284

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 284*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 199*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

        *హుదైబియా ఒప్పందం : - 1*
       *(జీఖాదా మాసం, హిజ్రీ శకం - 6)*

*ఉమ్రా కొరకు వెళ్ళడానికి గల కారణాలు : -*

అరేబియా ద్వీపకల్పంలో పరిస్థితులు చాలామటుకు ముస్లింలకు అనుకూలంగా మారిపోయినందున ఇస్లామీయ సందేశ ప్రచారం విజయవంతం అవుతుందనే శుభ సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా గోచరించసాగాయి. ఆరు సంవత్సరాల వరకు ముస్లింల కొరకు మూయబడిన 'మస్జిదె హరాం' ద్వారాలు తెరుచుకొని, వారి ఆరాధనకు అడ్డు తగిలిన పరిస్థితులు కూడా మారిపోనారంభించాయి.

*ప్రవక్త (సల్లం) స్వప్న వృత్తాంతం : -*

ఒకరోజు రాత్రి దైవప్రవక్త (సల్లం)కు, తాము, తమ అనుచరగణం కలసి మస్జిదె హరాంలో ప్రవేశిస్తున్నట్లుగా, ఆయన (సల్లం) కాబా తాళపు చెవులను తన చేతిలో తీసుకొని సహాబా (రజి)తో సహా బైతుల్లాహ్ (కాబా) తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తున్నట్లుగా, కొందరు తల వెంట్రుకలను గొరిగించుకున్నట్లుగా, మరికొందరు వెంట్రుకల్ని కత్తిరించుకున్నట్లుగా కలలో చూయించడం జరిగింది. దైవప్రవక్త (సల్లం)కు కల వచ్చిందంటే అది దాదాపు 'వహీ' (దైవవాణి) వంటిదే.

ఆ రోజు నిద్రలేవగానే ఆయన (సల్లం) ముఖారవిందం ఆనందంతో కాంతులీనసాగింది. తన సహచరులందరినీ ఆయన (సల్లం) మస్జిద్ వద్దకు రమ్మని కబురు చేశారు. దైవప్రవక్త (సల్లం) తమల్ని అందరినీ ఒకేసారి రమ్మని కబురు పంపారంటే, ఎంతో ముఖ్యమైన సమాచారం తెలియజేయటానికే అయివుంటుందని వారికి బాగా తెలుసు. సహచరులు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దైవప్రవక్త (సల్లం) చెప్పిన చోటికి చేరుకున్నారు. దైవప్రవక్త (సల్లం) తాను చూసిన కల గురించి సహచరులకు వివరిస్తూ ఇలా అన్నారు....; ↓

*"విశ్వాసులారా! ముస్లింలు నిర్భయంగా మక్కాలో ప్రవేశిస్తున్నట్టు నేను కలలో చూశాను. కనుక మీరు త్వరలోనే (కాబా) ప్రతిష్ఠాలయంలో ప్రవేశించబోతున్నారు. దైవచిత్తమయితే మీరు తప్పకుండా ప్రతిష్ఠాలయంలో ప్రవేశిస్తారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ప్రవేశిస్తారు. కనుక ఉమ్రా యాత్ర చేసిరావటానికి మక్కా వెళ్ళేందుకు సిద్ధమవ్వండి. కాబా గృహానికి గౌరవంగా బలి ఇచ్చేందుకుగాను జంతువులను కూడా వెంట తీసుకురండి."* అని సూచించారు.

ఈ శుభవార్త వినగానే సహాబా (రజి)లు ఆనందపరవశులయ్యారు. ఈ సంవత్సరమే తమకు మక్కాలో ప్రవేశించే భాగ్యం లభిస్తుందని తలపోశారు. ఇది దైవనిర్ణయమని, ఈ శుభవార్త వినిపించింది దైవప్రవక్త (సల్లం) అని వారికి తెలుసు. అందువల్ల ఇక తాము తప్పకుండా 'కాబా'ను సందర్శించగలమని దృఢంగా నమ్మారు.

మదీనాలో ఉంటున్న మక్కావాసులకు ఈ వార్త ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ఎందుకనగా, మక్కా పట్టణం ముస్లింల ప్రియనగరం. కాని శత్రువులు వారిని అనేక హింసలు పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయేలా చేశారు. దైవధర్మం కోసం, దైవప్రీతి కోసం వారు మాతృభూమిపై ఉన్న మమకారాన్ని బలవంతంగా చంపుకొని, ఆవేదనాభరిత హృదయాలతో మక్కా వదలి మదీనాకు వలస పోవలసి వచ్చింది.

అటువంటి విపత్కర పరిస్థితుల్లో మదీనాకు వలస వచ్చిన విశ్వాసులకు, ఆరు సంవత్సరాల తరువాత, కాబా గృహం పట్ల గౌరవభావంతో ఉమ్రా యాత్ర చేసేందుకు, తమ సొంత గడ్డపై మళ్ళీ అడుగుపెట్టే అవకాశం లభిస్తున్నందుకు ఎంతగానో పొంగిపోయారు. మక్కాలో నిర్భందించబడ్డ తమ భార్యాపిల్లల్ని, బంధుమిత్రుల్ని కలుసుకోబోతున్నామన్న వార్త ఆ వలస జీవుల మనసుల్ని పులకింపజేసింది.

అందువల్లనే దైవప్రవక్త (సల్లం) నోట ఈ శుభవార్త వెలువడగానే వారి ఆనందం అవధులు దాటింది. ముందెన్నడూ లేనంత ఉత్సాహంతో ఇళ్ళకు వెళ్ళి తమ కుటుంబసభ్యులకు, ఇతర బంధుమిత్రులకు ఈ శుభవార్త తెలియజేశారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు మక్కాలో ప్రవేశించడం సాధ్యమవుతుందా? కాబా గృహాన్ని ఎలా సందర్శించగలుగుతారు? అసలే ఖురైషీయులు ముస్లింల పేరు వింటేనే మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మక్కాలో అడుగుపెట్టేందుకు వారితో యుద్ధం చేయవలసి వస్తుందా? లేక వారే మక్కా వీడిపోతారా? పరిస్థితి అర్థంకాక ముస్లింలు తికమక పడుతున్నారు. 

ఆ తరువాత కొన్ని రోజులకే దైవప్రవక్త (సల్లం) కాబా యాత్ర ప్రకటన గావించారు. ఈ ప్రకటన వినగానే ముస్లింలు ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు. బలి పశువుల్ని కూడా సిద్ధం చేసుకోసాగారు.

దైవప్రవక్త (సల్లం) మదీనా చుట్టుపట్ల ఉన్న తెగల్లో, తన వెంట ఉమ్రా చేయడానికి బయలుదేరమని ప్రకటన చేయించారు. కొన్ని తెగలు దైవప్రవక్త (సల్లం)గారి ఆదేశాన్ని శిరోధార్యంగా భావించి తక్షణమే ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని మదీనా చేరుకున్నారు. అయితే కొన్ని తెగలు మాత్రం మక్కా బయలుదేరాడానికి బద్ధకం చేశాయి. మరికొందరయితే సాకులు చూపారు.

*"దైవప్రవక్తా! మేము ఈ సంవత్సరం అనేక సమస్యల్లో చిక్కుకొని ఉన్నాము. మోయలేని ఆపదలు వచ్చి పడ్డాయి. సంతానం, సిరిసంపదలు మా కాళ్ళకు బంధాలు వేశాయి."* అంటూ రకరకాల సాకులు చెప్పారు వారు. అంతటితో వారు మౌనంగా ఉండలేదు. *"చూశారా ఈ పిచ్చివాళ్ళు ఏం చేయబోతున్నారో! మక్కా వెళ్ళి పర్వతాలను ఢీకొనబోతున్నారు, పులులతో చేలగాటమాడబోతున్నారు!! అసలు అక్కడికి పోయి ఒక్కడయినా ప్రాణాలతో తిరిగివస్తాడా అని?"* ఈ విధంగా వారు తమ సమావేశాల్లో ముస్లింలను హేళన చేయడం ప్రారంభించారు.

ఈ మాటలు కొందరు ముస్లిం ప్రముఖుల చెవుల్లో పడ్డాయి. హజ్రత్ ఉమర్ (రజి) వారి మాటలు విని పళ్ళు పటపట నూరారు. *"దైవప్రవక్తా! ఈ దుర్మార్గుల తలల్ని నరికివేయాలి."* అన్నారు ఆవేశంతో.

కాని విశ్వకారుణ్యమూర్తి (సల్లం) అందుకు ఒప్పుకోలేదు. ప్రయాణానికి సిద్ధంకమ్మని ఆయన అనుచరులను ఆదేశించారు.

*ఉమ్రా సంకల్పంతో మదీనా వీడిన ముస్లింల బృందం : -*

ఉమ్రా యాత్ర గురించి ప్రకటన గావించటం వల్ల, యాత్ర గురించిన సమాచారం మదీనాలో, మదీనా చుట్టు ప్రక్కల గ్రామాల్లో దావానంలా వ్యాపించింది. మదీనా నగరం నలువైపులా నుంచి తండోపతండాలుగా, జన ప్రవాహం కదిలివచ్చింది. దైవప్రవక్త (సల్లం) కలను నిజం చేయటానికి, తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవటానికి ప్రజలు గుంపులుగా గుంపులుగా వచ్చి దైవప్రవక్త (సల్లం) దగ్గర చేరారు.

ప్రయాణ సన్నాహాలు పూర్తయ్యాయి. దైవప్రవక్త (సల్లం), మదీనా వ్యవస్థను పర్యవేక్షించడానికి 'ఇబ్నె ఉమ్మె మక్తూమ్ (రజి)', మరో ఉల్లేఖనంలో, 'నమీలా లైసీ (రజి)'ను నియమించి తన 'ఖస్వా' పేరు గల ఒంటెనెక్కి, జీఖాదా మాసం ఒకటవ తేదీ (హిజ్రీ శకం - 6) సోమవారం రోజున బయలుదేరారు.

మహాప్రవక్త (సల్లం) గారి వెంట ఉమ్ముల్ మోమినీన్ (ముస్లిముల మాతృమూర్తి) హజ్రత్ ఉమ్మె సల్మా (రజి) కూడా ఉన్నారు. మొత్తం బయలుదేరి వెళ్ళిన సహాబా (రజి)ల సంఖ్య పదునాలుగు వందలు (పదిహేను వందలు అని ఓ ఉల్లేఖనంలో ఉంది).

ముస్లింల వెంట డెబ్భై బలిపశువులు ఉన్నాయి. ఖడ్గాలు, ధనుర్బాణాలు తప్ప ఇతరత్రా ఆయుధాలు ఏమీ లేవు. కేవలం ప్రయాణంలో వెంట ఉంచుకునే ఆయుధాలు అంటే ఒరలోనే ఉన్న ఖడ్గాలు తప్ప మరే ఆయుధాలు వారి వద్ద లేవు.

*దైవప్రవక్త (సల్లం), తన అనుచరుల్ని వెంటబెట్టుకొని ఉమ్రా యాత్రకు బయలుదేరారని ఖురైషీయులకు అందిన సమాచారం : -*

అటు మక్కాలో ఖురైషీయులకు, దైవప్రవక్త (సల్లం) వేలాది అనుచరుల్ని వెంటబెట్టుకొని మక్కా వస్తున్నారని తెలిసింది. ఇంకేముంది! వారి గుండెలు పగిలినంత పనయింది. తమతో యుద్ధాలు చేసిన ముహమ్మద్ (సల్లం) మళ్ళీ మక్కా ముఖం చూస్తారనుకోలేదు వారు. కాని ఇప్పుడెలా?

వారికి సావకాశంగా ఆలోచించి తగిన పథకం రూపొందించుకునేంత వ్యవధి కూడా లేదు. అయితే సైనికుల్ని మాత్రం ఆదరాబాదరాగా సమీకరించుకున్నారు. సైన్యాధికారులుగా ఖాలిద్ బిన్ వలీద్, ఇక్రమా బిన్ అబూ జహల్ లు నియమితులయ్యారు. వీరిద్దరూ మక్కా దారిలో ఓ చోట ముస్లింల కోసం మాటుకాచి కూర్చున్నారు.

*మక్కా వైపునకు ముస్లింల కదలిక : -*

దైవప్రవక్త (సల్లం) మక్కా వైపునకు బయలుదేరి ప్రయాణం చేస్తూ 'జుల్ హలీఫా' అనే ప్రదేశానికి వెళ్ళి 'హదీ'★ పశువుల మెడల్లో పట్రాలు తొడిగారు. ఒంటెల మూపరాలను చీల్చి గుర్తులు పెట్టి ఉమ్రా ఎహ్రామ్ కట్టుకున్నారు. ఇలా చేయడం వల్ల చూసేవారు, వారు యుద్ధం చేయడానికి రాలేదని తెలియపరచడం.

_(★→ 'హదీ' అంటే హజ్ లేదా ఉమ్రాకు వెళ్ళేవారు 'మినా' అనే ప్రదేశంలో జిబహ్ చేసే జంతువులు. అరేబియా సంప్రదాయం ప్రకారం, హదీ పశువు మేక లేక గొర్రె అయినట్లయితే అది జిబహ్ చేసే జంతువు అని తెలియడానికిగాను దాని మెడలో ఖలాదా (పట్టా) వేసేవారు. అదే ఒంటె అయితే దాని మూపరాన్ని చీల్చి దానిపై రక్తం పులిమేవారు. అరబ్బులు ఇలాంటి జంతువు జోలికి పోయేవారు కారు. ఆ తరువాత ఇస్లామీయ ధర్మశాస్త్రం ఆ సంప్రదాయాన్నే కొనసాగించింది.)_

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment