280

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 280*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 195*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*2. ఇఫ్క్ సంఘటన : - 2*

*హజ్రత్ ఆయిషా (రజి)పై అపనిందలా....! : -*

ముస్లిం యోధులు విజయోత్సాహంతో మదీనాలో ప్రవేశించారు. ఇద్దరు సైనికులు హజ్రత్ ఆయిషా (రజి) కూర్చున్న ఒంటెను ఆమె పుట్టింటికి తీసుకెళ్ళి ఆపారు. హజ్రత్ ఆయిషా (రజి) అంబారీ నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళారు.

కాని ఆమె (రజి) మదీనా తిరిగిరాగానే జబ్బుపడ్డారు. తీవ్రమైన జ్వరం కారణంగా కొన్ని రోజులు ఆమె (రజి) మంచానికే పరిమితమయ్యారు. ఇంట్లో ఆమె బాగోగులు చూసేవారు, ఆమెకు ధైర్యం చెప్పేవారు అందరూ ఉన్నారు. కాని ఆమె అస్వస్థత తగ్గే సూచనలు మాత్రం కనిపించలేదు. ఈ విధంగా దాదాపు నెలరోజుల దాకా కోలుకోలేక పోయారు. మరోవైపు అబ్దుల్లా బిన్ ఉబై రగిలించిన దుష్ప్రచారపు చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఇటు ఆయిషా (రజి)కు ఈ అపవాదు గురించి ఏమాత్రం తెలియదు. 

ఆయిషా (రజి) త్వరగా కోలుకోలేక పోవడానికి మరొక కారణం కూడా ఉంది. అది ఏమిటంటే....; ↓

దైవప్రవక్త (సల్లం) అప్పుడప్పుడు వస్తూ ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి ఆమె తల్లిదండ్రుల్ని అడిగితెలుసుకొని వెళ్ళిపోయేవారు. అంతేగాని ఆమెను కలుసుకొని మాట్లాడేవారు కాదు. ఇలా ఆయన (సల్లం) తనతో ఎందుకు ముభావంగా ఉన్నారో ఆయిషా (రజి)కు అర్థమయ్యేది కాదు. అయితే ఆమెకు మాత్రం దైవప్రవక్త (సల్లం) వ్యాధి సమయంలో చేసే పరామర్శ గురించి బాగా తెలుసు. ఆయన (సల్లం) మాటిమాటికి పరామర్శించడానికి వచ్చేవారు. అంతకు ముందు ఎప్పుడు జబ్బుపడినా దైవప్రవక్త (సల్లం) ఆమె ప్రక్కన కూర్చొని ఆమెకు ధైర్యం చెబుతుండేవారు. కాని ఇప్పుడు ఒక నెల అయిపోయినా తన వైపు చూడనైనా చూడడం లేదు. ఇదే ఆమె మనస్సును తొలుస్తున్న ప్రశ్న.

కొన్ని రోజుల తర్వాత అల్లాహ్ కృపతో ఆయిషా (రజి) అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు.

*తనపై పడ్డ అపనింద వార్త విన్న ఆయిషా (రజి) : -*

ఓ రోజు ఆయిషా (రజి) బహిర్భూమికని బయలు ప్రదేశానికి వెళ్ళారు. ఆమె (రజి) వెంట ఉమ్మె మిస్తహ్ (మిస్తహ్ తల్లి) కూడా ఉన్నారు. మిస్తహ్ నికార్సయిన ముస్లిం అయినప్పటికీ ఆయిషా (రజి) విషయంలో మాత్రం ఆయన విశ్వాసం ఆయన్ని కపటులతో వంతపాడకుండా ఆపలేకపోయింది.

ఉమ్మె మిస్తహ్, ఆయిషా (రజి)కి తోడుగా నడుస్తుండగా అనుకోకుండా తాను కప్పుకున్న పొడవాటి దుప్పటి కాళ్ళలో పడి ఆమె క్రింద పడిపోయారు. అలా పడిపోతూ ఆమె నోట అప్రయత్నంగా, *"మా మిస్తహ్ నాశనం గాను!"* అని తన కుమారుడ్ని శపించారు. 

అది విని ఆయిషా (రజి) నిర్ఘాంతపోయారు. తల్లి తన సొంత కుమారుణ్ణే శపిస్తుండటం ఆమె (రజి)కు విస్మయం కలిగించింది. *"ఉమ్మె మిస్తహ్! బద్ర్ యుద్ధంలో ఇస్లాం కోసం వీరోచితంగా పోరాడిన యోధుడు మీ అబ్బాయి. ఆయన్ని గురించి ఎందుకు అలా అంటారు?"* అని మాములుగానే అడిగారు ఆయిషా (రజి).

*"నీకు ఈ విషయం తెలియదా అమ్మా?"* అని అమాయకంగా అడుగుతూ, మదీనా నగరంలో ఆయిషా (రజి) గురించి చెప్పుకుంటున్న విషయాలన్నీ (తనపై పడ్డ అపనింద గురించి) ఆవిడ (రజి) ముందు ఏకరువుపెట్టింది ఉమ్మె మిస్తహ్.

ఆ అపనిందల గురించి వినగానే ఆయిషా (రజి)కు గుండె ఆగినంత పనయింది. పొర్లుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ వెంటనే అక్కణ్ణుంచి ఇంటికి పరుగెత్తారు. ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రుల ముందు భోరున ఏడ్చేశారు. అలా రెండు రాత్రులు, ఒక పగలు కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తూ గడిపారు.

ఇటు మహాప్రవక్త (సల్లం) విషయానికొస్తే, ఈ సంఘటన గురించి ఆయనలో సహజంగానే ఆందోళన పెరిగింది. ఓ సుదీర్ఘకాలం వరకు దైవవాణి అవతరించకపోవడంతో, ఆయన హజ్రత్ ఆయిషా (రజి)కు దూరంగా ఉండిపోయే విషయంలో తన అనుచరులతో సంప్రదించాల్సి వచ్చింది. వెంటనే తనకు నమ్మకస్తులైన సహచరులను, దగ్గరి బంధువులను పిలిచి వారి అభిప్రాయాలు అడిగారు. సహచరులలో 'హజ్రత్ అలీ (రజి)'ని, 'హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి)'ని పిలిపించి ఆరాదీశారు.

*"ఉసామా! ఆయిషా గురించి ప్రచారం జరుగుతున్న విషయాలన్నీ విన్నావు కదా? వాటిని గురించి నీ అభిప్రాయం ఏమిటి?"* అని ప్రశ్నించారు దైవప్రవక్త (సల్లం).

*"దైవప్రవక్తా! మీ శ్రీమతిలో నేను మంచితనం తప్ప మరో విషయం చూడలేదు. ఇక ఆమె (రజి) గురించి జనం చెప్పుకుంటున్న మాటలంటారా? అవన్నీ అబద్ధం, అపనిందలు తప్ప మరేమీ కాదు."* అన్నారు హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి).

*"అలీ! మరి నువ్వేమంటావు?"* అని అడిగారు ప్రవక్త (సల్లం).

*"దైవప్రవక్తా! నేను కూడా ఆమెలో అలాంటి విషయమేదీ ఇంతవరకు చూడలేదు. కాని మీరేమో చాలా విచారంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు."* అన్నారు హజ్రత్ అలీ (రజి).

*"ఔను. నాకు ఈ విషయంలో చాలా విచారంగానే ఉంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"విచారించకండి. మిమ్మల్ని భర్తగా పొంది, ఆ విషయం తమకు గర్వకారణంగా భావించే స్త్రీలు చాలామంది ఉన్నారు."* అని చెప్పారు హజ్రత్ అలీ (రజి).

*"కాని ఆయిషా (రజి) సంగతి....?"* ప్రశ్నించారు ప్రవక్త (సల్లం).

*"ఆమె (రజి) ఏ పాపం ఎరగని అమాయకురాలని నా అభిప్రాయం. సరే, మీరొక సారి ఆమె (రజి) సేవకురాలు 'బరీరా' ను కూడా పిలిపించి విషయం అడిగి తెలుసుకోండి."* అన్నారు అలీ (రజి).

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఇంటికెళ్ళి, బరీరాను పిలిచి అడిగారు. దానికి ఆమె ఇలా సమాధానమిచ్చింది....; ↓

*"మీకు సత్యధర్మం ఇచ్చి పంపిన దేవుని సాక్షిగా చెబుతున్నాను. నేను ఆయిషా (రజి)లో ఇంతవరకు ఎలాంటి చెడు విషయం చూడలేదు. కాకపోతే నేను పిండి నానబెట్టి మరో పని మీద వెళ్తూ, 'నేనిప్పుడే వస్తా, కాస్త పిండి వైపు చూస్తుండమ్మా!' అని చెబితే, తర్వాత ఆమె ఆ సంగతి మరచిపోయి ఆదమరచి నిద్రపోతారు. అంతలో మేకలు, కోళ్ళు మొదలైనవి వచ్చి ఆ పిండి మొత్తం ఆరగించి వెళ్ళిపోతాయి. అంతకు మించిన నిర్లక్ష్యం ఏదీ నేను ఆమెలో చూడలేదు."* అన్నది బరీరా.

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం), తన మరో భార్య, తన మేనత్త కూతురైన 'హజ్రత్ జైనబ్ (రజి)' దగ్గరకు వెళ్ళారు. దైవప్రవక్త (సల్లం) పట్ల ప్రేమ విషయంలో జైనబ్ (రజి)కు మరియు ఆయిషా (రజి)కు మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది.

మహాప్రవక్త (సల్లం), హజ్రత్ జైనబ్ (రజి)తో, *"ఆయిషా (రజి)పై జరుగుతున్న ఈ దుష్ప్రచారం గురించి నీకేమైనా తెలుసా?"* అని అడిగారు.

తాను ఆ నోట, ఈ నోట విన్న ఒకటి అరా మాటలు జైనబ్ (రజి) దైవప్రవక్త (సల్లం)తో చెప్పారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా తన సవతి గురించి ఒకటికి నాలుగు అబద్ధాలు జోడించి చెబుతుంది. కాని జైనబ్ (రజి) మాత్రం ఆయిషా (రజి)కు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనలేదు. పైగా ఆయిషా (రజి)ని మెచ్చుకుంటూ మాట్లాడారు. *"ఇటువంటి అభాండాల గురించి నేను నా చెవుల్ని, దృష్టిని కాపాడుకుంటాను. ఆయిషా (రజి) గురించి నాకు బాగా తెలుసు. తను చాలా మంచి అమ్మాయి. అల్లాహ్ ఉన్నాడన్న మాట ఎంత సత్యమో నేను చెబుతున్న ఈ మాట కూడా అంతే సత్యం."* అన్నారు జైనబ్ (రజి).

ఈ విధంగా ప్రవక్త (సల్లం) సహచరులు దుష్ప్రచారాలకు చెవులొగ్గవద్దని సలహా ఇచ్చారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) మస్జిద్ లో ఉపన్యాసమిచ్చేందుకు మెంబరుపై నిలబడి, అబ్దుల్లా బిన్ ఉబై ఆగడాల నుండి తనను రక్షించమని సహచరులకు చెప్పడం జరిగింది.

*↑ ఇందులోని వివరణను In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment