288

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 288*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 203*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 5*

ఖురైషులు మీమాంసలో పడిపోయారు. ఒక వైపేమో తాము ముహమ్మద్ (సల్లం)ను అడ్డుకుంటామని తమ పూజ్య దేవతల ముందు ఒట్టేసుకొని ఉన్నారు. మరోవైపు గత యుద్ధాల్లో ముస్లింల శక్తిసామర్థ్యాలనూ వారు చూసి ఉన్నారు. బద్ర్ యుద్ధం రోజున ఒక చిన్న సైనిక పటాలం చేతిలో వారు తిన్న చావుదెబ్బ వారి జీవిత చరిత్రలో ఒక చీకటి పుటగా మిగిలిపోయింది. అలాగే ఉహద్ యుద్ధంలో తాత్కాలికంగా తమది పైచేయి అయినా అందులోనూ వారికి ఒరిగిందేమీ లేదు. ఇటీవల జరిగిన కందక యుద్ధ భయానక పరిణామాలూ ఇంకా వారి స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు.

అయితే, ముస్లింలను ఇప్పుడు అడ్డుకోకుండా మక్కాలోకి స్వాగతిస్తే, అది తమ పాలిట ఇంకా అవమానకరంగా పరిణమిస్తుందన్న భయం కూడా మరో వైపు ఖురైషులను వెంటాడుతూ ఉంది.

*ఉర్వా బిన్ మస్ఊద్ మధ్యవర్తిత్వం : -*

ఈ సందర్భంలోనే, తాయిఫ్ నగర నాయకుడు 'ఉర్వా బిన్ మస్ఊద్ సఖఫీ' కల్పించుకుని, *"ఆ వ్యక్తి (ముహమ్మద్ - సల్లం) మీ ముందు ఓ మంచి ప్రతిపాదనను ఉంచాడు. కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలి. మకూ మీకూ మధ్య ఒప్పందం ఉంది. నాకు అనుమతి ఇవ్వండి. ఆయన (సల్లం) దగ్గరకు నన్ను పోనివ్వండి. నేను ముహమ్మద్ (సల్లం)తో మాట్లాడివస్తాను."* అని అడిగాడు.

ఇందుకు ఖురైషీయులు వెంటనే అంగీకరించారు.

*దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరుకున్న ఉర్వా బిన్ మస్ఊద్ : -*

ఉర్వా బిన్ మస్ఊద్, దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరుకున్నాడు. ఆయన (సల్లం) గాంభీర్యాన్ని, ఆయన (సల్లం) అవగాహనా శక్తిని చూసి ఉర్వా అవాక్కయ్యాడు. అతను, దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళి మాట్లాడనారంభించాగా, ఇది వరకు బుదైల్ కు చెప్పిన విషయమే అతనికి చెప్పారు మహాప్రవక్త (సల్లం).

అది విన్న ఉర్వా, *"ఓ ముహమ్మద్ (సల్లం)! గతంలో తన జాతినే అంతమొందించిన ఏ వ్యక్తి గురించి అయినా విన్నావా? ఇప్పుడు నీవు నీ జాతినే అంతమొందించ బూనావు. ఒకవేళ అలా కాని పక్షంలో, దైవసాక్షిగా చెబుతున్నాను, నీ వెంట ఉన్న వారంతా నిన్ను వదిలేసి పారిపోయే పోకిరి వెధవల్లా అగుపడుతున్నారు నాకు."* అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడనారంభించాడు.

ఇది విన్న హజ్రత్ అబూ బక్ర్ (రజి) గారికి కోపం కట్టలు త్రెంచుకుంది. *"ఓరీ నీచుడా, లాత్ దేవుని మర్మంగాన్ని నాకేవాడా! మేమా దైవప్రవక్త (సల్లం)ను వదిలి పారిపోయేవారం!"* అని తిట్టారు.

ఇది విన్న ఉర్వా, అబూ బక్ర్ (రజి) వైపు చూసి, *"ఇతనెవరూ?"* అని అడిగాడు.

ఈయన హజ్రత్ అబూ బక్ర్ (రజి) అని పరిచయం చేశారు అక్కడున్నవారు.

ఉర్వా, అబూ బక్ర్ (రజి)ను సంభోదిస్తూ, *"చూడు! నా ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయో ఆ దైవం సాక్షిగా చెబుతున్నాను. నీవు ఒకప్పుడు నాకు సహాయం చేసి ఉన్నావు. దానికి ప్రతిఫలం ఇంకా నేను నీకు ముట్టజెప్పలేదు. అదే గనక అప్పుడు జరిగి ఉంటే నీవు అన్న మాటలకు సమాధానం ఇచ్చి ఉండేవాణ్ణి."* అన్నాడు.

ఆ తరువాత ఉర్వా, దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడనారంభించాడు. అతను మాటలు సందర్భంలో మాటిమాటికి మహాప్రవక్త (సల్లం) గారి గెడ్డాన్ని పట్టుకుంటున్నాడు. ముగైరా బిన్ షూబా (రజి), దైవప్రవక్త (సల్లం) గారి వెనుకే నిలబడి ఉన్నారు. ఆయన (రజి) చేతిలో కరవాలం ఉంది. తలపై శిరస్త్రాణమూ ఉంది.

ఉర్వా, అలా దైవప్రవక్త (సల్లం) గారి గెడ్డం వైపునకు తన చేతిని చాచుతూ ఉండగా చూసిన ముగైరా, తన కరవాలం పిడితో ఉర్వా చేతి మీద కొడుతూ, *"జాగ్రత్త! నీ చేతిని ప్రవక్త (సల్లం) గారి గెడ్డానికి దూరంగా ఉంచు."* అంటున్నారు.

చివరికి ఉర్వా తన తలను పైకెత్తి ముగైరా (రజి) వైపు చూస్తూ, *"ఇతనెవరూ?"* అని అడిగాడు.

*"ఈయన ముగైరా బిన్ షుబా (రజి)"* అని బదులిచ్చారు అక్కడున్నవారు.

*"ఓహో! ఓ విశ్వాస ఘాతకుడా! నేను నీ విశ్వాస ఘాతుకానికి తగిన శిక్షను వేయడానికి ప్రయత్నం చేయడం లేదనుకున్నావా?"* అని అడిగాడు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే, అజ్ఞానకాలంలో (ఇస్లాం స్వీకరించక ముందు కాలం అన్నమాట) హజ్రత్ ముగైరా (రజి) కొందరితో కలసి ఉన్నప్పుడు ఆయన వారిని సంహరించి వారి సంపదనంతా ఎత్తుకొని పారిపోయారు. ఆ తరువాత ఆయన వచ్చి ఇస్లాం స్వీకరించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆయనతో ఇలా అన్నారు కూడా. *"నేను నీ ఇస్లాం స్వీకారాన్ని ఒప్పుకుంటున్నాను. కాని నీవు కొల్లగొట్టిన ధన సంపదతో నాకెలాంటి సంబంధం లేదు."* (ఈ వ్యవహారంలో ఉర్వా చేసిన ప్రయత్నం ఎలాంటిదంటే ఆయన అతని సోదర కుమారుడై ఉండడమే).

ఆ తరువాత ఉర్వా, దైవప్రవక్త (సల్లం) గారి ఎడల వారి సహచరుల సంబంధాలు ఎలా ఉన్నాయో గమనిస్తూపోయాడు.

ఉర్వా మక్కాకు తిరిగి వెళ్ళి, తాను ముహమ్మద్ (సల్లం)తో జరిపిన చర్చలు విజయవంతం కాలేదని సమాచారం అందించాడు. అసలు అతని ప్రతిస్పందన ఏమిటని ఖురైషులు అతన్ని గుచ్చి గుచ్చి అడిగారు. అందుకు ఉర్వా ఇలా సమాధానం ఇచ్చాడు....; ↓

*"ఓ నా జాతి ప్రజలారా! దైవసాక్షి! నేను కైజరు, కిస్రా మరియు నజాషి లాంటి రారాజుల దర్బారులకు కూడా పోయి వచ్చినవాణ్ణి. దైవాన్ని సాక్షిగా పెట్టి చెబుతున్నాను. నేను వారిలో ఏ రాజును కూడా ముహమ్మద్ (సల్లం) సహచరులు గౌరవించినంతగా గౌరవించడం చూడలేదు. ఆయన (సల్లం) కాండ్రించి ఉమ్మివేస్తే అది ఎవరిపైనైనా పడితే దాన్ని వారు తాము ముఖాలపై, శరీరాలపై పులుముకుంటారు. ఆయన (సల్లం) ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని నిర్వర్తించడానికి పరుగిడుతారు. ఆయన (సల్లం) వుజూ చేసుకునేటప్పుడు, వారంతా ఆ నీటి కోసం తగువులాడుతున్నారా అన్నట్లు ఎగబడతారు. ఆయన (సల్లం) ఏదైనా పలుకును తమ నోటి నుండి వెలువరించినా నిశ్శబ్దంగా వింటారు. గౌరవం ఉట్టిపడేటట్లు ఆయన (సల్లం) వైపు సరిగా చూడనైనా చూడరు. ఆయన (సల్లం) ఓ ప్రతిపాదన చేశారు. అది ఎంతో మేలైన ప్రతిపాదన. కాబట్టి మీరు దాన్ని ఒప్పుకోక తప్పదు."*

_ఉర్వా పలికిన ఈ మాటలే మరొక ఉల్లేఖనంలో ఇలా ఉన్నాయి....; ↓_

*"ప్రజలారా! వినండి. నేను ఎన్నో రాజ్యాల రాజులను, చక్రవర్తులను చూశాను. పర్షియా చక్రవర్తిని, అబీసీనియా రాజుని, ఎందరెందర్నో నేను సందర్శించాను. కాని ముహమ్మద్ (సల్లం) సహచరులు ఆయన్ని గౌరవించినంత గొప్పగా, ఇతర ఏ ప్రజలూ తమ రాజుని, చక్రవర్తిని గౌరవించటం నేనెన్నడూ చూడలేదు. వారు ఆయన నాయకత్వాన్ని మనసా, వాచా అంగీకరించి, తమ వ్యవహారాలను నడపటంలో ఆయనకు సంపూర్ణ అధికారాన్ని ఇచ్చారు. ఆయన అభిప్రాయాన్ని వారు మనసారా అంగీకరిస్తారు. కనుక మీకు నా సలహా ఏమంటే, ఈ విషయంలో మీరు ఓ ఒప్పందానికి రండి, ఎందుకంటే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది."* అన్నాడు.

కాని ఇంత చెప్పినా ఖురైష్ నాయకులకు తలకెక్కలేదు. అతని మాటలు విన్న తర్వాత ఖురైషులు తలపొగరుతో, *"ఖురైషులు వారధి లాంటివారు. ఆ వారధిని ఎవరూ దాటలేరు. 'ఖురైషు' అంటే, ఎవరూ అధిరోహించలేని పర్వత శిఖరం. మా జెండాలు ఎన్నటికీ తలదించవు."* అన్నారు.

*ఖురైషీయుల విలుకాండ్రు కుట్ర : -*

ఖురైషుకు చెందిన యుద్ధోన్మాదులైన యువకులు, వారికి సంబంధించిన నాయకులే సంధికి దిగివస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని దాన్ని భంగపరచడానికి గాను ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. వారు రాత్రి అంధకారంలో ఎవరికీ తెలియకుండా ముస్లిముల శిబిరంలోకి చొరబడి భీభత్సం సృష్టిద్దామని అనుకున్నారు. దీనివల్ల సంధికి బదులు యుద్ధం అనివార్యమైపోతుంది అని వారి అంచనా.

ఆ తరువాత వారు యాభై మంది ఆరితేరిన విలుకాండ్రను ఎన్నుకున్నారు. రాత్రివేళ పోయి ముహమ్మద్ (సల్లం)పై ఆకస్మిక దాడి చెయ్యమని చెప్పి వారిని పంపించారు.

ఈ యాభై మంది విలుకాండ్రు రాత్రివేళలో హుదైబియా ప్రాంతానికి చేరుకున్నారు. కాని పథకం తల్లక్రిందులయింది. పాపం వారు ముస్లిముల శిబిరాలపై నాలుగైదు బాణాలు వదిలారో లేదో తక్షణమే ముస్లిములు మేల్కొని వారిని బందీలుగా పట్టుకొని దైవప్రవక్త (సల్లం) ముందు ప్రవేశపెట్టారు.

దైవప్రవక్త (సల్లం)పై దాడి చెయ్యడానికి వచ్చిన ఈ గెరిల్లా వీరులు చివరికి గొర్రెల్లా దైవప్రవక్త (సల్లం) సమక్షంలో తలలోంచి నిలబడవలసి వచ్చింది.

ప్రవక్త అనుచరులు వారి వైపు ఉరిమిచూస్తున్నారు. బందీలు ఇక తమకు చావు తప్పదని తలచి వణకిపోతున్నారు.

*"ఇంత ద్రోహానికి పాల్పడిన మీకు నేను ప్రాణభిక్ష ఎలా పెట్టాలి?"* దైవప్రవక్త (సల్లం) వారి కళ్ళలో సూటిగా చూస్తూ అడిగారు.

*"అయ్యా! మా బుద్ధి గడ్డి తిన్నది. మమ్మల్ని కనికరించండి. మీరు ఎంతో దయార్ద్ర హృదయులు. మీ క్షమాగుణంపై మాకు నమ్మకం ఉంది. దయచేసి మమ్మల్ని నిరాశపరచకండి."* అని పరిపరి విధాల వేడుకున్నారు శత్రు సైనికులు.

*"సరే వెళ్ళండి, మిమ్మల్ని క్షమిస్తున్నాను. రక్తపాతం జరుపడానికి ముహమ్మద్ (సల్లం) ఇక్కడకు రాలేదని మీ జాతి వాళ్ళకు గట్టిగా చెప్పండి. ఇప్పుడయినా వారికి స్పృహ వస్తుందేమో."* అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం).

శత్రుసైనికులు బ్రతుకు జీవుడా అంటూ ముస్లిముల పట్టు నుండి బయటపడ్డారు. అయితే ఇంతటి ఘోరమైన నేరాన్ని సయితం ముహమ్మద్ (సల్లం) క్షమించినందుకు వారు చాలా ఆశ్చర్యపోయారు. ఏమైనా ఇక తమ జాతికి కీడు తప్పదనుకున్నారు. కాస్త అవమానం జరిగినా కనీసం ప్రాణాలైనా దక్కాయని సంతోషిస్తూ వారు మక్కా దారిపట్టారు.

ఇలా కవ్వించి కయ్యం పెట్టుకోవాలన్న ఖురైషీయుల ఎత్తుగడ నీరుగారిపోయింది.

*ముస్లిముల తరఫున హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి) రాయబారం : -*

దైవప్రవక్త (సల్లం) ఈసారి ఖురైషీయులకు తాము కాబాదర్శనం నిమిత్తమే వచ్చామని తెలియజేయడానికి 'హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి)'ని పంపారు.

హజ్రత్ ఖరాష్ (రజి) ఒంటె ఎక్కి మక్కా బయలుదేరారు. ఆయన నేరుగా అబూ సుఫ్యాన్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో అబూ సుఫ్యాన్ ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాడు. ఆయనతో పాటు 'ఇక్రమా బిన్ అబూజహల్', 'ఖాలిద్ బిన్ వలీద్', 'అమ్రూ బిన్ ఆస్' వగైరా ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ముస్లింల దగ్గరకి రాయబారిగా వెళ్ళివచ్చిన 'హులైన్ బిన్ అల్కమా' కూడా ఉన్నాడు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment