291

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 291*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 206*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 8*

*సంధి కుదుర్చుకునేందుకు ఖురైషీయులు తరఫు నుండి ముస్లిములు వద్దకు రాయబారిగా వచ్చిన సుహైల్ బిన్ అమ్రూ : -*

*హుదైబియా శాంతి ఒప్పందం : -*

*"మహాశయా! నేను మీ దగ్గరకు చర్చలు జరపడానికి వచ్చాను. కాని ఇక్కడ చూస్తే మీ అనుచరులు యుద్ధసన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అక్కడేమో ఖురైషీయులు, ఈ సంవత్సరం మిమ్మల్ని మక్కాలో ప్రవేశించనీయమని తీవ్రంగా ప్రతిన బూనారు. నేను కొన్ని షరతులు తీసుకొచ్చాను. వీటిలో మన ఉభయపక్షాల శ్రేయస్సు ఉంది. వీటిని మీరు ఒప్పుకుంటే ఓ భయంకర యుద్ధాన్ని నివారించినవారవుతారు. అనేకమంది అమాయకుల ప్రాణాలు దక్కుతాయి. అంతటి మహత్కార్యం సాధించిన ఘనత కూడా మీకు లభిస్తుంది."* అన్నాడు సుహైల్.

*"సరే, చెప్పండి. ఏమిటా షరతులు?"* అడిగారు దైవప్రవక్త (సల్లం).

అప్పుడు సుహైల్ బిన్ అమ్రూ కింది షరతులను వినిపించారు....; ↓

*1 ―» ముస్లింలు ఈ సంవత్సరం మక్కాలో ప్రవేశించకుండానే వెనక్కు మళ్ళిపోతారు. మరుసటి సంవత్సరం ముస్లింలు మక్కాకు వచ్చి ఉమ్రా యాత్ర చేసుకునే అనుమతి ఉంటుంది. అయితే అప్పుడు ముస్లింలు మక్కాలో మూడు రోజులు మాత్రమే ఉంటారు. అప్పుడు ఖురైషులు మక్కా ఖాళీ చేస్తారు. మూడు రోజుల వరకు ముస్లింలు స్వేచ్ఛగా ఉమ్రా చేసుకోవచ్చు. మరుసటి సంవత్సరం ఉమ్రా యాత్రకు వచ్చినప్పుడు ముస్లింలు తమ సాంప్రదాయిక ఖడ్గాలు తప్పితే ఇతర ఆయుధాలేవీ వెంట తీసుకురాకూడదు. ఆ ఖడ్గాలు కూడా ఒరల్లోనే అణిగి ఉండాలి.*

*2 ―» పది సంవత్సరాల వరకు ఉభయ వర్గాలు యుద్ధం జోలికి పోరాదు. ఈ కాలంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఏ ఒక్కడూ మరొకనిపై చెయ్యి ఎత్తడానికి వీల్లేదు.*

*3 ―» ఎవరైనా ముహమ్మద్ (సల్లం)తో సంధి చేసుకుంటే చేసుకోవచ్చు. అలాగే మరెవరైనా ఖురైషులతో సంధి చేసుకుంటే చేసుకోవచ్చు. ఏ తెగ అయినా ఓ వర్గంలో చేరిపోతే అది ఆ వర్గానికి చెందినదిగానే భావించబడుతుంది. కాబట్టి అలాంటి ఏ తెగపైనైనా దౌర్జన్యం జరిగితే అది ఆ వర్గంపై దౌర్జన్యం చేసినట్లే అవుతుంది.*

*4 ―» ఖురైషులకు చెందిన ఏ వ్యక్తి అయినా అతని సంరక్షకుని అనుమతి లేకుండా - అంటే పారిపోయి ముహమ్మద్ (సల్లం) వద్దకు వచ్చి చేరితే ముహమ్మద్ (సల్లం), అతనిని ఖురైషులకు అప్పజెప్పవలసి ఉంటుంది. కాని ముహమ్మద్ (సల్లం) అనుచరుల్లో ఎవరైనా - రక్షణ నిమిత్తం పారిపోయి - ఖురైషుల వద్దకు వచ్చి చేరితే ఖురైషులు అతన్ని ముహమ్మద్ (సల్లం)కు అప్పజెప్పరు.*

*"ఇవీ ఖురైషీయుల సంధి షరతులు. ఇక మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. మీ వివేచనా నిర్ణయాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది."* అన్నాడు సుహైల్.

ఈ ఒప్పందంలోని షరతులు ఏకపక్షంగా ఉన్నట్లు ముస్లింలకు అనిపించింది. వారు దీని పట్ల చాలా అసంతృప్తిని వెలిబుచ్చారు. అదీగాక ముస్లింలు ఏ ఉద్దేశంతో మక్కాకు బయలుదేరారో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు.

దైవప్రవక్త (సల్లం) ఈ షరతులన్నిటిని అంగీకరించి సంధి పత్రం రాయమని హజ్రత్ అలీ (రజి)ని ఆదేశించారు.

దైవప్రవక్త (స) తమ ఆశలకు భిన్నంగా ఇలాంటి అన్యాయమైన షరతుల్ని ఆమోదిస్తారని ముస్లింలు ఊహించనైనా ఊహించలేకపోయారు. వారు విస్తుపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆ తర్వాత వారిలో ఆవేశం, ఆత్మాభిమానాలు పెల్లుబికాయి.

*"దైవప్రవక్త (సల్లం) ఇలాంటి దారుణమైన షరతుల్ని ఎందుకు ఒప్పుకున్నట్లు? ఒకవేళ నచ్చజెప్పినా ఖురైషీయులు వినకుండా మొండికేసి మనల్ని కాబాదర్శనం చేసుకోనీయకుండా నిరోధిస్తే, వారి మత్తు మంకుతనాలను వదలగొట్టగల శక్తియుక్తులు మనకు లేవా? వాళ్ళు మనల్ని మక్కాలో ప్రవేశించనీయకుండా ఎన్నటికి అడ్డుకోలేరు."* అని చెప్పుకున్నారు వారు తమలోతాము.

*ముస్లింలకు కలిగిన మనస్తాపం, హజ్రత్ ఉమర్ (రజి)గారి వాగ్వివాదం : -*

హుదైబియా ఒప్పందంలోని షరతుల వాస్తవికతను మనం రాబోయే పుటల్లో తెలుసుకుందాం.

ఈ షరతుల్లో రెండు విషయాలు మాత్రం ముస్లింలను మనస్తాపానికి గురిచేశాయి.

*మొదటిది :→* దైవప్రవక్త (సల్లం) వారితో, *"మనం కాబా గృహానికి వెళ్ళి దాని తవాఫ్ చేస్తాము"* అని చెప్పిన విషయం. అయితే ఆయన (సల్లం) తవాఫ్ చేయకుండానే వెనక్కు మరలుతున్నారు. 

*రెండవది :→* ఆయన (సల్లం) అల్లాహ్ ప్రవక్త. సత్యం ఆయన (సల్లం)కు తోడుగా ఉంది. దానితోపాటు అల్లాహ్ తన ధర్మానికి ప్రాబల్యం కలిగిస్తానని మాట కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఏ కారణం వలన దైవప్రవక్త (సల్లం) ఖురైషుల ఒత్తిడిని స్వీకరించవలసివచ్చింది? వారు ప్రవేశపెట్టిన షరతులపైనే ఎందుకు ఒప్పందం చేసుకోవలసి వచ్చింది?

ఈ రెండు విషయాలు రకరకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటు ముస్లింల భావోద్రేకాలు దెబ్బతినడం వలన వారు సంధి షరతులను లోతుగా తరచి చూడ్డానికి బదులు మనస్తాపం, దుఃఖంతో తల్లడిల్లిపోతున్నారు. బహుశా, అందరికంటే ఈ మనస్తాపానికి గురైన వారు 'హజ్రత్ ఉమర్ (రజి)' గారేనేమో.

ఒప్పందంలోని షరతులను వినగానే ఉమర్ (రజి) ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన (రజి) ఆవేశం అణచుకోలేక వెంటనే దైవప్రవక్త (సల్లం) సన్నిధిలో హాజరయ్యారు.

*"ఓ దైవప్రవక్తా! మనం సత్యంపై లేమా? వారు అసత్యవాదులు కారా? చెప్పండి"* అని అడిగేశారు ఉమర్ (రజి).

దానికి దైవప్రవక్త (సల్లం), *"తప్పకుండా"* అని జవాబు ఇచ్చారు.

ఉమర్ (రజి) తిరిగి, *"మన హతులు స్వర్గస్థులు కాలేదా? వారి హతులు నరకంలో పడలేదా?"* అని అడిగారు.

*"అవును, అది యదార్థం."* అని బదులిచ్చారు మహాప్రవక్త (సల్లం).

దీనికి ఉమర్ (రజి), *"మరి మనం మన ధర్మం విషయంలో ఒత్తిడికి ఎందుకు లోనుకావలసి వచ్చింది? అల్లాహ్ కూడా మా నడుమన ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వనిదే మనం ఎందుకు వెనకకు మరలాలి?"* అని బాధపడుతూ అడిగారు.

*"ఓ ఖత్తాబ్ కుమారుడా? నేను అల్లాహ్ ప్రవక్తను. నేను ఆయనకు ఎన్నడూ అవిధేయతకు చూపను. ఆయన నాకు సహాయాన్ని సమకూరుస్తాడు. నన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు."* అన్నారు మహాప్రవక్త (సల్లం).

*"అయితే, మీరు బైతుల్లాహ్ వద్దకు వెళతానని, దాని తవాఫ్ చేస్తానని మాతో అనలేదా?"* అన్నారు ఉమర్ (రజి).

*"అవును అన్నాను. కాని నేను ఈ సంవత్సరమే అక్కడికి వెళతానని అన్నానా?"* అడిగారు మహాప్రవక్త (సల్లం).

*"లేదు"* అని జవాబిచ్చారు ఉమర్ (రజి).

*"అయితే మొత్తానికి మీరు బైతుల్లాహ్ దగ్గరకు రాగలరూ, దాని తవాఫ్ కూడా చేయగలరు."* అన్నారు మహాప్రవక్త (సల్లం).

అప్పటికీ హజ్రత్ ఉమర్ (రజి) కోపం చల్లారలేదు. ఆయన (రజి) అక్కడ్నుంచి లేచి నేరుగా 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' దగ్గరకు వెళ్ళారు. అబూ బక్ర్ (రజి)తో దైవప్రవక్త (సల్లం)తో వాదించినట్లుగానే వాదించారు ఉమర్ (రజి). హజ్రత్ అబూ బక్ర్ (రజి) కూడా మహాప్రవక్త (సల్లం) గారిచ్చిన సమాధానమే ఇస్తూ దానికి అదనంగా, *"ఓ ఉమర్! ఆందోళన చెందకు. ముహమ్మద్ (సల్లం), అల్లాహ్ సందేశహరుడు. ఆయన (సల్లం) ఏది చేసినా అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే చేస్తారు. కాస్త ఓపిక పట్టు. అల్లాహ్ మనకే విజయం చేకూర్చుతాడని ఆశించు. అల్లాహ్ సాక్షిగా! ఆయన (సల్లం) సత్యంపైన్నే ఉన్నారు గనుక నీ చివరి శ్వాస వరకు ఆయన (సల్లం)నే అనుసరిస్తూ ఉండు."* అని అన్నారు.

హజ్రత్ ఉమర్ (రజి) కకావికలమైన మనసుతో అక్కడ్నుంచి వెళ్ళారు.

ఇక ఆ తర్వాత ఒప్పందాన్ని లిఖించమని మహాప్రవక్త (సల్లం), హజ్రత్ అలీ (రజి)ని పురమాయించారు. దైవప్రవక్త (సల్లం) ఆదేశాన్ని శిరసావహిస్తూ హజ్రత్ అలీ (రజి) సంధి పత్రం రాయడానికి సిద్ధమయ్యారు.

ప్రవక్త (సల్లం), అలీ (రజి)ని ఉద్దేశిస్తూ, *"అలీ! ఆ పత్రం ప్రారంభంలో 'బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను)' అని వ్రాయి."* అని అన్నారు.

దానికి సుహైల్ అభ్యంతరం చెబుతూ, *"ఆగండి! అలాంటి పదాలు రాయడం మాకు అలవాటు లేదు. ఈ 'రహ్మాన్' ఎవరో, 'రహీమ్' ఎవరో మాకు తెలీదు. మా దగ్గర ఆనవాయితీగా వస్తున్న 'బిస్మికల్లాహుమ్మా (ఓ అల్లాహ్! నీ పేరుతో)' అని మాత్రమే వ్రాయండి."* అన్నాడు.

దైవప్రవక్త (సల్లం), సుహైల్ అభ్యంతరాన్ని అంగీకరించారు. అతను అన్న ప్రకారమే అలీ (రజి) చేత ప్రారంభ వచనం రాయించారు.

అది రాసిన తరువాత తిరిగి దైవప్రవక్త (సల్లం), అలీ (రజి)కి తాకీదు చేస్తూ, ఇలా రాయమని చెప్పనారంభించారు.

*"దైవప్రవక్త అగు ముహమ్మద్ (సల్లం) మక్కా వాసులతో చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం...."*

దానిపై సుహైల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తూ, *"మీకూ - మాకూ మధ్య ఉన్న తగువుకు మూలం అసలు దైవప్రవక్త పదవే కదా! మిమ్మల్ని దైవప్రవక్తగా మేము అంగీకరించినట్లయితే ఈ గోడవంతా ఎందుకు? మీతో యుద్ధాలేందుకు? ఉమ్రా యాత్ర చేసుకునేందుకు మక్కాలోకి రానీయకుండా మిమ్మల్ని ఆపడమెందుకు? 'దైవప్రవక్త అగు ముహమ్మద్' బదులు 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ (అబ్దుల్లాహ్ కుమారుడగు ముహమ్మద్)' అని మాత్రమే రాయించండి."* అని అన్నాడు.

దీనికి దైవప్రవక్త (సల్లం), *"మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అల్లాహ్ ప్రవక్తనే."* అంటూ, హజ్రత్ అలీ (రజి)కు 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్'యే రాయమని, అల్లాహ్ ప్రవక్త అనే పదాన్ని తొలగించమని ఆదేశించారు.

'దైవప్రవక్త ముహమ్మద్' అనే పదాలను తన స్వహస్తాలతో కొట్టివేయడానికి అలీ (రజి) నిరాకరించారు.

అపుడు ప్రవక్త (సల్లం), అలీ (రజి)తో, *"సరే, ఆ పదాలు ఎక్కడ ఉన్నాయో చూపించు."* అని అడిగారు.

అలీ (రజి) ఆ పదాలను చూపించగా, మహాప్రవక్త (సల్లం) తన స్వహస్తంతో వాటిని కొట్టివేసి, వాటికి బదులు 'అబ్దుల్లాహ్ కుమారుడగు ముహమ్మద్' అని వ్రాయించారు. ఆ తరువాత ఆ ఒడంబడికలోని షరతులు లిఖించబడ్డాయి.

*'అబూ జందల్'ను అప్పగించడం : -*

ఒప్పంద పత్రం రాయడం ఇంకా పూర్తి కానేలేదు. అంతలో ఒక యువకుడు మక్కా నుంచి పారిపోయి రొప్పుతూ ముస్లింల దగ్గరకి వచ్చాడు. కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. వాడిపోయిన అతని ముఖంలో దైన్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ పీడితుడు ఎవరో కాదు, ఖురైషుల తరఫున సంధి కోసం రాయబారిగా వచ్చిన సుహైల్ బిన్ అమ్రూ కుమారుడే. ఇతని పేరు 'అబూ జందల్'. ఇస్లాం స్వీకరించిన నేరానికి అతని జీవితం మక్కాలో దుర్భరమైపోయింది. ఖురైషీయుల చేతుల్లో ఎన్ని బాధలు పడ్డాడో ఈ అభాగ్య జీవి! వారి నుండి తప్పించుకోవడానికి మరెన్ని తిప్పలు పడవలసి వచ్చిందో!!

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment