ (రజి)కు దుఃఖం పొరలివచ్చింది. దైవప్రవక్త (సల్లం)ను విసిగించానే అని ఆయన (రజి) లోలోన బాధపడసాగారు. కాస్సేపటికి హఠాత్తుగా వెనుక నుండి *"ఉమర్! దైవప్రవక్త (సల్లం) నిన్ను పిలుస్తున్నారు."* అనే పిలుపు వినవచ్చింది.

దైవప్రవక్త (సల్లం) పిలుస్తున్నారనగానే ఉమర్ (రజి) గుండెలు దడదడలాడాయి. కొంపదీసి తాను చేసిన తప్పుకు దివ్యావిష్కృతి ద్వారా దైవాగ్రహం విరుచుకుపడలేదు కదా అన్న అనుమానం వచ్చి ఆయన (రజి) ఓ క్షణం పాటు నిలువునా కంపించిపోయారు. అలా భయపడుతూనే ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళారు. కాని అక్కడ చూస్తే దైవప్రవక్త (సల్లం) దివ్యమోము పూర్ణచంద్రుడిలా వెలిగిపోతోంది. పెదవులపై దరహాసం తొణికిసలాడుతోంది.

*"ఉమర్! ఇప్పుడిప్పుడే నాపై ఖుర్ఆన్ అధ్యాయం ఒకటి అవతరించింది. సుమధుర వాణి! హృదయాన్ని ఆనందసాగరంలో ఓలలాడించే దివ్య సందేశం! దాని ముందు ఎంత పెద్ద ప్రాపంచిక సంతోషమైనా బలాదూరే. ఇదిగో విను"* అంటూ దివ్య ఖుర్ఆన్‌ లోని 48:1-6 వరకు గల సూక్తులు వినిపించారు.

_(మరింత వివరణ కోసం చదవండి దివ్య ఖుర్ఆన్‌ 48:1-6 మరియు 48:18-27.)_

ఈ సూక్తులు విని ముస్లింలు పరమ సంతోషంతో పొంగిపోయారు. ఇక ఉమర్ (రజి)గారి ఆనందం అవధులు దాటింది. వెంటనే ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం)ను ఉద్దేశించి, *"దైవప్రవక్తా! ఇది విజయమా?"* అని అడగగా; ఆయన (సల్లం), *"అవును"* అని బదులిచ్చారు.

అప్పుడుగాని హజ్రత్ ఉమర్ (రజి) మనస్సు శాంతించలేదు. ఆయన వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికిగాని ఉమర్ (రజి)గారికి తన తప్పిదమేమిటో తెలియలేదు. ఆయనకు ఎంతో సిగ్గేసింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, *"నేను ఆ రోజు చేసిన పొరపాటుకు దైవప్రవక్త (సల్లం)తో సంవాదానికి దిగిన తీరుకు భయపడి అప్పటి నుండి నేనెన్నో పుణ్యకార్యాలు చేసుకుంటూ పోతున్నాను. దానధర్మాలు చేస్తూపోయాను. నమాజులు చేస్తూపోయాను. బానిసలను స్వతంత్రులుగా చేశాను. ఇప్పుడు నాకు మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది."*

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment