286

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 286*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 201*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 3*

ఖాలిద్ బిన్ వలీద్ ముస్లిములు రేపే దుమ్మును చూసి వారు మార్గాన్ని మార్చి, 'హుదైబియా'కు వచ్చి విడిది చేశారని తెలుసుకొని మక్కాకు తిరుగుముఖం పట్టాడు. హుటాహుటిన ఖురైషీయులకు ఈ క్రొత్త పరిస్థితిని తెలియజేసేందుకు పరుగులు తీస్తూ మక్కా చేరాడు.

ఇటు మహాప్రవక్త (సల్లం) తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 'సనియ్యతుల్ మరార్' చేరగా, దైవప్రవక్త (సల్లం) కూర్చున్న ఒంటె అకస్మాత్తుగా ఆగిపోయింది. అడుగు ముందుకు వేయకుండా నడిబాటలో కూర్చుండిపోయింది. దైవప్రవక్త (సల్లం) ఒంటెను చాలా అదిలించారు. కాని లాభం లేకపోయింది. ఒంటె మొండికేసిందని కొంతమంది అన్నారు. కాని అసలు విషయం ఏమిటో దైవప్రవక్త (సల్లం)కు అర్థమయింది.

తన సహచరులతో ఆయన (సల్లం), *"లేదు, ఒంటె మొండికేయలేదు. మునుపటిలాగే అది ఇప్పుడు కూడా విధేయంగానే ఉంది."* అని చెప్పారు. తర్వాత ఆయన (సల్లం) అబ్రహా, అతని ఏనుగు మక్కాపై దాడి చేసిన సంగతిని సూచిస్తూ, *"ఎవరయితే మక్కాలోకి ఏనుగు(ల)ను ప్రవేశించకుండా అడ్డుకున్నాడో ఆయనే ఈ ఒంటెను కూడా ముందుకు వెళ్ళకుండా ఆపాడు. ఇందులో ఓ మంచి సూచన కూడా ఉంది. ఎవరి చేతుల్లోనయితే ముహమ్మద్ (సల్లం) ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఖురైషులు నాతో చర్చలు జరపటానికి వస్తారు. విశ్వాసానికి విఘాతం రానంత వరకు వారు ఎటువంటి షరతులు పెట్టినా నేను వారిని అంగీకరిస్తాను."* అన్నారు.

మక్కాలోకి ప్రవేశించకుండా కొంత సమయం వేచి ఉండాలని దైవప్రవక్త (సల్లం)కు దైవికంగా సూచనలు అందాయి.

_↑ ఇదే సంఘటన వేరొక సీరతుల్ కితాబ్ ప్రకారం ↓_

దైవప్రవక్త (సల్లం) ఒంటె 'సనియ్యతుల్ మరార్' అనే ప్రదేశంలో కూర్చుండిపోయింది. దాన్ని ఎంత అదిలించినా అది కదలలేదు. ఇది చూసిన ముస్లిములు దైవప్రవక్త (సల్లం)తో, *"ప్రవక్తా! ఇది మొండికేసింది."* అన్నారు.

*"కాదు! ఇది మొండికేయలేదు. దానికి ఆ అలవాటు కూడా లేదు. ఏనుగుల్ని సయితం నిలిపివేసిన ఆ అల్లాహ్ యే దాన్ని ఇక్కడ ఆపేశాడు. ఎవరి గుప్పెట్లోనయితే నా ప్రాణాలున్నాయో ఆ దేవుని సాక్షి! వీరు దైవం నిర్దేశించిన ఏ హద్దుల్ని కూడా గౌరవించరు. కాని నేను మాత్రం వాటిని పూర్తిగా గౌరవిస్తాను."* అని చెప్పి తన ఒంటెను ఒక్కసారే అదిలించగా అది లేచి నిలబడింది.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) తాను వెళుతున్న మార్గాన్ని కొంత మార్చి హుదైబియా ప్రాంతంలో ఉన్న ఓ ఊట బావి వద్దకు వచ్చి ఆగారు. ఆ ఊట బావిలో నీరు అడుగంటి ఉంది. సహచరులు కొద్దికొద్దిగా నీరు తీసుకోవడం మూలంగా బావిలో ఉన్న నీరు కాస్తా అయిపోయాయి. సహాబా (రజి)లు దాహం గురించి దైవప్రవక్త (సల్లం)కు విన్నవించుకోగా, ఆయన (సల్లం) తన తూణీరం నుండి ఓ బాణాన్ని తీసి, దాన్ని ఆ ఊట బావిలో పడవేయమని 'హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రజి)'ని ఆదేశించారు. హజ్రత్ బరా (రజి), ఆ బాణాన్ని ఊట బావిలో పడవేయగానే ఆ అందులోని నీరు పైకి ఉబకనారంభించింది. అందరూ కడుపారా నీరు త్రాగి వెనక్కు వచ్చేశారు.

ఇటు, మక్కాలో ఖురైషీయులు ఖాలిద్ రాక కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఖాలిద్ విజయవంతంగా తిరిగొస్తేనే తమకు అరేబియాలో గౌరవం దక్కుతుందని, లేకపోతే తాము శాశ్వతంగా అవమానభారంతో కృంగిపోక తప్పదని వారు భావించసాగారు.

*ఖురైషీయుల వద్దకు చేరుకున్న ఖాలిద్ : -*

ఖాలిద్ బిన్ వలీద్ రానే వచ్చాడు. అతను ఏం కబురు విన్పిస్తాడోనని ఖురైషీయులు ఊపిరి బిగబట్టి కూర్చున్నారు.

*"మన పథకం తారుమారయింది. ముహమ్మద్ (సల్లం), ఆయన అనుచరులు వేరే దారి గుండా హుదైబియాకు వచ్చి విడిది చేశారు."* అన్నాడు ఖాలిద్ రాగానే.

*"ఏమిటీ! ముహమ్మద్ (సల్లం) హుదైబియాకు వచ్చేశాడా!!"* నాయకులంతా దిగ్భ్రాంతి చెందారు. క్షణం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది.

*"అయితే ఇప్పుడేం చేద్దాం?"* అన్నాడు వారిలో ఒకడు.

*"పదండి, దారున్నద్వాలో సమావేశమయి ఆలోచిద్దాం."* అన్నాడు మరొకడు.

ఖురైష్ నాయకులంతా దారున్నద్వాలో సమావేశమయ్యారు. అందరి ముఖాలు మాడిపోయి ఉన్నాయి. ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోవడం లేదు.

కొంపదీసి ముస్లిములు మక్కా పట్నంలోకి చొచ్చుకొని వస్తే....? అమ్మబాబోయ్! ఇంకేమయినా ఉందా!! ఉన్న పరువు, పలుకుబడులు కాస్తా మంట కలిసిపోవూ? సంఘంలో తలెత్తుకొని తిరగ్గలరా?

*"కాదు, మనం ఏదో ఒకటి చేసి సంఘంలో గౌరవం దక్కించుకోవాలి."* ఖురైషీయుల పౌరుషం పడగలు విప్పింది.

*"మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ముహమ్మద్ (సల్లం) మక్కాలో అడుగు పెట్టడం అసంభవం."* వారి ఆవేశం బుసలు కొట్టింది.

*"ఇక్కడ మక్కాలో కూడా ముహమ్మద్ (సల్లం) అనుచరులు ఉన్నారు మన పక్కలో బల్లెంలా. ముస్లింలతో పేచీ పెట్టుకుంటే మనకు సర్వనాశనం తప్పదు."* అంటూ వారిలో ఒకడు సందేహం వెలిబుచ్చాడు.

*"ముహమ్మద్ (సల్లం) మనతో యుద్ధం చేయడానికి రాలేదంటున్నారు కదా! అలాంటప్పుడు ఆయన మనకు ఎలాంటి హాని తలపెట్టే అవకాశం లేదు. ఒకవేళ అతను మనసు మార్చుకొని మనతో కయ్యానికి దిగుతాడే అనుకుందాం. అప్పుడు మనం వెన్నుజూపి పారిపోయేటంతటి పిరికిపందలమా? వాళ్ళను చీల్చి చెండాడమూ!!"* అన్నాడు మరొకడు రొమ్ము విరుచుకుంటూ.

*"ఇంతకూ ఏం చేద్దామంటారు? వెంటనే ఏదో ఒక పథకం రూపొందించి పనిచేయక పొతే ప్రమాదం ముంచుకొస్తుంది."* అన్నాడు అగ్ర నాయకుడు అబూ సుఫ్యాన్.

*''బనీ ఖుజాఅ తెగ మనుషులు కొందరిని పంపుదాం. వారెళ్ళి ముహమ్మద్ (సల్లం) కోరుతున్నదేమిటో తెలుసుకొని వస్తారు. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు."* అన్నారు వారిలో కొందరు.

*"కాని ఖుజాఅ తెగవాళ్ళను పంపితే లాభం లేదు. వాళ్ళు ముహమ్మద్ (సల్లం)కు అనుకూలురు, ముస్లిముల శ్రేయోభిలాషులు. అలాంటి వారి వల్ల మనకు ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది."* అన్నాడు అబూ సుఫ్యాన్.

*"నువ్వేమీ భయపడకు. వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది. మక్కాలోనే వారి పొలాలు, తోటలు ఉన్నాయి. వారి భార్యాపిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ద్రోహం చేస్తే మన పట్టు నుండి తప్పించుకొని ఎక్కడికీ పారిపోలేరు."* అన్నాడు ఓ తలపండిన నాయకుడు.

ఈ ప్రతిపాదన అందరికీ నచ్చింది. ముస్లింల దగ్గరికి రాయబారం పంపవలసిన ప్రతినిధుల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment