285

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 285*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 200*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 2*

*మక్కా వైపునకు ముస్లింల కదలిక : -*

దైవప్రవక్త (సల్లం) మక్కా వైపునకు బయలుదేరి ప్రయాణం చేస్తూ 'జుల్ హలీఫా' అనే ప్రదేశానికి వెళ్ళి 'హదీ' పశువుల మెడల్లో పట్రాలు తొడిగారు. ఒంటెల మూపరాలను చీల్చి గుర్తులు పెట్టి ఉమ్రా ఎహ్రామ్ కట్టుకున్నారు. ఇలా చేయడం వల్ల చూసేవారు, వారు యుద్ధం చేయడానికి రాలేదని తెలియపరచడం.

అలా చేసిన తరువాత, మక్కా పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఖురైషీయులు ఏమనుకుంటున్నారో తెలుసుకురమ్మని ప్రవక్త (సల్లం), 'బనీ ఖుజాఅ' తెగకు చెందిన 'బిషర్ బిన్ సుఫ్యాన్'ని మక్కాకు పంపడం జరిగింది.

బనీ ఖుజాఅ తెగ ముస్లింల మిత్రపక్షం. బిషర్ కూడా ముస్లింల సానుభూతిపరుడే. అందువల్ల అతను ఖురైషీయులను గురించి నిజమైన సమాచారమే చెబుతాడని దైవప్రవక్త (సల్లం)కు పూర్తి నమ్మకం.

ముస్లిములు ప్రయాణిస్తూ 'అస్ఫాన్' దాపుకు చేరగానే బిషర్ బిన్ సుఫ్యాన్ వచ్చి ప్రవక్త (సల్లం)తో, *"దైవప్రవక్తా! మీరు చెప్పినట్టుగానే నేను మక్కా వెళ్ళివచ్చాను. మీ కల గురించి, మీ మక్కా ప్రయాణం గురించి వారికి తెలిసిపోయింది."* అని సమాచారం అందించాడు.

*"మక్కా వారి స్పందన ఎలా ఉంది?"* అని దైవప్రవక్త (సల్లం) అడిగారు.

దానికి సమాధానమిస్తూ అతను, *"వాళ్ళంతా ఏకమయి, మిమ్మల్ని మక్కాలోకి రానీయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారండీ! కఅబ్ బిన్ లువై అనేవాడు తమతో ఢీకొనడానికి అహాబీష్ ను (మిత్రపక్షాల సైన్యాన్ని) సమీకరిస్తున్నాడు, తమరు కాబా గృహానికి వెళ్ళకుండా అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నాడు."* అని వార్తనందించాడు.

ఈ వార్త అందిన తరువాత మహాప్రవక్త (సల్లం) తన సహచరులను సంబోధిస్తూ, *"వీరు ఖురైష్ కొమ్ముకాస్తున్నారు. అందుకని మనం వారి కుటుంబాలపై విరుచుకుపడి వారిని ఎందుకు పట్టుకోకూడదు? మనం అలాగే మిన్నకుండిపోతే వారు, మనం యుద్ధం వల్ల ఏర్పడిన దుఃఖం వల్ల మిన్నకుండిపోయాము అని అనుకుంటారు. మీ సలహా ప్రకారం మనం కాబా గృహం వైపునకు ప్రయాణించి ముందుకు వెళితే మనకు ఎదురైన వారితో తలపడాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీరిచ్చే సలహా ఏమిటో చెప్పండి."* అని అడిగారు.

దీనికి హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి) లేచి, *"ఈ విషయం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం) గారికే బాగా తెలుసు. కాని మనం మాత్రం ఉమ్రా చేయడానికి బయలుదేరివచ్చినవారం. ఎవరితోనూ యుద్ధం చేయడానికి రాలేదు. అయితే మనకూ, దైవగృహానికి మధ్య ఎవరైనా అడ్డుగా నిలిస్తే మాత్రం వారిని చీల్చి చెండాడుతాం."* అని విన్నవించుకున్నారు.

దైవప్రవక్త (సల్లం) ఈ మాటలు విని, *"సరే పదండి అలానే చేద్దాం."* అని తమ ప్రయాణాన్ని కొనసాగినంచనారంభించారు.

*కాబా గృహానికి రాకుండా ముస్లిములను అడ్డుకునే ప్రయత్నం : -*

ఇటు ప్రవక్త శ్రీ (సల్లం) ఉమ్రా కోసం బయలుదేరిన విషయం తెలిసిన ఖురైషీయులు ఓ సలహా సంఘాన్ని పిలిచారు. ఎలాగైనా సరే ముస్లిములను కాబా గృహానికి దూరంగా ఉంచడమే వారి అభిమతం. దైవప్రవక్త (సల్లం) అహాబీష్ (నీగ్రో) మూకలను తప్పించుకొని తమ ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా, బనీ కఅబ్ తెగకు చెందిన ఓ వ్యక్తి వచ్చి, *"దైవప్రవక్తా! ఖురైషీయులు 'తువా' అనే ప్రదేశంలో విడిది చేసి మీకోసం ఎదురుచూస్తున్నారు. ఖాలిద్ బిన్ వలీద్ రెండు వందల ఉష్ట్రారోహుల్ని వెంటబెట్టుకొని 'కురా అల్ గనీమ్' అనే చోట వేచి చూస్తున్నాడు."* అనే వార్తను అందించాడు. (కురా అల్ గనీమ్ మక్కాకు వెళ్ళే ప్రధాన వ్యాపార రహదారిపై ఉంది).

అప్పుడు దైవప్రవక్త (సల్లం), *"ఖురైషుల పరిస్థితి కడు శోచనీయం. గత యుద్ధంలో వారు వినాశపు అంచులకు చేరుకున్నారు. అయినా గాని వారికి బుద్ధి రాలేదు. నేను వారిని వారి మానాన వదిలేస్తానని వారనుకుంటున్నారేమో? లేదు. అలా ఎన్నటికీ జరగదు. అల్లాహ్ నన్ను, తన సందేశం ఇచ్చి పంపాడు. నా అంతిమ శ్వాస వరకు నేను ఆయన మార్గంలో కృషి చేస్తూనే ఉంటాను. ఖాలిద్ తో, అతని అశ్వదళంతో మనకు పనిలేదు. మనం యుద్ధానికి వెళ్ళటం లేదు. శాంతియుతంగా ఉమ్రా యాత్ర చేయటానికి మాత్రమే వెళుతున్నాం."* అన్నారు.

ఇటు ఖాలిద్ బిన్ వలీద్, ముస్లిములను మక్కాకు వెళ్ళకుండా అడ్డగించడానికి తన ఉష్ట్రారూఢుల్ని కనుచూపు మేరలో నిలబెట్టాడు. ఖాలిద్, ముస్లిములు జొహ్ర్ నమాజులో రుకూ మరియు సజ్దాలు చేస్తుండగా చూసి, వీరు ఏమరుపాటులో ఉన్నారు. ఈ సమయంలో దాడి చేస్తే ఎంత బాగుండును అని అనుకున్నాడు. ఆ తరువాత అతను అస్ర్ నమాజులో ముస్లిములపై ఒక్కసారే విరుచుకుపడడానికి నిర్ణయం తీసుకున్నాడు. కాని అల్లాహ్ ఈలోపు 'సలాతుల్ ఖౌఫ్' (యుద్ధ పరిస్థితిలో చేసే నమాజు విధానం) గురించి ఆదేశాలు అవతరింపజేయడం వల్ల ఖాలిద్ కు ఆ అవకాశం కూడా చేదాటి పోయినట్లయింది.

*భీకర పోరాటాన్ని తప్పించుకోవడానికి మార్గాన్ని మార్చడం : -*

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని ఉద్దేశించి, *"ముస్లిములారా! ఖురైషీయులు మనతో పోరాడటానికి బయలుదేరారు. మన ప్రయాణం ఈ దారినే కొనసాగితే మనం వారితో ఢీకొనక  తప్పదు. అప్పుడు ఘోర రక్తపాతం తప్పదు. ఇది నాకిష్టం లేదు. కనుక ఈ మార్గం తప్పించి, ఖాలిద్ కు ఎదురుపడకుండా మక్కాకు వెళ్ళే వేరొక మార్గాన తీసుకొని పోయేవారు ఎవరైనా ఉన్నారా మీలో?"* అని అడిగారు.

*"దైవప్రవక్తా! వేరే మార్గం గుండా నేను తీసుకెళ్తాను."* అన్నాడు అస్లం తెగకు చెందిన ఒకతను.

*"అయితే నువ్వు ముందు నడు. మేము నీ వెనకాల నడుస్తాం."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లం) కూర్చొని ఉన్న ఒంటె 'ఖస్వా' ముకుతాడు పట్టుకొని ముందుకు దారితీశాడు. ఇతర ముస్లిములు కూడా అతణ్ణి అనుసరించారు.

ఈ విధంగా మహనీయ ముహమ్మద్ (సల్లం), కురా అల్ గనీమ్ ప్రధాన రహదారిని వదిలి ఓ క్లిష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దారి, దుర్గమ పర్వత లోయల గుండా వెళ్ళే దారి. కొండలు, పెద్ద పెద్ద ఇసుకతిన్నెలతో కూడిన భయంకరమైన దారి అది. అంటే ఆయన (సల్లం) కుడి ప్రక్కగా బయలుదేరి 'హమష్' మధ్య భాగం నుండి వెళుతున్నారు. అది 'సనియతుల్ మరార్' అనే ప్రదేశం గుండా పోయే మార్గం. 'సనియతుల్ మరార్'ను దాటి "హుదైబియా" అనే ప్రదేశంలో విడిది చేశారు ఆయన (సల్లం) మరియు ఆయన అనుచరగణం.

ఈ హుదైబియా మక్కాకు దిగువన ఉన్న ప్రాంతం. ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల మహాప్రవక్త (సల్లం)కు చేకూరిన ప్రయోజనం ఏమిటంటే, తన్ఈమ్ మీదుగా హరంకు (కాబాకు) వెళ్ళే మార్గం కురా అల్ గనీమ్ రాచమార్గం ఎడమ వైపున ఉండిపోతుంది. ఈ మార్గం పైన్నే ఖాలిద్ బిన్ వలీద్ సైనిక పటాలం మాటువేసి ఉంది.

ఖాలిద్ బిన్ వలీద్ ముస్లిములు రేపే దుమ్మును చూసి వారు మార్గాన్ని మార్చి, 'హుదైబియా'కు వచ్చి విడిది చేశారని తెలుసుకొని మక్కాకు తిరుగుముఖం పట్టాడు. హుటాహుటిన ఖురైషీయులకు ఈ క్రొత్త పరిస్థితిని తెలియజేసేందుకు పరుగులు తీస్తూ మక్కా చేరాడు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment