290

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 290*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 205*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 7*

*హజ్రత్ ఉస్మాన్ (రజి)గారి దౌత్యం : -*

మహాప్రవక్త (సల్లం), హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పిలువనంపి ఆయన్ను ఖురైషుల వద్దకు వెళ్ళమని ఆదేశిస్తూ, *"వారికి ఎరుకపరచకండి! మేము పోరాడటానికి రాలేదు, కేవలం ఉమ్రా చేయడానికి వచ్చాము అని. దానితో పాటు వారిని ఇస్లాం వైపునకు రమ్మని ఆహ్వానించండి. మక్కాలో ఉన్న విశ్వాసుల స్త్రీ పురుషులందరికి త్వరలోనే విజయం చేకూరుతుంది అనే శుభవార్తను కూడా తెలుపండి. అల్లాహ్ తన ధర్మాన్ని మక్కాలో విస్తరింపజేస్తాడనీ, దానికే విజయం చేకూరుతుందనీ, ఇస్లాం విషయంలో మునుముందు ఎవ్వరూ దాక్కునే అవసరం కూడా ఉండబోదనీ శుభవార్తనందించండి."* అని చెప్పి పంపించారు.

ఉస్మాన్ (రజి) నగరంలోకి వెళ్ళి 'అబాన్' ఇంటి తలుపు తట్టారు. అబాన్ తలుపు తెరచి చూశాడు. ఉస్మాన్ (రజి)ను చూడగానే, *"స్వాగతం! రా తమ్ముడూ!! ఈ రాత్రిపూట నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ముహమ్మద్ (సల్లం) శిబిరాన్ని వదలిపెట్టి ఇక్కడికెందుకు వచ్చావు?"* అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

ఉస్మాన్ (రజి) అతనికి బదులిస్తూ, *"నేనిక్కడికి రాయబారిగా వచ్చాను. ఖురైషులు అర్థం చేసుకోలేకపోతున్న ఒక విషయాన్ని వారికి వివరించటానికి నేను ఇక్కడికి వచ్చాను. వారు ఏమైనా హాని తలపెడతారేమోనని భయంగా ఉంది. నాకు నీ రక్షణ కావాలి."* అన్నారు.

అబాన్, ఉస్మాన్ (రజి)ను ఖురైషు నాయకుల వద్దకు తీసుకువెళ్ళి, *"మీకు తెలుసు కదా! ఇతను నా తమ్ముడు ఉస్మాన్. ఇతను ఇప్పుడు నా రక్షణలో ఉన్నాడు. ఇతన్ని ముహమ్మద్ (సల్లం) పంపించారట. ఇతను మీతో ఏదో మాట్లాడాలంటున్నాడు."* అని చెప్పాడు.

అప్పుడు ఉస్మాన్ (రజి), ఖురైషీయులను సంబోధిస్తూ, *"ఖురైషీయులారా! మేము మీ ముందు రెండే రెండు విషయాలు ఉంచుతున్నాం. మమ్మల్ని కాబా ప్రదక్షిణ చేసుకోనివ్వండి. దానికి మీరు ఒప్పుకోకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండండి."* అని అన్నారు.

*"అలా కుదరదు. కావాలంటే నువ్వొక్కడివే కాబా ప్రదక్షిణ చేసుకో. అంతేగాని ఇతరుల ప్రస్తావన ఎత్తకు. వారు అటు నుంచి అటే వెళ్ళిపోవాలి."* అన్నారు ఖురైషీయులు.

ఈ మాటలు వినగానే హజ్రత్ ఉస్మాన్ (రజి)కు ఒళ్ళు మండిపోయింది.

*"ఏమిటీ? ముస్లిములు కాబాదర్శనానికి నోచుకోకుండా వెళ్ళిపోవాలా, నేనొక్కడ్ని మాత్రం కాబా ప్రదక్షిణ చేసుకోవచ్చా? కాదు, ముస్లిములందరికీ కాబా ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందే."* అన్నారు హజ్రత్ ఉస్మాన్ (రజి) పట్టుదలతో.

ఖురైషీయులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. హజ్రత్ ఉస్మాన్ (రజి) కూడా పట్టు విడవకుండా కాబాదర్శనం చేసుకునే అవకాశాన్ని ముస్లిములందరికీ ఇవ్వాలని అన్నారు. ఇలా చర్చలు ఎటూ తెగకుండా కొన్నాళ్ళు జరిగిపోయాయి.

*ఉస్మాన్ (రజి) నిర్బంధం : -*

మదీనాకు వలస వెళ్ళకుండా మక్కాలోనే బంధింపబడి ఖురైషుల ఆగడాలకు గురవుతూ ఉన్న అణగారిన ముస్లింల ఇళ్ళను ఉస్మాన్ (రజి) సందర్శించారు. *"మీరు నిరాశపడవద్దు, అల్లాహ్ త్వరలోనే మీకు విముక్తి కలిగిస్తాడు."* అని ఆయన వారికి ధైర్యం చెప్పారు.

ఖురైషులకు ఈ విషయం తెలిసింది. మక్కా వారిలో అనైక్యతా బీజాలు నాటుతున్నాడనే నెపంతో వారు ఉస్మాన్ (రజి)ని నిర్భందించారు.

*హజ్రత్ ఉస్మాన్ (రజి) అమరగతినొందారనే పుకారు : - - : బైతె రిజ్వాన్*

ఈ లోపు ముస్లిములు ఉస్మాన్ (రజి) కోసం ఎదురుచూస్తూ ఉండడం వల్ల వారిలో ఓ పుకారు బయలుదేరింది. హజ్రత్ ఉస్మాన్ (రజి)ను ఖురైషులు చంపివేశారనేదే ఆ పుకారు. ఆయన (రజి) తిరిగి రాకపోవడంతో ముస్లిములు ఈ వార్త నిజమేనని భావించారు.

ఇంకేముంది! ముస్లింలలో పెద్ద కలకలం చెలరేగింది. వారు ఆగ్రహోదగ్రులయి పోయారు. అందరిలోనూ పౌరుషం పడగ విప్పి నాట్యమాడసాగింది.

*"ఎంత ద్రోహానికి ఒడిగట్టారు వీరు! పైగా పవిత్ర మాసంలో ఈ ఘాతుక చర్య!! వీరికి పవిత్ర మాసం పట్లగాని, యాత్రికుల పట్లగాని ఏ మాత్రం గౌరవం లేదు."* అన్నారు దైవప్రవక్త (సల్లం) ఈ మాట విని.

అయితే ఇప్పుడు ముస్లింల తక్షణ కర్తవ్యం ఏమిటీ?

రాజనీతి ఉల్లంఘించి ఒక దౌత్యవేత్తను చంపడమంటే స్పష్టంగా యుద్ధ ప్రకటన చేయడమే. అందువల్ల వెంటనే దైవప్రవక్త (సల్లం) ప్రధాన అనుయూయులనందరినీ సమావేశపరిచారు.

*"ఖురైషీయుల నుండి ఉస్మాన్ (రజి) హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం మన విధి. ప్రతీకారం తీర్చుకోకుండా మనం ఇక్కడ్నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి మరలకూడదు."* అన్నారు దైవప్రవక్త (సల్లం) గంభీర వదనంతో.

ఈ మాట చెప్పిన తరువాత ఆయన (సల్లం) కొంచెం దూరాన ఉన్న ఓ తుమ్మచెట్టు నీడకు పోయి కూర్చున్నారు. సహాబా (రజి)లందరినీ ఆ యుద్ధం కోసం ప్రయాణం చేయడానికి పిలుపునిచ్చారు. సహాబా (రజి)లు దైవప్రవక్త (సల్లం) గారి ఆదేశం మేరకు ఆయన (సల్లం) చుట్టూ ప్రోగైపోయారు. ఓ వర్గం, *"మేము యుద్ధరంగాన్ని వదలి పారిపోయేవారం కాదు"* అనగా; మరో వర్గం, *"ప్రాణాలు త్యాగం చెయ్యటానికి మేము సిద్ధం"* అని ప్రమాణం చేసింది.

ఓ మహోన్నత కార్యం కోసం వారు కంకణం కట్టుకున్నారు. దైవప్రీతి కోసం, ధర్మరక్షణ కోసం ఒక మహోద్యమానికి సిద్ధమయ్యారు. దైవప్రవక్త (సల్లం)కు పూర్తిగా విధేయులయిపోయి దైవధర్మం పరిరక్షణ కోసం ముస్లిములంతా తమ సర్వస్వాన్ని త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చారు.

దైవప్రవక్త (సల్లం) చేయి జాపారు. అనుచరులు ఒక్కొక్కరే ముందుకొచ్చి ఆయన (సల్లం) చేతిలో చేయి వేసి శపథం చేశారు. ఘోరమైన శపథం! ఇక విజయమో, వీరమరణమో తేల్చుకోవడమే తరువాయి పని!!

అందరికంటే ముందు 'అబూ సనాన్ అసదీ' ప్రమాణం చేశారు. హజ్రత్ సల్మా బిన్ అకూ (రజి) అయితే మూడుసార్లు, బైత్ ప్రారంభంలో, మధ్యలో, చివరగా ప్రమాణం చేశారు. దైవప్రవక్త (సల్లం) స్వయంగా తన చేయినే పట్టుకొని, *"ఇది ఉస్మాన్ చెయ్యి"* అని అనగా, అందరూ ఆ చేతి మీదుగా బైత్ చేయడం జరిగింది. ఈ బైత్ లో కేవలం ఒకే ఒక వ్యక్తి 'జుద్ బిన్ ఖైస్' అనేవాడు పాల్గొనలేదు. అతను మునాఫిక్.

దైవప్రవక్త (సల్లం) తుమ్మచెట్టు క్రింద కూర్చొని ఈ బైత్ తీసుకున్నారు. హజ్రత్ ఉమర్ (రజి) దైవప్రవక్త (సల్లం) గారి చెయ్యి పట్టుకొని ఉన్నారు. హజ్రత్ మాఖిల్ బిన్ యసార్ (రజి) ఆ చెట్టు కొమ్మలు కొన్నింటిని పట్టుకొని దైవప్రవక్త (సల్లం)పై పడకుండా ఎత్తి పట్టుకున్నారు. ఈ బైత్ (ప్రమాణం) పేరే 'బైతె రిజ్వాన్'.

ఈ బైత్ గురించి అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఈ ఆయత్ ను అవతరింపజేశాడు.

*"(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంతస్థితిని (స్థిమితాన్ని) అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు." (ఖుర్ఆన్ 48:18)*

*సంధికి సిద్ధమైన ఖురైషీయులు : -*

ముస్లిముల దగ్గర తగినన్ని ఆయుధాలు లేవు. అయినా సరే ఖురైషులు ఉస్మాన్ (ర)ను హత్య చేసిన సంగతి తెలియగానే తప్పకుండా వారితో యుద్ధం చేయాలని ముస్లిములు నిర్ణయించుకున్నారు.

పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని గ్రహించిన ఖురైష్ నాయకులు, మరోసారి సమావేశమయి ఓ నిర్ణయానికి వచ్చారు.

*"ఖురైషీయులారా! మనం తాత్కాలికంగా యుద్ధానికి స్వస్తి పలుకుదాం. ముహమ్మద్ (సల్లం) వ్యవహారాన్ని చక్కబెట్టమని, ముస్లింలతో శాంతి ఒప్పందం కుదుర్చుకొని రమ్మని 'సుహైల్ బిన్ అమ్రూ'ని పంపుదాం. అతను ముహమ్మద్ (సల్లం) దగ్గరకు వెళ్ళి, ఈ సంవత్సరం ముహమ్మద్, ఆయన అనుచరులు వెళ్ళిపోయి, వచ్చే సంవత్సరం ఉమ్రా చెయ్యమని ఆయన (సల్లం)కు నచ్చజెబుతాడు."* అన్నారు ఖురైష్ నాయకులు.

ఖురైషీయులు, సుహైల్ బిన్ అమ్రూని దైవప్రవక్త (సల్లం) వద్దకు పంపిస్తూ, ఒప్పందంలో తప్పనిసరిగా, దైవప్రవక్త (సల్లం) ఈ సంవత్సరం వెనక్కు తిరిగి వెళ్ళిపోయే షరతు ఉండాలని మరీ మరీ తాకీదు చేశారు.

అరబ్బులు, మక్కా నగరంలో ప్రవక్త (సల్లం) బలవంతంగా ప్రవేశించారనే భావన కలుగకుండా ఉండాలనేదే వారి అభిమతం.

ఆ తరువాత వారు హజ్రత్ ఉస్మాన్ (రజి)ని పంపివేశారు. ఆయన (రజి) హుదైబియాకు తిరిగి వచ్చారు. ఆయన్ని చూడగానే ముస్లిములంతా తాము విన్న వార్త నిజం కాదని గ్రహించి చల్లగా ఊపిరి పీల్చుకున్నారు.

ఖురైషుల సూచనలతో సుహైల్, మహాప్రవక్త (సల్లం)గారి సన్నిధిలో హాజరయ్యాడు.

దైవప్రవక్త (సల్లం), సుహైల్ రాకను చూసి తన సహచరులతో, *"ఖురైషులు స్వయంగా ఇతన్ని పంపిస్తున్నారంటే వారు మనతో సంధి కుదుర్చుకోడానికి సిద్ధపడ్డారన్నమాట. ఎందుకంటే సుహైల్ చాలా వివేకవంతుడు, మంచి మనిషి. ఇలాంటి మనిషిని ఖురైషులు శాంతి చర్చల కోసమే పంపిస్తారు."* అని చెప్పారు.

కాని ఇక్కడ చూస్తే ముస్లింలు పెద్దఎత్తున యుద్ధసన్నాహాలు చేయడంలో నిమగ్నులై ఉన్నారు. వారి యుద్ధసన్నాహాలు చూసి సుహైల్ భయపడ్డారు. ఎలాగైనా ఈ యుద్ధాన్ని నిలుపుదల చేయించాలని తలచి దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళాడు.

*"మహాశయా! నేను మీ దగ్గరకు చర్చలు జరపడానికి వచ్చాను. కాని ఇక్కడ చూస్తే మీ అనుచరులు యుద్ధసన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అక్కడేమో ఖురైషీయులు, ఈ సంవత్సరం మిమ్మల్ని మక్కాలో ప్రవేశించనీయమని తీవ్రంగా ప్రతిన బూనారు. నేను కొన్ని షరతులు తీసుకొచ్చాను. వీటిలో మన ఉభయపక్షాల శ్రేయస్సు ఉంది. వీటిని మీరు ఒప్పుకుంటే ఓ భయంకర యుద్ధాన్ని నివారించినవారవుతారు. అనేకమంది అమాయకుల ప్రాణాలు దక్కుతాయి. అంతటి మహత్కార్యం సాధించిన ఘనత కూడా మీకు లభిస్తుంది."* అన్నాడు సుహైల్.

*"సరే, చెప్పండి. ఏమిటా షరతులు?"* అడిగారు దైవప్రవక్త (సల్లం).

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment