279

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 279*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 194*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

     *గజ్వయె బనీయిల్ ముస్తలిక్ : - 4*

బనీ ముస్తలిక్ తో పోరాటం అనంతరం, తిరుగు ప్రయాణంలో దుష్ప్రచారం చేసేందుకుగాను మునాఫిక్ లకు రెండు అవకాశాలు లభించాయి. వాటిని ఆసరాగా తీసుకొని ముస్లిములలో విభేదాలు, వైషమ్యాలు సృష్టించి దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా నీచమైన దుష్ప్రచారం చేశారు. ఈ రెండు సంఘటనలలో మొదటి సంఘటన "మదీనా నుండి అతి నీచమైన వ్యక్తిని గెంటివేసే విషయం" గురించి మునుపటి భాగంలో చదువుకున్నాం. ఇప్పుడు రెండవ సంఘటన "ఇఫ్క్" సంఘటన గురించి తెలుసుకుందాం.

*2. ఇఫ్క్ సంఘటన : - - : విశ్వాసుల మాతపై కపటుల నీలాపనిందలు*

ఈ గజ్వాకు సంబంధించిన మరో ముఖ్య సంఘటన 'ఇఫ్క్' సంఘటన. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటంటే...., ↓

దైవప్రవక్త (సల్లం), ఏదైనా ప్రయాణానికి బయలుదేరే ముందు తమతో పాటు ఏ సతీమణిని తీసుకు వెళ్ళాలి అని చీటీ వేసి, ఎవరి పేరు వస్తే వారిని తమ వెంట తీసుకువెళ్ళడం రివాజు. ఈ గజ్వాలో కూడా అలా చీటీ వేయడం జరిగింది. అందులో 'హజ్రత్ ఆయిషా (రజి)' గారి పేరు రావడం వలన ఆమె (రజి)ను తమ వెంట తీసుకువెళ్ళారు.

బనీ ముస్తలిక్ పోరాటం అనంతరం తిరుగు ప్రయాణంలో ఇస్లామీయ సైన్యం ఓ చోట విడిది చేసినప్పుడు హజ్రత్ ఆయిషా (రజి) బహిర్భూమికని వెళ్ళడం జరిగింది. ఆయిషా (రజి) అవసరం తీరాక సైనికశిబిరాల సమీపానికి వచ్చి చూసుకుంటే ఆమె (రజి) మెడలో కంఠహారం కనపడలేదు. బయటకి వెళ్ళేటప్పుడు ఆమె (రజి) తన సోదరి వద్ద నుండి అడిగి ధరించిన కంఠహారం అది. ఈ సంగతి ఆమె (రజి)కు తెలియగానే తిరిగి అదే ప్రదేశానికి వెళ్ళి వెదకనారంభించారు.

ఈ లోపు ఇస్లామీయ సైన్యానికి బయలేదేరే ఆదేశం అందగానే, ఆయిషా (రజి) అంబారీలోనే ఉన్నారని భావించి, అంబారీని ఒంటెపై ఎత్తిపెట్టేవారు వచ్చి అంబారీని ఎత్తి ఒంటెపైకి ఎక్కించారు. వారు హజ్రత్ ఆయిషా (రజి) అందులోనే ఉన్నారని తలచడం జరిగింది. అంబారీ తేలికగా ఉండటాన్ని వారు పట్టించుకోలేదు. ఎందుకంటే హజ్రత్ ఆయిషా (రజి) గారి వయస్సు పిన్న వయస్సు. శరీరం ఏమంత బరువుగా కూడా లేదు. అదే కాకుండా ఆ అంబారీని చాలా మంది పట్టి పైకి ఎక్కించడం మూలంగా ఈ విషయం వారికి అర్థం కాలేదు. ఒకరు ఇద్దరు ఎత్తితే బహుశా బరువు గురించి అనుమానం వచ్చి ఉండేదేమో.

ఎలాగయితేనేమి, హజ్రత్ ఆయిషా (రజి) తన హారాన్ని వెతికి దాన్ని తీసుకొని విడిదికి వచ్చి చూడగా సేన మొత్తం వెళ్ళిపోయి ఖాళీగా ఉంది. పిలిచేవారుగాని, పిలుపుకు సమాధానం పలికేవారుగాని ఎవ్వరూ లేరు అక్కడ. అందుకని ఆమె, తాను సేన వెంట లేననే విషయం తెలుసుకొని ఎవరైనా తిరిగి రాకమానరనే ఉద్దేశ్యంతో అక్కడనే ఓ ఇసుక తిన్నె మీద కూర్చుండిపోయారు. అయితే అల్లాహ్ ఏది తలిస్తే అది అయితీరుతుంది. ఆయన ఆకాశం నుంచి ఏ ఆదేశం ఇస్తాడో అదే అమలు జరుగుతుంది. దిక్కుతోచని స్థితిలో ఆయిషా (రజి) అక్కడే ఒక చోట దుప్పటి కప్పుకొని పడుకున్నారు. పడుకోగానే ఆమె (రజి)కు గాఢ నిద్రపట్టింది.

*ఆయిషా (రజి) వద్దకు సుఫ్వాన్ (రజి) రాక : -*

సూర్యుడు పడమటి ఇసుక తిన్నెల వెనక్కి వెళ్ళి కనుమరుగైపోయాడు. చీకటి పడిపోయి నక్షత్రాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఇస్లామీయ సైన్యం ఆ ఎడారి ప్రాంతాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. అందరికంటే వెనుక ఒక కావలివాడు సైన్యం వెళ్ళిన దారిని పరిశీలిస్తూ, తాను కూర్చొని ఉన్న ఒంటెను ముందుకు ఉరికిస్తున్నాడు. ఆయన పేరు 'సుఫ్వాన్ బిన్ ముఅత్తల్ (రజి)'. ఈయన 'సులైమ్' తెగకు చెందినవారు.

ముస్లింల వస్తువులు ఏవైనా దారిలో పడిపోతే వాటిని తీసుకువచ్చే బాధ్యత ఆయనకు అప్పజెప్పబడింది. సైన్యం నడిచిన దారిని పరిశీలించుకుంటూ వెనుక నుంచి వస్తున్నారాయన. సైన్యం చాలా దూరం వెళ్ళిపోయింది. తిరిగి సైన్యంలో కలవటానికి ఆయన త్వరత్వరగా వెళుతున్నారు. దారిలో ఆయనకు ఏదో వస్తువు నేల మీద పడిఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆయన ఒంటెను ఆపడానికి ప్రయత్నించారు. కాని వేగంతో ఉన్న ఆ ఒంటె కాస్త ముందుకు పోయిగాని ఆగలేదు.

ఆ తర్వాత ఆయన (రజి) ఒంటె దిగి వచ్చారు. చూస్తే ఎవరో మనిషి దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నట్లు కనిపించింది. అప్పుడప్పుడే సూర్యుడు అస్తమించినందున చుట్టూ మసక చీకటి ఉంది. అయినా పరిసరాలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. పడుకున్న ఆ వ్యక్తి వైపు ఆయన బాగా పరిశీలనగా చూశారు. ఆమె, దైవప్రవక్త (సల్లం) గారి భార్య ఆయిషా (రజి) అని తెలియగానే *"ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్"* అని పఠిస్తూ, *"అయ్యో! ఈమెగారు దైవప్రవక్త (సల్లం) గారి సతీమణి....!"* అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అక్కడ జరిగిన అలికిడికి ఆయిషా (రజి)కు మెలుకువ వచ్చింది. ఆమె ఉలిక్కిపడి లేచారు. ఎవరో వ్యక్తి ముందు నిలుచుని ఉండటం చూసి గబాలున ముఖం మీద వస్త్రం కప్పుకున్నారు.

హజ్రత్ సుఫ్వాన్ (రజి), ముస్లిముల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రజి)ను చూసి గుర్తుపట్టారు. ఎందుకంటే పరదా ఆదేశం వెలువడక పూర్వం ఆయన ఆమెను చూసి ఉన్నారు. ఆయన ఇన్నాలిల్లాహ్ తప్ప తన నోట మరే పలుకూ పలకలేదు.

ఆ తర్వాత హజ్రత్ సుఫ్వాన్ (రజి) తన ఒంటెను ఆమె దగ్గరగా కూర్చోబెట్టి, ఆమెతో ఏమీ మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళి కూర్చున్నారు. హజ్రత్ ఆయిషా (రజి) కూడా మౌనంగా లేచి ఒంటె మీద ఎక్కి కూర్చున్నారు. ఆయిషా (రజి) ఒంటెపై కూర్చోగానే హజ్రత్ సుఫ్వాన్ (రజి) ఒంటెను లేపి దాని పగ్గం పట్టుకొని సైన్యం వెళ్ళిన దారిలో నడవటం ప్రారంభించారు. ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారిరువురి మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.

*సైన్యం దగ్గరికి చేరుకున్న సుఫ్వాన్ (రజి), ఆయిషా (రజి) : -*

ఇస్లామీయ సైన్యం కొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తరువాత విశ్రాంతి కోసం మరో మజిలీ దగ్గర విడిది చేసింది. హజ్రత్ సుఫ్వాన్ (రజి) ఒంటె మీద హజ్రత్ ఆయిషా (రజి)ను తీసుకొని నడుస్తూ మధ్యాహ్న సమయానికి ఇస్లామీయ సైన్యం విడిది చేసిన చోటికి చేరుకున్నారు.

*విశ్వాసుల మాతపై ఘోరమైన అపనిందను మోపిన కపటులు : -*

వీలు చిక్కితే చాలు, ఏదో ఒక ఉపద్రవం లేవనెత్తడానికి అనుక్షణం కాచుకొని ఉండే కపట విశ్వాసి 'అబ్దుల్లా బిన్ ఉబై'కి ఇప్పుడు మరో అవకాశం లభించింది. అతని హృదయంలో కాపట్యం, ఈర్ష్యాజ్వాలలు ఏవయితే రగులుతున్నాయో, ఆ బాధను బయటపెట్టడానికి అతను ముందుకు వచ్చాడు. ముస్లిముల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రజి)పై అపవాదు వేస్తూ కట్టు కథలు అల్లడం ఆరంభించాడు. ఆయిషా (రజి)ని మరియు సుఫ్వాన్ (రజి)ని ఆ విధంగా చూడగానే, *"ఇదిగో చూడండి. మీ ప్రవక్తగారి భార్యామణి రాత్రి ఓ పరపురుషునితో గడిపి, ఇప్పుడు బహిరంగంగానే అతనితో కలసి వస్తోంది!"* అన్నాడతను.

అతని శిష్యులు ఎగిరి గంతేసి తమకు చేతి నిండా పని దొరికిందని తెగ సంబరపడిపోయారు. వారు ఈ విషయాన్ని సైనికుల్లో ప్రచారం చేయడం మొదలెట్టారు. వారి ప్రచార జాలంలో 'మిస్తహ్ బిన్ ఉసాసా', ప్రముఖ కవి 'హస్సాన్ బిన్ సాబిత్' వంటి కొందరు ముస్లిములు కూడా చిక్కుకున్నారు. ఈ దుష్ప్రచారం సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లం) ఎంతో బాధపడ్డారు. ఆయన (సల్లం) సైన్యానికి తక్షణమే బయలుదేరాలని ఆదేశించారు.

అయితే దారిలో కూడా ఈ దుష్ప్రచారం కొనసాగింది. దాంతో అది క్రమంగా ముస్లిములందరి చెవులకు ప్రాకింది. అనేకమంది ముక్కు మీద వేలేసుకున్నారు. కొందరు సందిగ్ధంలో పడిపోయారు. మరికొందరు ఇది పచ్చి అపనిందని కొట్టిపారేశారు. ఆయిషా (రజి) తండ్రి హజ్రత్ అబూ బక్ర్ (రజి) పరిస్థితి అర్థంకాక లోలోన చాలా బాధపడసాగారు. తన వెనుక ఇంత కుట్ర జరుగుతోందని హజ్రత్ ఆయిషా (రజి)కి ఏమాత్రం తెలియదు.

*మదీనా చేరుకున్న ఇస్లామీయ సైన్యం : -*

అలాంటి పరిస్థితుల్లో సైన్యం మదీనా సమీపానికి చేరుకుంది. అబ్దుల్లా (రజి), తన తండ్రి అబ్దుల్లా బిన్ ఉబై మాటలను ఖండిస్తూ మదీనా ప్రవేశ ద్వారం వద్ద కత్తి దూసి నిలబడ్డారు. తన తండ్రి అబ్దుల్లా బిన్ ఉబై అక్కడికి చేరగానే అతనిని అడ్డుకుంటూ, *"దైవసాక్షి! మీరు ఇక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. దైవప్రవక్త (సల్లం) అనుమతిస్తే తప్ప, ఎందుకంటే దైవప్రవక్తే అందరికంటే గౌరవనీయులు. మీరే అందరికంటే నీచులు."* అని నిలదీశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) అక్కడకు చేరగానే అతణ్ణి మదీనాలోనికి ప్రవేశించే అనుమతి ఇచ్చారు. అప్పుడుగాని అతని కుమారుడు అతని మార్గానికి అడ్డుతొలగలేదు.

ఆ సందర్భంలోనే అబ్దుల్లా బిన్ ఉబై కుమారుడు అబ్దుల్లా (రజి) దైవప్రవక్త (సల్లం)తో, *"దైవప్రవక్తా! తమరే అతణ్ణి హతమార్చదలుచుకుంటే నాకు ఆదేశం ఇవ్వండి. దైవసాక్షి ! నేను ఆయన తలను నరికి మీ కాళ్ళ దగ్గర పడవేస్తాను."* అని విన్నవించుకోవడం కూడా జరిగింది.

*హజ్రత్ ఆయిషా (రజి)పై అపనిందలా....! : -*

ముస్లిం యోధులు విజయోత్సాహంతో మదీనాలో ప్రవేశించారు. ఇద్దరు సైనికులు హజ్రత్ ఆయిషా (రజి) కూర్చున్న ఒంటెను ఆమె పుట్టింటికి తీసుకెళ్ళి ఆపారు. హజ్రత్ ఆయిషా (రజి) అంబారీ నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళారు.

కాని ఆమె (రజి) మదీనా తిరిగిరాగానే జబ్బుపడ్డారు. దాదాపు నెలరోజుల దాకా కోలుకోలేక పోయారు. మరోవైపు అబ్దుల్లా బిన్ ఉబై రగిలించిన దుష్ప్రచారపు చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఈ సంగతి హజ్రత్ ఆయిషా (రజి)కు ఇంకా తెలియదు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment