281

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 281*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 196*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*2. ఇఫ్క్ సంఘటన : - 3*

*ఆయిషా (రజి)పై జరుగుతున్న దుష్ప్రచారం గురించి దైవప్రవక్త (సల్లం) మస్జిద్ లో ప్రసంగిస్తున్న సందర్భం : -*

చాలా రోజులు గడిచిపోయాయి. దైవప్రవక్త (సల్లం) ఆయిషా (రజి)ను కలవలేదు. అయితే లోకం ముందు నిజాన్ని నిరూపించటానికి జిబ్రీల్ దూత (అలైహి) అల్లాహ్ సందేశం తీసుకొని రావాలని ఆయన (సల్లం) ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒక రోజు ఆయన (సల్లం) మస్జిద్ కు వెళ్ళి ప్రజలందరినీ సమావేశపరిచి ఇలా ప్రసంగించారు....; ↓

*"ప్రజలారా! మీలో కొందరు నా కుటుంబం గురించి అసత్యాలను వ్యాపింపజేసి నన్ను బాధపెడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? నా కుటుంబసభ్యులపై నిందలు మోపి, నా మనస్సును తీవ్రంగా గాయపరచిన వ్యక్తి (అబ్దుల్లా బిన్ ఉబై) చేస్తున్న దుష్ప్రచార దాడుల నుంచి నా గౌరవం కాపాడేవారు ఎవరైనా ఉన్నారా మీలో?  నా కుటుంబంలో మంచి తప్పితే మరేమీ నాకు తెలియదు. అల్లాహ్ ఉనికి ఎంత సత్యమో నేను చెబుతున్న మాటలు కూడా అంతే సత్యం. దైవసాక్షి! నేను నా అర్థాంగిలో ఎలాంటి చెడు చూడలేదు. మీరు ఆరోపిస్తున్న వ్యక్తి 'సుఫ్వాన్ (రజి)' గురించి అనుమానాలు పెట్టుకోవడానికి కూడా నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఇంకెన్నడూ అతను నా ఇంటి గడప కూడా తొక్కలేదు."* అన్నారు బాధాతప్త హృదయంతో.

అప్పుడు 'హజ్రత్ ఉసైద్‌ బిన్ హుజైర్ (రజి)' లేచి, *"దైవప్రవక్తా! ఆ వ్యక్తి మా తెగ (అవస్)కు చెందినవాడయితే మేము అతని శిరస్సు ఖండిస్తాం. ఒకవేళ అతను మా సోదర తెగ (ఖజ్రజ్)కు చెందినవాడయితే మీరు ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞను శిరసావహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం."* అని చెప్పారు.

అయితే, అబ్దుల్లా బిన్ ఉబై తెగ ఖజ్రజ్ తెగకు నాయకుడైన 'సఅద్ బిన్ ఉబాదా (రజి)'కు ఈ మాటలు రుచించలేదు. ఆయనకు తెగ దూరాభిమానం పొడుచుకు వచ్చింది. వెంటనే సఅద్ (రజి) దిగ్గున లేచి, *"నువ్వు అబద్ధమాడుతున్నావు. నువ్వతడ్ని వధించలేవు. ఆ మనిషి ఖజ్రజ్ తెగకు చె౦దినవాడు గనక నువ్వతడ్ని హతమార్చుతానని అంటున్నావు. ఆ వ్యక్తి మీ తెగ వాడయితే నువ్వెన్నటికీ 'అతని శిరస్సు ఖండిస్తాం' అని చెప్పవు."* అన్నారు ఆవేశంతో.

*"నువ్వు కపటవిశ్వాసివి. అందుకే నువ్వు కపటుల్ని వెనకేసుకొస్తున్నావు."* అన్నారు హజ్రత్ ఉసైద్‌ బిన్ హుజైర్ (రజి).

అలా ఆ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి అవస్, ఖజ్రజ్‌ తెగల మధ్య పెద్ద రభస జరిగింది. ఇరువైపుల నుంచి కఠిన పదజాలాలు వెలువడనారంభించాయి. ఇంకాస్తయితే ఉభయ తెగలవారు మస్జిద్ లోనే ముష్టియుద్ధాలకు పాల్పడేవారు. కాని అంతలో దైవప్రవక్త (సల్లం) కల్పించుకొని సర్దిచెప్పారు. అంతటితో రభస సద్దు మణిగింది. దైవప్రవక్త (సల్లం) కూడా ఆ విషయాన్ని గూర్చి మరి మాట్లాడలేదు. కాస్సేపటి తరువాత అందరూ మస్జిద్ నుండి వెళ్ళిపోయారు.

కాని హజ్రత్ ఆయిషా (రజి)పై వచ్చిన అపనింద వదంతి నగరంలో ఇంకా చెలరేగుతూనే ఉంది. దాంతో ఆమె కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తూనే ఉన్నారు. నిద్రాహారాలు కూడా మానేశారు. అలా ఏడుస్తూ గుండె పగిలి చనిపోతానేమో అని అనుకున్నారామె. ఇటు ప్రవక్త (సల్లం) కూడా ఆయిషా (రజి) పరిస్థితి చూసి లోలోన కుమిలిపోతున్నారు. ఆయిషా (రజి) తల్లిదండ్రులు కూడా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక పుట్టెడు దుఃఖంతో సతమతమవుతున్నారు.

*ఆయిషా (రజి) సఛ్ఛీలం గురించి అవతరించిన దైవవాణి : -*

చివరికి ఒక రోజు దైవప్రవక్త (సల్లం), దాదాపు నెలరోజుల తరువాత మొదటిసారిగా ఆయిషా (రజి) వద్దకు వెళ్ళారు. అప్పటికి ఆమె (రజి) ఇంకా తన పుట్టింట్లోనే ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) అక్కడికి చేరుకున్నప్పుడు ఆయిషా (రజి) తన తల్లిదండ్రుల ముందు ఏడుస్తూ కూర్చున్నారు. అక్కడ మరో అన్సార్ మహిళ కూడా ఉంది. దైవప్రవక్త (సల్లం) వారందరికీ సలాం చేశారు. సద్వచనంతో కూడిన ఖుత్బా చదివిన తరువాత ఆయన (సల్లం), ఆయిషా (రజి)ని ఉద్దేశించి ఇలా అన్నారు....; ↓

*"ఆయిషా! ప్రజలు నీ గురించి ఏం అనుకుంటున్నారో నువ్వు విని ఉంటావు. నువ్వు ఏ తప్పు ఎరుగని దానివయితే, అల్లాహ్ స్వయంగా నీ నిర్దోషిత్వాన్ని లోకం ముందు చాటిచెబుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు దానికి ఒడిగట్టి ఉంటే మాత్రం పశ్చాత్తాపపడు, క్షమాభిక్ష కోసం అల్లాహ్ ను వేడుకో. ఎందుకంటే, దాసులు తన పాపాలను ఒప్పుకొని దైవం ఎదుట పశ్చాత్తాపపడితే, అల్లాహ్ క్షమిస్తాడు."* అని అన్నారు.

హజ్రత్‌ ఆయిషా (రజి) ఈ మాటలు విని మరింత బాధపడ్డారు.

తన తండ్రి అబూ బక్ర్ (రజి) వైపు చూస్తూ, *"నాన్నా! దైవప్రవక్త (సల్లం) అడిగిన మాటలకు మీరు సమాధానం చెప్పండి."* అన్నారు ఆమె (రజి).

*"తల్లీ! ఏం సమాధానమివ్వాలో నాకేమీ అర్థం కావడం లేదు."* అన్నారు హజ్రత్‌ అబూ బక్ర్‌ (రజి).

తర్వాత ఆయిషా (రజి), కందిపోయిన ముఖంతో తన తల్లి 'ఉమ్మె రూమాన్ (రజి)' వంక చూస్తూ, *"అమ్మా! నువ్వయినా దీనికి సమాధానం చెప్పు."* అని అన్నారు.

*"నేను మాత్రం ఏం చెప్పగలనమ్మా! నాక్కూడా ఏమీ అర్థం కావడం లేదు."* అన్నారు హజ్రత్ ఉమ్మె రూమాన్ (రజి).

అప్పుడు స్వయానా ఆయిషా (రజి)నే వారందరికి చాలా గట్టిగా జవాబు చెప్పారు....; ↓

*"దైవసాక్షి! నాకు తెలుసు. ఈ విషయాన్ని వినీ వినీ అది మీ హృదయాల్లో ముద్రించుకుపోయిందని. మీరంతా దీన్ని నిజం అని అనుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ నేను ఇది తప్పు అని, నాకు దానితో ఏ సంబంధం లేదని చెప్పినా మీరు నమ్మరు. ఒకవేళ నేను దీన్ని ఒప్పుకుంటే, మీరు అది నిజమే అని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులో, నాకూ మీకు నడుమగల విషయం అచ్చం 'హజ్రత్ యూసుఫ్ (అలైహి)' గారి తండ్రి చెప్పిన విషయం, 'సహనమే మేలైనది. మీరు చెప్పే విషయాలను గురించి నాకు అల్లాహ్ సహాయం ఒక్కటే చాలు' అన్నట్లు ఉంటుంది."* అన్నారు.

_↑ ఆయిషా (రజి), తన తల్లిదండ్రులకు మరియు దైవప్రవక్త (సల్లం)కు ఇచ్చిన ఈ సమాధానం గురించి వేరొక సీరతుల్ కితాబ్ ప్రకారం ↓_

ఆయిషా (రజి) తన తల్లిదండ్రులతో దైవప్రవక్త (సల్లం)కు సమాధానం ఇవ్వండి అని చెప్పారు. అయితే ఏమని సమాధానం ఇవ్వాలో వారికి తోచలేదు. అందుకని ఆమెయే స్వయంగా కల్పించుకొని, *"దైవసాక్షి! మీరందరూ నా గురించి ఏదో విని నమ్మేశారు. ఇప్పుడు నేను, 'నాకేమి తెలియదు, నేను నిర్దోషిని' అని అంటే, మీకు నా మీద నమ్మకం కలగదు. చేయని తప్పుని చేశానని నేను ఒప్పుకుంటే ఆ అబద్ధాన్ని మీరు నమ్మేస్తారు. ఏమైనా, నేను ఏ తప్పూ చేయలేదన్న సంగతి అల్లాహ్ కు బాగా తెలుసు."* అన్నారు.

ఈ సందర్భంగా ఆమె (రజి), యాఖూబ్ ప్రవక్త (అలైహి) పేరు గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నించారు. కాని ఆ నిస్పృహ స్థితిలో ఆమె (రజి)కు ఆయన (అలైహి) పేరు గుర్తుకురాలేదు. *"'ఫసబ్రున్ జమీల్ (ఈ దుష్పరిణామాన్ని నేను అత్యుత్తమ సహనంతో ఎదుర్కొంటాను.)' యూసుఫ్ (అలైహి) తండ్రి చెప్పిన మాటలే నేను చెబుతున్నాను."* అని మాత్రం అనగలిగారు. ఆ తరువాత ఆయిషా (రజి) మరో ప్రక్కకు తిరిగి పడుకున్నారు.

అల్లాహ్ తనకు న్యాయం చేస్తాడని ఆయిషా (రజి) గట్టిగా నమ్మారు. అయితే తన సౌశీల్యతను ఋజువు చేస్తూ దైవసందేశం అంత త్వరగా అవతరిస్తుందనీ, ప్రళయదినం వరకూ తనకు సంబంధించిన వ్యాక్యాలు ముస్లిముల నోట పఠించబడతాయని ఆమె (రజి) అస్సలు ఊహించలేదు. ఏదో ఒక కల ద్వారా అల్లాహ్ దైవప్రవక్త (సల్లం)కు నిజం తెలియపరుస్తాడని ఆవిడ (రజి) భావించారు.

ఆ సమయంలోనే అనుకోకుండా ఒక్కసారిగా దైవప్రవక్త (సల్లం)ను ఒక విచిత్రమైన పరిస్థితి ఆవహించింది. ఆయన (సల్లం)పై దివ్యావిష్కృతి అవతరింపనారంభించింది. దాని తాలూకు ఆనవాళ్ళు ఆయన (సల్లం) ముఖారవిందంపై స్పష్టంగా కనిపించాయి. మెల్లగా మగతలోకి జారుకున్నారు. ఆయన (సల్లం) తల కింద ఒక దిండు ఉంచారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా చాలా ఆందోళన పడ్డారు. కుటుంబసభ్యులందరూ ఆయన చుట్టుముట్టారు. తీవ్రమైన చలిలో సైతం ఆయన (సల్లం) నుదుటి నుంచి చెమట బిందువులు ముత్యాల్లా రాలిపడుతున్నాయి. ఊపిరి బిగబట్టి అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. ఆయిషా (రజి) నిర్భయంగా ఉన్నారు. కాని ఆమె (రజి) తల్లిదండ్రులు ఆందోళనతో వణికిపోసాగారు.

కొద్దిసేపటి తర్వాత దివ్యవాణి అవతరణ కఠినత్వం పూర్తిగా తొలిగిపోగానే దైవప్రవక్త (సల్లం) మగత నుంచి తెరుకున్నారు. ఆయన (సల్లం) ముఖారవిందం ఆనందంతో కళకళలాడుతూ ఉంది. ఆయన (సల్లం) నోటి నుంచి వెలువడిన మొట్టమొదటి మాటలు, *"శుభాకాంక్షలు ఆయిషా! అల్లాహ్ నీ నిర్దోషిత్వానికి సంబంధించి ఋజువు పంపించాడు."* అని పలికారు.

ఈ సందర్భంలో *ఇఫ్క్* సంఘటనకు సంబంధించిన ఏ వాక్యాలు అయితే "నూర్" సూరాలో అవతరించాయో అవి....; ↓

*"ఇన్నల్లజీన జాఊబిల్ ఇఫ్కి ఉస్బతమ్ మిన్'కుమ్" (ఈ అభాండాన్ని సృష్టించి తీసుకువచ్చిన వారు, మీలోని ఒక వర్గం వారే).* (ఖుర్ఆన్ 24:11) నుండి ప్రారంభమవుతాయి.

_(ఈ సందర్భం గురించి బోధించే దివ్య ఖుర్ఆన్ 24:11 నుంచి 21 వరకు గల ఆయత్ లను In Sha Allah రేపటి భాగంలో మరింత వివరంగా తెలుసుకుందాం.)_

ఈ వ్యాక్యాలు వినగానే అందరి హృదయాల్లోనూ ప్రశాంతత నెలకొంది. ఆయిషా (రజి) తల్లి ఉమ్మె రూమాన్ (రజి) సంతోషం పట్టలేక తన కుమార్తె (రజి)తో, *"లే, లేచి దైవప్రవక్త (సల్లం)కు కృతజ్ఞత తెలుపుకో."* అని అంది.

కాని ఈ సంఘటన వల్ల బాగా మనస్తాపానికి గురైన ఆయిషా (రజి), *"నేను కృతజ్ఞతలు తెలుపుకోవలసినది ఆయనకో లేక మీ ఇద్దరికో (తల్లిదండ్రులకు) కాదు. నా నిర్దోషిత్వాన్ని ఋజువుచేసిన మహోన్నతుడైన అల్లాహ్ కు ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను."* అన్నారు.

ఆ తరువాత ఈ దైవసూక్తులు ఇతర విశ్వాసులకు కూడా తెలియజేయబడ్డాయి. దాంతో ముస్లింలందరూ సంతోషించారు.

తదుపరి ఈ అపవాదును, అభాండాన్ని విశ్వసించి ప్రచారం చేసిన నేరానికిగాను ముస్లిములైనటువంటి 'మిస్తహ్ బిన్ అసాసా (రజి)', 'హస్సాన్ బిన్ సాబిత్ (రజి)', 'హమ్నా బిన్తె హజష్ (రజి)'లకు ఎనభైయ్యేసి కొరడాల దండన విధించడం జరిగింది.★

_(★→ ఇస్లామీయ చట్టంలో ఎవరయితే ఒకరిపై వ్యభిచారానికి సంబంధించిన అపవాదు వేస్తాడో దానికి తగిన సాక్ష్యాలు చూపకపోతే (ఆ అపవాదు వేసేవానికి) ఎనభై కొరడాల శిక్ష విధించాలని ఉంది.)_

అయితే ద్రోహి, నీచుడు అయిన 'అబ్దుల్లా బిన్ ఉబై' వీపు, ఈ కొరడాల బారిన పడకుండా తప్పించుకుంది. అభాండాలు వేసిన వారిలో అగ్రగణ్యుడు. అతడే ఈ వ్యవహారంలో ప్రముఖ పాత్రను పోషించినవాడు. అతనికి శిక్ష పడకపోవడానికి కారణం బహుశా, ఎవరికయితే దైవం నిర్దేశించిన శిక్షలు పడతాయో, వారి కోసం పరలోకంలో పడబోయే శిక్షల్లో తగ్గింపుగాని, క్షమాపణగాని లభించడమే అయి ఉండవచ్చు. ఇహలోకంలో పడే శిక్ష వల్ల వారికి మన్నన లభించడం జరుగుతుంది. అల్లాహ్, అబ్దుల్లా బిన్ ఉబై కు పరలోకంలో భయంకరమైన శిక్షకు లోనుచేయదలచి ఉండడం వల్లనే ఇహలోక శిక్ష పడలేదు. ఈ కారణం మూలంగానే అతణ్ణి హతమార్చడం జరగలేదేమో.

ఇలా ఒక నెల తరువాతగాని మదీనా వాతావరణం నుండి అనుమాన మేఘాలు దూరం కాలేదు. అబ్దుల్లా బిన్ ఉబై అగౌరవంపాలై తిరిగి తల ఎత్తుకోలేకపోయాడు.

ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం....; ↓

అబ్దుల్లా బిన్ ఉబై ఎప్పుడైనా నీచ కార్యానికి లేదా ముస్లిముల్లో భేదాభిప్రాయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే స్వయంగా అతని జాతివారే అతణ్ణి ఎత్తిపొడుస్తూ తిట్టేవారు. అతని ఈ పరిస్థితిని చూసి దైవప్రవక్త (సల్లం) ఉమర్ (రజి)తో, *"చూశావా ఉమర్! నీవు అతణ్ణి చంపివేయమని సలహా ఇచ్చిన నాడే అతణ్ణి హతమార్చి ఉన్నట్లయితే ప్రజలు మనలను తూలనాడేవారు కాదా? కాని ఈ రోజు అతనికి మరణ శిక్షను విధిస్తే వారే ఆ పని చేసిపెట్టేటట్లు ఉన్నారు."* అని అనగా; ఉమర్ (రజి), *"దైవసాక్షి! ఈ విషయం నాకు బాగా అర్థం అయిపోయింది. దైవప్రవక్త (సల్లం) నిర్ణయమే నా నిర్ణయం కంటే మేలైన నిర్ణయం."* అని అన్నారు.

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment